ఆరెస్సెస్ వందేళ్ల ఉత్సవాలను జరుపుకోబోతోంది. సంఘపరివారంలో తనదైన విలక్షణ స్థానాన్ని పొందాలని ఈ ఉత్సావాల సందర్భంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే క్రమంలో ఆరెస్సెస్ గత చరిత్రను కూడా అర్థవంతంగా చూపించాలన్న ప్రయత్నం ఇందులో ఇమిడి ఉంది. ఈ లక్ష్యాలు నెరవేరనంతవరకూ ఆరెస్సెస్ సంఘపరివారంలో రెండో శ్రేణి సంస్థగానే మిగిలిపోతుంది.
ఆరెస్సెస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఏడాదిపాటు ఘనంగా ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ కాలంలో గతానికి సంబంధించిన మరకలు తుడిపేసుకోగలిగింది. తన లక్ష్యం గురించి బహిరంగంగా, తన చరిత్ర గురించి తాను స్పష్టంగా జనం దగ్గరికి రాగలిగింది. ఈ పరిస్థితుల్లో ఈ సంస్థకు కొత్త ఉత్సాహం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న మితవాద రాజకీయ వాతావరణం కూడా ఆరెస్సెస్‌లో కొత్త ఆశలు నింపటానికి అక్కరకొస్తోంది.

చాలాకాలం పాటు ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్పథం కేవలం దానికే పరిమితం అయ్యింది. ప్రస్తుతం ఇదే ప్రాపంచిక దృక్పథం సరైందన్న అభిప్రాయాన్ని వ్యాపింపచేయగలిగింది. నానాటికీ భారతదేశాన్ని హిందూ- పాకిస్తాన్‌గా మల్చాలని ఆశించే వారి సంఖ్య ఆరెస్సెస్‌లోనూ దాని అనుయాయుల్లోనూ, అభిమానుల్లోనూ మరింతగా పెరిగింది.
ఆరెస్సెస్ వ్యవస్థాపకుడైన కేబీ హెగ్డేవార్ శతజయంతి సందర్భంగా 1988- 89లో ‘మనం హిందువులమని గర్వంగా చెప్పండి’ అన్న నినాదాన్ని ఆరెస్సెస్ ఇవ్వటం ద్వారా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మూడున్నర దశాబ్దాల క్రితమే తెర లేచింది.
రామజన్మభూమి ఉద్యమం నడిపేటప్పుడు, ఈ నినాదం ఇలాంటి అనేక నినాదాలను సంఘపరివారం తెరమీదకు తెచ్చింది. ఇవన్నీ వెరసి ముస్లిం విద్వేషానికి చిహ్నంగా ప్రచారం గావించబడిన బాబ్రీమసీదు కూల్చివేత అనంతర కాలంలో హిందువుల్లోని ఓ సెక్షన్‌కు ఆరెస్సెస్ మీద గురి కుదిరింది.
ఆరెస్సెస్ 67 ఏళ్లు పూర్తిచేసుకునేసరికి అయోధ్యలోని బాబ్రీమసీదు ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం నేలమట్టం చేసే సమయానికి రామమందిర నిర్మాణం అత్యంత జయప్రదమైన ఉద్యమంగా ముందుకొచ్చింది. ఇంతటి జయప్రదమైన ఉద్యమాన్ని రూపొందించి ప్రణాళికాబద్దంగా నిర్మించిన ఘనత మూడో ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్‌గా ఉన్న మధుకర్ దత్తాత్రేయ దేవరస్ అలియాస్ బాలాసాహెబ్ దేవరస్‌కు దక్కుతుంది.
