
ప్రియమైన చెల్లెలికి, చెల్లీ నేను మీ అక్కను గుర్తున్నానా?ఎక్కడున్నావు? మనం విడిపోని ఆ రోజులు గుర్తున్నాయా? తోబుట్టువులమైన మనల్ని దురదృష్టవశాత్తూ మన రంగులే విడదీశాయి.
మొదట్లో మన మధ్య ఎలాంటి తేడాలు ఉండేవి కాదు. రాను రాను మన రంగుల చర్చ మొదలయింది. అదే నా నుంచి నిన్ను దూరం చేసింది. హాయిగా ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం.
నీ దూకుడు మొట్టమొదటిసారి తెలిసింది, మన ఊళ్ళో కొత్త సినిమా రిలీజైనప్పుడు బ్లాక్ టికెట్ల దగ్గర. ఆరోజే అనుకున్నాను, ముందు ముందు నిన్ను ఆపడం ఎవరి తరం కాదని. పొరపాటున ఒక్కసారి ఊరుదాటిపోయిన నిన్ను కొందరు స్వార్థంతో, దురాశతో దేశం దాటించారు. మనల్ని విడదీశారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి నిన్ను వాడుకుంటున్నారు. వాడుకుని వదిలెయ్యడమే తప్ప నా అనేవాళ్ళ ఆదరణ నీకు లేదని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. కానీ ఎలా సాధ్యం?
ఇతరుల సుఖం కోసం చీకట్లో నలిగిపోతున్నావని నాకు తెలుసు. ఇప్పటికీ రైడింగ్లలో ఎవరైనా పట్టుబడితే నువ్వే గుర్తుకొస్తావు. నువ్వు విదేశాలకు వెళ్లిపోయినప్పట్నుంచీ నీ వైభవంతోపాటు మన మద్య ఎడబాటు కూడా పెరిగిపోయింది.
ఏదైతేనేం, నువ్వెలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో, నీకేం– విదేశాల్లో హాయిగా భోగాలు అనుభవిస్తున్నావు. ఆ నోటా ఈ నోటా అంటుంటే నా చెవుల్లో పడింది. త్వరలో భారతదేశానికి వస్తున్నావటగా, నిజమేనా? అదే గనక నిజమైతే, ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ మేలుకోరి చెప్తున్నా, ఇండియాకు రావద్దు.
ఇక్కడ లెక్కలేనన్ని కట్టుబాట్లు, నీకు సరిపోదు. అక్కడయితే నిన్ను అడిగేవాడు ఉండడు.ఇండియాలో నా పరిస్థితి ఫరవాలేదు. నీకు తెలుసు కదా, నాకు ప్రతీది లెక్క ప్రకారం ఉండాలి. నెలనెలా జీతమే నాకు ఆధారం. అరకొర సంపాదనతో నెట్టుకొస్తున్నాను. నా పరిస్థితి అస్తమానం బ్యాంకుల చుట్టూ, పోస్టాఫీసుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుంది, ఫిక్స్డ్ డిపాజిట్లని, పీఎఫ్లని ఇదే తంతు. ఇంతే నా లోకం. దీనికి తోడు ఆదాయ పన్ను, సేవల పన్ను, వ్యాట్, ఆస్తి పన్ను, జీఎస్టీల గోల. ఈ మధ్య తరగతి బాధలు ఎప్పుడూ ఉండేవే. ఇవన్నీ నాకు అలవాటే.
నీకు ఆ బాధలేం ఉండవు. నీ పనే బెటర్. ఈపాటికి నువ్వు చాలా దేశాలు చూసుంటావు. దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్, యూరప్, ఒకటేమిటి లెక్కలేని దేశాలు! లెక్కపెట్టలేనంత సంపద! నీకుండే భోగాలు నాక్కూడా కలగాలనుకోవడం దురాశే అవుతుంది.
నువ్వు చాలా కూడబెట్టుకున్నావని విన్నాను. ఆ సంపదతో ఇండియాలో పొలం పుట్ర, నగలూ నట్రా కొంటున్నావట! అలా చెప్పుకుంటూ పోతే అసలు నీవు కొననిది ఏదైనా ఉందాని నాకు విపరీతమైన ఆశ్చర్యం వేస్తుంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నీకోసం తపిస్తారని విన్నాను, ఒకసారి నువ్వు పార్లమెంటులో కనిపించినట్లు చూసినవాళ్ళు చెప్పారు. ఇదంతా చూస్తుంటే నువ్వు త్వరలో ఇండియాకు వస్తున్నావేమో అనిపిస్తుంది.
ఎందుకొచ్చిన తిప్పలు చెప్పూ? హాయిగా విదేశాల్లో ఏసీ రూముల్లో ఉండక. అయినా నువ్వు ఇండియాకొచ్చి బీదాబిక్కిని ఉద్ధరిస్తావా ఏమన్నానా? కనీసం నీ తోబుట్టువును, నన్నైనా కలుస్తావా? ఏ కొద్దిమంది వీఐపీలకో నీ దర్శనభాగ్యం.
నా మాట విని అక్కడే హాయిగా ఉండిపో, అక్కడుంటే నీకు ఏసీ రూములు, రాజభోగాలు ఉంటాయి. ఇండియాకొస్తే నిందలూ, అవమానాలు, ఇప్పుడు ఇదంతా అవసరమా? ఈ రోజుల్లో సంపాదనే ముఖ్యం, ఎలా సంపాదిస్తే ఏం?అయినా నిన్నని లాభం లేదు. నీకోసం వెంపర్లాడే ఈ సన్నాసులను తన్నాలి.
చెల్లీ.. పేరుకు నువ్వు నల్లధనానివే అయినా, నీ మనసు తెల్లని మల్లెపువ్వు!
ఇట్లు
నీ తోబుట్టువు
తెల్ల ధనం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.