సాగర్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజుల్లో రెండు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆరోపించారు. ఈ దాడులు, అల్లర్లకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
అయితే, ఆశ్చర్యకరంగా యూనివర్సిటీ యాజమాన్యం బాధిత విద్యార్థులకే షోకాజ్ నోటీసులను జారీ చేసింది- హాస్టల్ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ అందులో ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: “క్యాంపస్‌లో మాపై రెండుసార్లు దాడులు జరిగాయి. కానీ, ఇప్పుడు క్రమశిక్షణా నియమాలను ఉల్లంఘించారన్న నెపంతో యూనివర్సిటీ అధికారులు మాకే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మమ్మల్ని హాస్టల్ నుంచి ఎందుకు బహిష్కరించకూడదని, మాపై ఇతర క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదని అందులో ప్రశ్నించారు.
దాడుల్లో గాయపడిన బాధితులం మేమైతే, తిరిగి మాపైనే చర్యలు తీసుకుంటున్నారు”అని ఓ బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న డాక్టర్ హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి బిట్టు ఫిబ్రవరి 24న ‘ది వైర్’ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు.
గత ఐదు రోజుల్లో క్యాంపస్‌లో తనతో పాటు తన తోటి విద్యార్థులపై రెండుసార్లు దాడులు జరిగాయని ఆయన వివరించారు.
దీని గురించి యూనివర్సిటీ అధికారులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో, జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశామని; అయినా తమ భద్రతకు ఎలాంటి భరోసా లభించలేదని ఆయన వాపోయారు.

యూనివర్సిటీలో జరిగిన ఈ రెండు హింసాత్మక ఘటనల వెనుక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్తల హస్తం ఉందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)కు చెందిన బిట్టు ఆరోపించారు.
అయితే, ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఆరోపణలను ఖండించారు. ‘స్టడీ సర్కిల్’ వల్లే ఈ ఘర్షణ తలెత్తిందని వారన్నారు.
బిట్టు చెబుతున్న దాని ప్రకారం, ఈ ఘటనలు కేవలం విద్యార్థి సంఘాల మధ్య జరిగే రాజకీయ ఘర్షణలు మాత్రమే కాదు.
విశ్వవిద్యాలయాల్లో పెరుగుతున్న సైద్ధాంతిక అసహనానికి, వ్యవస్థీకృత హింసకు ఇవి ప్రమాదకర సంకేతాలు.
ఇలాంటి ఘటనలు సెంట్రల్ యూనివర్సిటీల్లోని విద్యార్థుల భద్రత, విద్యా సంబంధిత, ప్రజాస్వామ్య వాతావరణంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఎందుకంటే, ఆర్ఎస్ఎస్-ఏబీవీపీలు వ్యతిరేకిస్తున్న ఈ ‘స్టడీ సర్కిల్స్’ ప్రధానంగా శాస్త్రీయ ఆలోచనా విధానం, హేతుబద్ధత, అందరికీ సమాన విద్య, లింగ సమానత్వం, సామాజిక-రాజకీయ అంశాల గురించే చర్చిస్తుంటాయి.
సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి హింసాత్మక పరిస్థితుల నడుమ స్వేచ్ఛగా చదువుకోవడం, చర్చలు నిర్వహించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
అసలేం జరిగింది?
కేరళలోని ఎర్నాకుళానికి చెందిన విద్యార్థి, ఏఐఎస్ఎఫ్ సభ్యుడు హరి అయ్యప్పన్ మాట్లాడుతూ- ఫిబ్రవరి 20న తాను, ఇతర ఏఐఎస్ఎఫ్ సభ్యులు కలిసి క్యాంపస్‌లోని గౌర్ పిల్లర్ దగ్గర “యూనిట్ కాన్ఫరెన్స్” కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
స్టడీ సర్కిల్ కోసం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పోస్టర్లు ఏర్పాటు చేస్తుండగా ఈ దాడి మొదలైందన్నారు.
ఈ కార్యక్రమం గురించి ముందే యూనివర్సిటీ అధికారులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.
“సమాన విద్యా హక్కు”కు సంబంధించిన పోస్టర్‌ను తాను తయారు చేశానని హరి అన్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 100 నుంచి 150 మంది అక్కడికి చేరుకుని విద్యార్థులపై దాడి చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల ఫోన్లను లాక్కుని, అందులోని వీడియోలను డిలీట్ చేయాలని బెదిరించారు. విద్యార్థులను తిట్టారు.
