2019–20, 2024–25 మధ్య 45.7 మిలియన్ల ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులు తొలగించబడ్డాయని, 65.4 మిలియన్ల కొత్తవి సృష్టించబడ్డాయని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. బీహార్‌లో అత్యధిక సంఖ్యలో 10.4 మిలియన్ల కార్డుల తొలగింపులు జరిగాయి. 2022–23లో తొలగింపుల సంఖ్య రికార్డు స్థాయిలో 22.4 మిలియన్లకు చేరుకుంది. ప్రభుత్వం దీనిని “సాధారణ ప్రక్రియ”గా తెలియజేసింది.
న్యూఢిల్లీ: 2019–20, 2024–25 మధ్య దేశవ్యాప్తంగా 4.57 కోట్ల ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులను తొలగించామని, అదే సమయంలో 6.54 కోట్ల కొత్త జాబ్ కార్డులు సృష్టించబడ్డాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిసెంబర్ 9న లోక్‌సభకు తెలియజేశారు.
రాష్ట్రాల వారీగా చూస్తే, 2019–20, 2024–25 మధ్య ఎంఎన్ఆర్ఈజీఏ కింద బీహార్‌లో అత్యధిక సంఖ్యలో జాబ్ కార్డుల తొలగింపులు జరిగాయి. ఈ కాలంలో బీహార్ 1.04 కోట్లకు పైగా జాబ్ కార్డులను తొలగించింది. ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకోని లెక్కిస్తే అత్యధికం. 2022–23, 2023–24లో బీహార్‌లో తొలగింపుల సంఖ్య గణనీయంగా పెరిగింది- 79.82 లక్షల జాబ్ కార్డులను తొలగించారు.
భారీ తొలగింపులలో బీహార్ తర్వాత రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇదే సమయంలో అక్కడ 91.48 లక్షల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. ఒడిశాలో 44.07 లక్షల జాబ్ కార్డులను తొలగించారు. పార్లమెంటుకు సమర్పించిన డేటా ప్రకారం- మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా పెద్ద సంఖ్యలో- 37.90; 36.14 లక్షల జాబ్ కార్డులను తొలగించాయి.
గత ఆరు సంవత్సరాలలో ఎక్కువ సంఖ్యలో జాబ్ కార్డుల తొలగింపులు 2022– 23లో నమోదయ్యాయి. 2019– 20లో మొత్తం 14.32 లక్షల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. ఈ సంఖ్య 2020–21లో 27.96 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత 2021– 22లో 50.31 లక్షలకు చేరుకుంది. తదనంతరం, ఈ సంఖ్య 2022–23లో అంచనాలకు మించి 2.24 కోట్లకు పెరిగింది. ఇది ఆరు సంవత్సరాలలో చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ సంఖ్య 2023–24లో 1.01 కోట్లకు తగ్గింది. 2024–25లో ఇప్పటివరకు 38.59 లక్షల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం- ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కేవలం 36 రోజుల్లోనే 16.31 లక్షల మంది కార్మికుల జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 11.07 లక్షలు, ఒడిశా (80,896), జమ్మూ కశ్మీర్ (79,070), తెలంగాణ (95,084), కేరళ (20,124) ఉన్నాయి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో 17,236 జాబ్ కార్డుల తొలిగింపు జరిగింది.
జాబ్ కార్డుల తొలగింపు అనేది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించే ‘సాధారణ ప్రక్రియ’ అని చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానంగా నకిలీ లేదా డూప్లికేట్ ఎంట్రీలు, తప్పుడు సమాచారం, శాశ్వత వలస, గ్రామ పంచాయతీలను పట్టణ ప్రాంతాలలోకి తిరిగి వర్గీకరించడం లేదా జాబ్ కార్డుదారుడి మరణం వంటి కారణాల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
‘అయితే కార్మికులు/జాబ్ కార్డులను తొలగించేటప్పుడు- అర్హత కలిగిన ఏ కుటుంబం జాబ్ కార్డు తొలగించబడకుండా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ధారించుకోవాలి. దీని కోసం, చట్టంలోని నిబంధనలు- మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించడం తప్పనిసరి’ అని కూడా ఆయన తెలియజేశారు.
కార్మికులు ఎన్ఆర్ఈజీఏఎస్ఓఎఫ్టీ ఫిర్యాదుల పరిష్కార మాడ్యూల్, స్థానిక అధికారులకు వ్రాతపూర్వక దరఖాస్తులు, టెలిఫోన్ హెల్ప్‌లైన్, గ్రామ పంచాయతీ ఫిర్యాదుల రిజిస్టర్; జాతీయ ఫిర్యాదుల పోర్టల్ సీపీజీఆర్ఏఎంఎస్ వంటి బహుళ మార్గాల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని మంత్రి సూచించారు.
డిజిటల్ వ్యవస్థల కారణంగా విస్తృతంగా మినహాయింపు లభిస్తుందనే ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ, జియో-ట్యాగ్ చేయబడిన హాజరును రియల్ టైమ్‌లో నమోదు చేసే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్) లేదా ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్(ఏపీబీఎస్) జాబ్ కార్డులను తొలగించడానికి ఆధారాలు కావని ప్రభుత్వం పేర్కొన్నది. 2023 జనవరి నుంచి చాలా కార్యాలయాల్లో ఎన్ఎంఎంఎస్ తప్పనిసరి కాగా, 2024 జనవరి 1 నుంచి ఏపీబీఎస్ ఆధారిత వేతన చెల్లింపులు తప్పనిసరి చేయబడింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
