
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో సాయుధ ఘర్షణ తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 3న 16 ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాయి.
డిప్లమాటిక్ అవుట్ రీచ్‌లో భాగంగా వివిధ దేశాలలో పర్యటిస్తున్న భారతీయ పార్లమెంటరీ సభ్యులు తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు ఈ లేఖను రాశాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం ప్రధాన పార్టీలు ఒకే తాటిపై ముందుకు రాగా, ఆమ్ఆద్మీ పార్టీ మాత్రం స్వతంత్రంగా లేఖ రాయాలని నిర్ణయించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ దీనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నది.
ప్రతిపక్షాలు రాసిన లేఖలో ఏముంది?
ఉగ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ సైనిక సంఘర్షణ, పూంచ్, యూరి, రాజౌరి సెక్టార్లలో జరిగిన దాడుల్లో సాధారణ ప్రజల మరణం వంటి అనేక తీవ్ర ప్రభావం కలిగిన ప్రశ్నలను ప్రతిపక్షాలు ఈ లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. వీటితోపాటు కాల్పుల విరమణ, భారత విదేశీ విధానం, దేశభద్రతలపై తాజా పరిణామాల ప్రభావం గురించి కూడా పార్లమెంట్ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని 16 ప్రతిపక్ష పార్టీలు ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారతదేశం ఎంచుకున్న విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా నిలిచిన విషయాన్ని ఈ లేఖలో గుర్తు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలకు మీడియాకు ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ, పార్లమెంటుకు వివరించేందుకు సిద్ధం కాకపోవటాన్ని ఈ లేఖలో ప్రశ్నించాయి.
ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంయుక్త కార్యచరణకు సిద్ధమవుతున్నాయని ది వైర్ గతవారం రాసిన వార్తల్లో ప్రస్తావించింది. ఉభయసభలోని ప్రతిపక్ష నేతలు ముందుగా ఈ విషయాన్ని డిమాండ్ చేస్తూ లేఖ రాసిన తర్వాత, ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలను- ఇండియా కూటమి భాగస్వాములను కలుపుకొని సమన్వయంతో వ్యవహరించాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
“అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య ఠాక్రేలను రాహుల్ గాంధీ సంప్రదించారు. ఇతర పార్టీలోని ముఖ్య నేతలను కేసీ వేణుగోపాల్ సంప్రదించగా, లోక్‌సభ కాంగ్రెస్ చీఫ్ విప్‌లు కే సురేష్, మణికం ఠాగూర్‌లు ఇతర పార్టీ నేతలతో సంప్రదించారు” అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, శివసేన(యూబిటీ) పార్టీల ఎంపీల సమావేశం అనంతరం ఈ ఉమ్మడి లేఖ పంపాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ ఉమ్మడి లేఖపైన సంతకాలు చేసిన పార్టీలలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, శివసేన యూబీటీ, ఆర్జేడీ నేషనల్ కాన్ఫరెన్స్, కమిషనర్ ఆఫ్ ఇండియా(మార్క్సిస్టు), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చ, విడుతలై చిరుతైగల్ కచ్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, సీపీఐ(మావోయిస్టు- లెనినిస్ట్) పార్టీలు ఉన్నాయి.
“16 పార్టీలు ప్రధానమంత్రికి రాసిన లేఖలో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాయి. ప్రధానంగా యూరిజ్ పూంచ్, రాజౌరి ప్రాంతాలలో జరిగిన ధన, ప్రాణ నష్టం లాంటి కీలకమైన ప్రజా ఉపయోగ విషయాలలో చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగాలని ప్రతిపక్షాలు కోరాయి” అని రాజ్యసభలో తృణమూల్ పార్టీ నేత డెరెక్ ఓబ్రియన్ తెలిపారు.
“ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారిగా ఉండాలి. పార్లమెంటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అందుకే పార్లమెంట్ సమావేశం జరపాలని డిమాండ్ చేస్తున్నాము” అన్నారు. ఇదే విషయంపై ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యేక లేఖ రాసిందని కూడా డెరెక్ ఓబ్రియన్ తెలిపారు.
ఏడు పార్లమెంటరీ బృందాలతో 33 దేశాలలో ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ప్రభుత్వంపై పహల్గాం దాడి అనంతర పరిణామాల గురించి పార్లమెంటుకు వివరించాల్సిన బాధ్యత కూడా ఉన్నదని ఓబ్రియన్ అన్నారు.
“పహల్గాం దాడికి ప్రతిస్పందనగా చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణపై అమెరికా ప్రకటన, అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం వంటి అంశాలపై ప్రభుత్వం తమ వైఖరిని ప్రకటించాల”ని కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా అన్నారు.
ఇరుదేశాలను అణుయుద్ధం ప్రమాదం నుంచి కాపాడామని, దానికోసం వాణిజ్యాన్ని కారణంగా చూపించమని అమెరికా అధ్యక్షుడు పదేపదే చెప్పుకుంటున్న సందర్భంలో ఈ విషయాలపై వాస్తవ అవాస్తవలేమిటో ప్రభుత్వం పార్లమెంటు వేదికగా దేశానికి వివరించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం అభిప్రాయపడుతున్నాయి.
“ఏం జరిగిందో, భారతదేశం ఏం చేసిందో అనే విషయంపై దేశప్రజలందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మీరేమో ప్రపంచం అంతా ప్రచారం చేసి చెప్తున్నారు. దేశంలో మాత్రం ప్రజలని, పార్లమెంట్‌ని చీకట్లో ఉంచుతున్నారు. మీ ప్రయత్నంలో మన దేశాన్ని సమర్ధించిన దేశాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏ ఒక్క దేశం బహిరంగంగా భారతదేశపు చర్యలను సమర్థించలేదు. ఇది ఆందోళనకర విషయం” అని రాంగోపాల్ వర్మ అభిప్రాయ పడ్డారు.
