తాజాగా 2024- 25 వార్షిక నివేదికను కేంద్ర సిబ్బంది- శిక్షణ శాఖ(డీఓపీటీ) విడుదల చేసింది.
నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రూప్-సీ పారిశుధ్య కార్మికులలో 66 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు లేదా ఇతర వెనుకబడిన తరగతుల నేపథ్యం నుంచి వచ్చినవారే ఉన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ(డీఓపీటీ) 2024-25 వార్షిక నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రూప్-సీ పారిశుధ్య కార్మికులలో 66 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులం(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) లేదా ఇతర వెనుకబడిన తరగతి(ఓబీసీ)నేపథ్యానికి చెందినవారు.
‘ది హిందూ’ కథనం ప్రకారం, గత వారం విడుదలైన ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలోని అన్ని గ్రూప్-ఏ పదవులలో 14.20 శాతం ఎస్సీలు; 6.54 శాతం ఎస్టీలు; 19.14 శాతం ఓబీసీలు ఉన్నారు.
డీఓపీటీ నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని కేటగిరీల పోస్టులకు ప్రత్యక్ష నియామకాల సమయంలో- 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 27 శాతం ఓబీసీలకు; 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వ్ చేయాలి.
2024-25 డీఓపీటీ వార్షిక నివేదికలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాతినిధ్యంపై ఉన్న డేటా ప్రకారం, గ్రూప్-సీ(పారిశుధ్య కార్మికులు మినహా) పోస్టుల్లో 16.75 శాతం ఎస్సీలు, 8.94 శాతం ఎస్టీలు, 27.29 శాతం ఓబీసీలు ఉన్నారు.
లెక్కల్లో చాలా వ్యత్యాసం
అలాగే గ్రూప్-బీ పోస్టుల్లో ఎస్సీల వాటా 16.20 శాతం, ఎస్టీల వాటా 7.63 శాతం, ఓబీసీల వాటా 21.95 శాతంగా ఉంది.
ఈ నివేదికలో పొందుపరిచిన 80 మంత్రిత్వ శాఖలు, విభాగాలలోని మొత్తం 32.52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో- 16.84 శాతం మంది ఎస్సీ, 8.70 శాతం ఎస్టీ, 26.32 శాతం మంది ఓబీసీలు ఉన్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈడబ్ల్యూఎస్ ఉద్యోగుల ప్రాతినిధ్యం గురించి నివేదిక ఎటువంటి డేటాను అందించలేదు.
డీఓపీటీ ప్రకారం, ఈ గణాంకాలు 2024 జనవరి 1 నాటికి ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తాయి.
2018-19 వార్షిక నివేదిక తర్వాత తన మంత్రిత్వ శాఖలు- విభాగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రాతినిధ్యంపై వివరణాత్మక డేటాను డీఓపీటీ విడుదల చేయడం ఇదే మొదటిసారి. 2019 నుంచి ప్రచురించబడిన వార్షిక నివేదికలలో, దాదాపు 1.9–2 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కవర్ చేస్తూ పాక్షిక డేటాను మాత్రమే డీఓపీటీ అందిస్తూ వచ్చింది.
అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి డేటా సకాలంలో అందకపోవడం వల్లే ఈ లోటు ఏర్పడిందని పార్లమెంటరీ కమిటీలకు ఇచ్చిన ప్రకటనలలో డీఓపీటీ పేర్కొంది.
2018-19 సంవత్సరపు ప్రాతినిధ్య డేటాతో(అప్పుడు 78 మంత్రిత్వ శాఖలలో 3.2 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్నారు) పోల్చినప్పుడు, మొత్తం ఎస్సీ ఉద్యోగుల ప్రాతినిధ్యం 17.49 శాతం నుంచి 16.84 శాతానికి తగ్గినట్టు తెలుస్తోంది.
ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యం 8.47 శాతం నుంచి 8.94 శాతానికి పెరిగింది. ఓబీసీ ఉద్యోగుల ప్రాతినిధ్యం అత్యధికంగా 21.57 శాతం నుంచి 26.32 శాతానికి పెరిగింది.
గ్రూప్-ఏ, గ్రూప్-బీ, గ్రూప్-సీ మూడు వర్గాలలోనూ 2018-19తో పోలిస్తే అత్యధిక పెరుగుదల ఓబీసీ వర్గం ప్రాతినిధ్యంలోనే కనిపించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం దాదాపు స్థిరంగా ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
