
హిందూ జాతీయవాద నాయకులు నుంచి వస్తున్న విమర్శలు అసాధారణమైనవి. ఒక రకంగా చూస్తే విమర్శలు చేసేవారు నిర్వహించిన బాధ్యతల రీత్యా ఇది ఆత్మవిమర్శ కూడా.
భారతీయ జనతా పార్టీ నేత, రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన రామ్ మాధవ్, “The New World: 21st Century Global Order and India” పేరుతో తాజాగా ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం మూడు భాగాలుగా విడుదలయింది. మొదటి భాగంలో విశ్వం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమాన్ని రేఖా మాత్రంగా రచయిత ప్రస్తావించారు. అందువలన ఆ పాఠం సారంశాన్ని నేను పెద్దగా ఈ సమీక్షలో చర్చించడం లేదు. రెండో భాగంలో భారతదేశానికి సంబంధించి తన అవగాహనను మాధవ్ ఆసక్తికరంగా వివరిస్తారు. భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగటం గురించి తనకున్న అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ఈ రకమైన అభ్యంతరం వ్యక్తం చేయడమంటే ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో పాటు, కాంగ్రెస్ వారసత్వంలో కీలకమైన అంశాన్ని పునఃస్థాపితం చేయడమే అవుతుంది.
సంఘ్ పరివార్ చట్రంలోని ఒక ముఖ్యమైన నేత 2014 తర్వాత కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ వారసత్వం గురించి సానుకూలమైన అంచనాను ప్రకటించడం ఇదే మొదటిసారి.
హిందూ జాతీయవాదం, దాని శత్రువులు కొత్త మిత్రులు..
ప్రస్తుతం రామ్ మాధవ్ హిందూ జాతీయవాద ఉద్యమం నుంచి ఆవిర్భవించిన ఆర్గానిక్ ఇంటలెక్చువల్‌గా ఉన్నారు. ఈ పుస్తకంలో ఆ ఉద్యమానికి సంబంధించి అనేకమైన పార్శ్వాలను చర్చించారు. గమ్మతైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం వివరణలో ఎక్కడ హిందూ జాతీయవాదం భావన ప్రారంభకులు, ప్రతిపాదకులు- దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యవస్థలు, సంస్థల గురించి ప్రస్తావన మాత్రం లేదు.(వీడీ సర్కార్ గురించి ప్రస్తావన ఒకచోట కూడా కనిపించలేదు).
ఆర్ఎస్ఎస్ గురించి కానీ, దాని అనుబంధ సంఘాల గురించి గానీ ప్రస్తావన లేకుండానే హిందూ జాతీయవాద ఉద్యమం ప్రస్థానాన్ని రామ్ మాధవ్ వివరించే ప్రయత్నం చేశారు. ప్రపంచంలో విస్తరిస్తోన్న జాతీయ మితవాద ధోరణులలో “హిందుత్వ” అనేది ఒకానొక ధోరణి మాత్రమేనని రామ్ మాధవ్ చెప్పే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. 2024లో ఆయన పాల్గొన్న జాతీయ మితవాద మహాసభలలో వచ్చిన నిర్ధారణలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ విధంగా చూసినప్పుడు, ఈ పుస్తకం జాతీయ మితవాద ఉద్యమానికి సంబంధించిన కీలకమైన అంశాలను వివరిస్తుంది. ప్రాచీన భారత దేశంలో హిందువులు, గ్రీకుల నాయకత్వంలో ఒక నూతన నైతిక ప్రాపంచిక మానవళి పురోగమనానికి దోహదం చేసిన అనేక ఆవిష్కరణలకు వేదికైన భారతీయత భావన క్రీస్తు శకం ఆరంభాని కంటే ముందే అవతరించిందని(పేజీ.xii)ప్రతిపాదించారు.
అంతే అస్పష్టంగా రచయిత మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. 13వ పేజీలో ” అదే సమయంలో హిందువులు వేదాలు ఉపనిషత్తులు ఇతర క్లాసికల్ సాహిత్యంతో ముందుకు వచ్చారు. తూర్పు దేశాలలో ఉన్నతమైన సామాజిక వ్యవస్థ ఆవిర్భావానికి నాయకత్వం వహించారు” అంటూ తీర్మానించారు.