ఆ తర్వాత పోలీసులు భద్రత నిమిత్తం ఈ విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే కొంతమంది ఏబీవీపీ-ఆర్ఎస్ఎస్ సభ్యులు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీసుల ముందే వాళ్లు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను బెదిరించారు, తిట్టారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 23న ఈ విద్యార్థులపై మళ్లీ దాడి జరిగినట్లు సమాచారం.
దీని గురించి బిట్టు వివరిస్తూ, “బాధిత విద్యార్థులంతా రక్షణ కల్పించాలంటూ ప్రాక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఇంతలో, ప్రాక్టర్ కార్యాలయం ముందే మాపై మళ్లీ దాడి జరిగింది. ఈసారి ఏబీవీపీ-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరింత బరితెగించి దాడికి దిగారు. ‘శాఖ’ల్లో ఉపయోగించే కర్రలతో(దండాలతో) వచ్చారు. చాలా మంది విద్యార్థుల ముఖాలపై, కళ్లపై ఆ కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. వీపుల మీద కూడా బలంగా బాదారు. ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు” అని తెలిపారు.
తాము ప్రాక్టర్ను కలిసినప్పుడు, ఈ విషయంలో యూనివర్సిటీ యాజమాన్యం ఏమీ చేయలేదని చేతులెత్తేసిందని బిట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

బిట్టు అభిప్రాయం ప్రకారం, క్యాంపస్‌లో భయానక వాతావరణాన్ని సృష్టించి, తమ సైద్ధాంతిక కార్యకలాపాలను అణచివేయడానికే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులకు పాల్పడ్డారు.
కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు దాడులు జరగడంతో విద్యార్థుల్లో భయం, అభద్రతా భావం మరింత పెరిగాయి.
ఈ విద్యార్థులంతా తమ ఇళ్లకు దూరంగా హాస్టళ్లలో ఉంటున్నారు.
ఈ దాడుల విషయం తెలిస్తే తమ కుటుంబ సభ్యులు ఏమైపోతారో అని వారు తీవ్ర ఆందోళన పడుతున్నారు.
“ఇంకా ఈ విషయం గురించి వాళ్ల ఇళ్లలో చాలా మంది విద్యార్థులు చెప్పలేదు. మా ఇంట్లో వాళ్లకి మాత్రమే ఈ ఘటన గురించి కొద్దిగా తెలుసు. వాళ్లు చాలా ఆందోళన పడుతున్నారని నాకు అర్థమైంది. కానీ ఇక్కడ అంతా బాగానే ఉందని, నాతో వాళ్లు రోజూ మాట్లాడవచ్చని చెప్పి ప్రస్తుతానికి సముదాయించాను. కానీ రేపు ఏం జరుగుతుందో నాకే తెలియదు” అని బిట్టు అన్నారు.
ఇదే సమయంలో మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న మహాత్మా గాంధీ అంతర్జాతీయ హిందీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి, ఏఐఎస్ఎఫ్ జాతీయ మండలి సభ్యుడు విశాల్ మాట్లాడారు.
ఈ దాడులు జరిగిన సమయంలో ఆయన సాగర్‌లోని హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలోనే ఉన్నారు.
“దాడి జరిగినప్పుడు నేను యూనిట్ సమావేశానికి వచ్చాను. క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది కళ్ల ముందే ఈ దాడి జరిగింది. కానీ ఎవరూ వారిని అడ్డుకోలేదు. ఇది దాడి చేసిన వారికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఆ చొరవతోనే మళ్లీ దాడి చేయడానికి వారికి ధైర్యం వచ్చింది” అని విశాల్ తెలిపారు.
విద్యార్థుల మనసుల్లో రాజ్యమేలుతున్న భయం
మొదటి దాడి జరిగిన సమయంలో, దాడికి గురైన విద్యార్థుల పక్షాన పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని విశాల్ ఆరోపించారు.
రెండోసారి దాడి జరిగిన తర్వాత కూడా, ఎంతో ఒత్తిడి చేస్తేగానీ పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం, యూనివర్సిటీ అధికారులు, ఇద్దరూ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ల ఒత్తిడికి తలొగ్గుతున్నారని; అందుకే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విశాల్ మండిపడ్డారు. ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ, తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంలో యూనివర్సిటీ, పోలీసుల వైఫల్యాన్ని ఆయన ప్రశ్నించారు.
