చట్టాన్ని అపహస్యం చేస్తూ జోరుగా సాగుతోన్న అక్రమ మద్య వ్యాపారం ప్రజల జీవితాలను, వారి అరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుందని మద్యం వ్యాపార ఆర్థిక విధివిధానాలపై మేవాని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ బీజేపీ నాయకులకు, పోలీసు అధికారులకు వారి కుటుంబీకులకు, ఇంకా మద్యం వ్యాపారులకు ఈ మాటలు మింగుడుపడడం లేదు.
గుజరాత్లో దశాబ్దాల నుంచి మద్యంపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందనేది బహిరంగ రహస్యం. థారాడ్లోని ఒక పాఠశాల సమీపంలో మద్యం, డ్రగ్స్‌ను కనుగొన్నట్టు సమాచారం తెలిస్తే పోలీసు అధికారులు తమ ఉద్యోగాలను కోల్పోతారని కాంగ్రెస్ నేత, వడ్గాం శాసనసభ్యులు జిగ్నేష్ మేవాని అనడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది.
కొన్ని మినహాయింపులతో గుజరాత్లో మద్యాన్ని నిషేధించినప్పటికీ గుజరాత్ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ పోలీసుల వెనుకుండి నడిపిస్తున్నారని మేవాని పరోక్షంగా పేర్కొన్నారు.
ఈ ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు తమ మాటలతో ఒకరిపై ఒకరు పేలుడు గుండ్లను విసురుకుంటున్నారు. అయిననప్పటికీ, గుజరాత్లో మద్య నిషేధం అమలులో ఉన్న అలసత్వ రికార్డును ఇక విస్మరించలేము.
గుజరాత్లో అక్రమ మద్యం అమ్మకాలపై సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో; మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. చట్టాన్ని, వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకొని, నాయకుల అండదండలతో తమ పనులను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు.
మద్య నిషేధం అమలు కోసం ప్రజలు ఎంతలా పోరాడుతున్నప్పటికీ; అధికారుల లాభాలు ఈ చీకటి పరిశ్రమ అభివృద్ధికి కారణమవుతున్నాయి.
క్షేత్రస్థాయి వాస్తవం..
గుజరాత్లో 1948 నుంచి మద్యంపై నిషేధం ఉంది. కానీ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ధనికులు లేదా పేదలు, “అగ్రవర్ణాలు” లేదా ఇతరులు అని తేడా లేకుండా అందరికి మద్యం అందుబాటులో ఉంది. అక్రమ మార్గంలో మద్యం వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఒకవేళ స్థానిక పోలీసుల దృష్టికి ఈ దందా వస్తే అప్పుడప్పుడు “కోత” విధిస్తున్నారు.
అప్పుడప్పుడు, చిన్న మోతాదయినా అత్యంత ప్రమాదకరమైన మిథనాల్‌ను కలిపి తయారు చేసిన మద్యాన్ని విక్రయిస్తున్నారు. చిన్న మోతాదులో మిథనాల్ కలిపిన ఇది చాలా ప్రమాదం. ఈ నేపథ్యంలోనే మద్యంలో మిథనాల్ కలపడం వల్ల కల్తీ సారా మరణాలు సంభవిస్తున్నాయి.
రూ 1,500 కోట్ల విలువ చేసే మద్యం పరిశ్రమ గుజరాత్లో ఉందని ఒక మీడియా సంస్థకు మేవాని చెప్పారు. “రాష్ట్రంలో అక్రమ మద్య వ్యాపారంతో స్థానిక నాయకుల నుంచి కానిస్టేబుల్ వరకు, గాంధీనగర్‌లో అధికారంలో ఉన్న వారితో సహా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన సంబంధం ఉంది. ఇందులో భాగస్వాములైన వారు లాభం పొందుతున్నారు. కల్తీ మద్యం, సారా తాగడం వల్ల ప్రతిసారి పేదలే బాధితులౌతున్నారు”అని తెలియజేశారు.
చీకటి వ్యాపారం..
అత్యధిక అక్రమ మద్యం కేసులు గుజరాత్‌లోని గాంధీ ఆశ్రమానికి నిలయమైన అహ్మదాబాద్‌లో నమోదయ్యాయనేది విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. 2024 సంవత్సరం మొదటి ఆరు నెలలలో నాలుగు కమీషనరేట్ల పరిధిలో 35 “నిషేధ కేసులను” రాష్ట్ర పర్యవేక్షణ విభాగం నమోదు చేసింది. ఇందులో అహ్మదాబాద్‌లో 17, సూరత్‌లో 13, వడోధరాలో 5, రాజ్‌కోట్‌లో 1 కేసుతో మొత్తం 36 కేసులు నమోదైయ్యాయి.
2023లో, మొత్తం 83 మద్యం కేసులలో 37 కేసులతో అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.
గడిచిన ఏడాది 2024 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్ర పర్యవేక్షణ మండలి 224 దాడులు నిర్వహించగా; 180 దాడులు విజయవంతమయ్యాయి. ఈ దాడుల్లో రూ 11.5 కోట్ల విలువ చేసే మద్యం రూ 26 కోట్లు విలువ చేసే అక్రమ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.
మినహాయింపులు..
గుజరాత్లో “వైద్య అవసరాల” కోసమే మద్యాన్ని అనుమతిస్తారని అధికారికంగా చెప్పబడుతుంది. ఇంత వరకు ఇలాంటివి 50,000 పర్మిట్లను జారి చేశారు. 2018 వరకు పర్మిట్ల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదు, సులభంగా దొరికేవి. ఇప్పుడు ప్రైవేటు వైద్యుల సర్టిఫికెట్‌ను ఎంతమాత్రం అంగీకరిచడం లేదు. పైగా ప్రాసెసింగ్ రుసుమును రెండింతలు చేసి రూ 2000లకు పెంచారు.
