కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జనగణనలో కులాన్ని కూడా గణించాలని, ప్రత్యేకించి వెనుకబడిన కులాలను లెక్కించాలని 20వ శతాబ్దం చివరి నుంచి డిమాండ్ పెరుగుతోంది.
స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో షెడ్యూల్డు కులాలు(ఎస్సీలు), షెడ్యుల్డు తెగల(ఎస్టీలు)ను మినహాయించి, ఎన్నడూ జనగణనలో అన్ని కులాలను గణించలేదు.
1961 జనగణనలో బీసీలను కూడా లెక్కించాలని కేల్కర్ కమీషన్ సిఫారసు చేసినప్పటికీ జరగలేదు. చివరి సారిగా 1931లో బ్రిటీషు పాలకులు అటువంటి కసరత్తు చేయడం జరిగింది.
ఈ ఆలోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, వాటిని ఈ వ్యాసంలో ప్రస్తావనకు తేవడం లేదు.
అయితే, కులంపై చర్చ వచ్చిన ప్రతిసారి కేవలం ‘‘నిమ్న కులాని’’కి పరిమితమవుతోంది.
ఈ ఆలోచన చుట్టూ జరిగే చర్చ మొత్తం ‘‘నిమ్న కులం’’ అనే అద్దం ద్వారా మాత్రమే చూడబడుతోంది.
కులగణన అనగానే కేవలం వెనుకబడిన తరగతులను మాత్రమే లెక్కించడం అనేది సాధారణంగా తలెత్తే అపోహ.
నిజానికి, ఇందులోకి అన్ని కులాలు వస్తాయి. అందువల్ల దీని చుట్టూ జరిగే ఆందోళన రాజకీయమైనదే తప్ప మరేమీ కాదు.
ఎప్పటి నుంచి డిమాండ్ ఇంకా బలపడిందంటే..
జనగణనలో కులాన్ని చేర్చే ప్రయత్నం 2011 జనగణనకు ముందే వేగం పుంజుకుంది.
ఈ అంశంపై 2010లో పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ, ప్రభుత్వం ప్రత్యేకంగా ‘‘సామాజిక ఆర్థిక కులగణన(ఎస్ఈసీసీ)’’ను ఎంచుకుంది.
కానీ, ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ, తప్పులు దొర్లాయనే పేరుతో ఆ డేటాను ఇప్పటి వరకు ప్రచురించలేదు.
అప్పటి నుంచి ఈ డిమాండ్ మరింత బలపడింది. దీని కోసం ఒత్తిడి చేయబడిన రాష్ట్రాలలో బీహార్ కూడా ఒకటి.
రానున్న జనగణనలో కులగణనను జరపాలని డిమాండ్ కొనసాతోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ – చట్టబద్ధమైన అడ్డంకులు ఉన్నపటికీ బీహార్ ప్రభుత్వం కులాల ఆధారిత లెక్కలను నిర్వహించడమే కాకుండా 2023 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నివేదికను కూడా విడుదల చేసింది.
ఈ నివేదిక విడుదల తరువాత, కులగణన, ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఒక ప్రధాన రాజకీయ డిమాండ్‌గా మారింది. 2025 అక్టోబర్–నవంబర్‌లో జరగనున్న బీహార్ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి నాటికి పూర్తి కానున్న జనగణనలో కులాలను లెక్కించనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో వెనుకబడిన కులాల సమీకరణ నేపథ్యంలో, ఈ వ్యాసం 2023 బీహార్ కులగణనను విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది.
మూడు విభాగాలుగా విభజించబడిన ఈ వ్యాసం- ఈ సమీకరణ చరిత్రను క్లుప్తంగా పరిశీలించి, జనగణన నివేదిక వెలుగులో ఎంచుకున్న సూచికల ఆధారంగా ‘ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీ)‘ సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తుంది.
నివేదిక విడుదలైన తరువాత అత్యంత వెనుకబడిన తరగతుల(ఈబీసీ) సమీకరణను చర్చిస్తుంది.
వెనుకబడిన కులాల సమీకరణ చరిత్ర..
స్వాతంత్ర్య అనంతర కాలంలో భారత ప్రభుత్వం కేల్కర్ కమీషన్ నివేదికను తిరస్కరించిన తరువాత 1960ల మధ్య బీహార్‌లో వెనుకబడిన తరగతుల సమీకరణ మొదలైంది(క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ 2003).
