
ఝార్ఖండ్ దేవ్‌ఘర్ జిల్లాలోని జమునియా అటవీ ప్రాంత సమీపంలో మంగళవారం(జూలై 29) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ఒక ట్రక్‌ను భక్తులతో నిండిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కొందరు భక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు.
న్యూఢిలీ: ఝార్ఖండ్ దేవ్‌ఘర్ జిల్లాలో మంగళవారం(జూలై 29) వేకువజామున హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో కొందరు భక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్ భక్తులతో నిండిన బస్సును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
దేవ్‌ఘర్ డిప్యూటీ కమీషనర్ ప్రకారం, ఈ విషాదంలో ఇప్పటి వరకు ఆరుగురు భక్తులు మృతి చెందినట్టుగా నిర్ధారించారు. ఈ ఘటన మోహన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంత సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన 32 సీట్ల బస్సు భక్తులను తీసుకెళ్తుంది.
ఎక్స్ వేదికగా డిప్యూటీ కమిషనర్ నమన్ ప్రియేష్ లాక్రా స్పందించారు. “మంగళవారం ఉదయం దాదాపు 5:30 గంటలకు మోహన్పూర్ తాలుకాలోని జమునియా వద్ద ఒక బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో గాయపడిన భక్తులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఇంకా 24మంది భక్తులు గాయాలపాలైయ్యారు. అందులో ఎనిమిది మంది భక్తులకు ఏమ్స్లో, మిగితావారికి సమీప ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది”అని పేర్కొన్నారు.
అయితే మరోవైపు, ఈ ఘటనలో దాదాపు 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టుగా దేవ్‌ఘర్ ఎంపీ నిశికాంత్ దూబే తెలియజేశారు.
ఆయన ఎక్స్ వేదికగా “శ్రావణమాసంలో కన్వర్ యాత్ర సందర్భంగా వెళ్తున్న బస్సు, గ్యాస్ సిలిండర్ల ట్రక్ ఢీకొట్టుకోవడంతో 18 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటన నా లోక్‌సభ ప్రాంతం దేవ్‌ఘర్‌లో చోటుచేసుకుంది. ఈ విషాదకర ఘటన నుంచి మృతుల కుటుంబాలు కోలుకునే శక్తిని బాబా వైద్యనాథ్ అందించాల”ని అన్నారు.
సబ్ డివిజనల్ ఆఫీసర్(ఎస్డీఓ) రవికుమార్ ప్రకారం, బస్సు డ్రైవర్ తన నియంత్రణను కోల్పోయాడు. దీంతో తన ముందు వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టాడు. “ఢీకొట్టిన తర్వాత కూడా బస్సు దాదాపు 100 నుంచి 200 ఫీట్లు ముందుకు వెళ్లింది. చివరికి మరోసారి ఇటుకల కుప్పను ఢీకొట్టింది”అని ఆయన తెలియజేశారు.
ఎస్డీఓ రవికుమార్ ప్రకారం, ప్రమాద సమయంలో కన్వర్ యాత్ర భక్తులు బసుకీనాథ్ గుడికి వెళ్తున్నారు.
దీనికంటే ముందు, పీటీఐతో మాట్లాడుతూ దుమ్కా జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ) శైలేంద్ర కుమార్ సిన్హా తెలియజేశారుగా, ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్టుగా నిర్దారించబడింది. మిగితావారు గాయాలపాలై విషమపరిస్థితిలో ఉన్నారు. “గాయాలపాలైన వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంద”ని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటన మీద ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. “ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైనది. ఇందులో ప్రాణాలను కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ బాధను తట్టుకునేలా దేవుడు వారికి శక్తినివ్వాలి. దీంతో పాటు గాయాలపాలైన వారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని ప్రార్థిస్తున్నాను”
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.