1973 జూన్ నుంచి దాదాపు రెండు దశాబ్దాలపైన మూడునెలలపాటు సర్ సంఘ్‌గా బాధ్యతలు నిర్వహించిన దేవరస్ కేవలం సంఘ్ కార్యాచరణను బహుముఖ మార్గాల్లో, రంగాల్లో, ప్రాంతాల్లో, సామాజికంగా విస్తరించటమేకాక ఆరెస్సెస్, దాని రాజకీయ విభాగమైన బీజేపీలు రాజకీయంగా అంటరాని శక్తులుగా ఉన్న దశ నుంచి కీలకస్థానాన్ని ఆక్రమించుకునే దశకు చేరుకునే వరకూ 1980, 1990లల్లో అనేక ఉద్యమాలకు మార్గదర్శకత్వం అందించారు.
దేవరస్‌కు అత్యంత సన్నిహితులు, విశ్వాసపాత్రుడు అయిన మోరోపత్ పింగ్లే- విశ్వ హిందూపరిషత్ ద్వారా అమలు చేసిన రామమందిర ఉద్యమ సూక్ష్మ ప్రణాళిక దేవరస్ రూపొందించిందే. ఈ ఉద్యమం ద్వారా కేవలం సంఘపరివారం రాజకీయంగా ఆయోదయోగ్యమైన సంస్థగా ఎదగటమే కాక, సంఘపరివారం ఇచ్చే అనేక సామాజిక రాజకీయ పిలుపుల్లో విశాల భాగస్వామ్యం పెరిగింది. భారతదేశంలో హిందువులకే ప్రథమ ప్రాధాన్యతన్న నినాదం సార్వత్రిక నినాదంగా మారింది దేవరస్ సర్‌సంఘ్‌చాలక్‌గా ఉన్న కాలంలోనే.

ఆరెస్సెస్ అప్రతిహతంగా నేడున్న స్థితికి ఎదగటానికి దేవరస్ తనవంతు పాత్ర పోషిస్తే కేశవ్ బలిరాం హెగ్డేవార్, ఆయన తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన మాధవ్ సదాశివ గోల్వాల్కర్లు పోషించిన పాత్ర కూడా తక్కువేమీ కాదు. హెగ్డేవార్, గోల్వాల్కర్లు ఆరెస్సెస్ పునాదులు బలోపేతం చేసి, బహుముఖ శాఖల నిర్మాణం గావించి ఉండకపోతే దేవరస్ చేసిన కృషి అంతా నిష్ఫలమయ్యేది.
ఆశ్చర్యకరంగా హెగ్దేవార్ సర్‌సంఘ్‌చాలక్‌గా ఉన్న పదిహేనేళ్లపాటూ, అంటే 1925 నుంచి 1940 వరకూ స్వయంసేవకులు పెద్దగా చేసింది ఏమీ లేదనిపిస్తుంది. కానీ ఈ కాలంలో హేగ్డేవార్ రూపొందించిన సంఘ్ పని విధానం, పద్ధతులు, ఆచరణ ఆ కాలంలో వలస ప్రభుత్వం కళ్లల్లో పడకుండా సంఘ్ నిర్మాణాన్ని కాపాడాయి. ఇదే జరక్కపోతే ఆరెస్సెస్ నేడున్న విస్తృత నిర్మాణ పునాదిని కలిగి ఉండేది కాదు.
అదేవిధంగా గోల్వాల్కర్ కూడా తన పదవీకాలంలో తొలి పదేళ్లల్లో ఆరెస్సెస్ మూల సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న జాతీయోద్యమంలో పాల్గొనకుండా స్వీయనియంత్రణను ఆర్ఎస్ఎస్ పాటించింది. ఇందులో భాగంగా ఉద్యమాలు, పోరాటాల బాట పట్టలేదు. అయినా అటు ప్రజాందోళనలు, ఇటు వలస ప్రభుత్వ అణచివేత, గాంధీ హత్యా నేపథ్యంలో ఆరెస్సెస్ నేరారోరపణలను ఎదుర్కొంది. అయిన్నప్పటికీ సామాజిక రాజకీయ రంగాలతో పాటు ఎన్నికలపరంగా కూడా సంఘపరివారం తన వాదన వినిపించాల్సిన ఆవశ్యకతను గుర్తించటమే కాక భావసారూప్యత కలిగిన మిగిలినవారితో కూడా గుర్తింపచేశారు.
