భారతదేశ వ్యతిరేక కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అరెస్టయిన అస్సాం మాజీ కళాశాల ప్రొఫెసర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తనకు మంజూరు చేసిన ఉపశమనం తన ఉద్యోగ పునరుద్ధరణకు ఆధారం కాకూడదని పేర్కొన్నది.
న్యూఢిల్లీ: భారతదేశ వ్యతిరేక కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణతో అరెస్టయిన అస్సాం మాజీ కళాశాల ప్రొఫెసర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనకు మంజూరు చేసిన ఉపశమనం తన ఉద్యోగ పునరుద్ధరణకు ఆధారం కాకూడదని కూడా పేర్కొన్నది.
కోక్రాఝర్‌లోని గోసాయిగావ్ ప్రభుత్వ కళాశాల మాజీ ప్రొఫెసర్ జోయ్నాల్ ఆబేదీన్ అప్పీల్‌ను సుప్రీంకోర్టులో విచారించారు. విచారిస్తున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. తన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన దిగువ కోర్టు, గౌహతి హైకోర్టు ఆదేశాలను ఆబేదీన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, అయితే అతనిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడానికి నిరాకరిస్తూ- మరో రెండు కేసుల్లో కూడా తన పేరు నమోదు చేయబడిందని కోర్టు పేర్కొంది. అందులో తన విద్యార్థినులను వేధించడం, సోషల్ మీడియాలో వారిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలు తన మీద ఉన్నాయి.
సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసులో ప్రాసిక్యూషన్ ఇంకా నలుగురు సాక్షులను విచారించాల్సి ఉందని, దీనికి సమయం పడుతుందని కోర్టు పేర్కొన్నది. “ప్రాసిక్యూషన్ ఇంకా నలుగురు సాక్షులను విచారించాల్సి ఉంది. విచారణకు సమయం పడుతుంది. పిటిషనర్ గత ఆరు నెలలుగా కస్టడీలో ఉన్నారు. ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని; అతను ష్యూరిటీ బాండ్ సమర్పిస్తే, అతన్ని బెయిల్‌పై విడుదల చేయాలి” అని పేర్కొంటూ ధర్మాసనం ఉత్తర్వును జారీ చేసింది.
‘పిటిషనర్‌ను తిరిగి ఉద్యోగంలో నియమించడానికి ఈ ఉత్తర్వు ప్రాతిపదికగా పరిగణించబడదు. అంతేకాకుండా విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు తన మీద ఉన్నందున- తనను తిరిగి నియమించకపోవడమే చాలా సముచితం’ అని కోర్టు స్పష్టం చేసింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, గోసాయిగావ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జోయ్నాల్ ఆబేదీన్ ఫేస్బుక్లో దేశవ్యతిరేక పోస్టులు పెట్టారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. “మేము మా సోదరులు, పాకిస్తాన్ పౌరులకు అండగా నిలుస్తాము. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వారితో అండగా నిలుస్తాము” అని ఆయన రాశారు.
ఆ సమయంలోనే ఆన్లైన్ పోస్టుల వల్ల దాదాపు 100 మందిని అరెస్టు చేశారు.
ఆబేదీన్ గతంలో కోక్రాఝర్‌లోని ట్రయల్ కోర్టు నుంచి బెయిల్‌ను కోరారు. కానీ అభియోగాల రూపకల్పన ప్రక్రియ కొనసాగుతున్నందున తన పిటిషన్ తిరస్కరించబడింది.
దీని తర్వాత తను హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ తన పిటిషన్ కొట్టివేయబడింది. “ఫేస్బుక్ సందేశాన్ని స్పష్టంగా చదివితే; పిటిషనర్ ఈ సంక్లిష్ట సమయంలో తన సొంత దేశానికి కాదు, పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. పిటిషనర్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(పౌరుల ప్రాథమిక విధులు)లో పొందుపరచబడిన ప్రాథమిక విధులను పాటించలేదు” అని పేర్కొన్నది.
గత నెలలో ఈ కేసు విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు తనను తీవ్రంగా విమర్శించింది. “నీకు మహిళలను వేధించడం, సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం అలవాటు. వక్రబుద్ధి ఉన్న మనస్తత్వం నీకు ఉంది. ఇంకా కళాశాల విద్యార్థులకు ప్రమాదకరం. అసలు నువ్వు ఎలాంటి ప్రొఫెసర్‌వి? ‘ప్రొఫెసర్’ అనే పదానికి నువ్వు ఇబ్బందికరంగా ఉన్నావు. నిన్ను కళాశాలలోకి అనుమతించకూడదు” అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
