
కొసలు కలుస్తాయన్న చందంగా సనాతన భాషలో మాట్లాడే ఛాందసులు, అత్యాధునికంగా ధ్వనించే వారూ కూడా శ్రీశ్రీని తమతమ రేఖల్లో బంధించి చూపే ప్రయత్నం చేశారు. “మాకు గోడలు లేవు, గోడలు పగలగొట్టడమే మా పని” అని ప్రకటించిన ప్రజాకవిని ప్రగతి నిరోధక ప్రమాణాలకు పరిమితం చేయడం మాత్రం సాధ్యమయ్యేది కాదు. ప్రజామోదకరమూ కాదు. వీటన్నిటి వల్లనా కలిగిన గందరగోళం నుంచి తికమక నుంచి ఆయన మహత్తర కవితా వారసత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రగతిశీలులందరిపైనా ఉంటుంది. ఇతర విమర్శలను పరిశీలించవలసీ ఉంటుంది.
గతంలో శ్రీశ్రీ శతజయంతి(1910- 2010) సంరంభం, ఆయన మహాప్రస్థాన కవితా స్ఫూర్తి పునఃప్రస్థాన ప్రకటనను తలపించింది. చాలామంది కవులు, రచయితలలా కాకుండా శ్రీశ్రీ శతయంతి ప్రజా ఉత్సవంగా జరిగింది. పాఠశాలల నుంచి పరిశోధనాలయాల వరకూ సాహితీవేత్తల నుంచి సాధారణ పాఠకుల వరకూ, పదండి ముందుకు పదండి తోసుకు అంటూ శ్రీశ్రీ చరణాలను స్మరించుకున్నారు. శ్రీశ్రీ కోరుకున్నదీ కూడా ఇదే.
మహాప్రస్థాన యోగ్యతా పత్రంలో సంచలన సాహిత్యకారుడు చలం కీలకమైన విషయాన్ని వెల్లడించారు. సమాజంలో అన్యాయాలకు గురవుతున్న వారికి సానుభూతి తెలియజేసి ఆగిపోకుండా, దానిపై ఒక దెబ్బ వేయాలని చెప్పడమే శ్రీశ్రీ కవిత్వమార్గమని అభివర్ణించారు. చలం రాయడం కూడా ఒక ప్రత్యేకతే.
ఎముకలు కుళ్లిన వయసులు మళ్లిన సోమరులారా చావండీ అంటూనే, నవ యువత భావాలేంటో శ్రీశ్రీ నినదించారు. మరో ప్రపంచ నిర్మాణానికి సాగిపోయే వీరులకు మార్చింగ్ బ్యాండ్ శ్రీశ్రీ కవిత్వమని చలం అన్నారు. అన్యాయపు పోకడలు సహించక, పావన నవజీవన బృందావనాన్ని నిర్మించేందుకు కంకణధారులైన ముందు యుగం దూతలకు సెల్యూట్లు చెప్పారు. అందుకే ప్రజాకవిత్వ వైతాళికుడయ్యారు. ప్రజలూ ఆయనను తమ వాడిగా చేసుకున్నారు.
శ్రీశ్రీ రాసిన రచనలోని వాక్యాలు..
‘‘ఎంత ద్వ్యర్థం, సృష్టి..
‘‘సృష్టి ఒక గొప్ప శ్లేషకావ్యం’’ అన్నాడు.
సముద్రతీరాన కెరటాలతో కాళ్ళు తడియనిస్తూ నడుస్తున్నారు వాళ్ళిద్దరూ. ఒక బ్రాహ్మణాధముడు, ఇంకొకడు శూద్రోత్తముడూ. ఇద్దరిలో ఎవడో ఒకడి ప్రసంగవశాత్తూ అన్నపై వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి ఇక్కడ రికార్డు చేశాను.
‘‘ఇద్దరిలో ఎవరిదో ఈ అమూల్య ప్రకటన! అసలా ఇద్దరిలో ఎవడు బ్రాహ్మణుడో, ఎవడు శూద్రుడో? గుణత్వమే అనుమానాస్పదమైపోయిన ఈ సందర్భంలో గుణాలెలా నిలుస్తాయి? వారిలో ఎవడు ఉత్తముడో, ఎవడు అధముడో?’’