అందువల్లనే ఆరెస్సెస్ ఒంటరిపోరాటం నడపటానికి బదులుగా భారతీయ జనసంఘ్, ఇతర సంఘపరివారం తెరమమీదకు వచ్చింది. ఇతరుల ఊహకు కూడా అందని కొన్ని రంగాలను ఆరెస్సెస్ తన ప్రాధాన్యతా రంగాలుగా ఎంచుకొన్నది. ఉదాహరణకు ఆదివాసీ ప్రాంతాల్లో పని చేయటానికి వీలైన సంస్థలు నెలకొల్పటం అలాంటి వాటిలో ఒకటి.

దేవరస్ తర్వాత బాధ్యతలు చేపట్టిన రాజేంద్రసింగ్‌ను అందరూ రజ్జు భయ్యా అని పిలిచేవారు. ఆయన కాలం సంఘపరివారానికి పరీక్షాకాలంగా నిలిచింది. బాబ్రీమసీదు కూల్చివేతకు కారణమైన కరుడుకట్టిన హిందుత్వ ఉద్యమానికి పరిమితులు ఉన్నాయని సంఘపరివారం నాయకత్వం గుర్తించిన కాలం అది.
ఈ విషయాన్ని ఆరెస్సెస్ నాయకత్వం గుర్తించినందునే బీజేపీ రాజకీయ సారథ్యం అద్వానీ చేతుల్లో నుంచి వాజ్‌పేయి చేతుల్లోకి మారింది. తొలిసారి 13 రోజులపాటు ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి సంఘ్ కార్యకర్తగా వాజ్‌పేయి నిలిచారు. వాజ్‌పేయి తొలి ప్రభుత్వానికి ఏ ఇతర పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో మధ్యేమార్గమే మహా ప్రస్తానానికి రాజమార్గమని సంఘపరివారం మరింతగా నమ్మటానికి దారితీసింది. ఈ విధంగా సంఘపరివారం మారుమనసు పొందిన తర్వాతనే వాజ్‌పేయి ప్రభుత్వం ఆరేళ్లపాటు అధికారంలో కొనసాగటానికి వీలుకలిగింది.
2004లో ఓటమి తర్వాత పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండాల్సివచ్చింది. 2014లో తిరిగి నరేంద్రమోడీ నాయకత్వంలో అధికారానికి రావడానికి కావల్సిన శక్తిసామర్ధ్యాలను సమకూర్చుకున్నది. దానికి ప్రధాన కారణం మోహన్ భాగవత్. మోహన్ భాగవత్ 2009లో ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆరెస్సెస్ ప్రధాన బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత అద్వానీ వంటి వృద్ధులను పార్టీ నాయకత్వం నుంచి తొలగించటంలో కీలకపాత్ర పోషించారు భాగవత్. కొత్త తరానికి నాయకత్వం పగ్గాలు అందించారు.
చివరకు మోడీ తన పోటీదారులను అందరినీ వెనక్కునెట్టి అధికారికంగా పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పటికి ఒకింత అయిష్టత ఉన్నమాట కూడా వాస్తవం. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం, ఆరెస్సెస్ ఉభయులూ ఉద్దేశ్యపూర్వకంగానే తమ నినాదాలు, విధానాల్లో వినాయక దామోదర సావర్కార్కు అగ్రతాంబూలం ఇచ్చారు.