నిబంధనలను తూచా తప్పకుండా పాటించినట్లయితే కొన్ని హోటళ్ళు మద్యాన్ని విక్రయించవచ్చు. అవి త్రీస్టార్ ఆపై ఉండాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల పరిధిలో ఈ హోటళ్ళు ఉండకూడదు. అంతేకాకుండా, రాష్ట్ర పర్యాటక శాఖలో ఆయా హోటళ్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు, పర్మిట్దారులకు మాత్రమే మద్యాన్ని అందించాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం చట్టాలను సవరిస్తుంది. ఆన్లైన్ పర్మిట్ల సౌకర్యాన్ని కూడా కల్పించింది. పర్మిట్లు లేనివారికి బూట్లెగర్లు ప్రత్యామ్నాయ మార్గం. కొంతమంది ఇంటివద్దకే తెచ్చిచ్చే సేవలను కూడా కల్పిస్తున్నారు.
గుజరాత్ మద్య నిషేధ 1949 చట్టాన్ని సవాల్ చేస్తూ ధాఖలైన పిటిషన్లను హైకోర్టు సమీక్షిస్తుంది. సమానత్వం, గోప్యత హక్కులతో పాటు ఈ చట్టం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని పిటీషనర్లు వాదిస్తున్నారు.
పోలీసు కుటుంబాల నిరసన..
ఇదిలా ఉండగా మేవాని వ్యాఖ్యాలు వడ్గాం, థారాడ్లో పోలీసు అధికారుల కుటుంబాల నిరసనలకు దారితీశాయి. చట్టాన్ని అమలుపర్చేవారు, రాజకీయ నాయకులు, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే చీకటి మద్యం వ్యాపారం వల్ల ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న వారి మధ్య ఘర్షణ ప్రత్యేకంగా కనిపించింది.
అయితే, మద్యానికి సంబంధించి కీలక అంశాన్ని మేవాని లేవనెత్తారు. కానీ ఆయన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని థారాడ్ వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షులు ప్రకాశ్భాయి సోని అన్నారు.
“మద్యం, మత్తు పదార్ధాల అంశం గురించి జిగ్నేష్ మేవాని మాట్లాడింది వాస్తవమే. అవి అక్కడ ఉండకూడదని మేము కూడా అంగీకరిస్తాము. అయితే సీనియర్ పోలీసు అధికారుల పట్ల అయన మట్లాడిన తీరు ఎంత మాత్రం అంగీకారం కాదు. వావ్- థారాడ్ ఒక కొత్త జిల్లా- పోలీసులతో సహా ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేసి ప్రజల నుంచి సలహాలు సూచనలను తీసుకుంటున్నాము. సామాజికమాధ్యమంలో తనకు తాను చురుకుగా ఉండటానికి మేవాని ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారు. వారు(జిల్లా పోలీసు అధికారులు) కొత్తవారు; పోలీసులను కాదు మమ్మలను కించపర్చారు. మేము పోలీసు పక్షాన ఉంటూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించాము”అని ఒక జాతీయ దిన పత్రికకు ఆయన తెలియజేశారు.
అదనంగా “గుజరాత్ డీజీపీ వికాస్ సహాయ్ పోలీసు సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. అధికారులు తమ విధులలో నిర్లక్ష్యం వహించినట్లయితే పాలనాపరమైన చర్యలు తీసుకుంటాము. బయటి వ్యక్తులు చేసే ఆరోపణలను “సహించాల్సిన” అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బందికి ఈ సందేశాన్ని పంపించే హక్కు మీకు ఉంది. కానీ రాష్ట్రంలో పోలీసుదళానికి నాయకుడిగా 33 జిల్లాల్లో సీనియర్ అధికారులు మద్యం, మైనింగ్, పేకాట భూదందాలు, డ్రగ్స్ వంటి విచ్చలవిడి వ్యాపారాల ద్వారా సంపాదిస్తున్న విషయాన్ని తెలుసుకోవల్సిన బాధ్యతను విస్మరించకండి. గుజరాత్లో మద్యం, డ్రగ్స్ వ్యాపారాన్ని ఆపివేయాలి” అని వీడియో సందేశంలో మేవాని తెలియజేశారు.
ఏదిఏమైనప్పటికీ, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని బనాస్కాంత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గులాబ్ సింగ్ రాజ్‌పుత్ మేవానికి మద్దతు తెలుపుతూ ఆరోపించారు. మద్యం, మత్తు పదార్ధాల వ్యాపారంతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్‌కు డిమాండ్ చేశారు.
“సంస్కార సున్నితత్వం గురించి తెలియని చాలా మంది ఉన్నత విద్యావంతులు వారెవరైతే ఉన్నారో; వారు మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు; మీ బెల్టులను తీసేసుకొనే, మీ ఉద్యోగాలను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది” అని పోలీసులకు హోంమంత్రి హెచ్చరించారు.
మంత్రి కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నారని, తన విద్యార్హతలపై మేవాని చేసిన దాడి నేపథ్యంలో సంఘ్వీ ఈ విధంగా స్పందించారు.
మాటల యుద్ధం, ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. త్వరలోనే ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. పట్టులేని కఠిన మద్యం చట్టాలను కొనసాగించినంత వరకు గుజరాత్ క్షేత్రస్థాయిలో అసమానతల వాస్తవాలు పెరుగుతూనే ఉంటాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
ఈ కథనం ముందుగా వైబ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