115 ఏళ్ల కిందట పుట్టిన ఒక మనిషి తర్వాత మహాకవిగా మనకు పరిచితుడైనప్పటికీ ఒక నిర్దిష్ట సామాజిక నేపథ్యం నుంచే వస్తాడు. తద్వారా సంక్రమించే భాష, భావాలు, ఆచారాల ప్రభావాన్ని ప్రయత్న పూర్వకంగా వదిలించుకోవల్సిందే. ఆ ప్రయత్నం చేయబట్టే శ్రీశ్రీ ప్రజల కవిత్వాన్ని రాయగలిగాడు. ఆయనే అన్నట్టు ‘‘మినహాయింపులు లేని/క్షమాపణలులేని స్వర్ణయుగం’’ వచ్చే వరకూ ఇలాంటి అంతరాలకు సర్వసంతృప్తికరమైన సమాధానాలూ లభించవు.
అక్షరాలతో అశయాలను రగిలించిన మహాకవి..
శ్రీశ్రీ కాలం సృష్టించిన మహాకవి. కాలంతో పాటు ముందుకు నడిచిన, కాలాన్ని ముందుకు నడిపిన కవి. కమ్యూనిస్టు భావాల వ్యాప్తితో సమాంతరంగా ప్రభవించిన పథ నిర్దేశకులు. 1933- 34లో కమ్యూనిస్టు పార్టీ తెలుగు నాట ఏర్పడ్డమూ, మహాప్రస్థాన గీతాల రచనా ఏకకాలంలో జరగడం యాదృచ్ఛికం కాదు. జీవితాంతం ఆయన ఆ ఆశయాలకే నిబద్ధుడై నిలిచారు.
1955 హోరాహోరి ఎన్నికల పోరాటంలో విషపు దాడులకు గురైనా చెక్కుచెదరక అక్షరాలతో అశయాలను రగిలించారు. వ్యక్తిగా ఎంత ప్రతిభావంతులైనా రచయితల సంఘాలతో నడవడానికి తాపత్రయపడ్డారు. ఒక దోసెడు తిరుగుబాటు ఒక పిడికెడు సానుభూతి తప్ప తనకేమీ అక్కర్లేదన్నారు. ఆ క్రమంలో అనేక ఢక్కాముక్కీలు తిన్నా- పాటలూ, మాటలూ, వ్యాసాలూ, ఉపన్యాసాలూ, చమత్కారాలూ, భాషాలంకారాలూ ఏదైనా మరో ప్రపంచం కోసమేనన్నారు. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదంపైన నిరంతరం నిప్పులు చెరిగారు. దేశంలో పాలక వర్గ పాతకాలను చీల్చిచెండాడారు. అయనతో అనుబంధం వున్న సంఘాలూ, సంస్థల జాబితా చాలా వుంది. అరసంలో విరసంలో చాలా కాలం పనిచేసినా, చేయలేక అనేక మల్లగుల్లాలు పడినా మహాప్రస్థానమే ఆయన శాశ్వత చిరునామా.
శ్రీశ్రీ చుట్టూ అవాస్తవిక వాదనలు- సంప్రదాయవాదుల తంటాలు..
నూరు సుగుణాల్లో ఒక దోషం అన్నట్టుగా ఇంతటి సంరంభంలోనూ కొన్ని అభ్యంతరాలు, మరికొన్ని అపశ్రుతులు లేవని కాదు. అస్తిత్వ వాదులు శ్రీశ్రీ స్ఫూర్తితో తమకు సంబంధం లేదని, ఎవరో పనిగట్టుకొని ఆయనను మోస్తున్నారని అవాస్తవిక వాదనలు వినిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆ మరో ప్రపంచ మహాకవిని తమ కొలబద్దలతో కొలిచేందుకు మరికొంతమంది ప్రాంతీయ వాదనలు తీసుకొచ్చారు. కొంచెం సర్దుకున్న వారు, లౌక్యులైన వారు నేరుగా దాడి చేయకుండా శ్రీశ్రీలోని రెండు అక్షరాలనూ ఒకదానికి ఒకటి పోటీగా నిలిపేందుకు ప్రయత్నం చేశారు, చేస్తున్నారు కూడా.
