
41 కామన్వెల్త్ దేశాలు పరువునష్ఠాన్ని నేరంగా భావించి జరినామాలు విధిస్తున్నాయి. దేశద్రోహానికి సంబంధించిన చట్టాలను 48 దేశాలు అమలు చేయగా, మరో 37 దేశాలలో దైవదూషణ లాంటి చట్టాలున్నాయి.
న్యూఢీల్లీ: కామన్వెల్త్ మానవ హక్కుల చొరవ(సీహెచ్ఆర్ఐ), కామన్వెల్త్ పాత్రికేయుల సంఘం(సీజేఏ), కామన్వెల్త్ న్యాయవాదుల సంఘం పత్రికా స్వేచ్ఛ– మానవహక్కులపై పరిశోధనలు జరిపాయి. ఇందులో వెల్లడైన విషయాలను 2025 సెప్టెంబరు 9న నివేదికగా ప్రచురించాయి. ఈ నివేదిక ప్రకారం, 56 కామన్వెల్త్ సభ్యదేశాలలో జాతీయ చట్టాలే పత్రికా స్వేచ్ఛకు తీవ్రంగా విఘాతం కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కూడా నియంత్రిస్తున్నాయి.
నివేదిక ప్రకారం, 19 కామన్వెల్త్ దేశాలలో 2006 నుంచి 2023 మధ్యకాలంలో 213 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. ఇందులో 96% కేసులలో బాధితులకు న్యాయం దొరకలేదు. మరో 41 దేశాలలో పరువునష్టాన్ని నేరంగా భావిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. 48 దేశాలు దేశద్రోహం చట్టాలను కొనసాగిస్తుండగా, మరో 37 దేశాల్లో దైవదూషణలాంటి చట్టాలున్నాయి.
“గడచిన 20 సంవత్సరాలలో సుమారు 200 మంది జర్నలిస్టులు హత్యకు గురైయ్యారు. ఈ హత్యలకు బాధ్యులైన వారిని విచారించి, శిక్షించడంలో కామన్వెల్త్ దేశాలు పూర్తిగా విఫలమవడం సిగ్గుచేటు. శిక్ష నుంచి మినహాయించే సంస్కృతిని పూర్తిగా అంతం చేయాలి. వాస్తవాలు, నిజాలు చెప్పేవారిని, బెదిరింపుదారులు, ప్రతీకారుల నుంచి చిత్తశుద్ధితో, మంచి ఉద్దేశంతో కామన్వెల్త్ రక్షించినప్పుడే దానికి మంచి పేరు వస్తుంది. వాస్తవం, నిజం, సత్యమనే భావనపై భీకరదాడి జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇలా చేయడం ఉత్తమం” అని కామన్వెల్త్ జర్నలిస్టు అసోసియేషన్‌కు చెందిన విలియం హార్స్లీ అన్నారు.
“కథనాలను ఎవరు నియంత్రిస్తున్నారు? కామన్వెల్త్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై చట్టపరమైన ఆంక్షలు” అనే శీర్షికతో ఈ నివేదిక ప్రచురించబడింది. భావవ్యక్తీకరణను నేరంగా పరిగణించే చట్టాలతో పాటు పరువునష్టం, దేశద్రోహంతో సహా జాతీయభద్రతా చట్టాలను ఏకపక్షంగా అమలు చేస్తున్నారు. దీంతొ జర్నలిస్టులు, మానవ హక్కుల పరిరక్షకులు, ప్రభుత్వ విమర్శకులను భయభ్రాంతులకు గురిచేస్తూ, వారి నోరు మూయించడం జరుగుతుందని నివేదిక పేర్కొంది.
నేషనల్ లీగల్ ఫ్రేంవర్క్‌పై జరిపిన విశ్లేషణ ఆధారంగా- ఆఫ్రికా, ఆసియా, అమెరికా, కరేబియన్, ఐరోపా, పసిఫిక్ ప్రాంతాల నుంచి 30 మంది సీనియర్ జర్నలిస్టులు, 35 మంది న్యాయవాదుల సాక్ష్యాలను క్రోడీకరించి నివేదికను రూపొందించారు.
