
అరవై లక్షల మంది ఆధునిక సాంకేతిక మేధో ఉద్యోగ సైన్యం కృత్రిమ మేధతో నేడు బజారు పాలుకానుంది. సమీప భవిష్యత్తులో ఇదో తీవ్ర సామాజిక కల్లోలాన్ని సృష్టిస్తుంది. నిజానికి అదో సామాజిక కల్లోల సుడిగుండం. అది కేవలం ఐటీ ఉద్యోగుల వరకు బలి తీసుకొని ఆగేది కాదు. ఐటీ రంగం ద్వారా విడుదలయ్యే లక్షల కోట్ల ఆర్ధిక లావాదేవీల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న సకల జీవన వృత్తులను ఆ సుడిగుండం బలి తీసుకుంటుంది. ఈ కారణంగా ఐటీ ఉద్యోగ వర్గ సంఘ నిర్మాణానికి ప్రాధాన్యత ఏర్పడింది. పారిశ్రామిక కేంద్రాలతో పోల్చకపోయినా, ఐటీ హబ్స్ కూడా నూతన ఉద్యమ కేంద్రాలుగా రూపొందడానికి చక్కని అవకాశం ఉంది. ఈ ఐటీ మేధో శ్రామికవర్గం కూడా సమకాలీన భారతదేశ కార్మికోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడానికి వస్తుగతంగా ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదికలు, ప్రాధాన్యతలను, వాటి ప్రభావిత శక్తిని సూచించే క్రింది అంశాలను చూద్దాం.
♦ ఐటీ ఉద్యోగవర్గం అధిక సాంకేతిక మేధో పరిజ్ఞానం గల ఆధునిక శ్రామికవర్గంగా చూడాలి.
♦ అధికాదాయ ఉద్యోగ వర్గంగా మార్కెట్లోకి అధిక కొనుగోలు శక్తిని విడుదల చేస్తూ, సమాజంలో పలు శ్రామిక, వర్తక వృత్తుల మనుగడకు ఆధారంగా మారిన నూతన భౌతిక పరిస్థితిని గుర్తించాలి.
♦ నేటి సమాజంలో తమ కంటే పలు అల్పాదాయ మధ్యతరగతి వర్గాల జన సమూహలను ప్రభావితం చేయగలిగే ఉద్యోగులుగా కూడా వీరిని గుర్తించాలి.
♦ ప్రపంచీకరణ ప్రక్రియ ఉనికిలోకి వచ్చే నాటికి ఇంటర్నెట్ ఆవిష్కరణ జరగలేదు. అయోధ్య కేంద్రంగా హిందుత్వ భావజాలం వ్యవస్థీకృత రూపం ధరించే నాటికి ఐటీ రంగ ఉద్యోగవర్గం ఉనికిలోకి రాలేదు. కానీ ఆ తర్వాతే ఉనికిలోకి వచ్చిన ఐటీ ఉద్యోగ వర్గం తమ కంటే ముందే పుట్టిన ఎల్పీజీ, హిందుత్వ భావజాలాలకి ప్రభావితం అయ్యింది. దానికి క్షేత్రస్థాయి వాహకంగా మారింది. ఆ భావజాలంతో పాలించే సర్కార్లకు ఓ పునాదిగా మారింది. అదే విధానం వారిని బలిపీఠంపై బలి పశువులను చేయనుంది. ఈ కొత్త భౌతిక పరిస్థితి ఐటీ ఉద్యోగ వర్గాన్ని కొత్త ఉద్యమ శక్తిగా మలిచే ప్రాతిపదిక కల్పిస్తుంది.
♦ కార్మికులు, రైతులు, కూలీల వంటి శారీరక శ్రమజీవి వర్గాల కంటే ఐటీ నిపుణుల పరిస్థితి భిన్నమైనది. ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీల్లో పని చేయడం ద్వారా ఐటీ సేవల తీరు పట్లా, వాటి ప్రపంచ మార్కెట్ల తీరు పట్లా, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి పట్ల అవగాహనా పరిజ్ఞానం ప్రత్యేకంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిజ్ఞానం సమకాలీన కార్మికోద్యమానికి చాలా ఉపయోగకరం.
పై ఐదు కారణాల వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగ వ్యవస్థ ప్రాధాన్యత గలది. వారి జీవన విధ్వంసం వృధా కాదు. అందులో నుండి కొత్త పునర్నిర్మాణ శక్తి జనిస్తుంది. సామాజిక అభివృద్ధిని కోరుకునే ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు వారి దృష్టిని సంఘ నిర్మాణం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయాలి.