“దౌత్యరంగంలో మన దేశం పూర్తిగా విఫలమైంది. తమ కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించిన భారతీయ సేనకు అభినందనలు. దౌత్య రంగం విషయానికి వస్తే ప్రధానమంత్రి పదేళ్ళకు పైగా ప్రపంచమంతా చుట్టి వచ్చారు. ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని కంటే ముందే కాల్పులు విరమణ ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటున్న మన దేశానికి ఇది ఆందోళనకరమైన పరిణామం. సైనిక చర్యలు నిలిపివేయాల్సిందిగా మనల్ని బలవంతం చేసినట్లు కనిపిస్తుంది.ఈ విషయంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ ప్రకటనతో భారతదేశ పరువు పోయింది. ఈ విషయాన్ని తప్పనిసరిగా చర్చించాలి.” అని వర్మ చెప్పారు.
ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ “తానే కాల్పులు విరమణకు రెండు దేశాలను ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 15 రోజుల్లో 13 సార్లు ప్రకటించారు. ఇది భారతదేశపు ఆత్మగౌరవాన్ని గాయపర్చింది. ఈ విషయంపై దేశానికి ఎవరు సందేశం ఇవ్వాలి? పార్లమెంట్. ఈ విషయంపై పార్లమెంట్ సమావేశం జరిపితే మేమంతా ఒక మాట మీద ఉంటాము” అన్నారు.
బ్లూమ్ బర్గ్ టీవీకి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి దశలో భారత్ నష్టపోయిందని చెప్పారు. ఎంత నష్టం జరిగిందన్నది ముఖ్యం కాదని కూడా ఆయన అన్నారు.
“ఎన్ని యుద్ధ విమానాలు కూలాయని ప్రశ్నించడం లేదు. కానీ ఈ విషయం ఎక్కడ చర్చించాలి? పార్లమెంట్లో. ఇది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ఉన్న సంబంధం. ఇది జవాబుదారీతనానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం పార్లమెంటుకు, పార్లమెంటు దేశానికి జవాబుదారీగా ఉండాలి” అని ఝా స్పష్టం చేశారు.
పహల్గాం దాడి నేపథ్యంలో జరిగిన ప్రమాదాల గురించి చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపాలని ప్రతిపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అనేక లేఖలు రాశారు. అందులో భాగంగా సోమవారం మనోజ్ ఝా ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు. ఈ విషయాల గురించి ప్రధాన ప్రతిపక్ష నేతలు రాసిన లేఖలతో సహా ఇప్పటి వరకు నాలుగు లేఖలు ప్రధానికి చేరాయి. అయితే ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు.
“ట్రంప్ కోరిక మేరకు కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు పదేపదే విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా పార్లమెంట్ సమావేశం ఎందుకు జరపడం లేదు? పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపాలని ట్రంప్‌ను కోరాలా? భారత ప్రధానినే డిమాండ్ చేస్తాం” అని శివసేన యుబీటీ నేత సంజయ్ రావత్ అన్నారు.
ఉమ్మడి లేఖలో భాగస్వామ్యం కానీ ఆమ్‌ఆద్మి పార్టీ, ఎన్సీపీ..
ఇది ఇలా ఉండగా ఇండియా కూటమిలో ఇద్దరు కీలకమైన భాగస్వాములు ఆప్, ఎన్సీపీలు ఈ లేఖపై సంతకాలు చేయలేదు. ఆమ్ఆద్మీ పార్టీ ఇదే డిమాండ్‌ను ప్రస్థావిస్తూ ప్రత్యేకంగా లేఖ రాస్తుందని భావిస్తుండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల డిమాండ్‌ను ఎన్సీపీ అధినేత సమర్ధించలేదు.
ఏ పార్లమెంట్ సమావేశాల్లోనైనా పాలక పార్టీ ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వదని దుందుడుగుగా వ్యవహరిస్తుందని, అటువంటప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ద్వారా సాధించేదేమంటుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా వైర్‌కు తెలిసింది. ఆపరేషన్ సిందూర్ పరిణామాలపై ఇప్పటికే బహిరంగంగా అనేక ప్రశ్నలు లేవనెత్తినందున ప్రత్యేక సమావేశాలు అవసరం లేదని ఎన్సీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మంగళవారం నాడు జరిగిన ప్రతిపక్ష పార్టీ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన సంజయ్ రావత్ ఎన్సీపీ పార్లమెంటరీ నేత సుప్రియ సూలె దౌత్య పర్యటన భాగంగా విదేశాల్లో ఉన్నారని, శరత్ పవర్ ముంబై వచ్చినప్పుడు ఈ విషయాన్ని చర్చిస్తామని తెలిపారు. అయితే, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు డిమాండ్‌పై శరద్ పవార్ తన వైఖరిని ఎప్పుడో స్పష్టం చేశారని ఎన్సీపీ అంటుంది. “ఇటువంటి సున్నితమైన విషయాలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అనే డిమాండ్‌ను తాము సమర్ధించడం లేదని ఎన్సీపీ అధినేత ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కంటే అఖిలపక్ష సమావేశం జరిపి అన్ని విషయాలు చర్చించాలని ఎన్సీపీ నేత శరద్ పవార్ అభిప్రాయ పడ్డారు” అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.