♦ తమ డిమాండ్లను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని యూనియన్ల ఆరోపణ
హర్యానాలోని ఐఎమ్‌టీ మానేసర్‌లో కాంట్రాక్ట్ కార్మికుల నిరసనలు తీవ్రమయ్యాయి. వేతనాలు, పని గంటలు, భద్రత వంటి తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
పోలీసుల చర్యలు, లాఠీచార్జీలు, అరెస్టులు జరుగుతున్నాయన్న ఆరోపణల మధ్య, తమ ఆందోళనను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా హర్యానాలోని ఐఎమ్‌టీ మానేసర్ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
కార్మికుల ప్రాథమిక డిమాండ్లను విస్మరిస్తున్నారని, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై పోలీసు బలగాలను ఉపయోగించి అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ‘ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్’ ఆరోపించింది.
దేశవ్యాప్తంగా ఉద్ధృతమవుతున్న కార్మిక ఉద్యమాలు..
ఏఐసీసీటీయూ ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బరౌని, పానిపట్, సింగ్రౌలి, సూరత్, పట్రాటు తదితర ప్రాంతాల్లో కార్మికులు మెరుగైన వేతనాలు, ఎనిమిది గంటల పనిదినం, సురక్షితమైన పని వాతావరణం, సామాజిక భద్రత కోసం డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.
ఒకవైపు కార్మికులు ఈ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం “కార్మిక వ్యతిరేక” లేబర్ కోడ్లను అమలు చేయడానికి పట్టుబడుతోందని ఆ సంస్థ పేర్కొంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గ్యాస్(ఎల్పీజీ) ధరలు కార్మికుల పరిస్థితిని మరింత దిగజార్చాయని పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆ సంస్థ ఆరోపించింది.
ఫలితంగా, వలస కార్మికులు ఉపాధి కోల్పోయి మళ్లీ స్వస్థలాలకు వలస వెళ్లాల్సిన(రివర్స్ మైగ్రేషన్) ముప్పును ఎదుర్కొంటున్నారు.
మానేసర్‌లోని పలు ఫ్యాక్టరీల్లో నిరసనలు..
హర్యానాలోని మానేసర్‌లో ఏప్రిల్ ఆరంభం నుంచి పలు ఫ్యాక్టరీల కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు.
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, ముంజల్ షోవా, సత్యం, రూప్ పాలిమర్స్, మోడలమా, రిచా గ్లోబల్, సిర్మా ఎస్జీఎస్, ప్రికోల్ తదితర సంస్థలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఇందులో పాల్గొన్నారు.
వేతనాల పెంపు, రెట్టింపు ఓవర్‌టైమ్ చెల్లింపు, ఎనిమిది గంటల షిఫ్టు, ఉపాధికి భరోసా, సామాజిక భద్రత కల్పించడం వంటివి కార్మికుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ, కాంట్రాక్ట్ కార్మికులకు ఏళ్లుగా తక్కువ వేతనాలు ఇస్తూ అసురక్షిత పరిస్థితుల్లో పని చేయించుకుంటున్నారని యూనియన్ ఆరోపించింది.
సెక్షన్ 163 ప్రయోగం – పోలీసుల లాఠీచార్జీ..
ఏప్రిల్ 8న, స్థానిక యంత్రాంగం ఆ ప్రాంతంలో ‘భారత పౌర సురక్షా సంహిత’ కింద సెక్షన్ 163ను విధించింది.
ఏప్రిల్ 9 ఉదయం నిరసన చేస్తున్న కార్మికులపై పోలీసులు పలుచోట్ల లాఠీచార్జి చేసి, వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారని యూనియన్ ఆరోపించింది.
తమ డిమాండ్ల సాధన కోసం వివిధ కంపెనీల కార్మికులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు గుమిగూడారు.
అయినప్పటికీ, పోలీసులు వారిపై బలప్రయోగం చేశారని యూనియన్ ఆరోపించింది.
ఏఐసీసీటీయూ బృందం మానేసర్‌ను సందర్శించి కార్మికులతో సమావేశమైంది. పురుష పోలీసు అధికారులు పలువురు మహిళా కార్మికులను కొట్టారని, ఈ దాడిలో కొందరు కార్మికుల బట్టలు చిరిగిపోయాయని, శరీరమంతా గాయాలయ్యాయని యూనియన్ ఆరోపించింది.
అంతేకాకుండా, కొంతమంది కార్మికులను అక్రమంగా నిర్బంధించారని కూడా ఆ సంస్థ పేర్కొంది.
యాజమాన్యాల బెదిరింపులు..
కార్మికులతో చర్చలు జరపకుండా, ప్రైవేట్ బౌన్సర్లను రంగంలోకి దించి వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది.
ఈ పరిణామాలు ప్రభుత్వ యంత్రాంగానికి, పరిశ్రమల యాజమాన్యాలకు మధ్య ఉన్న ‘కుమ్మక్కు’ను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని సంస్థ పేర్కొంది.
ఎస్డీఎం కార్యాలయం బయట తమ ప్రతినిధులు కార్మికులతో మాట్లాడుతుండగా, పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించి కొంతసేపు నిర్బంధించారని ఏఐసీసీటీయూ తెలిపింది.
కార్మికుల గొంతును అణచివేయలేరు..!
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై యూనియన్ తీవ్ర విమర్శలు చేసింది. ఇది కార్మికుల హక్కుల ఉల్లంఘనకు, ప్రభుత్వ ప్రేరేపిత హింసకు నిదర్శనమని పేర్కొంది.
గతంలోనూ మానేసర్ కార్మిక ఉద్యమాలకు కేంద్రంగా ఉండేదని, మారుతి, హోండా తదితర ఫ్యాక్టరీలలో జరిగిన పోరాటాలే ఇందుకు ఉదాహరణ అని గుర్తుచేసింది.
ప్రస్తుత ఆందోళనలు కూడా ఆ పోరాటాల పరంపరలో భాగమేనని యూనియన్ స్పష్టం చేసింది.
‘కార్మికుల హక్కులు, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటాన్ని పోలీసుల బలప్రయోగంతో అణచివేయలేరు. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది’ అని పత్రికా ప్రకటనలో తేల్చిచెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