ఏఐ సృష్టించనున్న తీవ్ర సంక్షోభ దుష్పలితాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి అంతర్గత వైరుధ్యాలను ఐటీ కార్పొరేట్ సంస్థలు వాడుకోవడానికి పథకాలను పన్నుతాయి. ఇది పురోగామి సామాజిక చలన శక్తుల దృష్టిలో ఉండాలి. అవి ఒకవైపు ఐటీ ఉద్యోగ వర్గానికి గైడింగ్ పాత్ర పోషించాలి. మరోవైపు పీడిత ప్రజలకు దిశానిర్దేశం చేయాలి. ఈ దృష్టి కోణంలో ఏఐ సృష్టించే నిరుద్యోగ సమస్య పట్ల, దానికి పరిష్కారం పట్ల కర్తవ్యోపదేశం చేయాలి.
ఐటీ రంగంలో సీనియర్ ఉద్యోగుల మనసులలో పాతుకుపోయిన ఉద్యోగ భద్రత మొదటిసారి నేడు కల్లగా మారింది. తాము భద్రజీవులమని నమ్మిన సీనియర్ ఐటీ నిపుణుల ప్రగాఢ మానసిక నమ్మకం గాయపడింది. ఉద్వాసన వేటు ఈసారి సీనియర్ ఉద్యోగులపై పడింది. గత ‘లాస్ట్ వన్ ఫస్ట్ గో’ ఫార్ములా బెడిసికొట్టింది. మధ్యస్త, ఉన్నత స్థాయి సీనియర్ ఉద్యోగులపై మొదటిసారి మొదటి వేటు పడడం గమనార్హం.
‘పెట్టుబడి’ తానే గతంలో సృష్టించిన పాత “బాసుల” వృత్తి మీద కర్కశంగా నేడు ఏఐ అందించిన సరికొత్త కొరడాతో దాడికి దిగింది. ఇక నుంచి వారి బుర్రలు తమకు అక్కరలేదని ‘పెట్టుబడి’ నిర్ధారణకు వచ్చింది. ఇక మానవ బుర్రలు వద్దని వారిపై కొత్త ఏఐ కొరడా ఝళిపించింది. లక్షల మంది పొట్టలు కొట్టే కుట్రకు బరితెగించింది.
గతంలో ఉద్యోగుల తొలగింపులకు, కొన్నాళ్ళ చొప్పున బెంచి మీద ఉంచడానికి కానీ ప్రధాన కారణం ఐటీ సంస్థలకు లభించే ఆర్డర్ల పరిమాణం తగ్గడం. ఆ సేవల మన్నిక తగ్గడం! ఆ మన్నిక మెరుగు పరిచే అవసరం ఏర్పడడం. ఈ రీత్యా వినిమయదార్ల ఆధారిత ఐటీ మార్కెట్ ఉద్యోగాల పరిమాణాలని ప్రభావితం చేయడం ఒక భౌతిక వాస్తవం. ఈసారి బయటనున్న సేవల మార్కెట్ వ్యవస్థ నుంచి ప్రమాదం రాలేదు. ఐటీ ఉత్పత్తి ప్రక్రియలో తాజా ఏఐ ప్రక్రియ వల్ల ఏర్పడ్డ కొత్త తరహా సంక్షోభమిది. ఇది మొదటిసారి ఐటీ వ్యవస్థాపర అంతర్గత కారకాలతో ఏర్పడింది. ఐటీ సేవల పరిమాణం తగ్గకపోయినా, గతం కంటే పెరిగినా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే సందర్భమిది. ఇది ఐటీ కంపెనీలకు లభించే ఐటీ సేవలతో సంబంధం లేని కొత్త తరహా సంక్షోభం. ఐటీ రంగం పొందే సేవల మార్కెట్ స్థిరంగా వున్నా, ఉద్యోగ వ్యవస్థ అస్థిరంగా మారుతుంది. ఈసారి ప్రధానంగా కృత్రిమ మేధ వల్ల ఐటీ వ్యవస్థ తీవ్ర కుదుపుకు గురికావడం గమనార్హం.
తిరగబడిన గత నియమం..
అనుభవం, దక్షతలు తక్కువ వుండే దిగువ స్థాయి జూనియర్ ఐటీ ఉద్యోగుల కంటే మధ్యస్థ, ఎగువస్థాయి సీనియర్ ఉద్యోగులపై మొదటి వేటు పడడానికి ప్రధాన కారణం ఐటీ కంపెనీలకు ఐటీ సేవల ఆర్డర్లు తగ్గడం కాదు. అదే నిజమైతే, వినిమయదార్లకి మరింత నాణ్యత, మన్నికలతో సేవలను అందించడానికి ఐటీ సంస్థల మధ్య పోటీ పెరుగుతుంది. సీనియర్ ఉద్యోగులను నిలబెట్టుకునే అవసరం కంపెనీలకు పెరుగుతుంది.
