Reading Time: 2 minutes
2025 నవంబరు 20 భారత గణతంత్ర చరిత్రలో చీకటి రోజు. బీహార్లో ప్రాంతీయ పార్టీ నేత ఎన్నికల వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పదోసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసుకున్నందుకు కాదు. భారత సమాఖ్య వ్యవస్థలో రాజకీయ అధికార సమతౌల్యాన్ని దెబ్బ తీసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కారణంగా నవంబరు 20 గణతంత్ర చరిత్రలో మాయని మచ్చ. ఈ తీర్పుతో బీహార్లో పదోసారి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసిన నితీష్ కుమార్ కీర్తిప్రతిష్టలు కూడా చర్చకు రాకుండా పోయాయి.
2025 ఏప్రిల్ 11న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ చట్టసభలు ఆమోదించిన బిల్లులకు తుది అనుమతి ఇవ్వకుండా; ఇష్టం వచ్చినంత కాలం పెండింగ్లో పెట్టకూడదని ఇచ్చిన తీర్పును నవంబరు 20న రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది.
బీజేపీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నరుకూ, తమిళనాడులోని ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి మధ్య తలెత్తిన రాజ్యాంగ వివాదం పరాకాష్టకు చేరుకోవడంతో, చివరకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదం పరిపాలనాపరమైన వివాదమని చెప్పేకంటే రాజకీయపరమైనదని చెప్పటం సబబుగా ఉంటుంది.
ఈ వివాదంపై జరిగిన వాదోపవాదాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పులను పరిశీలిస్తే కార్యనిర్వాహకవర్గం లేదా చట్టసభలు అనుసరించే రాజ్యాంగేతర వ్యవహారశైలిని సరి చేసేందుకు సుప్రీంకోర్టు సిద్ధపడటం లేదనే విషయాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. పైగా ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వటం గమనిస్తే రాజకీయ వివాదాలతో ప్రేరేపితమైన కేసుల్లో తలదూర్చటానికి సుప్రీంకోర్టు సుముఖంగా లేదన్న విషయం కూడా స్పష్టమవుతోంది.
న్యాయస్థానాల మౌనం శ్రేయస్కరం కాదు..
సుప్రీంకోర్టు ఈ రకంగా సంయమనం పాటించాలనుకోవటం గురించి ఎవరికి పేచీ ఉండక్కర్లేదు. కానీ దేశంలో గణతంత్ర వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రాజ్యాంగం నిర్దేశించిన సమతౌల్యాన్ని పాటించాల్సిన అవసరం ఉందని చెప్పాల్సి వస్తే ఈ విషయాన్ని సుప్రీం కోర్టు మాత్రమే చెప్పాలన్న రాజ్యాంగపరమైన బాధ్యతను సుప్రీం కోర్టు విస్మరించటం గురించే ఈ సమస్య.
ఈ రకమైన వైఖరిని గమనిస్తే ఏడీఏం జబల్పూర్ కేసులో అప్పట్లో మెజారిటీ న్యాయమూర్తులు రాజ్యాంగంలో పదాలను వల్లెవేయటంతో తమ బాధ్యతలను సరిపెట్టుకోవడం గుర్తొస్తోంది. ఈ కాలంలో రాజకీయ వ్యవస్థ ఎంతో పురోగమించింది. న్యాయ వ్యవస్థ కూడా ఎమర్జెన్సీ చీకటి కాలం నుంచి పురోగమించింది. నిజానికి రాజకీయ వ్యవస్థ ప్రదర్శించే ఒంటెత్తు వైఖరిని అదుపులో పెట్టే సామర్ధ్యం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉందన్న విశ్వాసం విశ్వవ్యాప్తంగా నెలకొని ఉంది. 

పొరుగునున్న పాకిస్తాన్లో సైతం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేసిన జస్టిస్ సయ్యద్ మన్సూర్ అలీఖాన్ తన రాజీనామా లేఖలో ‘‘సమన్యాయ పాలన పునాదిగా పరిపాలనా విధి విధానాలు అమలు చేసిన దేశాలు, న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పవిత్రమైనదిగా భావించే దేశాలే అభివృద్ధి చెందాయి. పురోగమించాయి. న్యాయ వ్యవస్థ బందీ అయితే విఫలమయ్యేది కేవలం దేశం మాత్రమే కాదు. నైతికవిలువలను కూడా కోల్పోతుంది. న్యాయస్థానాలు మూగబోయినప్పుడు సమాజాలు చీకట్లోకి జారిపోతాయనదానికి చరిత్రే సాక్షి’’ అని హెచ్చరించారు.
ఫీల్డ్ మార్షల్ మునీర్ ఖాన్ నేతృత్వంలో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణలకు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో మెజారిటీ న్యాయమూర్తులు తల్గొటాన్ని అంగీకరించలేక జస్టిస్ మన్సూర్ అలీఖాన్ రాజీనామా చేశారు.