1967లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో సమీకరణ ప్రభావం కనబడింది.
ఈ ఎన్నికలలో, కర్పూరి ఠాకూర్ ‘‘సోషలిస్ట్స్ నె బంధి గంత్, పిచ్ఛార పావె సౌ మే సాథ్ (సోషలిస్టులు ముడి వేశారు, వెనుకబడిన తరగతులు 100కు 60 గెలుస్తారు)‘‘ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు(ఇబిద్.: 266).
అంతేకాకుండా, పెద్ద ఎత్తున వెనుకబడిన తరగతుల సమీకరణ జరిగింది.
బీసీ ఎమ్మేల్యేల సంఖ్య 1962లో 24.4 శాతం నుంచి 1969 మధ్యంతర ఎన్నికలలో 28.8 శాతానికి పెరిగింది(రాబిన్ 2009).
రాజకీయ అనిశ్చితి నెలకొని, రెండు అసెంబ్లీ ఎన్నికలు జరిగి, రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించబడినప్పటికీ వెనుకబడిన కులాలు ప్రభుత్వ ఏర్పాటును తీవ్రంగా ప్రభావితం చేశారు.
1967 నుంచి 1971 మధ్య బీహార్‌లో తొమ్మిది మంది ముఖ్యమంత్రులు కాగా, అందులో ఇద్దరు మాత్రమే అగ్రకులాల వారు ఉన్నారు.
జనతా పార్టీ 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, రాజ్యాధికారం కోసం వెనుకబడిన తరగతుల పోరాటం మలుపు తిరిగింది. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేసిన నిర్ణయం..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, గత కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిన బీహార్ వెనుకబడిన తరగతుల కమిషన్ నివేదికను అమలు చేయాలని నిర్ణయించారు.
కర్పూరి ఠాకూర్ నిర్ణయాన్ని అగ్రవర్ణాల మంత్రులు అడ్డుకున్నారు (ఫ్రాంకెల్ 1989).
రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రకులాల యువత ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసింది.
అప్ప్పుడే అగ్రకులాలకు వ్యతిరేకంగా వెనుకబడిన కులాలు తాత్కాలికంగా ఏకమయ్యారు(సింగ్ 1991). అగ్రకులాలు రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం రాష్ట్రంలో వెనుకబడిన కులాలు త్వరగా సంఘటితం కావడానికి దారితీసింది(వర్మ 1991).
ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ, మండల్ కమీషన్ నివేదికను అమలు చేస్తూ ప్రధానమంత్రి వీపీ సింగ్ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత, 1980ల చివరిలో తలెత్తిన రిజర్వేషన్ వ్యతిరేక నిరసనలతో వెనుకబడిన తరగతుల సమీకరణ మళ్లీ మొదలైంది.
వీపీ సింగ్ నిర్ణయం అగ్రవర్ణాలు హింసాత్మక నిరసనలు జరిపేలా చేసింది(కుమార్ 1999).
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంఘాలుగా ఏర్పడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న వాటితో పాటు అన్ని రకాల రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు(క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ 2000).
ఈ పరిస్థితులలో, వెనుకబడిన తరగతులు, దళితులు సంఘటితమమై, రిజర్వేషన్లకు అనుకూలంగా ప్రతి ఉద్యమాలు నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా వెనుకబడిన కులాలు రిజర్వేషన్లకు సహజంగానే మద్దతు ఇచ్చినప్పటికీ, అగ్ర కులాల నిరసనల సమయంలో మౌనంగా ఉండిపోయారు. కానీ, బీహార్‌లో మాత్రమే అగ్రకులాల ఆందోళనలను గట్టిగా ఎదుర్కొన్నారు(కుమార్ 1999). వారిలో పెరుగుతున్న ఐక్యత 1990 ఎన్నికల తరువాత అసెంబ్లీ కూర్పులో కనిపించింది.
వెనుకబడిన కులాల ఎమ్మెల్యే సంఖ్యగణనీయంగా పెరిగింది. నిజానికి, బీహార్ రాజకీయ చరిత్రలో మొదటిసారిగా, అసెంబ్లీలో వెనుకబడిన కులాల ఎమ్మెల్యేల సంఖ్య అగ్రకులాల ఎమ్మెల్యే సంఖ్య కంటే కొద్దిగా పెరిగింది.