తన నిర్ధారణ కొనసాగిస్తూ రచయిత, పై పరిణామాల ఫలితంగా “భారతదేశం మొదటి సహస్రాబ్ది నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించిందని(xiv) ప్రతిపాదించారు. నిజానికి మొగలుల పరిపాలన కాలంలో మాత్రమే భారతదేశం ప్రపంచ ఆర్థిక రాజధానిగా ఎదిగింది. కానీ రామ్ మాధవ్ హిందూ జాతీయవాద పిడివాదం కోణంలో మాత్రమే చరిత్రను పునర్లిఖిస్తూ, భారతదేశ చరిత్రలో ఈ సువర్ణ అధ్యాయం తర్వాత కాలంలో మొగలుల ప్రవేశంతో పతనమైందని చెప్తూ “భారతదేశాన్ని మొదట్లో మొగలులు, తర్వాత మధ్యాసియా ప్రాంత దేశాలు, ఆ తర్వాత బ్రిటన్ 800 సంవత్సరాల పాటు వలస దేశంగా మార్చడంతో భారతదేశం పేద దేశంగా మారింది. వలస పాలకుల ఆధీనంలో భారతదేశం నలిగి చూర్ణమైంది (xiv)”అన్నారు.
రామ్ మాధవ్ అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో స్వర్ణయుగాన్ని చూసి ఉంటే అది కేవలం హిందూయిజం సహనశీలత సిద్ధాంతాన్ని ప్రబోధించినందువలన మాత్రమే. ఇటువంటి సహనశీలత లక్షణాన్ని ప్రబోధించిన హిందూయిజానికి భిన్నంగా “క్రైస్తవం- ఇస్లాం మతం మొత్తం యూరప్‌ను తమ మతాధారిత ప్రాపంచిక దృక్కోణం నుంచి చూడడంతో యూరోపియన్ దేశాలు పతనమయ్యాయి. మానవ జీవితంలోని అన్ని పార్శ్వాలపైన క్రైస్తవం- ఇస్లాం మతం తమ ప్రభావాన్ని చూపాయి. చివరకు శాస్త్ర విజ్ఞానం, కళలు, సంస్కృతిలో కూడా ఈ మతాలు ప్రవేశించాయి. తాము ప్రతిపాదించిన లేదా విశ్వసించిన మతాధారిత దృక్కోణంతో కూడిన అవగాహనకు భిన్నంగా ముందుకు వచ్చిన ఏ భావననైనా, అభిప్రాయాన్నైనా, ఆవిష్కరణనైనా ఈ మతాలు హింసాత్మకంగా తిరస్కరించాయి, తొక్కిపెట్టాయి. ప్రపంచాన్ని శాసించాలన్నదే ఈ మతాల ఏకైక లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా జరిగిన యుద్ధాలు, ఆక్రమణలలో మానవాళి తీవ్రంగా నష్టపోయింది(xiv)”.
ఈ వాక్యాలు చాలా ఆసక్తికరమైనవి. ఎందుకంటే, మతం పట్ల ఒక అనిర్వచనమైన అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమను తాము హిందువులుగా చెప్పుకుంటూ లౌకికతత్త్వాన్ని వ్యతిరేకించేవారు హిందూజాతీయ వాదులు. ఒక వ్యక్తిని హిందువని గుర్తించడానికి, ఆ వ్యక్తి పాటించే మత విశ్వాసాల ఆధారం ప్రమాణం కాదు. కానీ వారి జాతీయత ప్రమాణం. ఆ జాతీయత మొదటి తరం మానవాళి నుండి వచ్చిన వారసత్వం. ఆ మొదటి తరం మానవాళి ఆర్యులు. యూదుమతంతో ఉన్న పోలేక ఇక్కడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. యూదులు కేవలం నేటి ఇజ్రాయిల్ ప్రాంతంలోని గిరిజన తెగలకు చెందిన వారు మాత్రమే కాదు. వారు ఒక పవిత్ర భూమిలో జన్మించిన వారు. ఈ పవిత్ర భూమి అన్న భావన హిందుత్వ రాజకీయాలకు చాలా కీలకమైనది. అనన్య ప్రాధాన్యత కలిగినది. సావార్కర్ దృష్టిలో ఇదే పుణ్యభూమి భారతం.
