డిసెంబర్ 25న, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో మూక హత్యను ఖండించింది. అంతేకాకుండా మతపరమైన దృష్టితో ఈ సంఘటనను చూడవద్దని ప్రజలను, అంతర్జాతీయ పరిశీలకులను కోరింది.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో దోపిడీకి ప్రయత్నించాడనే ఆరోపణతో ఒక వ్యక్తిని ఒక మూక హత్య చేసింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఇలా కొట్టి చంపడం ఈ నెలలో ఇది రెండవసారి. ఈ చర్య మీద వెంటనే స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం– ఈ సంఘటన మతపరమైనది కాదని, నేరపూరితమైనదని నొక్కి చెప్పింది.
ది డైలీ స్టార్ కథనం ప్రకారం, డిసెంబర్ 24న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాజ్‌బరిలోని పంగ్షా ఉపజిల్లాలోని పంగ్షా పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసెండంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సామ్రాట్ అని కూడా పిలువబడే అమృత్ మొండల్‌ను స్థానిక గ్రామస్తులు తీవ్రంగా చితకబాదారు. దోపిడీ డబ్బును వసూలు చేయడానికి మొండల్ ఆ ప్రాంతానికి వెళ్లాడనే ఆరోపణల నేపథ్యంలో హింస జరిగిందని పోలీసులు తెలిపారు.
విలేకరులతో మాట్లాడుతూ, సమాచారమందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి పోలీసు అధికారులు చేరుకున్నారని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దేబ్రత సర్కార్ తెలియజేశారు. మూక నుంచి మొండల్‌ను అధికారులు రక్షించారని, పరిస్థితి విషమంగా ఉండటంతో తనను పంగ్షా ఉపజిల్లా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారని చెప్పారు. ఆరోగ్య కేంద్రంలో బాధితుడు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారని పేర్కొన్నారు.
సంఘటనా స్థలంలో మొండల్ సహచరులలో ఒకరైన మొహమ్మద్ సెలిమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలిమ్ నుంచి ఒక పిస్టల్, పైప్ గన్‌తో సహా రెండు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. మండల్‌పై పంగ్షా పోలీస్ స్టేషన్లో కనీసం రెండు కేసులు నమోదయ్యాయని, వాటిలో ఒక హత్య కేసు కూడా ఉందని, 2023లో నమోదైన చాలా దోపిడీలకు సంబంధించిన కేసుల్లో తను నిందితుడని సర్కార్ తెలిపారు.
ది డైలీ స్టార్‌తో మాట్లాడుతూ, దోపిడీ, ఇతర నేర కార్యకలాపాలకు మొండల్ పాల్పడుతున్నాడని; కొంతకాలంగా భారతదేశం నుంచి దూరంగా ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని; ఈ మధ్యే భారతదేశం నుంచి తిరిగి వచ్చాడని స్థానికులు చెప్పారు.
దాడి జరిగిన రాత్రి, తను- తన సహచరులు డబ్బు వసూలు చేయడానికి ఒక గ్రామస్తుడి ఇంటికి వెళ్లారని స్థానికులు ఆరోపించారు. అలారాన్ని నివాసితులు మోగించినప్పుడు, స్థానికులు అక్కడికక్కడే గుమిగూడి తనపై దాడి చేశారు. తన గుంపులోని ఇతరులు తప్పించుకున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ హత్యను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఖండించింది. ఈ సంఘటనను మతపరమైన దృష్టికోణంతో చూడవద్దని ప్రజలను, అంతర్జాతీయ పరిశీలకులను కోరింది.
“పోలీసుల సమాచారం- ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, ఈ సంఘటన ఏ విధంగానూ మతపరమైన దాడి కాదని స్పష్టంగా తెలుస్తుంది” అని ప్రకటనలో పేర్కొన్నది.
“దోపిడీ, నేర కార్యకలాపాల నుంచి ఉత్పన్నమయ్యే హింసాత్మక పరిస్థితి నుంచి ఇది ఉద్భవించింది”అని తెలియజేసింది.
2023 నుంచి మొండల్ మీద అరెస్ట్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, తను “అగ్ర నేరస్థుడ”ని ఢాకా నొక్కి చెప్పింది. “చనిపోయిన వ్యక్తి మతపరమైన గుర్తింపును ముందుంచడం వల్ల ఈ సంఘటనను మతపరమైన దాడిగా చిత్రీకరించడానికి” కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి కథనాలు “పూర్తిగా నిరాధారమైనవి, దురుద్దేశంతో కూడుకున్నాయి” అని పేర్కొంటూ “తీవ్ర ఆందోళన”ను వ్యక్తం చేసింది.
మూకహింసలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. “ఏ విధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు లేదా మూకహింసను” తాము సమర్ధించబోమని పునరుద్ఘాటించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