ప్రశ్నలను లేవనెత్తుతున్న తీర్పు..
చాలాకాలంగా భారతదేశంలో గవర్నర్ కార్యాలయాలు ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలుగా చలామణి అవుతూ వచ్చాయి. ప్రత్యేకించి బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ కార్యాలయాలే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల పనికి అంతరాయం కలిగించే కేంద్రాలుగా మారాయి.
తాజా తీర్పుతో సుప్రీం కోర్టు కూడా ఈ కసరత్తుకు వత్తాసు పలికినట్టయ్యింది. గవర్నర్లు ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రులుగా వ్యవహరించకూడదని, రాష్ట్రంలో రెండు కార్యానిర్వాహక కేంద్రాలుండకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దురుద్దేశ్యంతో వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే దిశగా వ్యవహరించాలని మాట వరుసకు చెప్పటం పరిశీలకుల్లో విశ్వాసాన్ని పెంపొంచేదిగా లేదు.
కక్షపూరితంగా ఉన్న అధికార కేంద్రాలు చట్టసభలు ఆమోదించిన బిల్లులకు తుది రూపం ఇవ్వటంలో జాగు చేస్తూ ఉంటే; ఎంత కాలం జాగును అర్థం లేని జాగని నిర్ధారించాలి? ఎవరు నిర్ధారించాలి? ఈ బిల్లులకు ఆమోదం తెలపటంలో జరిగే ఆలస్యాన్ని సహేతుకమైన ఆలస్యం కాదని ఎవరు నిర్ధారించాలి?
కక్ష సాధింపులే రాజకీయాలుగా చలామణవుతున్న సమయంలో; జఫర్సన్ ప్రతిపాదించిన సమదూరాన్ని పాటించటంలో రాజ్యాంగ వ్యవస్థలు విఫలమవుతున్నప్పుడు ప్రజాస్వామ్యం మృగమ్యమవుతుంది. అమెరికా న్యాయ వ్యవస్థ తన మౌన ముద్రతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందిస్తున్న మద్దతుతో అధ్యక్ష అధికారాలాను విచ్చలవిడిగా విస్తరించుకుంటూ పోతున్న ట్రంప్ పరిపాలన తీరు వర్తమానంలో ఓ చేదు జ్ఞాపకం.
భారత రాజ్యాంగం ఓ సమీకృత వ్యవస్థ. కమిటీలు, చర్చలు, సంప్రదింపులు, రాజీలువంటివన్నీ సమపాళ్లల్లో అమర్చబడిన విధానపత్రం. వివిధ వైవిధ్యాలు, వైవిధ్యాలతో నిండిన ఈ దేశానికి అర్థవంతమైన పరిపాలనను అందించేందుకు స్త్రీ పురుషులు కలిసి ఉమ్మడిగా రూపొందించిన విధానపత్రం ఇది. భారత ప్రజాస్వామ్యంలోని పాత్రధారులందరూ రాజ్యాంగం ఆయా పాత్రలకు కేటాయించిన పరిమితుల్లో వ్యవహరించాలని రాజ్యాంగం ఆదేశిస్తోంది.
నిరాశాజనకమైన చర్య..
మూడు విభాగాల మధ్య అర్థవంతమైన ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని సాధించినప్పుడే భారతదేశ రాజకీయ నాయకత్వం పరిణితి చెందిన నాయకత్వంగా మనగలదు. రాజ్యం, ప్రజలు మధ్య ఆరోగ్యవంతమైన సమతౌల్యం, మెజారిటీ, మైనారిటీల మధ్య అర్థవంతమైన సమతౌల్యం, ప్రైవేటు పరిశ్రమలు చికాకుల్లేకుండా పని చేయటానికి వీలైన పరిస్థితులు, విశాల జనహితం గురించిన అప్రమత్తత, కేంద్రం రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైన పని విభజన, అధికారాల విభజన ఇవన్నీ భారతరాజకీయాలు పరిణతికి సంకేతాలు. ప్రజాస్వామ్యం ఆరోగ్యవంతంగా ఉండాలంటే అర్థవంతమైన సమాఖ్యతత్వం ఆచరణలో కనిపించాలి.
రాజధర్మంలోని సున్నితమైన సూత్రాలను గత ఏడు దశాబ్దాలుగా పదేపపదే నేర్చుకుంటూనే ఉన్నాము. వ్యవస్థలు సక్రమంగా వ్యవహరించకపోతే తప్పుడు వ్యక్తులు అందలమెక్కుతారు. తప్పుడు ఫలితాలు వస్తాయి. తెలివైన రాజకీయ నాయకత్వం లేనప్పుడు తలెత్తే అసమతౌల్యాన్ని అదుపులో పెట్టే బాధ్యత న్యాయవ్యవస్థ మీదే ఉంటుంది. ఈ కోణంలో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ రూలింగ్ ప్రజాస్వామికవాదులకు ఆశాజనకంగా లేదు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