కొన్ని కామన్వెల్త్ సభ్య దేశాలలో గతంలో నిర్లక్ష్యం, ఇతర కారణాల వల్ల చర్యలు తీసుకోలేదు. దీని పర్యవసానంగా, ప్రస్తుతం భావవ్యక్తీకరణ పరిరక్షణ చట్టం అమలు విషయంలో నిరంతరంగా తీవ్ర సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదిక తెలియజేస్తూ ముగించింది.
“చాలా కామన్వెల్త్ దేశాలు నేటికీ వలసవాద యుగంనాటి చట్టాలనే అమలు చేస్తున్నాయి”
కామన్వెల్త్ గుర్తింపు పొందిన మూడు సంస్థలు నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నాయి. భావవ్యక్తీకరణ నియంత్రణ చట్టాలను త్వరితగతిన రద్దు చేయాలని అన్ని సభ్యదేశాలకు ఈ సంస్థలు పిలుపునిచ్చాయి. హింస, భయబ్రాంతులకు గురి చేసే వారి నుంచి మీడియా సిబ్బందిని, ప్రజాపర్యవేక్షకులుగా వ్యవహరించే వారికి రక్షణ కల్పించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరాయి.
“చాలా కామన్వెల్త్ దేశాలు మాట్లాడితే, లేదా నిశ్శబ్ద అభిప్రాయభేదాలపై నేటికి వలసవాద యుగం చట్టాలను అమలు చేస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. సమోవాలో ప్రభుత్వాధినేతలు ఆమోదించిన మీడియా సూత్రాలు, చట్ట సవరణలు, సంస్థల భద్రత ద్వారా భావప్రకటన స్వేచ్ఛ కోసం జాతీయచట్టాలను అంతర్జాతీయ చట్టాలతో జోడించాయి. అంతేకాకుండా, పటిష్టమైన చర్యలు సభ్యదేశాలు తీసుకోవడానికి ఈ సూత్రాలు సమయానుకూల అవకాశాన్ని కల్పించాయని” కామన్వెల్త్ మానవ హక్కుల చొరవ డైరెక్టర్ స్నేహ అరోరా అన్నారు.
మీడియా, పౌరసమాజంపై పద్ధతి ప్రకారం పెంచుతున్న ఒత్తిడి విషయంలో కామన్వెల్త్ మంత్రివర్గ చర్య సమూహం(సీఎంఏజీ) ఇచ్చిన హామీని అమలు చేయాలని నివేదిక డిమాండ్ చేసింది.
2024 అక్టోబరులో సమోవాలో భావప్రకటన స్వేచ్ఛ, మంచి పరిపాలనలో మీడియా పాత్రపై శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కామన్వెల్త్ నాయకులు ఆమోదించిన చారిత్రాత్మక మార్గదర్శక సూత్రాలు గొప్ప అవకాశానికి మార్గాన్ని సుగమం చేశాయి.
ఈ సూత్రాల ప్రకారం, కామన్వెల్త్ అనుబంధంగా ఉన్న అట్టడుగు స్ధాయి ప్రతినిధుల నేతృత్వంలో ఎనిమిది సంవత్సరాల పాటు సంప్రదింపులు, అనుకూల ప్రచార కార్యక్రమాలను చేపట్టారు.
సమోవాలోని ప్రభుత్వాధినేతలు ఆమోదించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, సుపరిపాలనలో మీడియా పాత్రపై 11-పాయింట్ల కామన్వెల్త్ సూత్రాలను పాటించేలా చూసుకోవడానికి ప్రభుత్వేతర సంస్థలతో కలిసి సచివాలయం, సభ్య దేశాలు దృఢంగా వ్యవహరించాలని నివేదిక కోరింది.
మీడియా సిబ్బందికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని, ఆన్లైన్- ఆఫ్‌లైన్‌లో స్వేచ్ఛగా మాట్లాడే హాక్కును నిరోదించే శక్తులకు వ్యతిరేకంగా దేశీయ చట్టాలను సమీక్షించి సవరించే అంశాన్నిపరిశీలించాలని తెలియజేశాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.