దేశంలో వసూలు అయ్యే వివిధ రకాల పన్నులను కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ఇది జరుగుతుంది. అయితే, జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల పరిధిలో వసూలు చేసుకునే పన్ను ఆదాయాలకు భారీగా గండి పడింది.
ఐదు సంవత్సరాల పాటు జీఎస్టీ కారణంగా రాష్ట్రాలకు జరిగే ఆర్థిక నష్టాన్ని భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తదుపరి కాలపరిమితిని మరొక రెండు సంవత్సరాలు పొడిగించారు. మొత్తంగా ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో కేంద్రం సాచివేత, భాష పక్షపాత ధోరణితో వ్యవహరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీగా బకాయిలు పెట్టింది.
ఇదంతా ఒక ఎత్తు కాగా, రాష్ట్రాలకు వాటా లేని విధంగా వివిధ రకాల సెస్‌లు/ సర్ చార్జీలు వసూలు చేసి కేంద్రం ఆ మొత్తాన్ని తన ఖాతాలోనే వేసుకుంది.
2019లో కార్పొరేట్ సర్ ఛార్జ్ విధించింది. 2013లో యూపీఏ కాలంలో ప్రారంభించబడిన ఇన్ కమ్ టాక్స్ సర్ చార్జ్‌ను 2016లో 25 నుంచి 37% దాకా పెంచింది. 2017 జూలై నుంచి 14% జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ విధించింది. (ఇది జీఎస్టీ కారణంగా రాష్ట్రాలకు జరిగే ఆర్థిక లోటును భర్తీ చేయడం కోసం విధించారు). 2018లో దిగుమతి అవుతున్న వస్తువులపై సాంఘిక సంక్షేమం, వ్యవసాయ మౌలికల సదుపాయాల ఏర్పాటు సెస్ విధించారు.
బీజేపీయేతర రాష్ట్రాలకు మాత్రం మొండి చేయి చూపిస్తున్న మోదీ ప్రభుత్వం
గతంలో లీటరు డీజిల్, పెట్రోల్ మీద 3 రూపాయలుగా ఉన్న రోడ్డు డెవలప్మెంట్ సెస్‌ను 2018లో రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్‌గా మార్చి, లీటర్‌పై ఏకంగా 3 రూపాయల నుంచి 8 రూపాయలకు పెంచి కేంద్రం వసూలు చేస్తున్నది.
ఈ విధంగా రకరకాల సెస్, సర్ చార్జీల రూపంలో 2024- 25 ఆర్థిక సంవత్సరంలో రూ 5,38,822 కోట్లు కేంద్ర ఖజానాకు జమయ్యాయి. ఇది మొత్తం పన్నులలో 14.19%. 25-26 ఆర్థిక సంవత్సరంలో రూ 5,08,040 కోట్లు వస్తాయని బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్లో తెలియజేశారు.
ఇది మొత్తం పన్ను వసూళ్ల రివైజ్డ్ ఎస్టిమేషన్లో 12.46%. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4,64,620 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేశారు. ఇది మొత్తం పన్నుల వసూళ్ళ అంచనాలలో 10.55%.
ఈ విధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వసూలు చేస్తూ రాష్ట్రాలకు మాత్రం మొండి చేయి చూపుతోంది.
పన్నులు వసూలు- చెల్లింపు..
2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంలో 19,19,008 కోట్ల పన్నులు వసూలు కాగా రాష్ట్రాలకు కేవలం 6,73,005 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇది మొత్తం పన్నులలో 37%.
2018-19 సంవత్సరంలో 20,80,465 కోట్ల పన్నులు వసూలు కాగా రాష్ట్రాలకు 7,61,454 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇది మొత్తం పనులలో 37%.
2019-20 ఆర్థిక సంవత్సరంలో 20,10,059 కోట్ల రూపాయలు వసూలు కాగా అందులో రాష్ట్రాలకు చెల్లించింది కేవలం 6,50,677 కోట్లు. ఇది మొత్తం పనులలో కేవలం 32% శాతం మాత్రమే.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20,27,104 కోట్లు వసూళ్లు కాగా, అందులో రాష్ట్రాలకు పంచింది 5,94,997 కోట్లు. ఇది మొత్తం పన్నులలో కేవలం 29 శాతం మాత్రమే.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 27,09,316 కోట్ల రూపాయల వసూలు కాగా అందులో రాష్ట్రాలకు పంచింది 8,98,392 కోట్లు. ఇది మొత్తం పనులలో 33%.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30,54,192 కోట్లు వసూలు కాగా రాష్ట్రాలకు పంచింది 9,48,406 కోట్లు. ఇది మొత్తం పనులలో 31%.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వసూళ్లు 34,65,519 కోట్లు కాగా రాష్ట్రాలకు పంచింది 11,29,494 కోట్లు. ఇది మొత్తం పనుల్లో 33%.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 37,96,382 కోట్లు వసూలు కాగా రాష్ట్రాలకు పంచింది 12,86,885 కోట్లు. ఇది మొత్తం పనుల్లో 34%.
2025-26 ఆర్థిక సంవత్సరంలో 40,77,772 కోట్లు అని అంచనా వేయగా, రాష్ట్రాలకు 13,92,971 కోట్లు వస్తాయి. ఇది మొత్తం వసూళ్లలో 34%.
అంచనాలు- వ్యత్యాసం..
2026-27 ఆర్థిక సంవత్సరంలో 44,04,086 కోట్లు వసూలు అవుతాయని అంచనా. ఇందులో రాష్ట్రాలకు 15,26,255 కోట్లు పంచాలి. ఇది మొత్తం పన్నులలో 35%.
పై వివరాలు పరిశీలించినప్పుడు 2018-19 సంవత్సరంలో మాత్రమే రాష్ట్రాలకు అత్యధికంగా మొత్తం పనులలో 37% పంచారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.
2020-21లో కనిష్టంగా 29%కి పడిపోయింది, ఆ తర్వాత సంవత్సరాలలో కొద్దిగా పెరిగినా ఇప్పటికీ 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రాలకు కేటాయిస్తున్నది చాలా తక్కువ.
రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా గండికోడుతున్నదో పై వివరాలు తెలియజేస్తున్నాయి. ఆర్థికంగా రాష్ట్రాలను బలహీనపరిచి ప్రతి చిన్న అవసరానికి కేంద్రాన్ని అడుక్కునే విధంగా దిగజారిస్తున్నది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలను ఆర్థికంగా దిగ్బంధించి ఆ రాష్ట్ర ప్రజలలో అక్కడి ప్రభుత్వం పై వ్యతిరేకత సృష్టించడం ప్రధాన లక్ష్యం.
తదుపరి డబుల్ ఇంజన్ పేరుతో రాష్ట్రంలో కూడా తమ పార్టీ/ కూటమిని గెలిపిస్తే అప్పుడు రాష్ట్రానికి భారీగా నిధులిస్తామని ఎర చూపుతున్నారు. ఇది రాష్ట్రాలను బ్లాక్ మెయిలింగ్ చేయడం తప్ప మరొకటి కాదు. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ వ్యవస్థకు ఇది తూట్లు పొడవడమే.
ఈ వ్యాసం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో ప్రచురితం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