భారతదేశం ప్రదర్శించిన అద్భుతాలను రామ్ మాధవ్ పునర్ వ్యాఖ్యానించటం గమనిస్తే, ప్రస్తుతం కూడా భారతదేశం అనన్య సామాన్యమైన అద్భుతాలను అనుసరించడం ద్వారా, నేడు భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో సాధించిన విజయాలను మించి అఖండ విజయాల సాధించే అవకాశం ఉంది. ఆయన మాటల్లో “విస్తారంగా ఉన్న ఇరుగుపొరుగు భారతదేశానికి అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఇరుగుపొరుగు దేశాలే భారత ఉపఖండంలో సాంస్కృతికంగాను, నాగరికత పరంగాను, చారిత్రకంగాను ఎన్నో ఉమ్మడి అంశాలతో పెనవేసుకొని ఉన్నాయి. చైనా కంటే భిన్నంగా ఈ ప్రాంతంలో భారతదేశం అనూహ్యమైన ఆదరణను కలిగి ఉన్నది. ఆగ్నేయాసియా దేశాల నుండి ఆఫ్రికా మీదుగా దక్షిణ పసిఫిక్ ప్రాంతం వరకు ఈ ప్రాచీన నాగరికత మేళవింపు కనిపిస్తుంది. దీనినే భారతదేశం దౌత్యపరంగా సావకాశంగా పరిగణించవచ్చు. (xxxviii)”.
నిజానికి రచయిత ఉద్దేశ్యం భారతదేశాన్ని అఖండ శక్తిగా పునరుద్ధరించడం(పేజీ 311). భారతదేశాన్ని తిరిగి ఆఖండ శక్తిగా నిలబెట్టాలంటే, నెహ్రూ వివరించినట్లుగా సున్నితంగా, ఆదర్శ వాదంతో, సున్నితమైన శక్తిగా(సాఫ్ట్ పవర్) వ్యవహరిస్తే సరిపోదు.” అంతర్జాతీయంగా పలుకుబడి కలిగిన బ్రాండ్ భారత్‌ను నిర్మించేందుకు, భారతదేశం తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. అంతర్జాతీయ రాజకీయాలలో సాఫ్ట్ పవర్ కాలం చెల్లింది. స్మార్ట్ పవర్‌తో దేశాలు విలక్షణమైన అస్తిత్వాన్ని నిర్మించుకునే కాలం ఇది”(పేజీ. xxxviii) అని రాశారు. అధికారం కోసం సాగే ఈ ప్రయత్నంలో భావసారూప్యత కలిగిన దేశాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడంతో పాటు పారిశ్రామిక, సైనిక, శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు రచయిత.
భారతదేశానికి మిత్రులుగా ఎవరు ఉండాలనే అంశాన్ని ప్రతికూల అర్థంలో ఇక్కడ ప్రస్తావించారు. రచయిత దృష్టిలో “నా మిత్రులందరూ హిందూ జాతీయ వాదుల శత్రువులతో పోరాడే రాజకీయ శక్తులే. హిందూ జాతీయ వాదులకు శత్రువులు ఎవరన్నది తరిచి చూస్తే, అదో వైవిధ్యమైన బృందం. నిద్రాణంగా ఉన్న బృందం”(పేజీ 158). రచయిత దృష్టిలో దేశంలోని ఉదారవాదులు మొదలు వామపక్షాల వరకు సాంస్కృతిక మార్క్సిస్టులు, ఇస్లామిస్టులు, ఎన్జీవో సంస్థల ద్వారా నిధులు అందుకుంటూ సమాజంలో చైతన్యం పెంపొందించడానికి పనిచేస్తున్నామని చెప్పుకునే వ్యక్తులు ఉన్నారు. ఈ బంధంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తి జార్జి సోరెస్. రామ్ మాధవ్ ప్రతిపాదన మౌలికంగానే ఆత్మ రక్షణ వ్యూహంతో కూడుకున్నది. భారతదేశాన్ని అస్థిరపరిచే అన్ని రకాల ప్రయత్నాలను అడ్డుకోవాలన్నది ఆ ఆత్మరక్షణ వ్యూహం. ఇటువంటి వ్యాఖ్యానమే ప్రపంచవ్యాప్తంగా ప్రజాకర్షక రాజకీయాలు నడిపే జాతీయవాదులు ముందుకు తెస్తున్న వ్యాఖ్యానం.