ఇక సంప్రదాయవాదులైతే అప్పుడూ ఇప్పుడూ కూడా ఆయనను తమ గీతల్లో బంధించి సంతృప్తి చెందేందుకు తంటాలు పడుతూనే వున్నారు. శ్రీశ్రీ వ్యక్తిగత అంశాలపైనే వారాల తరబడి చర్చలు నడిపిన వారూ వున్నారు.కొసలు కలుస్తాయన్న చందంగా సనాతన భాషలో మాట్లాడే ఛాందసులు, అత్యాధునికంగా ధ్వనించే వారూ కూడా శ్రీశ్రీని తమతమ రేఖల్లో బంధించి చూపే ప్రయత్నం చేశారు. “మాకు గోడలు లేవు, గోడలు పగలగొట్టడమే మా పని” అని ప్రకటించిన ప్రజాకవిని ప్రగతి నిరోధక ప్రమాణాలకు పరిమితం చేయడం మాత్రం సాధ్యమయ్యేది కాదు. ప్రజామోదకరమూ కాదు. వీటన్నిటి వల్లనా కలిగిన గందరగోళం నుంచి తికమక నుంచి ఆయన మహత్తర కవితా వారసత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రగతిశీలులందరిపైనా ఉంటుంది. ఇతర విమర్శలను పరిశీలించవలసీ ఉంటుంది.
శ్రీశ్రీనే కాదు, ప్రభావశీలులైన, ప్రచారంలో వున్న ఎవరినైనా కాలం పునర్మూల్యాంకనం చేస్తూనే వుంటుంది. అయితే ఏ మూల్యాంకనమైనా నిరంతరం సాగుతుంటుంది తప్ప ఒక బిందువు దగ్గర ఆగిపోదు. అవసరం లేని వారిని చరిత్ర తేలిగ్గా మర్చిపోతుంది. ఎవరి గురించైనా పునర్మూల్యాంకనం జరగాలని పదేపదే అంటున్నారంటే, వారి ప్రభావం నిలిచి ఉందని అర్థం.
శ్రీశ్రీ విషయంలో సాహిత్యపరంగా ఆయన మహత్తర పాత్రపై సంపూర్ణ మూల్యాంకనమే సరిగ్గా జరిగినట్టు కనిపించదు. తెలుగు కవిత్వాన్ని ఊగించి, దీవించి శాసించిన ఆయన మహత్తర కవిత్వంపైన, జన నిబద్ధమైన ఆయన జీవితంపైన, ఏకోన్ముఖ పరిశీలనే ఇంతవరకూ జరిగింది లేదు. కవిత్వంపై శ్రీశ్రీ ప్రభావం, మహాకవిగా ఆయన భావాలు భాష ప్రభావం కూడా వేర్వేరు విషయాలు.
‘విధిగా వికసించే చరిత్రకొక నివాళి’ అన్నట్టుగా నిరంతర గమనశీలమైన కాలంలో కొత్త తరాలు వస్తూనే ఉంటాయి. నూతన తరాలకు శ్రీశ్రీ గురించి గత చర్చల పూర్వాపరాలు తెలియకపోవచ్చు. ఎవరు ఏ విషయం ఎందుకు చెబుతున్నారో అర్థం కాకపోవచ్చు. కనుక శ్రీశ్రీ వంటి వారి గురించిన నిరంతర అధ్యయనం కొనసాగవలసిందే. శ్రీశ్రీకి సంబంధించిన విషయాలను పరిశీలించినప్పుడు, వివిధ దశలో వివిధ రకాల శక్తులూ వ్యక్తులూ విభిన్న రీతుల్లో వ్యాఖ్యానాలు చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి స్థితి తెలుగులో మరే కవి రచయితలకు చూడం. దీనికి శ్రీశ్రీ రాజకీయ నిబద్ధతే కారణమని చెప్పనవసరం లేదు.
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే మహా మేధావులు, కళాకారులు, చిత్రకారులు, శాస్త్రజ్ఞులు ఎందరో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులవడం కనిపిస్తుంది. తెలుగునాట ఆ విధంగా ఆకర్షితులైన వారిలో అత్యంత ప్రసిద్ధులు, ప్రతిభావంతులు శ్రీశ్రీ. ఈ వాస్తవాన్ని కమ్యూనిస్టు వ్యతిరేకులు, కమ్యూనిస్టేతరులు ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయారు. అందులోనూ ఆయన ప్రత్యక్షంగా కమ్యూనిస్టులతో పాటు రంగంలో నిలబడి శత్రు ప్రచారాలను ఢీకొనడం వారికి మరీ దుర్భరంగా మారింది.
పీడిత ప్రజాకవిపై విషపు దాడి..
