ఉన్నత ఆశయాలు, ఉదాత్త లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ దారి తప్పింది. తాజా దుస్థితిని ఇలాగే అనుమతిస్తే ఆర్థిక భారంతో పాటు మరిన్ని విపరిణామాలకు దారి తీసే ప్రమాదముంది. లోతుగా సమీక్షించి, తప్పిదాలను వెంటనే సరిదిద్దితే తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. సంకుచిత రాజకీయ దృష్టికోణంలో కాకుండా గ్రామస్వరాజ్య స్ఫూర్తితో సంస్కరణలు చేపట్టాలి. విస్తృత, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సిఫారసులను నిజాయితీగా అమలు చేయాలి. పాలన వికేంద్రీకరణ, సేవల విస్తరణ, పథకాల్లో పారదర్శకత, సమస్యల పరిష్కారం అన్న బహుముఖ లక్ష్యాల సాధనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కట్టుబడాలి.
గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరును తెలుసుకోవడం కోసం ‘పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ” ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత క్షేత్రస్థాయి సర్వేను నిర్వహించింది.
ఇందులో భాగంగా ఉత్తరాన ఇచ్ఛాపురం నుంచి దక్షిణాన తడ వరకున్న గ్రామాలు, వార్డులను సంస్థ ప్రతినిధి బృందాలు కలయ తిరుగుతూ పరిశీలించాయి.
సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, సాధారణ పౌరులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ విశ్లేషణ రూపొందింది.
2019 వేసవిలో, గాంధీజయంతి సందర్భంగా ప్రారంభమైన గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ ఒక పరిపాలనా సంస్కరణ మాత్రమే కాదు సమూల మార్పుకు నాంది అని భావించారు.
గ్రామ స్వరాజ్యాన్ని భారత ప్రజాస్వామ్యానికి ఆత్మగా చూసిన మహాత్మా గాంధీ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందిన ఈ వ్యవస్థ, వికేంద్రీకృత పాలనతో గ్రామ స్థాయిలోనే అన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పడింది.
ప్రభుత్వ సేవలను చేరవేయడమే లక్ష్యం
ప్రతి గడపకు బహుళ విభాగాల సిబ్బంది, వాలంటీర్లను పంపిచ్చి- సంక్షేమ పథకాలను, ముఖ్యంగా నాటి ప్రభుత్వం చేపట్టిన ‘నవరత్నాల’ను పారదర్శకంగా అమలు చేయడం; సమస్యల్ని వేగంగా పరిష్కరించడం; ‘గ్రామసభ’ కేంద్రకంగా బాధ్యతాయుత పాలనను నిర్మించడం ప్రధాన ఉద్దేశ్యం.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు, భూమిలేని వారు, అట్టడుగు వర్గాల కోసం ఇది గౌరవం, సమానత్వం, న్యాయమనే వాగ్దానంగా కనిపించింది.
కేరళ నమూనా నుంచి కొంత స్ఫూర్తి..
ప్రారంభ ప్రణాళిక సమగ్రంగా, మంచి ఉద్దేశ్యాలతో రూపొందింది.
కేరళ పంచాయతీరాజ్ నమూనా నుంచి కొంత స్ఫూర్తి పొందిన ఈ వ్యవస్థలో మొదట ప్రతి సచివాలయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మల్టీపర్పస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌తో సహా 14 మంది సిబ్బంది ఉండాలని భావించినా, చివరికి 11 మందికి పరిమితం చేశారు.
ఇంటింటికీ పెన్షన్లు అందించడం, ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సేకరించడం, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి బాధ్యతలతో పాటు; నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం పొందే వాలంటీర్లు ప్రజలకు- ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేవారు.
కేంద్ర పథకాలైన 14వ ఆర్థిక సంఘం నిధులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన జరగాల్సి ఉంది.
రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలపై పంచాయతీరాజ్ సంస్థలకు అధికారం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ, ఆరు సంవత్సరాల తర్వాత ఈ ఆశావహ వ్యవస్థ కీలక మలుపు వద్ద నిలిచింది.
2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకు నిర్వహించిన ఫీల్డ్ సర్వే ప్రకారం, ఈ వ్యవస్థ తన ప్రాథమిక లక్ష్యాల నుంచి దూరమైందని స్పష్టమౌతోంది.
ప్రజల ఆశలతో ప్రారంభమైన కార్యక్రమం క్రమంగా నిర్లక్ష్యం, అసమర్థత, నిరుత్సాహం, అమలు స్తబ్ధత వైపు జారిపోతోంది.