తొలగించే వారైనా, బెంచిపై ఉంచే వారైనా, జూనియర్ ఉద్యోగులను మాత్రమే బలిపశువులను చేసే స్థితి వుండేది. ఓవైపు మరింత కాస్ట్కట్టింగ్, మరోవైపు మరింత మన్నిక సేవల సప్లై అనే రెండు పరీక్షలు ఎదురైతే, ఐటీ సంస్థలు తొలి ప్రాధాన్యత రెండో అంశానికే ఇస్తాయి. అందుకే గత ఇక్కట్లలలో తక్కువ జీతాలను పొందే ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందే వారికే ప్రాధాన్యత ఇస్తుండేవి. ఇది మార్కెట్ అవసరం కోసం తప్ప సీనియరిటీ మీద ప్రత్యేక ప్రేమతో కాదు. అంతర్గతంగా జీతాల చెల్లింపు భారం కంటే మరింత మన్నిక సేవలను వినిమయదార్లకు అందించడం చోదక కారకంగా ఐటీ సంస్థలను నడిపిస్తుంది.
సహజ మానవ మేధ ఏఐని సృష్టించుకుంది. అది సృష్టించే అదనపు ఫలం మానవాభివృద్ధి కోసం సద్వినియోగం చేయాలి. పెట్టుబడి తన అధిక లాభాల కోసం దారి మళ్ళించిన ఫలితమే కొత్త తరహా నిరుద్యోగం. ఐటీ రంగం ఎదుర్కొన్న గత సవాళ్లు, సమస్యల కంటే భిన్నమైనది. ఇదొక గుణాత్మక మార్పు. దీన్ని గుర్తించకుండా మూస బాణీలోనే “పోటీ సూత్రం” ద్వారా పరిష్కార మార్గం గూర్చి బోధన చేయడం వల్ల ఉపయోగం లేదు. పైగా హాని కలిగిస్తుంది.
ఏఐ సృష్టించే సంక్షోభం నేడు ఉద్యోగం చేసే ఐటీ నిపుణులకే పరిమితం కాదు. నిరుద్యోగం ఫ్రెషర్స్ సహా లక్షల ఇంజనీరింగ్ విద్యార్ధుల మనసులను కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రేపు టెకీలు కావాలని కలలు కనే వారి మనసుల మీద కూడా తీవ్రంగా దుష్పభావం చూపుతుంది. వారి తల్లిదండ్రుల మనసుల మీద కూడా ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది టెకీల సమస్యగానే కాకుండా, సార్వత్రిక సామాజిక సమస్యగా కూడా మారుతుంది.
ఏఐ సృష్టించే నిరుద్యోగ ప్రమాదం గూర్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది టీసీఎస్ యాజమాన్య ప్రకటన తర్వాత మరింత పెరిగింది. ఐటీ రంగంపై ఏఐ దుష్ప్రభావాలు, దుష్పరిణామాలు, దుష్ఫలితాల గూర్చి వివరించడం ఒక ఎత్తు! ఆ సమస్యకు పరిష్కారం సూచించడం మరో ఎత్తు!
రెండవ భాగంలో రెండు రకాల పరిష్కారాలను సూచించే భిన్నమైన విశ్లేషకులు వున్నారు. ఒకటి ఏఐ సృష్టించే నిరుద్యోగ సమస్య పరిష్కార బాధ్యత ఆయా సర్కార్లకు కూడా కొంత వుందని కొందరు విశ్లేషకులు చెప్పడం విశేషం. ఇది అరుదైన ధోరణి! ఇది అస్పష్టంగా, అసమగ్రంగా ఉండొచ్చు. పరోక్షంగా, సున్నితంగా, మర్యాదగా వివరించిన సందర్భాలూ ఉండొచ్చు. కానీ ఏఐ వల్ల సంభవించే నిరుద్యోగ సంక్షోభాన్ని నివారించడం కోసం, దాని నియంత్రణ కోసం పూనుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనే భావన వ్యక్తం చేయడం చాలా ప్రాధాన్యత గల సానుకూల అంశం.
