వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం రావాలంటే మంచి సాహిత్యం రావాలి. సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండాలి. మంచి సాహిత్యం ప్రగతిశీల ఉద్యమాలకు స్ఫూర్తిని అందించాలనే లక్ష్యంతో నాలుగు దశాబ్దాలుగా సాహితీసేవ చేస్తున్నారు టీవీ రెడ్డి. జీవన గమనంలో తాడిపత్రి వెంకట్ రెడ్డిగా కనిపించే వీరు. కవన లోకంలో “తెలుగు వెలుగు రెడ్డి”గా సుపరిచితులు.
రచయిత ఆర్టీసీలో మెకానికల్ సూపరిండెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. శ్రామిక రాజ్యం కోసం అసువులు బాసిన అమరులకు అంకితమిస్తూ, తన తొలి కవిత్వ సంపుటి “అమరమ్”తో మన ముందుకు వచ్చారు.
“ఇప్పుడే సర్కారు సంక్రాంతి సంబరాలు నగర అంబరాన్ని మీటాయి కానీ,
పొట్టకొచ్చిన పంటను సుడిగాలి మింగేస్తే
చేతికొచ్చిన కొడుకును ఉపాధి ఉసురు తీసింది” వంటి కఠిన నిజాలకు తన అక్షర బాణాలతో పుస్తకం అంతటా పాఠకులకు దృశ్యరూపం ఇచ్చారు. హలమేనీ ఆత్మస్థైర్యం అంటూ, తూర్పున ఉదయించిన ఎర్ర సంద్రాన్ని రైతు కవితగా చిత్రీకరించారు. రైతు పండించిన పంట చేతి కందిననాడే నిజమైన సంక్రాంతి అంటూ సగటు పేద రైతుల బతుకు బాధలకు, భావాలకు తన ఆలోచనలతో ప్రాణం పోశారు.
ఆలోచనను ఎవరూ నిషేధించలేరు..
నిరంకుశంగా పాలిస్తున్న దేశాధినేతలను ఉద్దేశించి రాస్తూ, అభ్యుదయ కవి ఆలోచనను, కోయిల పాటను, నెమలి నాట్యాన్ని, ప్రకృతిగా శాసించే మట్టిని ఎవరూ నిషేధించలేరనీ కవి అన్నారు. దీనికి బదులుగా “ఆకాశాన్నంటుతున్న ధరల్ని, అత్యాచారాలను, అన్యాయం, అవినీతి”వంటి వాటిని నిషేధించమని పిలుపునిచ్చారు. కాలుష్య విషవృక్షాన్ని కూల్చివేయడంతోపాటు మానవజాతి సంరక్షణకై, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు. “మరమ్మత్తులు; మర మనుషులకే కాదు- మానవ మెదళ్లకూ కూడా కావాలన్నారు”.
రేపు జరిగే మహాసంగ్రామంలో నిశ్శబ్దాన్ని ఛేదించడానికి నేనూ ఒక సైనికుడిలా ఉద్యమానికి అండగా ఉంటానని, నేను సైతం అంటూ కవితా సంపుటిలో గర్జించారు. ఇక్కడ ప్రశ్నించడం కూడా నేరమే అంటూ హైటెక్ లీడర్ గురించి మాట్లాడుతుంటారు. కాలసర్పాన్ని చంపిన చలిచీమల్ని చూపించాలంటూ, ఆర్టీసీ నాయకుల మధ్య చీలిక వాదానికి నిరసనగా “చెట్లు అలసిపోయాయి”అనే కవిత రాశారు.
ఆంగ్లం వద్దనడం లేదు. కానీ, తెలుగును బతికించాలని తన నిరసన గళం వినిపిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఆశాజ్యోతితో ప్రయాణం..
