ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై స్పందిస్తూ “రైతుల త్యాగాలకు, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం” అని తన ఎక్స్ ఖాతాలో చంద్రబాబు పేర్కొన్నారు.
అంతేకాదు, లోక్‌సభలో బిల్లుకు మద్దతు పలికిన పార్టీలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజధాని అంశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిపాదనను తెర మీదికి తెచ్చారు. “విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకు డెబ్భై కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు నలభై కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల హైవే ఉంది. మవిగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి. ఆ పేరు వింటే జగన్ గుర్తొస్తాడనుకుంటే వేరే పేరు పెట్టండి” అని అన్నారు.
పంతం నెగ్గించుకున్న చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో, చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
గత ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి నెట్టేశారు. ఎన్డీఏకు జగన్మోహన్ రెడ్డి పరోక్ష మద్దతు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో బాబే కీలకమయ్యారు.
అందువల్ల బాబు ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం అనివార్యమైంది.
గడిచిన ఐదేళ్ల కాలంలో రాజధాని అంశమే రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించింది.
రాజధాని ప్రాంత రైతులు పాదయాత్రలు నిర్వహించారు. బయటికి దాని ప్రభావం తొలుత కనబడలేదు కానీ, ఎన్నికల సందర్భంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది.
రాజధాని నిర్మాణంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, కొందరికే లబ్ధి చేకూరేలా చంద్రబాబు వ్యవహరించారని ఆరోపిస్తూ జగన్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు.
అప్పటికే అమరావతిలో జరిగిన నిర్మాణాలు నిలిచిపోయాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అనివార్యమని జగన్ చెప్పారు.
గడిచిన పదేళ్ల కాలంలో నిర్దిష్ట రాజధాని లేకుండానే పాలన సాగిందనే చర్చ ఏపీలో విస్తృతంగా జరిగింది.
కూటమి ప్రధాన ఎజెండాగా అమరావతి..
గత ఎన్నికల ప్రచార సమయంలో ఎన్డీఏ కూటమి అమరావతి అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుంది.
ఏపీ మధ్యతరగతి ప్రజలు కూడా ఆ మేరకు బాబుకు మద్దతు ఇచ్చారనే చెప్పవచ్చు. దానికి తోడు గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి.
విద్య, వైద్యం, ప్రభుత్వ పథకాల అమలు వంటి విషయాల్లో జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతంగా నిలిచింది. నగదు బదిలీ ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆయన దగ్గరయ్యారు.
రాజధాని విషయంలో మాత్రం ప్రజల మద్దతు అనుకున్నంత స్థాయిలో దక్కలేదు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి గ్రోత్ సెంటర్లు ఉన్నాయి.
అమరావతిని మరొక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుకోలేకపోయామనే భావన చాలా మందిలో ఉంది.
అందువల్లే పరిపాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గ్రోత్ సెంటర్‌గా దాన్ని ఏర్పరుస్తారని చాలా మంది భావించారు.
ఈ క్రమంలో అనుకున్నట్టుగానే ఎన్నికల్లో భారీ ఓట్లతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలిచింది.
వెరసి ఈరోజు ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు.
అక్కడ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. అక్కడ కూడా పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
అనివార్యంగా మారిన పార్లమెంటు చొరవ..
పార్లమెంటు ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చింది. భవిష్యత్తులో మార్పులు చేర్పులు చేయాలన్నా మళ్లీ పార్లమెంటు చొరవ తీసుకోవాల్సిందే. ఇదంతా సులభమైన విషయమైతే కాదు.
ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనంలో ఉంచుకోవాల్సిందే.
గతంలో చంద్రబాబు ప్రతిపాదించిన రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అంటే, భవిష్యత్తులోనూ రాజధాని అంశాన్ని తాను వదలబోననే సంకేతాన్ని ఇస్తున్నారని చాలామంది భావిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు జగన్ ఏం చేయలేకపోవచ్చు. కానీ, మరో ప్రత్యామ్నాయం ఉందనే ఆలోచనను ప్రజల చర్చలోకి పెట్టారు. అంతేకాదు, ఒకే సామాజిక వర్గం వారికి లబ్ధి చేకూరేలా అమరావతి నిర్మాణం ఉందని జగన్ బాహాటంగా చెప్పారు.
అక్కడ ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ జరిగిందని, అది భారీ కుంభకోణమని కూడా అన్నారు. తాజాగా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం బహిరంగ పాత్ర పోషిస్తోంది. రెండు సామాజిక వర్గాల మధ్య పోటీ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పార్లమెంటు ద్వారా చట్టబద్ధత సాధించుకున్న అమరావతి, ఆంధ్రుల రాజధానిగా బలమైన అడుగును ముందుకు వేసింది. బహుశా ఎంతటి అనివార్య పరిస్థితులు ఉన్నా ఇక మార్పులు ఉండకపోవచ్చు. కానీ ఒకే రాజధాని, ఇద్దరు నాయకులు, రెండు పార్టీలు, రెండు అభిప్రాయాలు చరిత్రలో నిలబడిపోయాయి. ఈ విషయంపై సగటు ఆంధ్రీయులు నేరుగా ఇదని చెప్పకున్నా, తమకంటూ ఒక రాజధాని నిర్దిష్టంగా ఉండాలని బలంగా కోరుకుంటున్న మాట వాస్తవం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