ఇక రెండవది, మరికొందరు విశ్లేషకులు భిన్నమైన పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. రాజ్యం పాత్ర ఉందంటూ ఒక్క మాట కూడా వారి నోటి నుండి రావడం లేదు. సర్కార్లపై ఒత్తిడి తెచ్చే అవసరం ఉందనే మాట రావడం లేదు. ఉద్యోగ భద్రత, ఉపాధి పరిరక్షణ కోసం ఐటీ ఉద్యోగులకు సంఘ నిర్మాణ అవసరం వుందని మాట్లాడడం లేదు. పైగా ఏఐ సృష్టించే నిరుద్యోగం అత్యంత సహజ పరిణామంగా చెబుతున్నారు. కృత్రిమ మేధను నియంత్రణ చేయాలని సర్కార్లను కోరడమే ఒక అభివృద్ధి నిరోధక ఆలోచనగా వారి మనస్సుల్లో వుంది. వారి విశ్లేషణ తీరు స్పష్టమే.
ఏఐ నియంత్రణ వైపు దృష్టి పెట్టడం నేరంగా, ఏఐతో పోటీలో నెగ్గడం మీద దృష్టి పెట్టడం ఐటీ ఉద్యోగుల కనీస ధర్మంగా బోధిస్తున్నారు. ఇది పూర్తి అశాస్త్రీయ అవగాహన. ఆ పోటీలో విజేతలుగా నిలవడమే ఐటీ ఉద్యోగ వర్గాల ఏకైక కర్తవ్యంగా చిటికెలు వేస్తూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విశ్లేషకుల తీరు ఐటీ ఉద్యోగులకే పరిమితం కాకుండా సమాజానికి కూడా నష్టం కలిగిస్తుంది. పైగా అట్టి విశ్లేషకులు గొప్ప ప్రతిభావంతులైన ప్రగతిశీల మేధావులైతే, ఆ నష్టం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులను సంఘ నిర్మాణం వైపు అడుగు వేయాలని చెప్పాల్సిన ప్రగతిశీల విశ్లేషకులు తెలిసో తెలియకో ఏఐతో పోటీలో దింపే ప్రచారం చేపడితే నష్టం ఎక్కువ ఉండడం సహజమే. అది లక్షలాది ఐటీ ఉద్యోగుల మనస్సులపై ప్రభావం పడే అవకాశం వుంది.
నేడు ఐటీ ఉద్యోగుల ఎదుట ఒకటి సంఘ నిర్మాణం, రెండవది ఏఐతో పోటీకి దిగడం. ఈ రెండే పరిష్కార మార్గాలుగా ఉన్నాయి. మూడో మార్గం లేదు.
ఏఐతో పోటీకి దిగాలని సూచించే పరిష్కార దారి ప్రమాదకరమైనది. ఏఐతో పోటీలో గెలవడమే ఐటీ ఉద్యోగుల కర్తవ్యంగా చెప్పడమంటే అంతిమ సారంలో పెట్టుబడి దించే రక్తసిక్త కోడిపందెం వంటి యుద్ధబరిలోకి దిగమని చెప్పడమే.
తమ ఆస్తిపాస్తులను అమ్ముకొని అప్పులపాలై, ఏండ్ల తరబడి రాత్రింబవళ్ళు నిద్రాహారాలుమాని చదివి మన ప్రజల బిడ్డలు సాఫ్ట్వేర్ నిపుణులుగా మారారు. మన బిడ్డల నైపుణ్యంతో స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలు ఇంతవరకూ తెగ బలిశాయి. పాతికేళ్ళల్లో మన బిడ్డల నైపుణ్యాలని కొల్లగొట్టిన సంపదలో కొంత భాగంతో ఏఐని అప్డేట్ చేసే పనిని చేపట్టాయి. ఏఐని ప్రవేశపెట్టడంతో పాటు నిత్యం అప్డేట్ చేస్తూ దాంతో పోటీ పడాలని మన బిడ్డలని కంపెనీలు కోరుతున్నాయి. ఈ రక్తసిక్త పందెంలో మన బిడ్డలను బలి పశువులు కానివ్వరాదు.
కృత్రిమ మేధ సృష్టించే నిరుద్యోగ సమస్యకు తమ స్వీయ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే పరిష్కార మార్గంగా భావించడం సరికాదు. ఈ భావన ఏఐ సృష్టించే నిరుద్యోగ సమస్యకు రాజ్య బాధ్యత లేదని చెప్పడానికి దారితీస్తుంది. ఏఐతో పోటీలో తమ ఉద్యోగాలు కోల్పోయే లక్షలమంది అసమర్ధులు, సోమరులని చెప్పడానికి కూడా దారితీస్తుంది.
