వాషింగ్టన్: ఇటీవల అమెరికా గూఢచారి సంస్థల నివేదికల ప్రకారం- అమెరికా, ఇరాన్‌తో జరుపుతున్న శాంతి చర్చలలో పాల్గొన్న అమెరికన్ ప్రతినిధులపై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు నిఘా పెట్టి, వారి సంభాషణలను రహస్యంగా వింటున్నాయని పెంటగాన్ హెచ్చరిక చేసింది.
ఇజ్రాయెల్ చేస్తున్న కౌంటర్ ఇంటెలిజెన్స్(ప్రతిగూఢచర్యం) వలన ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తోంది.
ఇజ్రాయెల్, అమెరికా చాలా కాలంగా ఒకరిపై ఒకరు గూఢచర్యం చేసుకుంటున్నారని తెలుసు. దాన్ని కొంతవరకు సహించుకుంటూ వచ్చాయి.
అయితే, ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో అమెరికా వైఖరి తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు ఒక హద్దును దాటాయని కొందరు అమెరికా అధికారులు భావిస్తున్నారు.
ఈ నివేదికల్లో, అమెరికా ఉన్నతాధికారులపై ఇజ్రాయెల్ నిఘా మరింత పెంచిందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
వీరిలో అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, పెంటగాన్ అత్యున్నత విధాన అధికారి ఎల్బ్రిడ్జ్ ఏ కోల్బీ, ఆయన ముఖ్య సహాయకుల్లో ఒకరైన మైఖేల్ పీ డిమినో ఐవీ ఉన్నారు.
మరో నివేదికను డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ), ఇతర సైనిక గూఢచారి విభాగాలు సంయుక్తంగా సిద్ధం చేశాయి.
గత కొన్ని సంవత్సరాల సంఘటనలను పరిశీలించి, ఇజ్రాయెల్ చేస్తున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇటీవల వారాల్లో “హై”(అధిక) స్థాయి నుంచి “క్రిటికల్”(క్లిష్టమైన) స్థాయికి పెంచినట్లు పేర్కొన్నారు.
డిఫెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ కలిసి తయారు చేసిన ఈ నివేదికలో, అమెరికా సైనిక సిబ్బంది, ప్రభుత్వ అధికారులపై ఇజ్రాయెల్ చేసిన గూఢచర్యం, వివిధ ప్రయత్నాలను వివరించారు.
సైనిక సమన్వయానికి ఆటంకం..
ఈ నివేదికలు అత్యంత సున్నితమైన సమయంలో ఇజ్రాయెల్ గూఢచారి చర్యలను వెలుగులోకి తెచ్చాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ చర్యల్లో పాల్గొంటున్నాయి.
అంతేకాక, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సైనిక సమన్వయం కొనసాగుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) కేంద్రంలో ఇజ్రాయెల్ సైనిక అధికారులు తమ అమెరికన్ సహచరులతో కలిసి పక్కపక్కనే పనిచేస్తున్నారు.
అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో వ్యూహాత్మక, ఆపరేషనల్ సమాచారాన్ని పంచుకుంటోంది. అయితే, ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చల విషయంలో అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి, ఆయన వైఖరిలో వస్తున్న మార్పులు ఏమిటి, అనే విషయాలను తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రత్యేకంగా ప్రయత్నిస్తోందని అమెరికా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ తాజా హెచ్చరికలతో, అమెరికా సెంట్రల్ కమాండ్, ఇజ్రాయెల్ మధ్య సైనిక సమన్వయాన్ని మరింతగా పెంచుకొనే ప్రయత్నాలకు ఆటంకంగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ఇజ్రాయెల్ అధికారులతో పంచుకునే సమాచారంపై పెంటగాన్ పరిమితులు విధిస్తే, అమెరికా, ఇజ్రాయెల్ సైనిక సహకారంపై ప్రభావం పడవచ్చు.
ఇదివరకే ఈ రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా- మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఇరాన్ శక్తిని మరింత బలహీనపరచడం, అక్కడి మత ఆధారిత పాలనను బలహీనపరచడం లేదా కూలదోయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అలాగే లెబనాన్‌లో ఇరాన్ మద్దతుదారులుగా ఉన్న హిజ్బుల్లా సంస్థపై దాడులను కొనసాగించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
నివేదికపై భిన్న స్పందనలు..
అమెరికా రక్షణ శాఖ అధికారులు ఇజ్రాయెల్‌లో ఉన్న సమయంలో, వారి మొబైల్ ఫోన్లలో రహస్యంగా వినగలిగే సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసినట్లు గుర్తించిన తరువాత, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) ఈ నివేదికను రూపొందించింది.
డీఐఏ నివేదిక మనుగడ గురించి, అలాగే ఇజ్రాయెల్ గూఢచర్యాలతో పెరుగుతున్న ప్రమాద స్థాయిని మొదటగా ఎన్బీసీ న్యూస్ వెల్లడించింది.