అమెరికాలో మెకార్తిజం రోజులలో హాలివుడ్లో కూడా కమ్యూనిస్టు అనుకూలులైన వారి జాబితాలు విడుదల చేసేవారు. ఇప్పుడూ అది జరుగుతూనే వుంది. 1955 మధ్యంతర ఎన్నికల కురుక్షేత్రం తర్వాత మన పాలకవర్గాలు శ్రీశ్రీ విషయంలో అదే చేశాయి. ఆయనపై నీచాతినీచ ప్రచారాన్ని రివాజుగా చేసుకున్నాయి. అత్యంత నియమబద్ధుడైన సుందరయ్యపైనే నీచ కథలతో నాటకాలాడిన వారికి ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీడిత ప్రజాకవిపై విషపు దాడి చేయడం పెద్ద పనేమీ కాదు. వాటికి శ్రీశ్రీ లోబడక పోవడంతో వ్యతిరేకులు మరీ రెచ్చిపోయారు. మతతత్వ వర్గాలు ఛాందసులకు శ్రీశ్రీ హేతువాద దృష్టి పెద్ద ముప్పుగా కనిపించింది.
కళా సాహిత్యాలంటేనే పురాణాలు, విశ్వాసాలు అన్నట్టు చిత్రించే ఈ శక్తులకు ప్రత్యామ్నాయ చైతన్యానికి ప్రతీకగా శ్రీశ్రీ ప్రకాశించడం ఏ మాత్రం మింగుడు పడలేదు. అదీకాక వ్యక్తిగతంగానూ రాగద్వేషాల పాత్ర వుండనే ఉంటుంది. ఇన్ని రకాల కుత్సితాల మధ్య శ్రీశ్రీ నిలదొక్కుకున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోయారు. నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోతారని పొరబడిన వారికి నిరంతర ప్రహేళికే అయ్యారు.
అనన్య సామాన్యమైన స్థాయికి చేరిన ఆయన ప్రాచుర్యాన్ని ఆమోదించడానికి సహృదయతే కాక సాహసం కూడా కావాలి. మహా ప్రస్థానం పీఠికలోనే చలం ఈ విధమైన హెచ్చరికలు చేశారు. 75 ఏళ్ల తర్వాత ఆయన మరణానంతర పునఃప్రస్థానం నాటికి కూడా ఈ దృశ్యం మారలేదంటే, శ్రీశ్రీ ప్రగాఢ ప్రభావానికి అదే ప్రత్యక్ష నిదర్శనం.
అసలు శ్రీశ్రీపై ఉన్న విమర్శలేమిటి..!?
వాటిలో మొదటిది స్త్రీల పట్ల దృష్టి. కవిగా వ్యక్తిగా ఈ విషయంలో ఆయన భావాలేమిటి?
పుట్టిన అప్సరసలుగా మాత్రమే కనిపిస్తారు. రక్తమాంసాలు సజీవ చైతన్యంగల స్త్రీలు దాదాపు కనిపించరు. సహజీవన సౌందర్యం గోచరించదు. మొదటి సారిగా గురజాడ అప్పారావు “మగడు వేల్పన పాతమాటది/ ప్రాణసఖుడ నీకు” అంటూ ఆధునిక ప్రేమభావన స్నేహ సహజీవనాల మాధుర్యాన్ని చెప్పారు. శ్రీశ్రీ అద్వైతం అంటూ ఒక గేయం రాశారు. కానీ గురజాడ స్థాయిలో మాత్రం కాదు.
అయితే, ఒక సినిమా పాటలో “మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ అదే సౌఖ్యమూ” అంటూ స్త్రీ పురుష సహజీవన వేదాన్ని ఆలపించారు. తరతరాలుగా మూఢాచారపు వలలో చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి బలైపోయిన పడతులకూ ఎవరూ తోడు వస్తారని ఎదురు చూసి మోసపోవద్దన్నారు.
“మాంచాలను తలుస్తారు, మల్లమ్మను కొలుస్తారు/ సరోజినీ దేవికి పటం కట్టి పొగుడుతారు/ పంచాది నిర్మలంటే భయం పుట్టి వణుకుతారు” అని ‘దోపిడీవర్గాలు పోరాట చైతన్య మహిళలను చూసి కంపించి పోయే తీరును చెప్పారు.
‘ప్రజాతంత్ర’ పత్రికలో‘అనంతం’ ధారావాహికంగా వెలువడినప్పుడు, రచయిత్రి రంగనాయకమ్మతో జరిపిన వాదోపవాదాల్లోను, ఆత్మకథలోను కూడా శ్రీశ్రీ స్త్రీల గురించి చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యానించడం వాస్తవం. అది గర్హనీయం కూడా.