హిందుత్వకు సూత్రీకరణ చేసినా సావర్కార్ దీర్ఘకాలం ఆరెస్సెస్ పరివారానికి వెలుపటి మనిషిగానే ఉండిపోయారు. కానీ ఒకసారి ఆరెస్సెస్- బీజేపీ నాయకత్వ శ్రేణుల్లో ఆయనకు స్థానం కల్పించటం ద్వారా, ఆయన్ను వీరుడిగా కీర్తించటం ద్వారా సావర్కార్ ఆశయాలకు తాము వారసులమని చెప్పుకునేందుకు కావల్సిన భూమికను సిద్ధం చేసుకుంది సంఘపరివారం. సావర్కార్‌ను తమ ఆదర్శపురుడుగా చెప్పుకోవడం ద్వారా తమకూ స్వాతంత్య్రోద్యమ వారసత్వం ఉందని చెప్పుకునేందుకు ప్రయత్నించాయి బీజేపీ- ఆరెస్సెస్‌లు.
ఎంత చేసినా రామజన్మభూమి ఉద్యమంతో ముడిపడిన నినాదాలను తెరమీదకు తీసుకురాక తప్పలేదు. దీంతో ఆరెస్సెస్ శ్రేణుల్లో అప్పటికే ముస్లింలకు వ్యతిరేకంగా వేళ్లూనుకుపోయిన అపోహలు, మూఢనమ్మకాలూ మరింత ముదిరిపోయాయి. భారతదేశం హిందూ దేశమే తప్ప మరోటి కాదని పునరుద్ఘాటన పుంజుకున్నది. 35 ఏళ్ల తర్వాత హిందువని చెప్పుకునేందుకు గర్వపడండి అన్న నినాదం నూతన దుస్తులు ధరించి ముందుకొచ్చింది.
ఈ రకమైన లోపాయికారీ వ్యవహారశైలి పదకొండేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీ హయాంలోనే జరుగుతోంది. ఈ పదకొండేళ్లల్లో ఆరెస్సెస్‌కు కీలకమైన కార్యక్రమాలు ప్రభుత్వమే రూపొందించి అమలు చేయటం, కీలకమైన ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఆరెస్సెస్ శ్రేణులను కూర్చోబెట్టడం పెరిగింది. ఈ విధంగా పదవులు పొందినవారు గొప్పగా చేసిందేమీ లేదు. తాము లబ్ధి పొందటం, ఆరెస్సెస్ లక్ష్యాలను బ్రహ్మసూత్రాలుగా భావించి ప్రచారం చేయటం తప్ప.
వివాదాస్పద అంశాలుగా చెప్పుకుంటున్న రామజన్మభూమి, ఆరిక్టల్ 370, ఉమ్మడి పౌరస్మృతులను దాటి ముందుకు పోలేదు. కానీ 2014 నుంచీ మోడీ ఏలుబడిలో వివాదాస్పద అంశాల జాబితా చాంతాడంత పెరిగింది. 2019లో ఆమోదించిన చట్టం ద్వారా శరణార్ధులకు మతాధారిత పౌరసత్వం జారీ మొదలు, సీమాంతర ఇస్లామిక్ చొరబాట్లు గురించిన అపోహలు కల్పించే ప్రచారాలు, అంతిమంగా దేశంలో హిందువులను సంఖ్యాపరమైన మైనారిటీలుగా మార్చేందుకు కుట్రలు వంటి వాటి వరకూ, సంఘపరివారానికి ప్రచారోద్యమ ఆయుధాలను ఎన్నిటినో అందించటం ద్వారా మోడీ ప్రభుత్వం వివాదాస్పద అంశాల పరిధి, విస్తృతిని పెంచింది. ఈ ప్రచార ఆందోళనలు ఉన్నత స్థాయి జనాభా సంఘాన్ని నియమించేందుకు దారితీశాయి.
