ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం గడిచింది.
పాలకులు మారారు, రాజధానుల పేర్లు మారాయి, కానీ రాష్ట్ర పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన ‘రాష్ట్ర మానవ హక్కుల కమిషన్'(ఏపీఎస్హెచ్ఆర్సీ) పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.
నేడు ఈ సంస్థ ఒక క్రియాశీలక రక్షణ కవచంలా కాకుండా, ప్రభుత్వ రికార్డుల్లో ఒక “చిల్లర పరిపాలనా అంశం”గా మిగిలిపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.
ఇటీవల వెల్లడైన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)వివరాలు, ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ గణంకాలను చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ హక్కుల పట్ల ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో స్పష్టమవుతోంది.
ప్రధాన 23 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ 23వ స్థానంలో నిలవడం అనేది కేవలం ఒక ర్యాంకు పతనం కాదు, ఇది రాష్ట్ర పాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
నియామకాల జాప్యం: పరిపాలనా లోపమా లేక ఉద్దేశపూర్వక వ్యూహమా?
కమిషన్లో నాయకత్వ శూన్యత అనేది ఆకస్మికంగా జరిగింది కాదు, అది ఒక వ్యవస్థీకృత నిర్లక్ష్యం. 2024 మార్చి 23న చైర్మన్, సభ్యుల పదవీకాలం ముగిసింది. నూతన ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా, ఈ కీలక కార్యనిర్వాహక పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
ఈ సుదీర్ఘ నాయకత్వ లోపం కారణంగా కమిషన్ నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేకపోతోంది. 2024 మార్చి నాటికి 1,661 కేసులు పెండింగ్లో ఉండగా- ప్రస్తుతం ఆ సంఖ్య 4,722కు చేరింది. ముఖ్యంగా, 2025 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబర్ 30 వరకు వచ్చిన 1,561 కొత్త ఫిర్యాదులపై కమిషన్ ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
ప్రభుత్వ యంత్రాంగంపై ఫిర్యాదులను విచారించే అధికారం ఉన్న ఒక సంస్థను ‘headless’గా ఉంచడం ద్వారా, ప్రభుత్వం తనపై ఎటువంటి విచారణలు జరగకుండా అడ్డుకుంటోందా? అనే అనుమానాలు వ్యూహాత్మక జాప్యం వల్ల బలపడుతున్నాయి.
కర్నూలు వర్సెస్ అమరావతి: ప్రాంతీయ సెంటిమెంట్ల మధ్య నలుగుతున్న న్యాయం
కమిషన్ కార్యాలయం ఎక్కడ ఉండాలనే వివాదం, సామాన్యుడికి న్యాయం అందకుండా చేస్తోంది. రాజ్యాంగబద్ధ సంస్థకు ఉండాల్సిన స్థిరత్వం ఏపీలో మచ్చుకైనా కనిపించదు.
2017లో నాటి ప్రభుత్వం అమరావతికి తరలించాలని నిర్ణయించినా(జీఓ ఎంఎస్ 151), తర్వాతి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి కర్నూలుకు మార్చింది(జీఓ 89 ఆఫ్ 2021).
ప్రస్తుతం కర్నూలులోని ఒక స్టేట్ గెస్ట్ హౌస్లో కేవలం రెండు గదులకు పరిమితమైన ఈ కార్యాలయం, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలకు అందుబాటులో లేదు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వం, కమిషన్ను అక్కడికి తరలిస్తే రాయలసీమలో రాజకీయ ఆగ్రహం ఎదురవుతుందేమోనని భయపడుతోంది. ప్రాంతీయ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లేదా రాజకీయ ఆందోళనలకు భయపడి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ “వ్యూహాత్మక మౌనం” వల్ల శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు బాధితులు ప్రయాణించలేక, ఫిర్యాదులు చేయడమే మానేస్తున్నారు.
వనరుల సంక్షోభం: దర్యాప్తు శూన్యం
వనరుల కొరత ఈ సంస్థను మరింత బలహీనపరిచింది. కేవలం పది మంది డిప్యూటేషన్ సిబ్బంది, ఆరుగురు అవుట్సోర్సింగ్ కార్మికులపై ఆధారపడి కమిషన్ పనిచేస్తోంది. మానవ హక్కుల చట్టం ప్రకారం దర్యాప్తు విభాగానికి ఐజీ(ఐజీపీ) స్థాయి అధికారి నాయకత్వం వహించాలి. కానీ, ఏపీలో కేవలం ఇద్దరు పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీరి వద్ద అవసరమైన వనరులు ఏమాత్రం లేవు.
దీని ఫలితంగానే, 2023-24 మొత్తం కాలంలో ఏపీ హెచ్ఆర్సీ జైళ్లు, ఆసుపత్రులు లేదా ఇతర సంస్థలకు ఒక్కసారి కూడా సందర్శనలు నిర్వహించలేదు. దీంతో రాష్ట్రంలోని 25 జైళ్లు స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా నిరంకుశత్వానికి నెలవుగా మిగిలిపోయాయి.
ప్రభుత్వ మౌనం — ఎవరికి లాభం?
కమిషన్ నిర్వీర్యం కావడం వల్ల పరోక్షంగా లాభపడుతున్నది వ్యవస్థలోని అధికార బలమే.
డిజిటల్ అంధకారం: సొంత వెబ్సైట్ లేదు, జాతీయ హక్కుల పోర్టల్(hrcnet.nic.in)లో అనుసంధానం లేదు. ఈ అపారదర్శకత ఎవరిని కాపాడటానికి?
ఆర్థిక జవాబుదారీతనం లేమి: 2022-23 బడ్జెట్ వినియోగంపై కమిషన్ ఎలాంటి డేటాను నిర్వహించడం లేదని ఇండియా జస్టిస్ రిపోర్ట్ వెల్లడించింది.
ప్రజలకు సమాచారం అందుబాటులో లేకుండా చేయడం, జాతీయ పారదర్శకత వ్యవస్థ నుంచి రాష్ట్రం విడిపోవడం వల్ల బాధితుల గొంతు నొక్కడం ప్రభుత్వానికి సులభతరమవుతోంది.
సాకులు చెప్పే సమయం ముగిసింది. మానవ హక్కులు అనేవి ప్రభుత్వ ఎజెండాలో చర్చించదగిన అంశం కాదు; అవి ప్రజాస్వామ్య పాలనలో భాగం. ఏపీ హెచ్ఆర్సీ ప్రస్తుత స్థితి రాజ్యాంగబద్ధమైన తనిఖీ సంస్థల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ప్రశ్నిస్తోంది.
4,722 కేసులు కేవలం కాగితాలు కావు, అవి న్యాయం కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది ఆర్తనాదాలు. ప్రభుత్వం వెంటనే రాజకీయ సమీకరణాలను పక్కన పెట్టి, నియామకాలు చేపట్టి, కమిషన్ను పూర్తిస్థాయి వనరులతో అమరావతిలో పునరుద్ధరించాలి.
కర్నూలులో కార్యాలయం తలుపులు తెరిచే ఉన్నాయి, కానీ అక్కడ బాధితుల గోడు వినే నాథుడే లేడు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ నేడు ఒక ‘శూన్య మందిరం’గా మిగిలిపోయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