ఈ అంశంపై స్పందించడానికి అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) నిరాకరించింది.
అయితే, పేరు వెల్లడించకూడదనే షరతుతో వైట్ హౌస్ అధికారి ఒకరు, ఈ కథనంలో చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.
వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి, ఇజ్రాయెల్ వలన అమెరికాకు కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రమాదం ఉందనే వాదనలను ఖండించారు.
ఇజ్రాయెల్, అమెరికా అధికారులపై గానీ, అమెరికా సంస్థలపై గానీ గూఢచర్యం చేయదని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల గురించి ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులు సున్నితమైన గూఢచర్యల సమాచారంపై మాట్లాడుతున్నందున, తమ పేర్లు వెల్లడించవద్దనే షరతుతో వివరాలు వెల్లడించారు. ఈ గూఢచర్యలు ఆశ్చర్యకరమైనవి కాదని పేర్కొన్నారు.
ఎందుకంటే, అమెరికా మాదిరిగానే ఇజ్రాయెల్ కూడా చాలా కాలంగా తన శత్రు దేశాలపై మాత్రమే కాకుండా, మిత్రదేశాలపై కూడా గూఢచర్యల ద్వారా సమాచార సేకరణ నిర్వహిస్తూ వస్తోంది.
కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్..
ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రమాద స్థాయి, అమెరికా తన మిత్రదేశాలపై చేసే దానికంటే ఎక్కువ స్థాయిలో ఉండటమే కాకుండా, కొన్ని ప్రత్యర్థి దేశాల కంటే అధిక స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు.
అమెరికా మిత్రదేశమైన దక్షిణ కొరియా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తరహా గూఢచర్యల కార్యకలాపాలు చేస్తున్నదని వారు పేర్కొన్నారు.
ట్రంప్ రెండోసారి పరిపాలనా కాలంలో, ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు, అమెరికా అత్యున్నత అధికారులపై చేపట్టిన సమాచార సేకరణ చర్యల దూకుడు “హద్దులు దాటిన స్థాయిలో ఉంది” అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
ఇద్దరు అమెరికా సైనిక ఉన్నతాధికారుల మాటల్లో.. ఇజ్రాయెల్‌లో విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనిక అధికారులకు, లేదా ఇజ్రాయెల్ అధికారులతో కలిసి పనిచేస్తున్న అమెరికా సిబ్బందికి, ఈ నివేదిక వెలువడక ముందే ఇజ్రాయెల్ ప్రతిగూఢచర్యల ప్రమాదాల గురించి పూర్తి అవగాహన ఉంది.
అంతర్గత భద్రత రీత్యా, తమ పేర్లు వెల్లడించకూడదనే షరతుతో మాట్లాడిన అధికారులు, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సిబ్బంది పలు రకాల భద్రతా విధానాలు, ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తున్నారని తెలిపారు.
ప్రత్యేకించి ఇజ్రాయెల్‌లో పర్యటించే సమయంలో లేదా అక్కడ విధులు నిర్వహించే సందర్భాల్లో తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల రక్షణకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు.
జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా, ఆ భద్రతా చర్యలు ఏమిటి, అవి ఎలా అమలు చేస్తారనే విషయాలను వివరంగా వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.
గోప్యత కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల మధ్య సహకారం అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఇరు దేశాలు తమకు అత్యంత కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఉదాహరణకు, ఇజ్రాయెల్‌లోని కిర్యాట్ గాట్లో ఉన్న పౌర-సైనిక సమన్వయ కేంద్రంలో, అమెరికా నాయకత్వంలో పనిచేస్తున్న కేంద్రంలో, అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక, దౌత్య సిబ్బంది కలిసి పక్కపక్కనే పనిచేస్తూ, గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించడం, మానవతా సహాయ కార్యక్రమాలను సమన్వయం చేయడం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
కిర్యాట్ గాట్లో అమెరికా సిబ్బందికి కేటాయించిన అంతస్తు, ఇజ్రాయెల్ సిబ్బందికే కేటాయించిన మరో అంతస్తు కూడా ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో ఆయా దేశాల అధికారులు తమకు సంబంధించిన అత్యంత సున్నితమైన, గోప్యమైన అంశాలపై ఇతర దేశ ప్రతినిధుల జోక్యం లేకుండా చర్చలు జరుపుతారు.
తాజా నివేదిక ప్రకారం, ప్రతిగూఢచర్యలు రెండు వేల ఇరవై నాలుగు చివరి నెలల నుంచి ప్రారంభమయ్యాయి.
ఆ సమయంలో, గాజాపై దాడులను తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు.