“భారతదేశంలో 2020- 21లో మొదలైన రైతు ఉద్యమంతో సహా అనేక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు సోరోస్ సహాయ- సహకారాలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక దాడులలో తాజాగా భారతీయ పరిశ్రమ అధిపతి గౌతమ్ అదానిపై ముక్కు మొఖం తెలియని హిండెన్ బర్గ్ నివేదిక రూపంలో జరిగిన దాడి కూడా అంతర్భాగమే. మోడీ ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయక చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమం భారతదేశంలోని ప్రభుత్వ వ్యతిరేకులకు అంతర్జాతీయ ఎన్జీవోలకు మధ్య సంబంధాలు తేటతెల్లం చేస్తుంది. ఈ రైతు ఉద్యమాన్ని సమర్థించి ప్రచారం చేయటంలో కొన్ని ప్రభుత్వ ఇతర సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్యం, జోక్యం ఉన్నాయని భారత ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఉద్యమ కాలంలో ముందుకొచ్చిన మాట టూల్ కిట్. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి కావలసిన సాధనాలను సమకూర్చడం. గ్రేటా థన్‌బర్గ్ లాంటివారు ఈ సాధనాలు సమకూర్చడంలో క్రియాశీల పాత్ర పోషించారు. తరువాత ఆ టూల్‌కిట్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ కిట్‌ను కెనడా కేంద్రంగా పనిచేసే పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ రూపొందించింది. ఈ సంస్థకు ఖలిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. ఈ టూల్కిట్లో దేశద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలే కాక అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా వివరించబడ్డాయి”( పేజీ 140).
ఈ కుట్ర కోణం గురించి వింటున్నప్పుడు నవ్వకుండా ఉండలేము. కానీ ఇటువంటి కుట్ర కోణాలు జాతీయవాద మితవాద ధోరణుల ఎదుగుదలలో కీలకమైన భాగాలు వ్యూహాలు. ఈ వ్యాఖ్యానాలను ముందుకు తెచ్చేవారు సామాజిక వ్యవస్థలను ఛిద్రం చేసే ఇటువంటి కుట్ర కోణాలను మొలక దశలోనే నిర్మూలించాలని ప్రతిపాదిస్తారు. ఇటువంటి శక్తులను విస్మరిస్తే కుటుంబ విలువలకు కూడా విఘాతం కలుగుతుందని వాదిస్తారు. (అందుకే ఈ మితవాదులు ఉదాహరణకు స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు).
తమ నాగరికతను విచ్ఛిన్నం చేయటానికి బాహ్య శక్తులు పని చేస్తున్నాయన్నది వారి అవగాహన. అరాచకత్వం గందరగోళం అన్నవి పదేపదే రామ్ మాధవ్ పుస్తకంలో కనిపించే పదాలు. ఈ బాహ్య శక్తులను అడ్డుకోవడానికి డొనాల్డ్ ట్రంప్, విక్టర్ ఓర్బన్, జార్జియా మెలోని, మారిన్ లీ పెన్ వంటి నాయకులతో జతకట్టాలని రామ్ మాధవ్ ప్రతిపాదిస్తున్నారు.
మాధవ్ ఎంచుకున్న సామాజిక మితవాదం కుటుంబ పరిధి దాటి కులాన్ని కూడా తనతో కలుపుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడిస్తోంది. ఆయన మాటల్లో, కులవ్యవస్థ కేవలం భారతదేశంలోని అనేకానేక వైవిధ్యాలలో ఒక వైవిధ్యం మాత్రమే. అనేకానేక భిన్నత్వంలో ఒక భిన్నత్వం మాత్రమే.