దాడిలో గాయపడిన విద్యార్థులు ఇప్పటికీ ప్రాణభయంతోనే ఉన్నారని ఆయన అన్నారు. అందువల్ల, ముందుగా బాధిత విద్యార్థులందరికీ తక్షణమే రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అప్పుడే వాళ్లు ఎలాంటి భయం లేకుండా తమ చదువులు, విద్యాపరమైన కార్యక్రమాలు కొనసాగించగలరని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడికి పాల్పడిన వారిపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
“చర్చలు జరిపితేనే విద్యార్థులను చంపే స్థాయికి వెళ్తే, అది ఉన్నత విద్యా సంస్థల ప్రజాస్వామ్య స్వభావంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అవుతుంది. విశ్వవిద్యాలయం అనేది ఆలోచనలకు, స్వేచ్ఛాయుత చర్చలకు బహిరంగ వేదిక. అక్కడ విద్యార్థి సంఘాల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు హింసాత్మకంగా మారితే, అది విద్యా వ్యవస్థకే అత్యంత ప్రమాదకరమైన సంకేతం” అని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి సమయంలో, తమ వద్ద ఉన్న భారత రాజ్యాంగం బుక్‌లెట్‌ను లాక్కున్నారని; తాము సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటూ ఆ దుండగులు తప్పుడు ప్రచారం చేశారని బాధిత విద్యార్థులు వాపోయారు.
అంతేకాకుండా, బయటి నుంచి వచ్చిన ఏబీవీపీ-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ఏఐఎస్ఎఫ్ను కించపరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
వీళ్లు క్యాంపస్‌లో దేశ వ్యతిరేక, మహిళా వ్యతిరేక, సమాజ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి, విద్యార్థులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.

మరోవైపు, ఇదే యూనివర్సిటీలో చివరి సంవత్సరం లా చదువుతున్న ఏబీవీపీ విద్యార్థి నాయకుడు గౌరవ్ మిశ్రా ‘ది వైర్’తో మాట్లాడుతూ- 23న జరిగిన హింసతో గానీ, దాడితో గానీ తమ సంస్థకు, ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆ ఘటన జరిగిన సమయంలో తాను క్యాంపస్ బయట ఉన్నానని, ఈ ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు.
జేఎన్‌యూ తరహా సంస్కృతిని రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాం: గౌరవ్ మిశ్రా (ఏబీవీపీ)
ఫిబ్రవరి 20న జరిగిన ఘటన గురించి ఆయన స్పందిస్తూ.. “కొంతమంది ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు గౌర్ స్తంభంపై ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ పోస్టర్‌ను తొలగించి, ఆ స్థానంలో “బ్రాహ్మణవాదం నశించాలి,” “మనువాదం నశించాలి,” “లాల్ సలాం” అని రాసి ఉన్న వివాదాస్పద పోస్టర్లను అంటించడంతోనే ఈ వివాదం మొదలైంది. ఆ సమయంలో కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు అక్కడికి వెళ్లి, ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు వాళ్లు మాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో మా సంస్థకు చెందిన 12-15 మంది సభ్యులు అక్కడికి చేరుకుని వారితో వాగ్వివాదానికి దిగారు. మేమే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఆ తర్వాత రెండు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆ రోజే దీనికొక పరిష్కారం కూడా దొరికింది” అని గౌరవ్ వివరించారు.
స్టడీ సర్కిల్ గురించి గౌరవ్ మిశ్రా మాట్లాడుతూ, తమ సంస్థ కూడా ఇలాంటి స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తుందని చెప్పారు.
కాబట్టి, దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, విద్యార్థుల ప్రయోజనం కోసం చేసే ఏ కార్యక్రమాన్నైనా తాము ఎందుకు వ్యతిరేకిస్తామని ఆయన ప్రశ్నించారు.
అయితే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు బయటి వ్యక్తులతో కలిసి విద్యార్థుల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, దానిని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన ఆరోపించారు.
“ఈ వ్యక్తులు ఇక్కడ కూడా జేఎన్‌యూ తరహా హాస్టల్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారు. అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరి హాస్టల్‌కు మరొకరు స్వేచ్ఛగా వెళ్లే పరిస్థితి ఉంది. అది పూర్తిగా తప్పు. అక్కడి నుంచి లైంగిక విద్య పేరుతో ఇతర వివాదాస్పద సంస్కృతిని ఇక్కడకు తీసుకురావాలనుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వాళ్లు కార్ల్ మార్క్స్ భావజాలాన్ని ఇక్కడ రుద్దాలనుకుంటున్నారు. మృతి చెందిన నక్సలైట్ కమాండర్ హిడ్మాకు వీళ్లు సంతాప సభ నిర్వహించి, అతన్ని ఒక విప్లవకారుడిగా కీర్తించారని మాకు సమాచారం అందింది. వీళ్లు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలని చూస్తున్నారు. దీనిపై మా అందరికీ తీవ్ర అభ్యంతరం ఉంది” అని గౌరవ్ మిశ్రా స్పష్టం చేశారు.
