భారతీయ సమాజ శాస్త్రానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిన అతికొద్ది మంది మేధావుల్లో ఆండ్రే బెటెల్లీ ఒకరు.
ఆయన మరణం కేవలం ఒక అకడమిక్ ప్రొఫెసర్ మరణం కాదు; నెహ్రూ యుగపు ఉదారవాద విలువలను, రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తిని నరనరాన జీర్ణించుకున్న ఒక తరానికి చెందిన చివరి గొంతుక మూగబోయిన సందర్భం ఇది.
ఈ డిజిటల్ యుగంలో సమాచారం వెల్లువలా వస్తున్నా, లోతైన విశ్లేషణ కరువవుతోంది.
అందుకే ఆండ్రే బెటెల్లీ జీవితాన్ని, ఆయన రచనలను, ముఖ్యంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలను మనం ఇప్పుడు నిశితంగా, సాంతం కూలంకషంగా చర్చించుకోవాలి.
ఎందుకంటే, ఆయన సిద్ధాంతాలతో మనం ఎంత తీవ్రంగా విభేదించినా, ఆయన అధ్యయన పద్ధతిలోని నిజాయితీని మనం విస్మరించలేము.
ఈ వ్యాసంలో ఆండ్రే బెటెల్లీ తాత్విక చింతనను, కులం-తరగతి మధ్య ఆయన గీసిన గీతలను, రిజర్వేషన్లపై ఆయనకున్న అభ్యంతరాలను; నేటి భారతీయ రాజకీయ ముఖచిత్రంలో ఆయన స్థానాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
పుస్తకాల నుంచి పొలాల గట్ల మీదకు — శ్రీపురం అధ్యయనం
భారతదేశంలో కులాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకప్పుడు రెండే మార్గాలు ఉండేవి.
ఒకటి, ప్రాచీన సంస్కృత గ్రంథాలను చదివి- “వర్ణ వ్యవస్థ ఇలా ఉండేది కాబట్టి సమాజం ఇలాగే ఉంటుంది” అని ఊహించుకోవడం. రెండు, పాశ్చాత్య సామాజిక శాస్త్రవేత్త లూయిస్ డ్యూమోంట్ చెప్పినట్లుగా, కులాన్ని కేవలం ఒక మతపరమైన, పవిత్రత-అపవిత్రత చట్రంలో చూడటం.
ఆండ్రే బెటెల్లీ ఈ రెండు పద్ధతులను తిరస్కరించారు. 1960లలో ఆయన తంజావూరు జిల్లాలోని ‘శ్రీపురం’ అనే గ్రామంలో కూర్చుని క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. దాని ఫలితమే ఆయన రాసిన అద్భుతమైన గ్రంథం ‘Caste, Class and Power’.
మార్క్సిస్టులు తరచూ చేసే పొరపాటు—కులాన్ని కేవలం ఆర్థిక అసమానతలకు ఒక మారుపేరుగా చూడటం.
అంటే, “ఎవడు భూస్వామో వాడే అగ్రవర్ణం, ఎవడు కూలీయో వాడే దళితుడు” అనే సరళీకృత సమీకరణం. కానీ ఆండ్రే బెటెల్లీ ఈ సమీకరణం మారుతోందని పసిగట్టారు.
కుల అంతస్తు (Status): సమాజంలో ఎవరికి గౌరవం ఉంది?
ఆర్థిక తరగతి (Class): సంపద ఎవరి చేతిలో ఉంది?
రాజకీయ అధికారం (Power): అధికారం ఎవరి చేతిలో ఉంది?
గతంలో ఈ మూడూ ఒకే కులం(బ్రాహ్మణులు లేదా అగ్రవర్ణాలు) చేతిలో ఉండేవి.
కానీ ప్రజాస్వామ్యం, వయోజన ఓటు హక్కు, భూసంస్కరణల ఫలితంగా—ఈ మూడు వేర్వేరు వర్గాల చేతుల్లోకి వెళ్తున్నాయని బేటే గమనించారు.
