పశ్చిమాసియాలోని ప్రస్తుత యుద్ధ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోని తక్షణమే అన్ని పక్షాలు సాయుధ చర్యలను నిలిపివేయాలని చైనా పిలుపునిచ్చింది.
ఇజ్రాయెల్- అమెరికా ద్వయం ఇరాన్‌పై సాగిస్తున్న దాడులకు స్పందనగా ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది.
దీంతో భారతదేశంతోసహా ప్రపంచ దేశాలకు చేరాల్సిన చమురు రవాణా సంక్షోభంలో పడింది.
అంతర్జాతీయ చమురు మార్కెట్లపై అమెరికాకు చెందిన బహుళ జాతీయ సంస్థలదే గుత్తాధిపత్యమన్న విషయం తెలిసిందే.
ఇరాన్‌పై జరుగుతున్న దాడి- ప్రతిదాడులు మరికొంతకాలం కొనసాగితే, అంతర్జాతీయ చమురు మార్కెట్లు కకావికలమయ్యే పరిస్థితి తలెత్తుతుంది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలను శాసించే బహుళజాతి గుత్త సంస్థలు అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.
యుద్ధాన్ని నిలిపివేయాలని హెచ్చరించిన చైనా..
తాను సృష్టించిన సంక్షోభమే ఈ పరిస్థితికి కారణమని ట్రంప్ గుర్తించలేదని అనుకోలేము.
అయినా, హర్మూజ్ జలసంధిని ఇరాన్ గుప్పిట నుంచి విడిపించే నెపంతో- చైనా,రష్యా, జపాన్, ఫ్రాన్స్, భారత్, ఆస్ట్రేలియావంటి దేశాలకు ట్రంప్ ఇస్తున్న పిలుపును అంగీకరించడం అంటే- మూడు దేశాల మధ్య సాగుతోన్న సమరాన్ని మూడవ ప్రపంచ యుద్ధంగా మార్చడమే.
ఈ ప్రమాదాన్ని గుర్తించిన చైనా తక్షణమే పశ్చిమాసియాలో సాగుతోన్న యుద్ధాన్ని నిలిపివేయాలని హెచ్చరించింది.
బీజింగ్‌లో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ విలేకరులతో మాట్లాడుతూ, “హర్మూజ్ జలసంధి, పరిసర ప్రాంతాలలో నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా సరుకులు, ఇంధన వనరుల రాకపోకలను ప్రభావితం చేయడమేకాక పశ్చిమాసియాలో శాంతికి, అంతర్జాతీయ సుస్థిరతకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లకుండా ఉండడానికి అన్ని పక్షాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించే ఈ ప్రాంతీయ ఘర్షణలను నియంత్రించాలి” అని అన్నారు.
మార్చి 15 ఆదివారంనాడు, ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
తమ దేశానికి కావాల్సిన ప్రధానమైన చమురు వనరులు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకుంటున్న చైనా, ప్రపంచ చమురు రవాణాకు అంతరాయం కలిగించేందుకుగాను హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు స్పందించాలని ట్రంప్ ఇంటర్వ్యూలో కోరారు.
ఈ నెలలో చైనా పర్యటించనున్న ట్రంప్, పరిస్థితిని బట్టి తన పర్యటనను వాయిదా వేసుకునే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు పశ్చిమాసియాలో సాయుధ చర్యలను విరమించాలని చైనా విదేశాంగ శాఖ కోరింది.
ఇది తమ యుద్ధం కాదంటున్న యూరోపియన్ యూనియన్
హర్మూజ్ జల సంధిని ఇరాన్ గుప్పెట నుంచి విముక్తి చేసే విషయంలో యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్ విజ్ఞప్తి చేశారు.
దీని మీద యూరోపియన్ యూనియన్ విదేశాంగ శాఖ ప్రతినిధి కాజా కల్లాస్ తీవ్రంగా స్పందించారు. ఇది యూరోపియన్ యూనియన్ యుద్ధం కాదని ఆమె తెలియజేశారు.
హర్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోతే భవిష్యత్తులో నాటో కూటమికి అనేక తీవ్ర పరిణామాలు ఎదురుకానున్నాయని ట్రంప్ హెచ్చిరించారు. అయితే, యూరోపియన్ యూనియన్ దేశాలు ట్రంప్ హెచ్చరికలను స్వీకరించడానికి సిద్ధంగా లేవు.
జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ పిస్టోరియస్ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత యూరప్‌ది కాదని; సైనిక జోక్యాన్ని పెంచడం కంటే, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి జర్మనీ సుముఖంగా ఉంటుందని అన్నారు.
మధ్యధరా సముద్రంలోని ఫ్రెంచ్ నావికా దళాలు గల్ఫ్‌లోకి ప్రవేశించటంలేదని ట్రంప్ ప్రకటనపై స్పందించిన ఫ్రాన్స్ స్పష్టం చేసింది.
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కూడా మూడు దేశాల మధ్య వివాదాన్ని ప్రపంచ స్థాయి సంఘర్షణంగా మల్చే ప్రయత్నాలలో ఇంగ్లాండ్ భాగస్వామి కాదని స్పష్టం చేశారు. సముద్ర మార్గ రవాణాలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు మిత్ర దేశాలతో సమన్వయం చేసుకుంటూనే- తమ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తామని ఆయన అన్నారు.
తమ నావికా దళాలు హర్మూజ్ జలసంధిలో ఎటువంటి చర్యలకు పాల్పడలేదని ఇటలీ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనియో తజాని ప్రకటించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