మీడియా స్వేచ్ఛకై సాగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా రాసిన కవితలో; అక్షర ఆయుధాలతో ప్రజాపక్షమై మా ఉద్యమాలు కొనసాగుతాయనీ, సమాజ హితమే లక్ష్యంగా, నిష్పక్షపాతమే చిరునామాగా అక్షర సూర్యులమై కదులుతామని, ఒక కవిగా తన బాధ్యతను నిత్యం సత్యాన్వేషణ శోధనతోనేనని సూటిగా చెప్పారు.
ప్రశ్న ఒక ఆయుధం కావాలనీ, ఓటు బ్రహ్మాస్త్రమై సామాన్యుడి తడాఖా చూపాలని తన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. కలి కాలాన్ని అంతం చేస్తూ, కలకాలం కాలం మంచిదనే పాజిటివ్ దృక్పథంతో జీవించమన్నారు.
పోలీసుల కాల్పులకు నిరసనగా నెలిమర్ల అమరవీరుల స్మృతికై రాసిన “అమరమ్” కవితలో; పేగులు తెగిన నెత్తుటి బిడ్డల ఆవేశం అగ్నిగుండంగా మారిందనీ, ఈ అరాచకానికి చరమగీతం పాడి నూతన వ్యవస్థ కోసం నగారా మోగించాలనీ, రైతన్న అస్థికల రథానికి అక్షర బాట వేశారు.
ఇంకో కవితలో, ఉగ్రవాదుల గుండెల్లో ప్రళయాన్ని సృష్టించి- లక్ష సాధనలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు తన అక్షర వెలుగుల దేశభక్తితో సెల్యూట్ చేశారు.
గురజాడ అక్షర జాడలకు, కందుకూరి వీరేశలింగం సందేశాలకు, గిడుగు అడుగులకు, సినారే సరాగాలకు, అబ్దుల్ కలాం స్ఫూర్తి శిఖరాలకు, దాశరథి కవన వనాలకు, బాలు మధుర పాటలకు, మదర్ థెరిస్సా మానవత్వపు దారులకు; ఇలా ఎంతోమంది మహానుభావులకు అక్షర కుసుమాంజలి సమర్పించారు.
“నిజాం నిరంకుశత్వానికి అంకుశమై
అరాచక పాలనకు చరమగీతమై
హక్కులపై ప్రశ్నించిన గొంతుకవై
తెలంగాణ తొలి పొద్దు పద్మభూషణుడవై
తెలంగాణ తేజమా
కాళోజీ మీకు జోహార్లు” అంటూ ప్రజా కవి కలం గళాన్ని వినిపించారు.
చాలా కవితల్లో చెట్లు నాటాలని, మొక్కలు పెంచాలని, ప్లాస్టిక్ కాలుష్య కౌగిలి నుంచి మా”నవజాతి”కి విముక్తి కావాలని ప్రస్ఫుటంగా తన ఆలోచనలు ప్రకటించారు.
“సమరమ్ నుంచి అమరమ్ అన్నీ నా అనుభవ భావాలే, నా అక్షర సంపద నాతోనే” అంటూ, మనల్ని ఆలోచింపజేసే కవితా పుష్పవనంలో, తన భావాల పవనాలతో మనకు నేటి సమాజ పోకడలపై కావ్యాల కామెంట్రీ వినిపించారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఎన్నో కష్టాలను అనుభవించి; ఓ స్వప్నంతో, ఓ కసితో డిగ్రీ వరకు చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగం పొంది తనవంతుగా సమాజానికి సాయపడుతున్నారు.
అంతేకాకుండా, ఎన్నో సామాజిక సాహిత్య సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తనదైన జీవనదారిలో పయనిస్తున్న టి.వి రెడ్డి తొలి పుస్తకంతోనే ఆగిపోకుండా, నవ యువకుడిలా రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎన్నో తన అనుభవాల అక్షరాల ఆశయాల కవిత్వ సంపుటిలతో భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
అమరమ్
(మీ త్యాగం వృథా పోదు)
కవితా సంపుటి
రచయిత:టి.వి. రెడ్డి
సెల్: 7382863523
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
