కేంద్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరంలో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చింది.
ఈ కోడ్లు 2026 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 21న నోటిఫికేషన్ను విడుదల చేసింది.
దీంతో దేశంలో కార్మిక చట్టాలు మౌలికమైన మార్పులకు లోనుకాన్నాయి.
వేతనాలు, సామాజిక భద్రత, పని ప్రదేశాలలో భద్రత, పారిశ్రామిక సంబంధాలలాంటి చట్టాలు దశాబ్దాలుగా దేశంలో అమల్లో ఉన్నాయి.
ఇప్పుడు ఆధునీకరణ, హేతుబద్ధం చేయటం, పటిష్టం చేయడం పేరుతో మొత్తం చట్టాలను కేంద్ర ప్రభుత్వం తిరగదోడుతున్నది.
ఈ నూతన లేబర్ కోడ్లు మారుతున్న ఉద్యోగ విధానం, ఆర్థిక సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల నేపథ్యంలో తీసుకురాబడ్డాయని అధికార వర్గాలుచెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో పరిశ్రమ నిర్వచనంపై మరొకమారు వివాదం లేవనెత్తబడింది.
గతంలో 1978లో ప్రఖ్యాత న్యాయమూర్తి జస్టిస్ కృషయ్యర్తో పాటు మరొక ఆరుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వివాదాల చట్టం సెక్షన్ 2(జే) ప్రకారం పరిశ్రమను విస్తృతపరచి నిర్వచించింది.
ఇప్పుడు దీనిపై వివాదం మొదలైంది, దాంతో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేసింది. 9 మంది న్యాయమూర్తులు ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసు విచారణ 2026 మార్చి 17న ప్రారంభం కానుంది.
1978లో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పరిశ్రమ అంటే ‘ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, క్లబ్బులు, ఇతర సామాజిక సేవ సంస్థలు” కూడా పరిశ్రమగా పరిగణించబడతాయని తీర్పునిచ్చారు.
తిరగ దోడబడుతున్న తీర్పు..
పాత నిర్వచనం సరైనదేనా? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పరిశ్రమ కిందికి వస్తాయా? రాష్ట్రం నిర్వహించే ఏ కార్యకలాపాలు కార్మిక చట్టం పరిధిలోకి వస్తాయి? ఏవి రావు? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
నాలుగు లేబర్ కోడ్లు వచ్చిన నేపథ్యంలో పరిశ్రమ నిర్వచనాన్ని తిరిగి నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదా అనేది పరిశీలించబడుతుంది.
ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల, కార్మిక సంఘాల హక్కులపై, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పనిచేసే వారిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపొచ్చు.
పరిశ్రమ నిర్వచనాన్ని కుదిస్తే కొన్ని సంస్థలు కార్మిక చట్టాల పరిధి నుంచి బయట పడతాయి.
1978 తీర్పు ప్రకారం, విస్తృతంగా ఉంటే ఉద్యోగుల రక్షణ బలంగా ఉంటుంది.
ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు కార్మిక చట్టాల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక తీర్పు అవుతుంది.
ఇది కేవలం నిర్వచనానికి సంబంధించిన వివాదం కాదు. కార్మిక హక్కులు వర్సెస్ పరిపాలన స్వేచ్ఛ మధ్య సమతల్యత ప్రశ్నగా ముందుకు వస్తున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