కేవలం వేశ్యల గురించే కాదు. తన భార్య గురించి కూడా అసభ్యంగా ధ్వనించే అనేక వ్యాఖ్యలు రాశారు. అనంతంలో కన్నతల్లి గురించీ ఇబ్బందికరమైన వ్యాఖ్యలు రాసిన ఆయన తల్లిగా భావించిన పిన్ని సుభద్రమ్మను దేవతగా పేర్కొన్నారు. అసలు ఆయన వ్యాసాలన్నిటిలోనూ స్త్రీని ఉన్నతంగా రాసింది చాలా తక్కువ. అలాగే తన జీవితంలో ప్రతిభావంతులైన స్త్రీల ప్రభావం గురించి కూడా రాయలేదు. స్త్రీకి శరీరంతో పాటు హృదయం వుందన్న చలం మాటలు ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. స్త్రీల సమస్యలపై లైంగికత కోణం నుంచి ప్రధానంగా రాసిన చలం, తన ఇతర రాతలలో వారి గురించి చౌకబారుగా రాయలేదు. కానీ శ్రీశ్రీ ఆ పని చేయడం ఒక విచిత్ర యథార్థం.
అయితే సామ్యవాద భావజాలం చదివిన శ్రీశ్రీకి సమస్యల మూల కారణాలూ తెలుసు. స్త్రీల స్వేచ్ఛకు సంబంధించి ఒక సందర్భంలో ఆయన ఇలా చెప్పారు: ‘‘ప్రాచీన కాలమైతేనేమిటి, నవీన కాలమైతేనేమిటి ఇప్పుడిప్పుడు కూడాను మాస్కులైన్ డామినేషన్. పురుషాధిక్యం ఎక్కువ వున్నటువంటి సమాజం మనది. ఆ పురుషాధిక్యం వున్నప్పుడు కూడా స్త్రీలు ఆహుతి అవుతున్నారు. దీని మీద చలంగారు ఓ గొప్ప తిరుగుబాటు లేవదీశారు. చలంగారి కంటే ముందర కందుకూరి వీరేశలింగం గారు. ఆయన సంస్కరణలు తీసుకుంటే, అంతకు ముందు రాజారామ్మోహన్రాయ్ ఒక ఆడదాని మొగుడు చచ్చిపోతే చితి మీద వేసి తగలేయడమంటే అంతకంటే క్రూరమైనటువంటి ఆచారం ఏమిటుంటుంది? ఆ ఆచారం చాలా గొప్పదని చెప్పి కవిత్వాలు కూడా రాసినవాళ్ళు ఉన్నారు. మరి ఆ సహగమనాన్ని మాన్పించి రాజారామ్మోహన్రాయ్ అయితేనేమిటి, చిన్నప్పుడే మొగుడుచచ్చిపోతే, వితకాలమంతా కూడాను మోడు చెట్టులా జీవించవలసినటువంటి వారికి వితంతు పునర్వివాహం అనేటటువంటి ఉద్యమాన్ని లేవదీసి, దాన్ని ఎంతోమంది తమకు శత్రువులై ప్రాణాలు కూడా తీయటానికి ప్రయత్నించిన సందర్భాలను ఎదుర్కొని, దృఢదీక్షతో నిలబడి, స్త్రీలకు నాయకత్వం వహించి పోరాడి, విజయం సాధించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఈ శతాబ్ది ప్రారంభంలోని వాడు. శతాబ్ది మధ్యలో వున్నవాడు చలం. ఈనాడు నికృష్టస్థితిలో వుంది సమాజం. ఎందుచేంత వుందీ ఇంకా ఇందాక నేను చెప్పినట్టు మాస్కులైన్ డామినేషన్ పోలేదు. మాస్కులైన్ డామినేషన్ పోయి ఫెమినైన్ డామినేషన్ రావాలని నేను ఎప్పుడూ కోరను. అది డామినేషనే. అట్లా కాకుండాను స్త్రీకి మగవాడి మీద ఆధారపడవలసిన అవసరం లేనటువంటి, ఆర్థిక ప్రతిపత్తి రావాలి. మగవాడితో సమానం అయినటువంటి సామాజిక స్థాయికి ఆమె ఎదగాలి. మరి వారి పరిస్థితి బాగుపడాలంటే ఈ వ్యవస్థే మారాలి. ఈ వ్యవస్థ మారి సామ్యవాద వ్యవస్థ వచ్చి అందులో స్త్రీ పురుషులకి సమానత్వం. కొలమానం, కొలబద్ధ ఏమిటి అంటే ఆర్థిక స్వాతంత్య్రం. స్త్రీ తన జీవితాన్ని, తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోగలగాలి. అటువంటి ఆర్థికబలం ఆవిడకి కలగాలి.’’