ఎక్కువగా పేరుకే పరిమితమౌతోన్న వికేంద్రీకరణ..
పంచాయతీరాజ్ సంస్థలతో కలిసి పనిచేయాల్సిన సచివాలయాలు అనేక చోట్ల సమాంతర వ్యవస్థలుగా మారి; ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల పాత్రను తగ్గిస్తున్నాయి.
“ఈ వ్యవస్థలో మా స్థానం ఏంటి?” అని మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, గ్రామ సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
సచివాలయ సిబ్బంది గ్రామ సభలకు హాజరు కావాలని, అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం కావాలని, వార్షిక-అయిదేళ్ల కార్యాచరణ రూపొందించాలని ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో కనిపించడంలేదు.
దీంతో ప్రజాప్రతినిధులు అమలు ప్రక్రియ నుంచి వేరుపడుతున్నారు.
ఈ వ్యవస్థలో మానవ వనరుల నిర్వహణ వ్యయం మరింత ఆందోళన కలిగిస్తోంది. రెగ్యులరైజేషన్ తర్వాత లక్షా పది వేల మందికి పైగా ఉద్యోగులున్నారు.
వారిలో చాలామంది డిగ్రీలు, పీజీలతో పాటు సోషల్ వర్క్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీలు చేసిన ఉన్నత విద్యావంతులు.
అయినప్పటికీ పాఠశాల మరుగుదొడ్ల ఫోటోలు తీయడం, వైన్ షాపులకు జియో ట్యాగింగ్ చేయడంవంటి పనులు అప్పగించడంతో తమ ప్రతిభ వృధా అవుతోందని వారు భావిస్తున్నారు.
స్వాతంత్య్రాన్ని మరింత దెబ్బతీస్తున్న జోక్యం..
2024లో తదనంతరం వాలంటీర్ వ్యవస్థ ఉన్నపళంగా రద్దవడంతో ఇంటింటికీ సేవలు అందించే బాధ్యతలు, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సిబ్బందిపై పడిపోయాయి. వారానికి 48 గంటలకు మించి పని, దూరప్రాంతాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు సమస్యలు, జీతం కోతల భయం, ప్రమోషన్లు-ఇంక్రిమెంట్లు లేకపోవడం ఇలాంటివి ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతున్నాయి.
యునైటెడ్ ఫ్యామిలీ కార్డ్ అప్డేట్లు, బయోమెట్రిక్ ధృవీకరణలు, ఈ-కేవైసీ, కుటుంబ వలసల ట్రాకింగ్వంటి అంతులేని సర్వేలు ప్రధాన సేవలను పక్కకు నెడుతున్నాయి.
“పర్యవేక్షకులు చాలామంది ఉన్నారు, కానీ నిజమైన మార్గదర్శకత్వం లేదు” అని సిబ్బంది వాపోతున్నారు. నియంత్రణ-నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. లైన్ అధికారుల ఒత్తిడి, రాజకీయ జోక్యం స్వాతంత్య్రాన్ని మరింత దెబ్బతీస్తున్నాయి.
ఉద్యోగులపై నిరంతర ఒత్తిడి వారి మానసిక, శారీరక ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తోంది. సుమారు పది మంది సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్యలో, ఆకస్మిక మరణాలో 2025లోనే నమోదయ్యాయి. మొత్తంగా 61 మంది చనిపోయినట్టు ధృవీకరణ.
తమను రాత్రి విధుల నుంచి మినహాయించాలని, ప్రమోషన్ అవకాశాలు కావాలని మహిళా పోలీసు అసిస్టెంట్లు కోరుతున్నారు. సర్వేయర్లు ఆధునిక పరికరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అనేక విభాగాల బాధ్యతలు చేపట్టి, నాణ్యత లోపాల పేరుతో మెమోలు, సస్పెన్షన్లు ఎదుర్కొంటున్నారు.
ప్రజల ఇబ్బందులు..
సంక్షేమ కార్యదర్శులు తమ నైపుణ్యానికి సంబంధించిన పనులకంటే ఇతర సర్వేలకు మళ్లించబడుతున్నారు. అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపైనే పడుతోంది. 72 గంటల్లో సమస్య పరిష్కారం అనే లక్ష్యం కడకొక ఆశగానే మిగులుతోంది.