మోడీ ప్రభుత్వం హయంలో ఏది ఏమైనా అనుకున్నది సాధించాల్సిందే అని సంఘపరివార్ శ్రేణుల్లో పెరిగిన దూకుడు మరోవైపున మరికొన్ని ఆందోళనలకు కూడా దారితీసింది. ఆరెస్సెస్ శతజయంతి ఉత్సవాలు మొదలయ్యాయో లేదో పార్టీ(బీజేపీ) పైన ప్రస్తావించిన వివాదాస్పద అంశాలను మళ్లీ తెర మీదకు తేవటంకూడదన్న విషయంలో సంఘ్ నాయకత్వం ఓ అంచనాతో ఉన్నది. పార్టీ, సంఘపరివారం నాయకత్వం మధ్య పెద్దఎత్తున కొనసాగిన వైషమ్యాలు, పరస్పర వ్యతిరేకతల తర్వాత ఎట్టకేలకు ఇరుపక్షాలూ ఐక్యరాగం అందుకున్నాయి. పర్సపర వాక్బాణాలు సంధించుకుంటున్న తరుణంలో ఇరుపక్షాలూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఏమీ చేయకూడదన్నంత వరకూ సంధి కుదుర్చుకున్నాయి.
అటు పార్టీ ఇటు ఆరెస్సెస్ పరస్పరం చెట్టాపట్టాలేసుకుని కనపడుతున్నా ఇరువురి నడుమ పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందన్న వాస్తవాన్ని అటు ఇరు పక్షాలు, 20కిపైగా ఉన్న సంస్థలు, బీజేపీ- సంఘ్ సంబంధాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న వారూ గుర్తించకమానలేదు.
ఉదాహరణకు ఆరెస్సెస్ బీజేపీ సమన్వయానికి సంబంధించినంత వరకూ కీలకమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానీ పార్లమెంటరో బోర్డు సమావేశం కానీ 2024 ఎన్నికల తర్వాత ఒక్కసారిగా జరగలేదు. చివరకు పార్లమెంట్లో బీజేపీ బలం కనీసం 20 శాతం వరకూ ఎందుకు పడిపోయిందనే విషయానికి సంబంధించి సమగ్ర విచారణకు కూడా బీజేపీ నాయకత్వం కూడా చర్యలు మొదలుపెట్టలేదు. 2014 తర్వాత ఈ స్థాయిలో పార్లమెంట్లో బీజేపీ బలం తగ్గటం ఇదే మొదటిసారి.
మరోవైపున పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవటంలో బీజేపీ వైఫల్యం, జేపీ నడ్డాను నేటికీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ ఉండటంతో పార్టీలో కరుడుకట్టిన క్రమశిక్షణను పాటించేవాళ్లు సైతం ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నారు. నిజానికి ప్రధాన స్రవంతి మీడియా మాధ్యమాలపై పాలకపార్టీ, ప్రభుత్వం గుత్తాధిపత్యం బిగుసుకుని ఉండకపోతే ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారి ఉండేది.
2014 తర్వాత ఆరెస్సెస్ అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుందనటంలో సందేహం లేదు. దగద్ధగాయమానంగా మారిన ఢిల్లీలోని ఆరెస్సెస్ కార్యాలయం కేశవ్ కుంజ్‌ను చూస్తేనే ఈ విషయం తెలిసిపోతుంది. సాధారణంగా పొదుపైన జీవనానికి పేరుపొందిన ఆరెస్సెస్ ఇంతటి ఖరీదైన భవనాన్ని సమకూర్చుకోవడం అంటే సంఘ్ తన పని తాను చేయకుండా ఉన్నందుకు దక్కిన ప్రతిఫలమేనన్నది నిస్సందేహం.
దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆరెస్సెస్ వ్యక్తి ఆరాధనకు దూరంగా ఉంది. 1973లో బాలాసాహెబ్ దేవరస్ సర్సంఘ్ చాలక్‌గా బాధ్యతలు తీసుకున్న కొద్దికాలంలోనే హెగ్డేవార్, గోల్వాల్కర్లను తప్ప వేరేవ్వరినీ కీర్తించరాదని ఆదేశాలు జారీ చేశారు. తనతో సహా భవిష్యత్తులో ఏ ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ చనిపోయినా హెగ్డేవార్ స్మృతి మందిర్‌లో దహనం చేయరాదని కూడా ఆదేశించారు. ఇక్కడ ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్, రెండో సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్లను మాత్రమే దహనం చేశారు. హెగ్డేవార్కు నిర్మించిన స్మృతి చిహ్నం కంటే గోల్వ్కార్ స్మృతి చిహ్నం చిన్నదే.
వ్యవస్థ కంటే వ్యక్తి పెద్దవాడు కాకూడదన్న దేవరస్ హితబోధే నేడు మోడీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మోడీ అటు ప్రభుత్వ విధానపరమైన విషయాల్లోనూ, ఇటు పార్టీ ఆంతరంగిక వ్యవహారాల్లోనూ ఆరెస్సెస్‌ను ఎన్నడూ సంప్రదించలేదు.
2013లో మోహన్ భాగవత్ కూడా మోడీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించిన సమయంలో, మోడీకున్న ఈ ఒంటెద్దు పోకడ గురించి ఆరెస్సెస్‌కు అంచనా ఉంది. ఒకసారి ఆ నిర్ణయం అంటూ జరిగిన తర్వాత నాగపూర్ కేంద్రంగా ఉండే పెద్దన్న తన పెద్దన్న పాత్రను పోషించలేకపోయాడు. చివరకు కవలలుగా మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు మోడీ తన పట్ల వ్యక్తి ఆరాధనా భావాన్ని ప్రోత్సహించిన కొన్నేళ్ల తర్వాత కూడా ఈవిషయంలో ఆరెస్సెస్- బీజేపీ నాయకత్వాన్ని మందలించే సామర్ధ్యం కలిగి ఉన్నదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ సంవత్సరం మార్చిలో ప్రధాని ఓ కార్యక్రమానికి హాజరవ్వటం కోసం నాగపూర్ వెళ్లినప్పుడు కానీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో కానీ పైకి చూస్తే ఆరెస్సెస్ సర్ సంఘ్
చాలక్ను, ఆరెస్సెస్నూ గౌరవిస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో తాను ఆరెస్సెస్‌కు రుణపడి ఉంటానని ప్రకటించారు. మరికొన్ని సందర్భాల్లో మోడీ నోట ఆరెస్సెస్ గురించి పొగడ్తల వర్షం కురిసేది. కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ మొత్తం వ్యవస్థలో నిర్ణయం తీసుకునే ఏకైక వ్యక్తి మోడీమాత్రమే అన్నది కాదనలేని వాస్తవం.
మోడీ పదవీ విరమణ అనంతరమైనా ఆరెస్సెస్ మొత్తం సంఘపరివారానికి తిరుగలేని నాయకత్వ స్థానంలో ఉన్నదన్న గౌరవాన్ని తిరిగి పొందుతుందా లేదా అన్నది ప్రశ్న. అసలు మోడీ పదవీ విరమణ ఎప్పుడు అన్న ప్రశ్నకే సమాధానం లేదు. అదే సమయంలో మోడీ నుంచి ఎదురయ్యే సవాలును ముందుగానే గుర్తించిందా అన్నట్టు ఆరెస్సెస్ శ్రేణులకు కూడా ఆధునిక సామాజిక మాధ్యమాల వినియోగం ద్వారా ప్రజలను చేరుకోవడానికి కావల్సిన శిక్షణ ఇచ్చారు. సాధారణంగా ఆరెస్సెస్ శ్రేణులన్నీ బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాయి. 1984, 2004, చివరిగా 2024లో తప్ప. తర్వాత రామజన్మభూమి ఉద్యమం ఆందోళన రూపంలో కానీ బీజేపీ నాయకత్వాన్ని మార్చే విషయంలో కానీ ఆరెస్సెస్ పైచేయి సాధించిన తర్వాత బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య ఉన్న విబేధాలను చాప కిందకు నెట్టేయబడేవి.