ఈ తరహా సంక్షోభానికి మూల కారణాల పట్ల; వాటి భావి పర్యవసానాల పట్ల; పరిష్కార మార్గాల పట్ల స్పష్టత ఉండాలి. ముఖ్యంగా ప్రగతిశీల శక్తులు పొరబడకుండా జాగ్రత్త పడాల్సి వుంది.
సామూహిక తొలగింపుల ప్రక్రియ “పోటీ సూత్రం”తో అధిగమించే సమస్య కాదు. ఉద్యోగుల తొలగింపుతో తమకు బాధ్యత లేదని సర్కార్లు తప్పించుకునే అవకాశం ఇవ్వరాదు. అది తెలిసి చేసినా, తెలియక చేసినా ఉద్యోగుల పొట్టలు కొట్టే ఐటీ కార్పొరేట్ సంస్థలను కొమ్ముకాసే దుష్ట రాజ్య విధానాన్ని కాపాడడమే అవుతుంది.
ఏఐ సృష్టించే నిరుద్యోగం ఒక్క సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాదు. విద్య, వైద్య, ఆరోగ్య, వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వరకు తరతమ స్థాయిల్లో విస్తరిస్తుంది. సర్వవ్యాప్త సంక్షోభంగా మారనుంది. ఆ సంక్షోభ సుడిగుండంలోకి నేడు ఐటీ రంగం జారుతోంది. ఈడ్చబడే మొదటి రంగం ఐటీ కావచ్చు. సంక్షోభం పాలై జీవన విధ్వంసానికి బలయ్యేది ఐటీ రంగం ఒక్కటే కాదు. ఐటీ తొలి ప్రయోగశాలగా మారినా ఈ జీవన ధ్వంస రచన అక్కడే ఆగదు.
అయితే, ఏఐ నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఒకచోట ఆగేది కాదు. దాని అంతిమ లక్ష్యం తనతో పోటీ పడే వారికి శిక్షణ ఇస్తూ అప్డేట్ చేయడం కాదు. మానవ నిపుణశక్తిని నిరంతరం తగ్గిస్తూ పోవడమే. ఈ నిజాన్ని గుర్తించకుండా ఏఐ వల్ల తొలగించబడ్డ అందరూ, తిరిగి ఏఐతో పోటీలో గెలవాలనడం అశాస్త్రీయ అవగాహనే. సాధన చేస్తే నూరు శాతం మంది విజయం సాధించి తీరతారని వాదిస్తోన్న విశ్లేషకులకు అవగాహన లేకపోవడమో, మభ్యపెట్టే పద్ధతినో అవుతుంది.
నేటి భౌతిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా, కనీసం సూత్రప్రాయంగా అయినా ఈ రంగంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా సంఘాల్లో సంఘటితమై కృత్రిమ మేధ నుంచి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. ఈ అవసరం తక్షణమే ఉందని విస్తృత ప్రచారం నిర్వహించటం ఇప్పుడు పురోగామి, ప్రగతిశీల శక్తుల తక్షణ బాధ్యత.
ఐటీ ఉద్యోగుల సంఘ నిర్మాణ కృషి తక్షణమే చెప్పుకోదగ్గ ఫలితాలని ఇస్తుందనే అంచనాకు రానక్కరలేదు. వెంటనే సంఘ నిర్మాణం వైపు ఐటీ ఉద్యోగులు వెల్లువ రూపం తీసుకుంటుందనే ఆశ పెట్టుకోరాదు. ఐటీ కంపెనీలు తొలగించే నిరుద్యోగులు ఓ వెల్లువకు దారితీసినట్లు, ఆ రోడ్డున పడ్డ వారిని సంఘాలలో సమీకరణ ప్రక్రియ అదే స్థాయిలో వెల్లువకు దారి తీసే అవకాశం ఉండదు. అదే సమయంలో అదొక క్రమం తీసుకొని క్రమంగా వెల్లువకు దారి తీస్తుంది. ఆ దిశలో ఇప్పుడు పడే తొలి అడుగులు రేపటి మలి అడుగులకు దారి తీస్తుంది. ఆ దిశలో ఐటీ ఉద్యోగులను మేల్కొలిపే కృషిని చేపడదాం. ఇది పురోగామి సామాజిక శక్తులకు ఇచ్చే సందేశం. అవి ఈ సందేశ స్ఫూర్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగ వర్గానికి కర్తవ్యోపదేశం చేస్తాయని ఆశిద్దాం.
ఈ వ్యాసం రెండు భాగాలుగా ప్రచురితమైంది. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.