భారతదేశంలో భూకేంద్రీకరణ పెరుగుతోందని, ఈ భూకేంద్రీకరణ పంజాబ్, బీహార్ రాష్ట్రాలలో అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.
భారతదేశంలో పది శాతం కుటుంబాల చేతుల్లో 44 శాతం భూమి కేంద్రీకృతమై ఉందని, 46 శాతం కుటుంబాలు భూమిలేని పేదలుగా ఉన్నారని పారిస్ కేంద్రంగా పనిచేసే ‘వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్’ విడుదల చేసిన ఒక అధ్యయన పత్రం పేర్కొన్నది.
గ్రామాల్లో బడా భూస్వాముల ఆధిపత్యం..
అనేక గ్రామాలలో బడా భూకామందులు ఎక్కువ మొత్తం భూమిపై యాజమాన్యం కలిగి ఉన్నారని, కొన్ని గ్రామాలలో మొత్తం గ్రామంలోని భూమిలో 12% భూమి ఈ కామందుల చేతుల్లో కేంద్రీకృతమై ఉందని ఈ అధ్యయన పత్రం ప్రస్తావించింది.
పంజాబ్, బీహార్లలో తీవ్రం..
బీహార్, పంజాబ్ రాష్ట్రాలలో ఈ భూకేంద్రీకరణ అత్యధికంగా ఉన్నదని, కొన్ని గ్రామాలలో మొత్తం అందుబాటులో ఉన్న భూమిలో సగానికి పైగా భూమి ఒకే భూస్వామి చేతుల్లో కేంద్రీకృతమైందని “భూ యాజమాన్యంలో అసమానతలు – స్వభావం, చరిత్ర, మార్కెట్లు” అనే శీర్షికన ఉన్న ఈ పత్రం అంచనా వేసింది.
పరిశోధకుల నిర్ధారణ..
ఈ అధ్యయన పత్రాన్ని ఆర్థిక పరిశోధకులు నితిన్ కుమార్ భారతి, డేవిడ్ బ్లాకేశ్లీ, సమ్రీన్ మాలిక్ రూపొందించారు.
బీహార్, కేరళలలో ఒక శాతం లేదా ఐదు శాతం లేదా పది శాతం కుటుంబాల చేతుల్లో భూకేంద్రీకరణ ఎక్కువగా ఉందని వీరు నిర్ధారణకు వచ్చారు.
లెక్కలు ఇలా..
స్థూలంగా చూసినప్పుడు పది శాతం కుటుంబాల చేతుల్లో 44 శాతం భూమి కేంద్రీకృతమై ఉందని, ఒక శాతం కుటుంబాల్లో 18 శాతం భూమి, ఐదు శాతం కుటుంబాల్లో 32 శాతం భూమి కేంద్రీకృతమై ఉన్నదని ఆ పత్రంలో పేర్కొన్నారు.
సామాజిక-ఆర్థిక సర్వే ఆధారం..
2011లో జరిగిన సామాజిక-ఆర్థిక గణాంకాల ఆధారంగా పరిశోధకులు ఈ విశ్లేషణ చేశారు. ఈ సర్వే కోసం గ్రామీణ ప్రాంతాల్లోని 65 కోట్ల జనాభాకు సంబంధించిన వివరాలను 2,70,000 గ్రామాల నుంచి సేకరించారు. ఈ సర్వేలో 75 శాతం గ్రామీణ జనాభా పాల్గొన్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
(వివిధ రాష్ట్రాల్లో భూ కేంద్రీకరణ వివరాలు తదుపరి కథనంలో అందిస్తాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
