తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు అదనపు శక్తినిచ్చిన కవి అందెశ్రీ. జనం అడుగుల సవ్వడిని, జనస్వరాల నినాదాలను తన పాటకు పల్లవులు– చరణాలుగా చేసుకున్నవారు. బడి మెట్లు ఎక్కలేదు, బలపం పట్టుకోలేదు. కానీ కోటానుకోట్ల జనహృదయాలలో అక్షరాలను లిఖించినవారు అందెశ్రీ.
ఆయన పాటలను విన్నప్పుడు ఒక శ్రీనాధుడు, పోతన, భాగవతాదుల వలే అందెశ్రీ గోచరమవుతారు. “కొమ్మ చెక్కితే బొమ్మరా” అనే పాట చరణాలు విన్నప్పుడు మహాకవి కాళిదాసు మనకు స్ఫురణకు వస్తారు. బర్లను, గొర్లను కాసిన అందె ఎల్లయ్య అందెశ్రీగా కోటానుకోట్ల తెలుగు హృదయాలకు చేరువైన అతి సర్వసాధారణ మానవుడు. మాటగాంభీర్యమూ, ఆయన స్వరమూ ఒక ఫిరంగీ, జనజాతరలో ఆయన పాట జనగీతం. ఆధునిక మానవుని అంతరాత్మ ఆవిష్కరణ అద్భుతంగా చేసిన మహాకవి అందెశ్రీ.
1990ల తర్వాత మన దేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణల అనంతర పరిణామాలను “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు” అని చెప్తూనే భారతీయ సమాజపు రాజకీయ దిగజారుడుతనాన్ని, అమానవీయ కోణాలను ఆవిష్కరించిన ఒక తాత్త్వికులు అందెశ్రీ.
తాను పుట్టి పెరిగిన ప్రాంత జీవావరణ ప్రభావాలు తన భవిష్యత్తుపై ప్రగాఢమైన ముద్రను వేశాయి. తన జీవిత పరంపరలో వచ్చిన మార్పులు, భుక్తి కోసం చేసిన వృత్తి ఈ ప్రపంచ అంతఃదృష్టి కోణాన్ని అందెశ్రీ ఆకలింపు చేసుకునేలా చేశాయి. అందుకే కావచ్చు పిచ్చుక గూడుపై అద్భుతమైన కవితాక్షరాలను పేర్చిన ఒకానొక తాపీ మేస్త్రీ ఈ అందెశ్రీ. పండు వెన్నలలను, వసంత రాగాలను, హేమంత శిశిరాలను తన జీవితంలో ఇముడ్చుకొని అక్షరాలుగా వెదజల్లిన అభినవ కాళిదాసు అందెశ్రీ. తన జీవితం గ్రీష్మమై మండినప్పుడు, తన బాట భరణి కార్తిలా భగభగమండినప్పుడు- పల్లవులు, చరణాలను వెదజల్లి చల్లటి మేఘాలను పల్లెలపై రప్పించినవారు, అతి సామాన్యులు, లౌక్యమెరుగనివారు ఈ అందె ఎల్లయ్య.
ఒక నది తనలో ఎన్నో కాలువలను, వాగులను, వంకలను ఇముడ్చుకుంటుంది. మహా ప్రవాహమై నాగరికతకు జీవం పోస్తుంది. తానే జీవితమై చరిత్రలో నిలబడుతుంది. తానే సాహిత్యమై, పాటై మనల్ని చైతన్యపరుస్తుంది. ఆ చైతన్యపు ప్రతిబింబమే ఈ అందెశ్రీ.
మానవ నాగరికతలో అక్షరజ్ఞానంలేనివారు రాజులయ్యారు. చక్రవర్తులూ అయ్యారు. మహాపండితులైనవారు ఒకరో ఇద్దరో. వారిలో ఒకరే ఈ అందెశ్రీ. వీర శైవ తాత్త్విక చింతన, భారతీయ ఆధ్యాత్మిక జీవన శబ్ద సౌందర్యాన్ని తన పాటలలో పలికించిన సంగీతకారులీ తాపీ మేస్త్రి. ఏ గురువు సాంగత్యామూ? ఏ పరిసరాల ప్రభావమూ? అందెశ్రీని అక్షరాల అల్లికలో కవితా నేర్పారిని చేశాయో! తెలంగాణ రాష్ట్ర గేయ రచయితనూ చేశాయో!
ప్రతిభ ఉండాలి. సంకల్పమూ ఉండాలి. లక్ష్యమూ ఉండాలి. గురిచూసి అస్త్రాన్ని సంధించాలి. తన పాట ద్వారా. తన గళం ద్వారా. ఇవి చేసి చూపిన ఆచారణశీలి అందెశ్రీ.
తెలంగాణ జనజీవితాలను, గ్రామీణ వ్యవస్థ నిర్మాణాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన కవి అందెశ్రీ. “చూడా చక్కనీ తల్లీ.. చుక్కల్లో జాబిల్లి..” అంటూ తన జీవిత పునాదిని గుర్తు చేసుకున్న పాటగాడు అందెశ్రీ. వృత్తులూ ధ్వంసమై కకావికళమవుతోన్న సందర్భంలో అందెశ్రీ రాసిన పాట తెలుగు సమాజాన్ని విపరీతంగా ఆకట్టుకున్నదని చెప్పడంలో సందేహం లేదు. ప్రత్యేక రాష్ర్టంలో తనదైన ముద్రను వేసుకొని అరుదైన గౌరవాన్ని పొందిన కవి ఈయన. ఈయన చదివిన డిగ్రీలు లేవు. చేసిన పరిశోధనలు లేవు. కానీ, ఆయన చేసిన సామాజిక సృజన తన్ని డా అందెశ్రీని చేసింది. కాకతీయ యూనివర్సిటీ సగర్వంగా ఆయనకు డాక్టరేట్‌ను ఇచ్చి, తనను తాను సత్కరించుకున్నది.
కాకతీయ సామ్రాజ్యం ఉత్థానపతనాలు; జైనం, బౌద్ధం, వీర శైవం గమ్యాగమనాలు ఎట్లా తెలంగాణను ప్రభావితం చేశాయో చరిత్ర మనకు చెపుతోంది. ఈ పరిణామక్రమంలో ఎందరో ఆశుకవులు, ఎందరో భక్తి ఉద్యమకారులు వీరంతా సమాజంపై అంతులేని ప్రభావాన్ని చూపించినవారే. మధ్యయుగాల భక్తి ఉద్యమ తాత్త్విక చింతనకు కొనసాగింపుగా ఉన్నవారు అందెశ్రీ. అతిసామాన్యులు తన ఆలోచనధారతో, తన గళంలో ఇంతలా సమాజాన్ని ప్రభావం చేసినవారు వర్ధమాన చరిత్రలో కనిపించరు. అత్యంత అరుదైన చరిత్రను నిర్మించుకున్న అభినవ కాళిదాసు ఈ అందెశ్రీ.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