బ్రాహ్మణులకు గౌరవం ఉండొచ్చు కానీ అధికారం మధ్యస్థ కులాల చేతికి వెళ్ళింది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్డి వర్గాల ఆధిపత్యాన్ని, తమిళనాడులో వెల్లాల, ముదలియార్ల ఆధిపత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైన సూత్రం.
అయితే, ఆండ్రే బెటెల్లీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని తెచ్చారు. అదే “డిస్హార్మోనిక్ సిస్టమ్”(Disharmonic System).
పూర్వ సమాజంలో “విలువలు” (అసమానత ఉండాలి అనే నమ్మకం); “వాస్తవాలు” (నిజంగా ఉన్న అసమానత) ఒకేలా ఉండేవి కాబట్టి అది “హార్మోనిక్” (సంగతమైన) వ్యవస్థ అని ఆయన అన్నారు.
కానీ ఇప్పుడు రాజ్యాంగం “సమానత్వం” చెబుతోంది, సమాజం మాత్రం “అసమానత” పాటిస్తోంది.
కాబట్టి ఇది సంఘర్షణతో కూడిన డిస్హార్మోనిక్ వ్యవస్థ అని ఆయన వాదన.
కానీ మనం ఇక్కడ ఆయనను నిలదీయాలి. గతం “హార్మోనిక్” గా ఎందుకు ఉంది? దళితులు, శూద్రులు ఆ అసమానతను ఇష్టపూర్వకంగా అంగీకరించారా? లేక మనువాద చట్టాలు, భూస్వామ్య దౌర్జన్యాలు వారి గొంతు నొక్కి “శ్మశాన నిశ్శబ్దాన్ని“(Silence of the graveyard) పాటించేలా చేశాయా? బేటే ఆ నిశ్శబ్దాన్ని సామరస్యం అని భ్రమపడ్డారు. నేడు జరుగుతున్న సంఘర్షణ “అపశృతి” కాదు, అది అణిచివేయబడిన గొంతుల నుంచి వస్తున్న న్యాయమైన ఆక్రందన.
సంస్థల రక్షకుడిగా ఆండ్రే బెటెల్లీ — ఉదారవాద భ్రమలు
బేటే ఆలోచనా విధానం పూర్తిగా పాశ్చాత్య ఉదారవాదం మీద ఆధారపడి ఉంది.
ఆయనకు యూనివర్సిటీలు, న్యాయస్థానాలు, బ్యూరోక్రసీ వంటి ఆధునిక సంస్థల(Modern Institutions) మీద విపరీతమైన భక్తి.
ఈ సంస్థలు కులమతాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని ఆయన ఆశించారు.
ఇక్కడే ఆయన వాదనలోని డొల్లతనం మనకు కనిపిస్తుంది. భారతదేశం వంటి అసమాన సమాజంలో, సంస్థలు శూన్యంలో పనిచేయవు.
సుప్రీంకోర్టు జడ్జీల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు—అందరూ ఒక నిర్దిష్టమైన సామాజిక నేపథ్యం నుంచి- అంటే అగ్రవర్ణాల నుంచి వచ్చినవారే అయినప్పుడు, ఆ సంస్థలు “నిష్పక్షపాతంగా” ఎలా ఉంటాయి?
దీనికి కొనసాగింపుగా ఆండ్రే బెటెల్లీ “పౌర సమాజం” గురించి చాలా గొప్పగా రాశారు. రాజ్యం నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికి పౌర సమాజం ఒక కవచంలా ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ భారతదేశంలో “పౌర సమాజం” అంటే ఎవరు? ఇంగ్లీష్ మాట్లాడే మధ్యతరగతి, అపార్ట్మెంట్లలో నివసించే ఉద్యోగస్తులు, కుల సంఘాలు కాదా? వీరంతా తమ ఆస్తిని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి సంఘటితమవుతారే తప్ప, పేదవాడి హక్కుల కోసం కాదు.