ఆరెస్సెస్ శ్రేణులతో జరిగిన పలు సంభాషణల్లో వివిధ అనుబంధ సంస్థలు, సంఘాలు పూర్తి చేయాల్సిన లక్ష్యాలు, నెరవేర్చాల్సిన కర్తవ్యాలు వివరించబడ్డాయి. అటువంటి సంభాషణల్లో ముందుముందు దేశమంతా స్వయం సేవక్ సంఘ్‌గా మారిపోవాలన్నది లక్ష్యమని చెప్తారు. కొత్తగా విన్నవారికి ఇదేదో ఊహల పల్లకిగా కనిపిస్తుంది. ఆ కొత్త ఊహాలోకంలో ప్రజలందరూ సంఘపరివారం సభ్యులైనప్పుడు, ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్ఫథానికి ఎల్లెడలా ఆదరణ వ్యక్తమవుతున్నపుడు, ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్ఫథం సార్వత్రిక దృక్ఫథంగా ఎక్కడిక్కడ ఆవిష్కృతం అవుతున్నపుడు ఓ ప్రత్యేక సంస్థ అంటూ అవసరంలేదు. ఆ సంస్థ సిద్ధాంతాలు ప్రచారం చేయటానికి ఓ నిర్మాణాత్మక పద్దతి కానీ నాయకుడు కానీ అక్కర్లేదు. ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆకర్షణీయమైన ప్రచార వ్యూహాలు అక్కర్లేదు. ఓ ఎన్నికల యంత్రాంగం ఉంటే సరిపోతుంది.
దేశంలో అధికంగా ఉన్న హిందువుల్లో గడిచిన దశాబ్దాల్లో ప్రత్యేకించి 2014 తర్వాత హిందుత్వ సిద్ధాంతం పట్ల ఆదరణ పెరిగింది. కానీ అదే హిందువుల్లో అత్యధికులు ఇదే ఆలోచనా ధోరణితో ఉంటారని చెప్పలేము. కనీసం ఇదే హిందూ సమాజంలో వెలివేతకు గురైన సామాజిక తరగుతులు ఈ సిద్ధాంతాన్ని ఆదరిస్తారని అనుకోలేము.
మోడీ పాలనలో వ్యక్తమవుతున్న ఎన్నికల ఆధిపత్యం నేపథ్యంలో అల్పసంఖ్యాకవర్గాల భావోద్వేగాలు అణచివేయబడి ఉన్నాయి. ఈ విధంగా అణచివేయబడిన సామాజిక తరగతుల మనోభావాలను వ్యక్తపర్చుకునేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటారు.
2004లో బీజేపీ కూటమిని మరో కూటమి ఓడించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకీ, దాని వెనుక నోరు పెగలక ఉడికిపోతున్న దాని మిత్రపక్షాలకూ వారి ఉమ్మడి దీర్ఘకాల ప్రత్యర్ధి కాంగ్రెస్ తీవ్రమైన సవాలు విసిరింది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆరెస్సెస్ విస్తృతమైన సంఘపరివారంలో నాయకత్వ స్థానాన్ని పునరుద్ధరించుకునేందుకు, తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలన్న లక్ష్యంతో ఈ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది.
ఈ లక్ష్యాన్ని సాధించేవరకూ ఆరెస్సెస్ ద్వితీయ శ్రేణి పాత్ర పోషించేందుకే సిద్ధంగా ఉంటుంది. అదే సమయంలో హిందూ జాగృతి లక్ష్యంతో పని చేసే విషయంలో ఆరెస్సెస్ శ్రేణులు ఏమరుపాటుతో వ్యవహరించరనీ, ఎన్నికల ద్వారా వచ్చే అధికారాల పట్ల మోహంతో వ్యవహరించరనీ విశ్వసిస్తుంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
