ఆధునిక భారత నిర్మాతలు త్రిమూర్తులు. వీరి వల్లనే ఈనాడు ఇండియా ప్రపంచ అగ్రగామిగా పురోగమిస్తున్నది. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలబడుతున్నది. ఇంతటి సత్తువనిచ్చిన ఆ మహానీయులలో ఒకరు గాంధీ, రెండు నెహ్రూ, మూడు అంబేద్కర్. వీరి ఆలోచన కారణంగానే అనేక కుంపట్లమయమైన ఇండియా ఏకీకృత స్వరంతో పురోగమిస్తున్నది. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మార్గదర్శిగా నిలబడుతున్నది. అంతేకాదు, ప్రజాస్వామ్యమే ఈ జగత్తులో అనివార్యమైనదని కూడా రుజువు చేస్తున్నది. ఇంతటి మహత్కార్యానికి, ఆచరణకు పునాది అంశం భారత రాజ్యాంగమే.
నేటితో భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు. అంతేకాదు, అంటరాని కులాల కోటాను కోట్ల ప్రజల ఆత్మాభిమానానికి 75 ఏళ్లు. మనుధర్మ విషపూరిత ఆచరణ విరుగుడుకు 75 ఏళ్లు. భారత దేశ అశేష ప్రజానికపు ప్రజాస్వామ్య ఆకాంక్షకు నేడు వజ్రోత్సవం.
ఈ దేశ చరిత్రలో నవంబరు 26 సువర్ణాక్షరాలతో లిఖించదగినది. దీనికి సజీవ ఉదాహరణ పైన పేర్కొన్న అంశాలే. 1950 జనవరి 26న భారత ప్రజానికం తమకు తాము సమర్పించుకున్న మహాద్భుతమైన మార్గదర్శి, భవిష్యత్తుకు పునాదయినది మన రాజ్యాంగం.
ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేనిది ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్నది మన రాజ్యాంగం. ఈ భూమండలంలో ఎక్కడాలేని కులదాష్టికపు కుళ్లును సమూలంగా పెకళించిన వజ్రాయుధం ఈ రాజ్యాంగం. కొన్ని కులాల చేతిలోనే అధికారం. సంపద కేంద్రీకృతం కావద్దని చెప్పింది భారతీయ రాజ్యాంగం. అంతేకాదు, ఏ యుద్ధమూ లేకుండా రక్తపు చుక్క కారకుండా కులపీడితుల అట్టడుగు శూద్రజనులకు అధికార అస్త్రాన్ని అందించిన ప్రాణవాయువు భారత రాజ్యాంగం. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చిన తర్వాతనే మనుషులంతా ఒక్కటే, తమందరమూ భారతీయులమనే గొప్ప ఆచరణను మనకు చూపించింది ఈ రాజ్యాంగం.
ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వం..
హిందూ చాతుర్వర్ణ వ్యవస్థ నిర్దేశించిన నీచనికృష్ట, మానసిక దాస్య శృంఖలాలను బద్దలు కొట్టి సమానత్వాన్ని వెలిగెత్తి చాటింది; ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ ఇదే భారత రాజ్యాంగపు మౌలిక అంశం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, స్వతంత్రాలను అందరూ పొందాలనే సార్వజనీన ప్రజాస్వామిక మౌలికతను జనానుభవంలోకి ప్రవహింపజేసింది. ఓటనే గొప్ప ఆయుధాన్ని ఈ దేశ ప్రజలకు అందించింది.
1952 తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని నేటి వరకు ఎందరెందరో అభాగ్యులు, మనుధర్మ పీడితులు అధికార పీఠాలపైకి వచ్చారు. పరిపాలనలో తమదైన ముద్ర వేసుకున్నారు, వేస్తున్నారు. మహిళలకు సర్వహక్కులను తృణీకరించిన, నిరాకరించిన వ్యవస్థ స్థానంలో రాజ్యాధికారాన్ని అప్పగించిన మహాస్త్రం మన రాజ్యాంగం.
ఇందిరా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ అంతకు ముందు రాజమణి దేవి, సదా లక్ష్మమ్మ, ఈశ్వరీబాయి నేటి సీతక్క వరకు ఎందరెందరో మహిళామణులు తమ ధైర్య సాహసాలతో తమదైన చరిత్రను లిఖించికున్నారు. రాజ్యాంగమే లేకపోతే కులా మతాలకతీతమైన మహిళలకు, అంటారని జాతులకు రాజ్యాధికారం కల్లా.
తీవ్ర వ్యతిరేకతల మధ్య ఆమోదం..
మన రాజ్యాంగాన్ని రచనా సమయంలోనే వ్యతిరేకించిన వారు చాలా మందే ఉన్నారు. అందులో మనుధర్మ ప్రేమికులు కొందరు. ఇది బూర్జువా రాజ్యాంగమంటూ లేని పంచాయితీ పెట్టింది మరికొందరు. వీరూ మనుధర్మపు అడుగుజాడలకు పరోక్షంగా మద్దతునిచ్చానే అపప్రధను మూటగట్టుకున్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని, నెహ్రూ విశాల దృక్పథాన్ని, గాంధీ దైవీకృత సమానత్వపు కోణాన్ని వీరెవరూ అర్థం చేసుకోలేదు. పైగా వీరిపై నిందలూ నిష్టూరాలు. కాల గమనం ఈ ముగ్గురు నేతలను భావి భారత మార్గదర్శకులుగా ఈ 75 ఏళ్ల భారత రాజ్యాంగపు అమలు; దాని ఫలితాల తీరు చెప్పకనే చెప్తున్నాయి.
భారతీయ కులవ్యవస్థను, దాని నీచత్వాన్ని అందమైన పదబంధాలతో; సమానత్వపు డ్రామాలతో మోసగించే వారిని పక్కకు నెట్టివేసింది సరికొత్త భారత రిపబ్లిక్. పరిపాలనే చేతకాదు, ఈ ప్రజాస్వామ్యం నిలబడదని చాలా మంది విదేశియులు మనలను అవహేళన చేశారు. ఈ అనుమానాలను, ఆపోహలను పటాపంచలు చేస్తూ భారత రాజ్యాంగ పీఠిక ఆచారనాత్మకంగా చూపిస్తున్నారు భారత ప్రజలు.
ఈ భూగోళంపై అత్యంత జనాభా కలిగిన రెండో దేశంగా సువిశాలమైన తొలి ప్రజాస్వామిక దేశంగా ఇండియా అంటే భారత్ ప్రపంచానికే మార్గదర్శిగా నిలబడింది. ఈ సముచితమైన, సర్వోన్నతమైన విజయానికి పునాది మన భారత రాజ్యాంగంలోనే ఉన్నది. మన ప్రియాంబుల్ సర్వమానవ సమానత్వపు మానవీయ కోణాన్ని ఆవిష్కరించి మనలను లోక విజేతలుగా నిలబెడుతున్నది. ఇంతటి శక్తివంతమైన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