అగ్ర కులాలు 34.6 శాతం అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగా, వెనుకబడిన కులాలు 34.9 శాతం గెలుచుకున్నాయి(రాబిన్ 2009). ఆ తరువాత, 1995 ఎన్నికలలో, అసెంబ్లీ సామాజిక కూర్పు పూర్తిగా మారింది(కుమార్ 1999). వెనుకబడిన కులాలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యధికంగా 46.8 శాతం స్థానాలను సొంతం చేసుకోగా, అగ్రకులాలు అత్యల్పంగా 21.8 శాతం స్థానాలను పొందారు(రాబిన్ 2009).
ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వెనుకబడిన కులాల రాజకీయాలకు అనుకూలమైన ధోరణిని సుస్థిరం చేశాయి. రాజకీయ అధికారంపై ఈ కులాలు తమ పట్టుబిగించేలా చేశాయి.
వెనుకబడిన తరగతులలో రాజకీయ ప్రాతినిధ్యం సమానంగా లేకపోవడం
పైన చర్చించుకున్నట్లుగా 1990 నుంచి బీహార్ అసెంబ్లీ కూర్పు వెనుకబడిన తరగతుల వారికి అనుకూలంగా మారింది. ఇతర ఉత్తర భారత రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ మార్పును గమనించవచ్చు.
అయితే, ఓబీసీ గ్రూపుల మధ్య ప్రాతినిధ్యం సమానంగా లేదు. కొన్ని వెనుకబడిన కమ్యూనిటీల రాజకీయ ప్రాతినిధ్యం పెరిగినట్లుగా ‘దిగువ సామాజిక వర్గం’ క్రిందకు వచ్చే అనేక ఇతర కమ్యూనిటీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగలేదు. బీహార్‌లో యాదవులు, కుర్మీలు, కుష్వాహాలు, బనియా కులస్తుల ప్రాతినిధ్యం రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభలో కూడా బాగా పెరిగింది.
ఆ విధంగా ఈ కులాలు ఆధిపత్య రాజకీయ శక్తిగా ఉద్భవించాయి. దీనికి భిన్నంగా, ఇతర వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం కుచించుకుపోయింది.
పైన పేర్కొన్న నాలుగు కులాలు కలిసి బీహార్ జనాభాలో 23.65 శాతం ఉన్నారు(బీహార్ ప్రభుత్వం 2023). మొత్తంగా, ఈబీసీలను కూడా కలుపుకుని వెనుకబడిన కులాలు రాష్ట్ర జనాభాలో 63.13 శాతం ఉన్నారు. బీసీ కులాలలో నాలుగు కులాల వారు 37.49 శాతం ఉన్నారు.
అయితే, 2020 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే, అసెంబ్లీలో వీరి ప్రాతినిధ్యం 41.54 శాతం కంటే ఎక్కువ ఉండగా, మిగిలిన వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం కేవలం 7.81 శాతం మాత్రమే ఉంది.
మరింత లోతుగా పరిశీలిస్తే, యాదవులు 21.39 శాతం అసెంబ్లీ సీట్లను పొందగా; కుర్మీలు 3.7 శాతం, కుష్వాహాలు 6.58 శాతం, బనియాలు 9.87 శాతం దక్కించుకున్నారు.
బీహారు జనాభాలో ఈ నాలుగు కులాల జనాభా వాటా వరుసగా 14.26 శాతం, 2.87 శాతం, 4.21 శాతం, 2.31 శాతం ఉన్నాయి. ఈ నాలుగు కులాలు, మరీ ముఖ్యంగా యాదవులు, బినియాలు తమ జనాభా పరిమాణంతో పోల్చుకుంటే రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నారని ఈ డేటా స్పష్టం చేస్తుంది.
ఈ నాలుగు కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రాతినిధ్యం మధ్య అంతరం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉన్నప్పటికీ; 1990లలో కొద్ది మేరకు తగ్గడం మొదలైంది. మరీ ముఖ్యంగా 2010 నుంచి తగ్గుతోంది.
పైన పేర్కొన్న నాలుగు కులాల(యాదవులు, కుర్మీలు, కుష్వాహాలు, బనియాలు)తో పోలిస్తే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న కులాల జనాభా సంఖ్యాపరంగా తక్కువగా ఉండటమే కాకుండా, రాష్ట్రంలో చెల్లాచెదురుగా ఉన్నారు.