ఆండ్రే బెటెల్లీ ఊహించిన ఆదర్శవంతమైన పౌర సమాజం, వాస్తవంలో ఒక “కుల సమాఖ్య” గా మారిపోవడాన్ని మనం చూస్తున్నాం. రాజ్యం చేసే హింసను ఈ పౌర సమాజమే చాలాసార్లు మౌనంగా ఆమోదిస్తుంది.
మండల్ కమిషన్, రిజర్వేషన్లు- ‘మెరిట్’ అనే మిథ్య
1990లలో మండల్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు, దానికి మేధోపరమైన మద్దతు ఇచ్చిన వారిలో ఆండ్రే బెటెల్లీ అగ్రగణ్యుడు. ఆయన రాసిన వ్యాసాలు రిజర్వేషన్ వ్యతిరేకులకు ఆయుధాలుగా మారాయి.
ఆయన వాదన సారాంశం ఇది: “కులం అనేది గతం అవశేషం. మనం ఆధునిక సమాజం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తే, కులాన్ని మనమే బతికించిన వాళ్ళం అవుతాం. వ్యక్తులను పౌరులుగా చూడాలి తప్ప, కులాల ప్రతినిధులుగా చూడకూడదు.”
వినడానికి ఇది చాలా ఆదర్శవంతంగా అనిపిస్తుంది. కానీ ఇది భారతీయ సామాజిక వాస్తవికతకు పూర్తి విరుద్ధం. కులం అనేది కేవలం గతం కాదు, అది వర్తమానం. అది కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక భౌతిక శక్తి.
ఆండ్రే బెటెల్లీ “మెరిట్” గురించి మాట్లాడతారు. కానీ ఆ మెరిట్ వెనుక ఉన్న వందల ఏళ్ల సాంస్కృతిక పెట్టుబడిని (Cultural Capital) ఆయన విస్మరిస్తారు. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం, తరతరాలుగా చదువుకున్న నేపథ్యం, ఆస్తిపాస్తులు ఉన్న బ్రాహ్మణ/అగ్రవర్ణ పిల్లవాడికి—ఏమీ లేని దళిత పిల్లవాడికి ఒకే పరీక్ష పెట్టి, వచ్చిన మార్కులను బట్టి “మెరిట్” నిర్ణయిస్తామంటే అది న్యాయం ఎలా అవుతుంది?
అసమానతలను సరిదిద్దకుండా సమాన అవకాశాల గురించి మాట్లాడటం, ఆధిపత్య వర్గాలకు లాభం చేకూర్చడమే. బేటే ఈ విషయాన్ని అంగీకరించడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు. ఆయన దృష్టిలో అసమానత ఒక సహజ పరిణామం, దాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు, కేవలం నియంత్రించగలం అంతే. ఇది చాలా ప్రమాదకరమైన వాదన.
మార్క్సిజంతో వైరం — ప్రజాస్వామ్యంతో సంభాషణ
ఆండ్రే బెటెల్లీ తనను తాను ఎప్పుడూ మార్క్సిస్ట్ వ్యతిరేకిగా చెప్పుకోలేదు కానీ, మార్క్సిజం ఆచరణను తీవ్రంగా విమర్శించేవారు.
వర్గ పోరాటం ద్వారా సమాజాన్ని మార్చొచ్చు అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్మలేదు. సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాల్లో విప్లవం తర్వాత కూడా అసమానతలు కొనసాగాయని, కేవలం పార్టీ నాయకులు కొత్త యజమానులుగా మారారని ఆయన ఎత్తిచూపేవారు.
