గతంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కాంగ్రెస్ కూడా ఇలాంటి హమీలిచ్చాయి; కానీ అమలు చేయలేదని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బండి సంజయ్ పోస్టు చేశారు.
న్యూఢీల్లీ: స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజికవర్గంలో బీజేపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైతే; ప్రతి గ్రామానికి నజరానాగా తన ఎంపీ నిధుల నుంచి రూ 10 లక్షలు కేటాయిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
“కరీంనగర్ గ్రామాలలో బీజేపీ బలపర్చే సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అభివృద్ధి కోసం అప్పటికప్పుడే రూ 10 లక్షలు పొందవచ్చు. కరీంనగర్ పార్లమెంటు నియోజికవర్గం పరిధిలోని గ్రామాలలోని బీజేపీ మద్దతు సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లయితే; ఆయా గ్రామాల అభివృద్ధికి రూ 10 లక్షల నిధిని నేను నేరుగా అందజేస్తాను. ఇందులో ఎలాంటి జాప్యం లేదా సాకులు ఉండవు” అని సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
“మీ పార్లమెంటు సభ్యునిగా, నాకు ఎంపీల్యాడ్స్ నిధులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్ఆర్ ద్వారా ఎలా కోట్లు తీసుకొచ్చి విద్యా, ఆరోగ్యరంగాన్ని మెరుగుపర్చడానికి పెట్టామన్నది ఇప్పటికే మీకందరికి తెలుసు. పంచాయతీ అభివృద్ధిని మరింత పటిష్టం చేయడానికి కేంద్రమంత్రిగా మరిన్ని ఎక్కువ కేంద్ర నిధులు తేస్తాను”అని అన్నారు. తెలంగాణలో గ్రామీణ సంస్ధల ఎన్నికలు మూడు దశల్లో డిసెంబరు 11, 14, 17వ తేదీలలో జరుగనున్నాయి.
గతంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)- కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలు ఇచ్చాయని, కానీ అమలు చేయలేదని సంజయ్ పేర్కొన్నారు.
“బీజేపీ ఒక్కటే నిజంగా నిధులను తేగలదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతిచ్చే అభ్యర్ధులు పొరపాటున గెలిస్తే; కొత్త నిధులు రావు, కేంద్ర నిధులు మళ్లించబడతాయి. వారి వ్యూహాలు, జిమ్మిక్కులలో పడకండి; వారి ప్రలోభాలకు లొంగకండి. బీజేపీ బలపర్చే అభ్యర్ధులకు ఓటు వేయండి. అందరం కలిసి గెలుద్దాం, ప్రతి విషయంలో మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దాం”అని సంజయ్ చెప్పారు.
కొన్ని రోజుల క్రితం మాలేగావ్ నగర్ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎన్సీపీ ఛీఫ్ అజిత్‌పవార్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల తర్వాత బండి సంజయ్ కుమార్ ప్రకటన వెలువడింది. పవార్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