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థితిలో లేరని బ్లెయిర్ 1972లో పేర్కొన్నారు. అందువల్ల, వెనుకబడిన తరగతులలో వీరు మెజారిటీగా ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు వారికి తగినన్ని స్థానాలు కేటాయించలేకపోతున్నాయి. దీనివలన వారికి తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదు.
ఇది ఇలా ఉంటే, 2023 బీహార్ కులగణన తరువాత ఈబీసీలు రాష్ట్ర రాజకీయాలలో ప్రబలమైన శక్తిగా అవతరించారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం బీసీలు గెలుచుకున్న 81 స్థానాలలో 40 శాస్థానాలు ఈబీసీలు దక్కించుకున్నారు. ప్రతి రాజకీయ పార్టీ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
ఓబీసీ సామాజిక- ఆర్థిక రాజకీయ పరిస్థితులు
2023 బీహార్ కుల ఆధారిత గణన నివేదిక డేటాను కులం, కమ్యూనిటీల పరంగా వేరుచేస్తూ రాష్ట్రంలోని సామాజిక-ఆర్థిక గతిశీలతలకు సంబంధించిన విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది.
పాండే, గౌతమ్ (2024); అదేవిధంగా గిల్మోటో, హిమాంశు(2024) నివేదికపై పూర్తి విశ్లేషణను అందించారు.
మొదటి వారు కేటగిరీల వారీగా కులాల వ్యత్యాసాలను ఎత్తి చూపగా, తరువాత వారు కులాల స్థాయి విశ్లేషణపై కేంద్రీకరించారు.
ఈ సెక్షన్లో విద్యా స్థాయి, ఉపాధి హోదా, అన్ని వనరుల ద్వారా నెలవారీ కుటుంబ ఆదాయం అనే మూడు సూచికల ఆధారంగా బీహార్‌లో ఓబీసీల సామాజిక- ఆర్థిక స్థితిగతులను విశ్లేషించడంపై దృష్టిసారిస్తుంది. సమిష్టి విశ్లేషణ కోసం, బీహార్ మొత్తం సగటుతో పాటుగా వెనుకబడిన తరగతులు(బీసీలు); అత్యంత వెనుకబడిన తరగతుల(ఈబీసీ) కేటగిరీలను ఉపయోగించడం జరుగుతుంది.
బీసీలలో విద్యకు సంబంధించిన విశ్లేషణ కోసం, గ్రాడ్యుయేషన్ స్థాయి(నాన్-టెక్నికల్) విద్యను మాత్రమే ఎంపిక చేసుకోవడం జరిగింది.
ఎందుకంటే తరచుగా అనేక ఉద్యోగాలకు, ముఖ్యంగా గౌరవనీయమైన, ప్రతిష్టాత్మకమైన, మంచి వేతనాలు ఉండే ఉద్యోగాలకు అర్హతగా ఉంటుంది.
అదేవిధంగా ఉపాధికి సంబంధించి, రిజర్వేషన్లు వర్తింపజేసే ప్రభుత్వ రంగ ఉద్యోగాలను మాత్రమే పరిశీలించడం జరిగింది. ఈ కమ్యూనిటీలలో ఆదాయాన్ని విశ్లేషించడం కోసం రూ 50,000కు పైన ఉండే కుటుంబ ఆదాయాన్ని పరిమితిగా ఉపయోగించడం జరిగింది.
ఇంకా, బీసీలు, ఈబీసీలు ఇద్దరికీ సంబంధించిన ప్రతి సూచిక సగటు ఒక్కొక్క కులం విలువను పోల్చడానికి ఆధార రేఖగా పని చేస్తుంది.
యాదవులు మినహా, సంబంధిత సముదాయ సగటుకు స్థాయిలో అంతకు పై స్థాయి పనితీరుకలిగిన వాటిని ఈ విశ్లేషణలో చేర్చడం జరిగింది. యాదవుల పనితీరు బీసీల సగటు కంటే దిగువనే ఉంది. అందువలన, వారు ఏ విధమైన ఏ తులనాత్మక పట్టికలో చేర్చడానికి అర్హత పొందలేకపోయారు.
అయితే, వారు బీహార్‌లో సంఖ్యాపరంగా అతిపెద్ద, రాజకీయంగా అత్యంత ముఖ్యమైన కులాలలో ఒకటి కాబట్టి, వారిని విస్మరిస్తే విశ్లేషణ అసంపూర్తిగా ఉంటుంది.
అనువాదం: పీ నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
