
లాభాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆస్తులను ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు వెయ్యి కోట్ల విలువైన 22 హోటళ్లు, 450 ఎకరాల భూమిని 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంపదను ప్రైవేటుపరం చేయడాన్ని ఉద్యోగ సంఘాలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ఆస్తుల ప్రైవేటీకరణకు పునాది వేసిన కీలక నిర్ణయం, 2025 మార్చి 11న విడుదలైన జీఓ ఎంఎస్ నెం.1(పర్యాటకం) ద్వారానే జారీ చేయబడింది. ఈ ఆదేశంతో ఏపీ పర్యాటక భూమి కేటాయింపు విధానం(AP Tourism Land Allotment Policy) 2024– 2029 అమల్లోకి వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన ఈ పాలసీ ప్రకారం, ప్రైవేటు సంస్థలకు దాదాపు శతాబ్దం వరకు(99 సంవత్సరాలు) ప్రభుత్వ ఆస్తులను అప్పగించే అవకాశం కల్పించబడింది. పెద్ద ప్రాజెక్టులకు 66 సంవత్సరాలు, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులకు 33 సంవత్సరాలు లీజుకు ఇస్తారు. లీజు కాలం పూర్తవగానే మరొకసారి పొడిగించే అవకాశం కూడా ఉంది. దీంతో ఒకసారి ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే, రెండు నుంచి మూడు తరాల పాటు ప్రభుత్వానికి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
మరో ప్రధానమైన అంశం లీజు రెంట్ మార్కెట్ విలువ ప్రకారం కాకుండా, ఎస్ఆర్ఓ (Sub-Registrar Office) విలువలో కేవలం 1% మాత్రమే నిర్ణయించబడింది. అంటే, మార్కెట్లో వేల కోట్లు విలవున్న భూములు, హోటళ్ళు, రిసార్టులు ప్రైవేటు సంస్థలకు చాలా తక్కువ ధరకు దాదాపు శాశ్వతంగా అందుబాటులోకి వస్తాయి. అదీ కాకుండా, లీజు రెంట్ ప్రతి మూడు సంవత్సరాలకోసారి 5% మాత్రమే పెరుగుతుంది. ఇది ఆస్తుల వాస్తవ విలువతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
అత్యంత వివాదాస్పద అంశమేంటంటే,పెద్ద ప్రాజెక్టులకు బిడ్డింగ్ అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వం నిర్ణయించే అవకాశం కల్పించడం. అంటే పారదర్శక పోటీ ప్రక్రియ లేకుండా, ఎవరికీ కావాలనుకుంటే వారికే లీజుకు ఇవ్వొచ్చు. ఇది పారదర్శకతను ప్రశ్నార్థకంగా మార్చడమే కాకుండా, రాజకీయ ప్రభావం ఉన్న కంపెనీలు ఎక్కువ లాభపడే పరిస్థితిని సృష్టిస్తుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ జీఓ ఏం చెబుతుంది?
చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2025 ఆగస్టు 7న జోఓ ఎంఎస్ నెం 23 విడుదల చేసి, 22 ఏపీటీడీసీ ఆస్తులను ప్రైవేటు సంస్థలకు Operation & Maintenance (O&M) పద్ధతిలో లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై ఆగస్టు 2025లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపింది.
ఆస్తులను 6 క్లస్టర్లుగా విభజించి, 33 సంవత్సరాలపాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. లీజు పద్ధతి వార్షిక స్థూల ఆదాయం(AGR- Annual Gross Revenue)లేదా కనీస హామీ ఇవ్వబడిన వార్షిక లీజు అద్దె(MAALR- Minimum Assured Annual Lease Rent) ఆధారంగా అమలు చేయబడనుంది.
చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గం దీన్ని “సర్వీస్ క్వాలిటీ పెంచడం, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ మెరుగుపరచడం, ప్రభుత్వానికి అదనపు ఆదాయం తీసుకురావడం” అనే ఉద్దేశంతో చేసిన నిర్ణయమని స్పష్టం చేసింది. అయితే, విమర్శకులు మాత్రం దీనిని ప్రజల ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు దీర్ఘకాలం చవకగా వదిలేయడమేనని విమర్శిస్తున్నారు.
వేల కోట్ల విలువైన ఆస్తులను వదులుతున్నారా?
ఏపీటీడీసీకు చెందిన 22 హోటళ్ళు, సుమారు 450 ఎకరాల భూమి కలిపి మార్కెట్ విలువ కనీసం రూ 10,000 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ హోటళ్ళు కేవలం ఆస్తులు మాత్రమే కాదు– వాటికి అనుబంధంగా రెస్టారెంట్లు, కన్వెన్షన్ హాల్స్, యాత్రికుల వసతి గృహాలు ఉన్నాయి. వీటిని 30–40 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థలకు లీజు ఇవ్వాలన్న ఆలోచన బయటకు రావడంతో ఆందోళనలు మరింత పెరిగాయి.
ఒకసారి లీజుకు వెళ్లిన ఆస్తులు తిరిగి ప్రభుత్వ నియంత్రణలోకి రావడం చాలా కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏపీటీడీసీ గత మూడేళ్లుగా సగటున రూ 120– 150 కోట్ల వార్షిక ఆదాయం సంపాదిస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత కూడా ఈ హోటళ్ళు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. సాధారణంగా నష్టాల్లో ఉన్న సంస్థలను మాత్రమే ప్రైవేటీకరించడం ఆనవాయితీగా ఉంది. కానీ లాభాల్లో ఉన్న సంస్థను ఎందుకు ప్రైవేటీకరించాలని చూస్తున్నారని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విమర్శకులు దీనిని విశాఖ ఉక్కు కర్మాగారం ఉదాహరణతో పోలుస్తున్నారు – అక్కడ కూడా లాభాల్లో ఉన్నప్పటికీ కేంద్రం ప్రైవేటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది.