ఈ విమర్శలో కొంత నిజం లేకపోలేదు. మార్క్సిస్టులు తరచూ కులాన్ని, లింగ వివక్షను కేవలం ఆర్థిక కోణంలో చూసి విఫలమయ్యారు. అయితే, ఆండ్రే బెటెల్లీ ప్రత్యామ్నాయం ఏమిటి? కేవలం రాజ్యాంగబద్ధమైన పాలన.
కానీ ఆ రాజ్యాంగం అమలు కావాలంటే, ఆ చట్టాలు పని చేయాలంటే, పీడిత ప్రజలు సంఘటితమై పోరాడక తప్పదు కదా? హక్కులు ఎవరో పళ్లెంలో పెట్టి ఇవ్వరు, వాటిని సాధించుకోవాలి. ఈ “పోరాడే కర్తృత్వాన్ని“(Agency of Struggle) ఆండ్రే బెటెల్లీ గుర్తించలేకపోయారు.
ఆయనకు ఉద్యమాలంటే భయం. ఉద్యమాలు వ్యవస్థను నాశనం చేస్తాయని ఆయన ఆందోళన. కానీ వ్యవస్థే ప్రజలను నాశనం చేస్తున్నప్పుడు, ఉద్యమించడం తప్ప వేరే మార్గం ఏముంది?
నేటి సందర్భంలో ఆండ్రే బెటెల్లీ— ఒక విషాద వైరుధ్యం
ఇప్పుడు మనం ఒక సంక్లిష్టమైన కాలంలో ఉన్నాం. ఒకవైపు నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, మరొకవైపు హిందుత్వ సంఖ్యాధిక్యవాదం(Majoritarianism) కలగలిసి దేశాన్ని పాలిస్తున్నాయి.
విచిత్రం ఏమిటంటే, బేటే ఏ సంస్థలైతే (యూనివర్సిటీలు, మీడియా, కోర్టులు) పవిత్రమైనవని నమ్మారో, వాటిని ఇప్పుడు పాలకవర్గాలు పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఇనిస్టిట్యూషన్స్ అనేవి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ ఇవాళ ఆ ఇనిస్టిట్యూషన్లే అధికార పార్టీకి అనుబంధ శాఖలుగా మారిపోయాయి.
బహుశా బేటే చివరి రోజుల్లో ఈ పతనానికి ఎంతో బాధపడి ఉంటారు. ఆయన వామపక్ష రాజకీయాలను విమర్శించి ఉండవచ్చు, కానీ ఆయన మితవాద మూకదాడిని ఎన్నడూ సమర్థించలేదు. జాతీయవాదం పేరుతో సాగుతున్న గూండాగిరీని ఆయన అసహ్యించుకునేవారు.
ముగింపు — విభేదిస్తూనే గౌరవిద్దాం
ఆండ్రే బెటెల్లీ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పారు: “సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కళ్లకు గంతలు కట్టుకుని సిద్ధాంతాలను వల్లె వేయకూడదు, వాస్తవాలను నిశితంగా పరిశీలించాలి“.
ఆయన పరిష్కారాలతో మనం ఏకీభవించకపోవచ్చు. ఆయన ఉదారవాదం, పీడిత వర్గాల విముక్తికి మార్గం చూపకపోవచ్చు. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలు—సంస్థల స్వయంప్రతిపత్తిని ఎలా కాపాడుకోవాలి? మెరిట్, సామాజిక న్యాయం మధ్య సమతుల్యత ఎలా? ప్రజాస్వామ్యంలో చర్చ పాత్ర ఏమిటి?—ఇవన్నీ ఇవాళ మన ముందున్న సవాళ్లు.
ఆయన మరణం భారతీయ సామాజిక శాస్త్రంలో ఒక శూన్యాన్ని మిగిల్చింది. ఆ శూన్యాన్ని పూరించడానికి మనం ఆయన కంటే లోతుగా, మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాల్సి ఉంది. ఒక నిజాయితీ గల మేధావికి, ప్రజాస్వామ్యవాదికి మనం ఇవ్వగలిగే నిజమైన నివాళి అదే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