ఈ పరిణామాలు రెండు వేల ఇరవై ఐదులో కూడా కొనసాగాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరాన్‌పై దాడి చేసే అవకాశాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో, గూఢచర్యం, ప్రతిగూఢచర్యానికి సంబంధించిన ఆందోళనలు మరింత పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
గతంలో పట్టుబడిన ఇజ్రాయెల్ అధికారులు..
అమెరికా సైనిక గూఢచారి సంస్థలు సమాచారాన్ని సమీకరించి రూపొందించిన ఈ నివేదికలో, గత కొన్ని సంవత్సరాల్లో జరిగిన పలు సంఘటనలను కూడా వివరించారు.
రెండు వేల ఇరవై ఒకటిలో ఇజ్రాయెల్ సైనిక గూఢచారి విభాగానికి చెందిన అధికారులు అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో రహస్యంగా వినికిడి పరికరాలు అమర్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని పేర్కొంది.
గత ఏడాది, ఇజ్రాయెల్ దేశీయ గూఢచారి సంస్థ షిన్ బెట్‌కు చెందిన అధికారులు, అమెరికా యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ వాహనంలో “రహస్య వినికిడి పరికరాన్ని” అమర్చేందుకు ప్రయత్నించినట్లు నివేదిక వెల్లడించింది.
ఈ సంఘటనలు, అమెరికా భద్రతా వ్యవస్థలో ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలపై పెరుగుతున్న ఆందోళనలకు కారణమైన ముఖ్య ఉదాహరణలుగా నివేదికలో ప్రస్తావించబడ్డాయి.
వ్యక్తిగత ఫోన్ల వాడకంతో లీకులు..
డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలో శాంతి చర్చల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ, ఇటీవల వచ్చిన ఇతర గూఢచారి నివేదికలు మాత్రం, అమెరికా–ఇరాన్ మధ్య దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు జరుగుతున్న చర్చల సమయంలో- ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, చర్చలలో పాల్గొన్న ఇతర ఉన్నతస్థాయి అధికారులు, తమ సంభాషణలను ఇజ్రాయెల్ రహస్యంగా వినే ప్రయత్నాలు చేస్తున్నదనే ఆందోళనలను వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్‌తో విస్తృతంగా పనిచేసిన మాజీ అమెరికా ఉన్నతాధికారి మాటల్లో, ట్రంప్ ప్రభుత్వంలోని కొందరు సీనియర్ అధికారులు ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించడం, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో చర్చించడం, విదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల భద్రతా సిబ్బంది సహకారాన్ని తిరస్కరించడం వంటి చర్యల వలన, మిత్రదేశాలు, ప్రత్యర్థి దేశాల గూఢచర్యలకు అనుకూలంగా పరిస్థితులు మారాయని చెప్పారు.
ప్రస్తుతం విధుల్లో ఉన్న కొందరు అమెరికా అత్యున్నత అధికారులు, వ్యక్తిగత సెల్ఫోన్లను ఉపయోగించడం వలన, వారి సంభాషణలను రహస్యంగా వినడం మరింత సులభమైందని అంగీకరించారు.
భిన్నమైన లక్ష్యాలు.. వ్యూహాలు..
భద్రతా ప్రమాణాలు కఠినంగా పాటించాల్సిన ఉన్నత అధికారులే, వ్యక్తిగత కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించడం వలన సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం పెరుగుతోంది.
ఇరాన్‌తో యుద్ధం ప్రారంభ దశలో, అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలు చాలావరకు ఒకే దిశలో ఉండేవి. ఇరాన్‌లోని మత ఆధారిత పాలనను అధికారంలో నుంచి తొలగించాలన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీర్ఘకాలిక లక్ష్యానికి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు.
యుద్ధం కొనసాగుతున్న కొద్దీ, ఇరు దేశాల లక్ష్యాలు వేర్వేరు దిశల్లోకి మళ్లాయి. అమెరికా, చర్చల్లో ఇరాన్‌ను రాయితీలపై ఒత్తిడి తీసుకురావడం, దాని సైనిక సామర్థ్యాలను బలహీన పరచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.
ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌లోని మొండి ప్రభుత్వ పాలన పట్టు కోల్పోవాలని ఆశించింది.
పెంటగాన్ విధాన బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్బ్రిడ్జ్ ఏ కోల్బీ అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానాల్లో పరిమిత జోక్యాన్ని సమర్థించే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు.
ఆయన ఎందుకు లక్ష్యంగా మారారో స్పష్టంగా లేదని నివేదిక పేర్కొంది.
అదే విధంగా, డిమినో మధ్యప్రాచ్యానికి పెంటగాన్ విధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆ ప్రాంతానికి సంబంధించిన అమెరికా వ్యూహాలు, నిర్ణయాలను తెలుసుకోవాలనుకొనే ఇజ్రాయెల్‌కు ఆయనను సహజంగానే కీలక వ్యక్తిగా నివేదిక సూచిస్తోంది.
అనువాదం: జె నాగేశ్వరరావు
న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