రుణ భారం ప్రభుత్వానికి, లాభాలు మాత్రం ప్రైవేటుకా?
ఏపీటీడీసీ ఇటీవల ఈ హోటళ్ళ పునరుద్ధరణ కోసం రూ 150 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది. ఒకవేళ ఆస్తులను ప్రైవేటు చేయాలన్న ఉద్దేశ్యం ముందే ఉంటే, రుణాలు ఎందుకు తీసుకున్నారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రుణభారం ప్రభుత్వానికే మిగిలిపోతుంది, కానీ లాభాలు మాత్రం ప్రైవేటు కంపెనీలకు చేరతాయన్న వాదన మరింత బలపడుతోంది. ఇది ప్రభుత్వ నిర్ణయాలపై విశ్వసనీయతను దెబ్బతీస్తోందని నిపుణులు అంటున్నారు.
ఏపీటీడీసీ గతంలో కూడా కొన్ని ఆస్తులను ప్రైవేటు లీజులకు ఇచ్చింది. కానీ, ఆ లీజులు సంస్థకు పెద్దగా ఆదాయం ఇవ్వలేదు. చాలా మంది లీజుదారులు చెల్లింపులు చేయకుండానే ఆస్తులను వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. గత అనుభవం అంతా చేదుగా ఉన్నప్పటికీ మళ్లీ అదే మార్గంలో నడవడమేంటి? అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం..
ప్రస్తుతం ఏపీటీడీసీలో దాదాపు 1,300 మంది ఉద్యోగులు(రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్) పనిచేస్తున్నారు. ప్రైవేటీకరణ జరిగితే వీరి భవిష్యత్తు ఏమవుతుందనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగ సంఘాల ప్రకారం, ప్రైవేటు సంస్థలు లాభం దృష్టితోనే నడుస్తాయి. అందువల్ల ఉద్యోగాల భద్రత కూడా ప్రశ్నార్థకమవుతుంది. వేల కుటుంబాల జీవనాధారం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, నాగార్జునసాగర్, మహానంది, లేపాక్షి, అహోబిలం, ద్వారకా తిరుమల, కడప, కర్నూలు వంటి పుణ్యక్షేత్రాల్లో ఏపీటీడీసీ హోటళ్ళు యాత్రికులకు తక్కువ ధరల్లో వసతి కల్పిస్తున్నాయి. ప్రైవేటీకరణ జరిగితే, ఈ ధరలు భారీగా పెరగడం ఖాయం. దీని వల్ల మధ్యతరగతి, పేద భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక రంగం మొత్తం దెబ్బతింటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల మోడల్స్..
ఇతర రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితుల్లో వేరే దారులు అనుసరించాయి. ఉదాహరణకు, కేరళలో పర్యాటక హోటళ్ళను పూర్తిగా ప్రైవేటు చేయకుండా పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) మోడల్లో నడుపుతున్నారు. ప్రభుత్వం నియంత్రణ కొనసాగిస్తూ, ప్రైవేటు పెట్టుబడులు తీసుకుంటోంది. తెలంగాణలో కూడా పర్యాటక రంగం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం నేరుగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఉద్యోగ సంఘాలు కొరుతున్నాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు చేతుల్లోకి వదలకూడదనే అభిప్రాయం మరింత బలపడుతోంది.
ప్రైవేటీకరణను ఎటువంటి పరిస్థితిలో చేస్తారంటే, ఎప్పుడూ నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రభుత్వ భారం తగ్గించేందుకు. కానీ లాభాల్లో ఉన్న సంస్థను కూడా వదులుకోవడం అంటే ఇది ప్రజా ప్రయోజనానికి కాదు, ప్రైవేటు ప్రయోజనానికే అనుకూలంగా తీసుకున్న నిర్ణయమని అనిపిస్తోంది. ఈ లీజు నిర్ణయం పారదర్శకతతో కూడుకుని ఉందా?
వేల కోట్ల విలువైన ఆస్తులను వదులుతున్నప్పుడు పబ్లిక్ డొమైన్లో టెండర్ వివరాలు, లీజు నిబంధనలు, లాభనష్టాల లెక్కలు అందుబాటులోకి రావాలి. కానీ ఇప్పటివరకు ఆ సమాచారం స్పష్టంగా ప్రజలకు అందించలేదు.
ఉద్యోగుల భవిష్యత్తు కూడా ఇక్కడ కీలక అంశం. 1,300 కుటుంబాల జీవనాధారంపై ప్రభావం చూపే నిర్ణయాన్ని తీసుకూనే ముందు, వారితో సంప్రదింపులు జరిపారా? ప్రైవేటీకరణ తర్వాత ఉద్యోగ భద్రతకు హామీ ఇచ్చారా? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం రాలేదు.
మొత్తానికి, ఏపీటీడీసీ ప్రైవేటీకరణ నిర్ణయం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది నిజంగా రాష్ట్ర ప్రయోజనానికా? లేక ప్రైవేటు లాభదారుల కోసమేనా? అన్న ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.