
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో దశ భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల తుళ్లూరు, మండడం, నిదమనూరు, అమరావతి, వెలగపూడి,పెదపరిషెట్ల వంటి పలు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి అధికారులు ప్రాథమిక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై కాస్త వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది.
తొలి దశలో భాగంగా, సుమారు 1600 నుంచి 2000 ఎకరాల భూసేకరణకు సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, రైతులు ‘ల్యాండ్ పూలింగ్’ విధానానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచడంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై కాస్త వెనక్కి దగ్గినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో స్థానిక రెవెన్యూ అధికారులను తమ భూముల్లోకి ప్రవేశించనివ్వకుండా రైతులు అడ్డుకున్నారు. తుళ్లూరు, నిదమనూరు ప్రాంతాల్లో రైతులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాము ఇప్పటికే మొదటి దశలో భూములను ఇచ్చామని దానిపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకుండానే , మళ్లీ భూసేకరణ ఎందుకు అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మొదటి దశ భూసేకరణ..
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘ల్యాండ్ పూలింగ్’ విధానం ద్వారా సుమారు 33,000 ఎకరాల భూమిని సేకరించింది. ఇది దేశంలోనే అతిపెద్ద ‘ల్యాండ్ పూలింగ్’ కార్యక్రమాలలో ఒకటి. ఈ విధానంలో రైతుల నుంచి భూములను సేకరించి, వాటిని అభివృద్ధి చేసిన తర్వాత, తిరిగి వారికి కొంత శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను రిజిస్టర్డ్ డీడ్ల ద్వారా అప్పగించారు. ఈ భూములను ఆధారంగా చేసుకుని అమరావతిలో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. అయితే, ఆ తర్వాత రాజధాని మార్పు, ఇతర రాజకీయ పరిణామాల వల్ల అమరావతి అభివృద్ధి కుంటుపడింది.
ప్రభుత్వ స్పందన, భవిష్యత్తు కార్యాచరణ..
రెండో దశ భూసేకరణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం స్థానిక రైతులు, భూయజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు రెండో దశ భూసేకరణపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు.
రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్డీఏ) అధికారుల ప్రాథమిక పరిశీలన ప్రకారం, రెండో దశలో గుర్తించిన గ్రామాల్లో ప్రభుత్వ అవసరాలకు అనువైన భూములను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిసింది.
అయితే, ప్రస్తుత మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, కొత్త భూముల అవసరం ఉందా లేదా అన్న దానిపై స్పష్టత లేకపోవడం కూడా ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా కార్యాచరణకు ముందు గ్రామస్తుల అంగీకారం, చట్టపరమైన స్పష్టత వంటి అంశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. మొదట భూముల వివరాలను స్థానికంగా గుర్తించి, అవసరమైతే రైతుల సమావేశాలను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.