
2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విద్యారంగం సంక్షోభంలో మునిగిపోతోంది. వనరుల విభజన, మౌలిక సదుపాయాల లోటు, పేదరికం, వలసలు, ఇవి అన్నీ కలిపి ప్రభుత్వ విద్యను బలహీనపరచాయి. కానీ ఈ లోటుపాట్లను సరిచేసే బదులు, గత దశాబ్దంగా అధికారంలోకి వచ్చిన పార్టీలు ఖర్చు తగ్గింపుపై దృష్టి పెట్టి, పాఠశాలల విలీనం, హేతుబద్ధీకరణ పేరుతో విద్యను మరింత నాశనం చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు- తెలుగుదేశం(టీడీపీ), వైసీపీ సమస్యకు పరిష్కారం చూపకుండా, తాత్కాలిక నిర్ణయాలతో మరింత తీవ్రతరం చేశాయి.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అనేక పాఠశాలలను కోల్పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తక్కువ సౌకర్యాలతో ఉన్న పాఠశాలలు మరింత బలహీనమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు వలస పోవడం ప్రారంభమైంది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల పేదలు సైతం అప్పులపాలు అవుతున్నా తమ పిల్లల భవిష్యత్తుకోసం ప్రైవేట్ పాఠశాలలను వెతికారు.
టీడీపీ పాలనలో పాఠశాలల మూసివేతలు..
2014– 19 మధ్య టీడీపీ 5,000కు పైగా పాఠశాలలను మూసేసింది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్లతో విలీనం చేసి ప్రయాణ దూరాలను పెంచింది. ముఖ్యంగా బాలికలకు ఇది సమస్యగా మారడంతో డ్రాప్‌ఔట్ల సంఖ్య పెరిగింది. భద్రతా సమస్యలతో పాటు చిన్న వయసులోనే వివాహాలు కావడంలాంటి దుష్ఫలితాలు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరసనలు చేసినా పాలకులు పట్టించుకోలేదు.
వైసీపీ పాలనలో జీఓ 117 ప్రభావం..
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా పరిస్థితిని మెరుగుపరచలేకపోయింది. 2021లో జీఓ 117 ద్వారా కూళ్లను ఆరు వర్గాలుగా పునర్వ్యవస్థీకరించి, 3– 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఫలితంగా 5,300 పాఠశాలలో 10 మందికంటే తక్కువ విద్యార్థులే మిగిలిపోయారు. 1.93 లక్షల మంది విద్యార్థులు డ్రాప్‌ఔట్ అయినట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. దీనిని “విద్యా నాశనం”గా అభివర్ణిస్తూ ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. ఈ పథకం రైట్ టు ఎడ్యుకేషన్ చట్ట ఉల్లంఘన అని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది.
టీడీపీ పునరాగమనం జీఓ 21..
2024లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ 117ను రద్దు చేశారు. అయినా, జీఓ 21 ద్వారా మరోసారి తక్కువ రిజిస్ట్రేషన్ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం ప్రారంభించారు. తొమ్మిది కేటగిరీలుగా పాఠశాలలను పునర్వ్యవస్థీకరించడంతో సమస్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే 46,000కిపైగా డ్రాప్ఔట్లు నమోదయ్యాయి.
ఒకే ఉపాధ్యాయ పాఠశాలల వాస్తవం..
విలీన సమస్యతో పాటు ఒకే టీచర్ పాఠశాలల వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది. కేంద్ర విద్యాశాఖ ఉమ్మడి జిల్లా విద్యా సమాచార వ్యవస్థ(UDISE 2024-2025) నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1,04,000 పాఠశాలలలో ఒకే టీచర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12,912 పాఠశాలలు ఒకే టీచర్‌ను కలిగి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్(9,508), జార్ఖండ్ (9,172) లాంటి పెద్ద రాష్ట్రాలను ఈ పరిస్థితి మించిపోయింది.
ఈ పరిస్థితిలో ఒక టీచర్ ఎన్నో తరగతులు, సబ్జెక్టులు, పరిపాలనా పనులు చూసుకోవాల్సి రావడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పాఠశాలలు 38% వరకు ఉండటం ఆందోళన కలిగించే విషయమే. పాఠశాలలు దూరంగా ఉండడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో బాలికల విద్యను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్నత ప్రాథమిక స్థాయి బాలికల డ్రాప్‌ఔట్ రేటు 3.3%గా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. విభజన తర్వాత 16– 18 ఏళ్ల వయస్సు గల బాలికల డ్రాప్‌ఔట్ రేటు గణనీయంగా పెరగడం, బాల్య వివాహాలు, వలసలు, భద్రతా లోపాల ఫలితమే.
పొలిటికల్ ఎజెండాకు విద్య బలి..
విద్యను రక్షించాల్సిన బదులు టీడీపీ, వైసీపీ పార్టీలు రెండు కూడా విద్యా రంగాన్ని రాజకీయ ఎజెండాలకు వాడుకున్నాయి. ఎన్ఈపీ- 2020 పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించిన “క్లస్టరింగ్, స్కూల్ కాంప్లెక్స్” మోడల్‌కు మద్దతు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలీన విధానాన్నే కొనసాగించాయి. స్వతంత్ర పరిష్కారాలపై శ్రద్ధ లేకపోవడం వల్ల స్థానిక సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 70– 75% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సమూహాల పిల్లలు- విలీనం, ఒకే టీచర్ వ్యవస్థ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఈ వర్గాలే విద్య ద్వారా ఎదగాలని ఆశపడుతున్న సమయంలో, పాలకుల తప్పుడు నిర్ణయాలు వారి భవిష్యత్తును మసకబారుస్తున్నాయి.
“హేతుబద్ధీకరణ” పేరుతో కొనసాగించే ప్రయోగాలు ఆగాలి. పాఠశాలలను మూసివేయడం కాదు, తిరిగి తెరుచుకోవాలని సమయం చెబుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించడం, రవాణా సదుపాయాలు కల్పించడం, బాలికల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అత్యవసరం. నిజమైన మార్పు స్కూలు స్థాయిలోనే రావాలి.
ఆంధ్రప్రదేశ్ విద్యా సాగా ఒక హెచ్చరిక. సామర్థ్యం పేరిట విలీనం చేస్తూ, ఒకే టీచర్ పాఠశాలలను కొనసాగిస్తూ, విద్యార్థులను ముఖ్యంగా బాలికలను అవకాశాలు కోల్పోయేలా చేస్తోంది . విలీనం కాదు నిజమైన పునరుజ్జీవనం కావాలి. ప్రతి బాలుడికి, ప్రతి బాలికకు సమానమైన, నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను నిర్మించాలి. అదే రేపటి ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడి.
(వ్యాస రచయిత న్యాయ విద్యార్థి, ఎస్ఎఫ్ఐ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.