మహిళల పట్ల శ్రీశ్రీ దృక్ఫథం ఏమిటో ఆయన కవితలతో పాటు, ఈ మాటలు కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.
నారాయణబాబు చనిపోయినప్పుడు శ్రాద్ద క్రియలు నిర్వహించిన పురోహితుడి గురించి ఒకానొక సందర్భంలో ఇలా రాశారు.
‘‘గిడుగు రామమూర్తి అంత్యక్రియలు జరిగిన మైలాపూర్ శ్మశానంలోనే నారాయణబాబుకి ఆరుద్రా, నేనూ ఆఖరి వీడ్కోలు చెప్పాము. మా జేబుల్లోంచి కనిపిస్తున్న కరెన్సీనోట్లను చూసి పురోహితుడు నారాయణబాబు కులగోత్రాదులు చెప్పమన్నాడు. ‘‘ఆయన వాటన్నిటికీ అతీతుడు’’ అన్నాడు ఆరుద్ర. నారాయణబాబు అస్థికలను మరునాడు కావేరిలోనో, గోదావరిలోనో కలుపుతానన్నాడు పురోహితుడు. ‘‘ఎదురుగానే మహాసముద్రం ఉంది. అందులో కలపండి’’ అన్నాన్నేను. ఇక్కడ పురోహితుని గురించి శ్రాద్ధ కర్మల గురించి రాసినవి సంప్రదాయంపై నమ్మకం వున్నవారెవరూ అనగలిగినవి కావు.
తెలంగాణ- నిజాం కొలువు..
అంతటి ‘మహాప్రస్థానం’ రాసిన మహాకవి తెలంగాణ పోరాటంపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్న నాటికీ నేటికీ వినిపిస్తూనే ఉంది. శ్రీశ్రీ ఆ కాలంలో నిజాం సంస్థానంలో కొలువు చేయడం ఈ విమర్శకు మరింత బలం చేకూరింది.
ఇంతకూ నిజాం కొలువులో శ్రీశ్రీ పనిచేసిన కాలం ఏడాదిలోపే. అది కూడా అనువాదకుడిగా. అవి ఆయన బాగా దరిద్రంలో ఇబ్బంది పడుతున్న రోజులు. సినిమాల్లో రాయడాన్నే పోతన సత్కవులు హాలికులైననేమి అని రాసిన కోణంలో చూడాలని శ్రీశ్రీ చెప్పారు.
నిజాం సంస్థానం కూడా ఒక నిరంకుశ రాజ్యం అనుకుంటే, అందులో శ్రీశ్రీ పనిచేయడం ఉద్యోగం కాకుండా పోదు. రాజకీయంగా నిజాం నిరంకుశత్వాన్ని కీర్తిస్తూ ఆయన ఏమీ రాయలేదు. నిజాం జీవిత చరిత్ర అనువదిస్తే బాగా డబ్బు వస్తుందని తెలిసి కూడా తిరస్కరించినట్టు త్రిపురనేని మహారథి రాశారు. శ్రీశ్రీ రచనలలో ఎక్కడా నిజాం కొలువు గురించి గొప్పగా చెప్పడం చూడం.
ఇప్పటికీ నిజాంకు సలాములు చేసే వారి వెంట తిరుగుతూ, తామూ ‘‘యథాశక్తి’’ ఆయనపై దురభిప్రాయాలను తొలగించడానికి తంటాలు పడే పరిశోధకాగ్రణులు కొందరు ఈ కారణంగా శ్రీశ్రీపై శ్రుతిమించిన దాడి చేయడం అహేతుక ఆగ్రహానికి అసలైన ఉదాహరణ. శ్రీశ్రీ వ్యక్తిగత జీవితంలో ఇటువంటి వైరుధ్యాలు ఇంకా ఉన్నాయి.