గౌరవ్ చెబుతున్న దాని ప్రకారం- వాళ్ల దగ్గర ఉన్నది రాజ్యాంగం బుక్లెట్ కాదు, కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకం.
దాని కోసం వాళ్లు డబ్బు ఖర్చు చేసి మరీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పంచుతూ ప్రచారం చేస్తున్నారు.
ఈ వివాదం గురించి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ ‘ది వైర్’తో మాట్లాడుతూ, విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులతో పాటు మరో ఎనిమిది నుంచి పది మంది గుర్తు తెలియని వ్యక్తులపై దాడి, అల్లర్లకు సంబంధించిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.
ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు.
సంఘటనా స్థలానికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారని, కాలేజీ క్యాంపస్‌లో సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరా దృశ్యాలతో పాటు, కొందరు విద్యార్థులు అందించిన వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
శాంతియుత విద్యా వాతావరణం కోసం చర్యలు: యూనివర్సిటీ యాజమాన్యం
ఈ మొత్తం వివాదంపై ‘ది వైర్’ యూనివర్సిటీ అధికారులకు ఇమెయిల్ ద్వారా పలు ప్రశ్నలు పంపింది. దీనికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ వివేక్ జైస్వాల్ బదులిచ్చారు.
క్యాంపస్‌లో శాంతియుత, సామరస్యపూర్వక విద్యా వాతావరణాన్ని కాపాడేందుకు యూనివర్సిటీ యాజమాన్యం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా, క్యాంపస్‌లో క్రమశిక్షణ పాటించాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక అడ్వైజరీ జారీ చేశారని, దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.
“యూనివర్శిటీలో జరిగిన వివాదానికి సంబంధించి రెండు వర్గాల విద్యార్థులకు యూనివర్సిటీ భద్రతా విభాగం నోటీసులు జారీ చేసింది. వారి వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థుల ఫిర్యాదును యూనివర్సిటీ యాజమాన్యం ఫిబ్రవరి 25న స్వీకరించింది. నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాము” అని ఆయన వివరించారు.
క్యాంపస్‌లో భద్రతా ఏర్పాట్ల గురించి వివేక్ జైస్వాల్ వివరిస్తూ- “యూనివర్సిటీకి చెందిన శాశ్వత భద్రతా సిబ్బందితో పాటు, ఒక ప్రైవేట్ ఏజెన్సీ అందించిన సిబ్బంది కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
అవసరమైనప్పుడు సమీప పోలీస్ స్టేషన్ సహాయం కూడా తీసుకుంటాం.
క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య తలెత్తే అవాంఛనీయ ఘటనలు, వివాదాలను బోర్డ్ ఆఫ్ రీజెంట్స్, సెక్యూరిటీ కమిటీ పరిష్కరిస్తాయి” అని స్పష్టం చేశారు.
ఇటీవలి ఘటనలపై యూనివర్సిటీ యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఏమైనా ఫిర్యాదు చేసిందా అని ‘ది వైర్’ ప్రశ్నించగా, “రెండు సందర్భాల్లోనూ, పరిస్థితిని అదుపు చేయడానికి యూనివర్సిటీ భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
భద్రతా విభాగం ద్వారా సమీప పోలీస్ స్టేషన్‌కు తక్షణం సమాచారం అందించి, పోలీసులను సంఘటనా స్థలానికి పిలిపించాము.
విద్యార్థులు నేరుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు మాకు సమాచారం ఉంది” అని ఆయన బదులిచ్చారు.
అదే సమయంలో, దాడిలో గాయపడిన బాధిత విద్యార్థులకు ‘షోకాజ్ నోటీసులు’ ఎందుకు జారీ చేశారన్న ప్రశ్నకు యాజమాన్యం స్పందించింది.
సరైన అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు యూనివర్సిటీ హాస్టల్లోకి ప్రవేశించడం, ఆ బయటి వ్యక్తులతో విద్యార్థి సంఘాలు నిరంతరం సమావేశాలు నిర్వహించడం, అలాగే ఫిబ్రవరి 20న జరిగిన ఘటనలో వారి పాత్రపై అనుమానాలు ఉన్నందునే హాస్టల్ విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