“కులం, భాష, మతం వంటివన్నీ భారతీయుల్లోని భిన్నత్వాలకు ప్రతిబింబాలు” అంటారు (పేజీ 265).
దేశంలో ముస్లింలు రోజువారీ ప్రాతిపదికన వేధింపులు, హింసాత్మక దాడులకు గురవుతున్న వాస్తవం నేపథ్యంలో రామ్ మాధవ్ దేశంలోని మతపరమైన వైవిధ్యాన్ని ఏమేరకు గుర్తిస్తున్నట్టు? ఆయన వాదనంతా జనాభా పెరుగుదలపై ఆధారపడి ఉన్నది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ రూపొందించిన వివాదాస్పద అధ్యయన నివేదిక ప్రకారం, భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు 7.8 శాతంగా ఉంది.
“భారతదేశ ప్రత్యేక పరిస్థితులలో, మైనారిటీల జనాభా నిష్పత్తి ప్రత్యేకించి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధుల జనాభా 7.81 శాతం పెరగటాన్ని గమనిస్తే ఇప్పటివరకు పాశ్చాత్య మీడియా ప్రచారం చేసిన దాని కంటే భిన్నంగా, భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన జనాభా తన పురోభివృద్ధి విషయంలో ఎంతో సంతృప్తిగా ఉందన్న విషయం రుజువు అవుతుంది(పేజీ 281)”
సామాజిక శాస్త్రాల అధ్యయనవేత్తలు, విద్యార్థులు ఎవరైనా ఒక విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. సమాజంలో ఓ నిర్దిష్ట తరగతిలో జనాభా పెరుగుతోందంటే, ఆ తరగతికి సంబంధించిన జనాభాలో అక్షరాస్యత తక్కువగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఈ పరిణామాలు సామాజిక, విద్యా విషయక అభివృద్ధికి సంతానోత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని వెల్లడిస్తోంది.
రామ్ మాధవ్ పెంచుకున్న జాతీయమిత వాదంలో ఓ మోతాదులో ఉన్న నియంతృత్వ ధోరణి ఇమిడి ఉంటుంది. ఇది పుస్తకంలో చివరి పేజీలలో తప్ప ఎక్కడ కనిపించదు. ప్రత్యేకించి ఇది తీవ్ర స్వభావంతో కూడుకున్న అవగాహన.
భారతదేశం ప్రజాస్వామ్యాన్ని తనదైన శైలిలో ధార్మికస్వామ్యంగా మలుచుకోవాలని ఆ దిశగా భారతదేశం ప్రయాణించాలని రామ్ మాధవ్ ప్రతిపాదిస్తున్నారు(పేజీ 320). ధర్మం అనేది నైతిక, ఆధ్యాత్మిక, ప్రాపంచిక దృక్పథమని రామ్ మాధవ్ నిర్వచిస్తున్నారు. ధర్మమే అంతిమమని దాన్ని నిర్వచించేది, నియంత్రించేదీ రాజగురువులే అని అంటున్నారు. ( హిందూ ధర్మ శాస్త్రాలు రీతిరివాజులను రూపొందించి అమలు చేసే బ్రాహ్మణులు). ఏ ఇతర మతాధిపత్య దేశాలల్లోలానే ధర్మోక్రసిలో కూడా పాలకులు ధర్మానికి ప్రాతినిధ్యం వహించే ధార్మిక గురువులకు తప్ప మరెవ్వరికీ జవాబుదారీగా ఉండదు. రామ్ మాధవ్ అభిప్రాయంలో 2023 తర్వాత భారతదేశం మోడీ నాయకత్వంలో ఈ దారి గుండానే ప్రయాణించడం మొదలు పెట్టింది. 2023లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించేటప్పుడు మోడీ చోళ వంశానికి చెందిన సెంగోల్‌ను పూజించి ప్రారంభించారు. (ఇంకా ఉంది)
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.