శ్రీశ్రీ వంటి మహాకవి తెలంగాణ పోరాటానికి స్పందించి ఉంటే అద్భుతంగా ఉండేదనడంలో సందేహం లేదు. కానీ ఒక కవి లేక రచయిత ప్రతి సందర్భంలోనూ రచనలు చేసి తీరాలనే నిబంధన విధించలేము. తెలంగాణ పోరాటంతో సహా శ్రామికవర్గ సమరాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించగల విస్తృతి మహాప్రస్థాన గీతాలకు ఉందని చెప్పాలి. పైగా శ్రీశ్రీ పోరాట సాహిత్యానికి దూరంగానూ లేడు. తానుగా రాయలేకపోయినప్పటికీ తెలంగాణపై వచ్చిన సాహిత్యాన్ని శ్రీశ్రీ ఎంతగానో ప్రోత్సహించారు.
చరిత్రాత్మకమైన ‘మాభూమి’ నాటకం ‘అభ్యుదయ’ పత్రికలో అవహేళనకు గురయినప్పటికీ ఆయన మాత్రం దాని గొప్పతనాన్ని గుర్తించి స్వాగతం పలికారు. ఆరుద్ర ‘త్వమేవాహం’కు రాసిన ముందుమాటలో కూడా రాజకీయంగా తెలంగాణ పోరాటం, సాహిత్యపరంగా ఆ కావ్యం వంటివి భారతదేశంలో తెలుగువారి విశిష్టతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఆరుద్ర తెలంగాణాని పేరు పెడితే త్వమేవాహమని శ్రీశ్రీ మార్చారు. నీవే నేను అని తెలంగాణ పోరాటానికి మమేకత తెలిపారు.
తెలంగాణ పోరాటంపై వెలువడిన చాలా కావ్యాలలో మహాప్రస్థాన ముద్ర కానవస్తుంది. వాటిని రాసిన కవులూ, వాగ్గేయకారులే ఆ మాట చెప్పారు. ఆపదాలూ, బాణీలూ వాడారు. తెలంగాణ మాండలికంలో రచనలు రావలసిన అవసరాన్ని చాలాముందుగా చెప్పిన వారిలో ఆయనున్నారు. బాగా వయసొచ్చాక కూడా ఆ బాణీలో రాయడానికి చేతనైంది చేశారు.
కనుక మొత్తం మీద మహాప్రస్థాన కవిగా శ్రీశ్రీ ఎవరి వైపు ఎవరికోసం నిలబడ్డారో చరిత్ర– ఇప్పటికే విమర్శకులు గుర్తించారు.
శ్రీశ్రీకి పరిమితులే లేవని కాదు. ఆలోచనా పరులెవరూ ఎవరి విషయంలోనూ అలాంటి అతిశయోక్తులను అంగీకరించరు. శ్రీశ్రీ భజన, భంజన ఏది చేసినా తప్పే అవుతుంది. ఒకానొక చారిత్రక సామాజిక పరిణామక్రమంలో, శ్రీశ్రీ పాత్రను సరిగ్గా అర్థం చేసుకోగలిగితేనే ఉన్న పరిమితులనైనా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎవరి సాహిత్యంలోనైనా లోపాలను తప్పక గుర్తించవలసిందే. కానీ, ముందు రాసింది చూడాలి. వారి ప్రధాన పాత్రను గుర్తించి ఆపైన ఇతర లోపాలను చూడాలి. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న సమతుల్యత పాటించాలి. ఆ లోపాలకు మూలాలు ఎక్కడో శోధించాలి. అందుకోసం వీలైనంత విస్త్రతంగా ఆయన రాసినవి చూడాలి.
ఈనాడు ప్రబలంగా ప్రచారంలోకి వచ్చిన అస్తిత్వవాదాలను ‘యథాతథంగా’ ఆనాడు ప్రకటించలేదు. కనుక మొత్తంగా శ్రీశ్రీ కవిత్వం ప్రాధాన్యత కోల్పోయిందనడం సాహిత్యపరంగాను, చారిత్రకంగాను కూడా నిలిచేదేనా? ఎవరో అన్నట్టు శ్రీశ్రీ జీవితం కన్నా కవిత్వం గొప్పది. కవిత్వం కన్నా కవితామార్గం ఇంకా గొప్పది. అదే పదండి ముందుకు అంటూ మనల్ని నడిపిస్తుంటుంది.
(శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రచురణ 75వ వార్సికోత్సవం, ఆయన 115వ జయంతి సందర్భంగా.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.