సచివాలయాలు సమస్యలను పరిష్కరించే కేంద్రాల కంటే దరఖాస్తులు స్వీకరించే కౌంటర్లుగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. సర్టిఫికెట్లు, భూ సర్వేలు, సబ్సిడీలు, పథకాల కోసం ఆలస్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లేదా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్‌ను ఆశ్రయిస్తున్నారు.
ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో సచివాలయాల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు గ్రామంలో సిబ్బంది హాజరు లోపం, 15 లక్షల రూపాయలతో నిర్మించిన లైబ్రరీ వినియోగం లేకపోవడం, కనెక్టివిటీ సమస్యలు ప్రజల్లో నిరాశను పెంచుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఇంటికి వచ్చే పెన్షన్ల కోసమో, ఇతర అవసరాలకో పౌరులు ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం వారి నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఆర్థికంగా కూడా ఈ వ్యవస్థ “తెల్ల ఏనుగు”గా మారుతోందనే విమర్శలున్నాయి.
జీతాలు, అలవెన్సులు, నిర్వహణ ఖర్చులు వేల కోట్లు అయినప్పటికీ ఫలితాలు ఆ నిష్పత్తిలో కనిపించడం లేదు. జనాభా ఆధారంగా పంచాయతీల వర్గీకరణ జరుగుతున్నా, అధిక సిబ్బందిని సరైన విభాగాలకు మళ్లించాల్సిన అవసరం ఉంది.
రాజకీయాలకు అతీతంగా తక్షణ చర్యలు అవసరం..
పబ్లిక్ వర్క్స్, రెవెన్యూ, సామాజిక సంక్షేమవంటి విభాగాల్లో ఖాళీలకు అనుగుణంగా నైపుణ్యాల మ్యాపింగ్, శిక్షణ ద్వారా ఉద్యోగుల సేవల్ని సమర్థంగా పునర్వినియోగం చేయవచ్చు.
ఈ పరిస్థితికి మూల కారణాలు ప్రారంభ దశలో పైలట్ పరీక్షలు లేకపోవడం, సమన్వయ లోపం, 2024 తర్వాత తీసుకున్న మార్పులకు సమగ్ర వ్యూహం లేకపోవడమే! వరుస ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పించుకోజాలవు. ఒకటి లోపభూయిష్ట అమలయితే మరొకటి స్పష్టతలేని సవరణలు.
ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా తక్షణ చర్య అవసరం. కనీసం పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి అధ్యక్షతన అన్ని పార్టీల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
సచివాలయాలను పంచాయతీరాజ్ సంస్థలతో పూర్తిగా అనుసంధానించి గ్రామ సభలకు సంయుక్త బాధ్యత కల్పించాలి. పర్యవేక్షణ, నివేదిక వ్యవస్థలను స్పష్టంగా నిర్వచించాలి. సర్వవిధ కుటుంబ డేటాతో సమగ్ర సర్వే విధానం అమలు చేయాలి. పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక విద్యా సహాయకులను నియమించాలి. ప్రతి కార్యాలయానికి కనీస సౌకర్యాలు కల్పించాలి; గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నమూనాలు రూపొందించాలి.
రాజకీయ ప్రభావం లేకుండా పరిమిత స్థాయిలో వాలంటీర్లను పునరుద్ధరించాలి. జనాభా ఆధారంగా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేసి, అధిక సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లించాలి. ఉద్యోగుల డిమాండ్లైన సౌకర్యవంతమైన పని వేళలు, గోప్యమైన మానసిక ఆరోగ్య సలహాలు, ప్రమోషన్ మార్గాలు, ఆధునిక పరికరాలు, భద్రతా ప్రమాణాలను అమలు చేయాలి.
ఈ వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం పరిపాలనా అవసరం మాత్రమే కాదు! పాలనా వికేంద్రీకరణతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయానికి ఇదెంతో కీలకం.
ఆధారపూర్వక, సమగ్ర సంస్కరణలతో గ్రామ స్వరాజ్య వాగ్దానాన్ని తిరిగి సాధించవచ్చు. శక్తివంతమైన గ్రామాలు, పారదర్శక సంక్షేమం, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితం.
గాంధీజీ చెప్పినట్లే, నిజమైన స్వాతంత్య్రం గ్రామ పునాదుల నుంచి మొదలవుతుంది. సవ్యమైన ‘సచివాలయ వ్యవస్థ’ ద్వారా మాత్రమే ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు కట్టుబడే ప్రజాస్వామ్యం వస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
