రాజకీయ ఆర్థిక వేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్, 2026 జూలై 11న సికింద్రాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో నిర్వహించిన ఫాదర్ స్టాన్ స్వామీ స్మారక సభలో ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ఉపన్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వ్యాసం రెండు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది రెండవ భాగం. మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువను నిలబెట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆ జోక్యం రూపాయి ఒక్కసారిగా కుప్పకూలకుండా మాత్రమే అడ్డుకోగలిగింది. కానీ దాని నిరంతర పతనాన్ని మాత్రం ఆపలేకపోయింది.
ప్రతి వ్యాపార దినాన రూపాయి మరింత దిగజారుతూ కొత్త కనిష్ఠ స్థాయిలను నమోదు చేస్తూనే ఉంది. ఈ పరిస్థితికి మూల కారణాలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు.
ఆసియాలోనే అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీగా రూపాయి ఎందుకు మారిందో కూడా ప్రభుత్వం లోతుగా పరిశీలించడం లేదు. దానికి బదులుగా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులనే కారణంగా చూపిస్తూ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తోంది.
ఆర్థిక దృష్టికోణం..
ప్రస్తుత పాలక వ్యవస్థకు దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో నడిపే సామర్థ్యం, స్వభావం లేదనే భావన కలుగుతోంది. దాని ప్రధాన లక్ష్యం దేశ రాజకీయ వ్యవస్థను మెజారిటీ ఆధిపత్యం ఆధారంగా మలచడమే.
దేశానికి సమగ్ర ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక దాని వద్ద కనిపించడం లేదు. కొద్దిమంది తనకు అనుకూలమైన వర్గాలను సంపన్నులను చేయడమే దాని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
అయితే గత పన్నెండు సంవత్సరాలు కేవలం ఆర్థిక రంగానికే చెడ్డ కాలమని భావించడం పొరపాటు. ఈ కాలంలో దేశ రాజకీయ సమాజం కూడా మారిపోతోంది. అది కూడా అంతే తీవ్రమైన సమస్య.
రాజకీయ వ్యవస్థ: లౌకిక, సమ్మిళిత భారతదేశాన్ని నిర్వీర్యం చేయడం..
ప్రస్తుత పాలక వ్యవస్థ భారతదేశాన్ని లౌకిక, బహుళత్వ, సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశంగా ఉంచాలనే భావనను క్రమంగా నిర్వీర్యం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం లాంటి విలువలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఏర్పడిన భారత రాజ్యాంగ ఆత్మ ఈరోజు తీవ్రమైన ప్రమాదంలో ఉంది.
1947లో స్వాతంత్ర్యం పొందినప్పుడు మనం కలగన్న భారతదేశ భావన, 1950 రాజ్యాంగంలో ప్రతిబింబించిన రాజకీయ ఒప్పందం, రెండూ ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి.
లౌకిక, బహుళత్వ, ప్రజాస్వామ్య భారతదేశం అనే ఆలోచనపై ఈ పాలక వ్యవస్థతో పాటు గతాన్ని మహిమాపరచే అనేక శక్తులు నిరంతరం దాడి చేస్తున్నాయి.
అవి అసమానతలతో కూడిన సామాజిక వ్యవస్థకే బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. వాటి లక్ష్యం భారతదేశ భవిష్యత్తును నిర్మించడం కాదు.
గతంలో ఉన్నదాన్ని కాకుండా ఊహించిన ఒక కల్పిత “స్వర్ణయుగాన్ని” తిరిగి తీసుకురావడం. లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రాన్ని సాంస్కృతికంగా, భాషాపరంగా, మతపరంగా ఒకే రూపంలోకి మార్చడం.
భారతీయ నాగరికత అనేక సంస్కృతుల సమ్మేళనం అనే భావన వారికి అసహ్యకరమైనది. మన దేశం ప్రత్యేకత అయిన భాషల వైవిధ్యం, సంస్కృతులు, జీవనశైలులు, ఆహార అలవాట్లు, దుస్తుల సంప్రదాయాలు, ఆరాధనా పద్ధతులు, పరస్పర సంస్కృతుల కలయిక, ఇవన్నింటినీ చెరిపివేయడమే వారి ప్రాజెక్టు లక్ష్యం. ఒకే మాదిరిగా మార్చబడిన భారతదేశమే వారి దృష్టిలో “నాగరికతా రాజ్యం”. అదే ప్రస్తుత పాలక వ్యవస్థ లక్ష్యం.
ప్రత్యేక సవివర పునః సమీక్ష (ఎస్ఐఆర్)..
ఓటరు జాబితాల ప్రత్యేక సవివర పునః సమీక్ష (ఎస్ఐఆర్) అనేది ఒక ప్రత్యేక పరిపాలనా చర్య మాత్రమే కాదు. భారతదేశంపై హిందువులకే ప్రత్యేక యాజమాన్య హక్కు ఉందనే భావనను స్థాపించడానికి రూపొందించిన ఒక విస్తృత రాజకీయ ప్రాజెక్టులో ఇది కీలక భాగం.
ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏమిటంటే హిందూ జాతికే భారతదేశంపై ఏకైక హక్కు ఉందని ప్రకటించడం. భారత రాజ్య భూభాగంలో నివసించే హక్కు కూడా ప్రధానంగా అదే జాతికేనని ప్రతిపాదించడం.
చివరికి భారతదేశాన్ని హిందూ జాతీయ రాజ్యంగా మలచడం. అంటే, భారతదేశపు గుర్తింపును “హిందూ జాతీయ రాజ్యం”గా పునర్నిర్వచించాలన్నదే దీని ఉద్దేశ్యం.
ఈ దశలో “సవర్ణ” అనే అంశాన్ని వ్యూహాత్మక కారణాల వల్ల ఉద్దేశపూర్వకంగా ముందుకు తేవడం లేదు. కానీ, ఒకసారి పరిస్థితులు అనుకూలంగా మారితే, అది పూర్తిస్థాయి, ఎలాంటి సంకోచం లేని “సవర్ణ హిందూ రాష్ట్రం”గా బహిర్గతమవుతుంది.
రక్తపాతం లేని రాజకీయ మారణహోమం..
భారతదేశం గణతంత్రంగా ఏర్పడినప్పుడు, ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఈ దేశాన్ని ఒక ఉమ్మడి నివాసంగా మన రాజ్యాంగ నిర్మాతలు నిర్మించారు.
పౌరసత్వం లేదా గణతంత్ర సభ్యత్వం మతం, కులం, లింగం, భాష, సంస్కృతి, ప్రాంతం, చర్మ రంగు, ఆర్థిక స్థితి లేదా విద్యార్హతలపై ఆధారపడి ఉండేది కాదు.
భారతదేశాన్ని తన నివాస దేశంగా ఎంచుకున్న ప్రతి వ్యక్తి పౌరుడే. అతనికి ఓటు హక్కు ఉంది. అతను దేశ రాజకీయ సమాజంలో సమాన హక్కులు కలిగిన సభ్యుడు. ఏ మతానికీ, ఏ వర్గానికీ దేశంపై ప్రత్యేక యాజమాన్య హక్కు ఇవ్వలేదు. ఈ దేశం అందరిదీ.
జన్మభూమి మాత్రమే ప్రమాణం. పుణ్యభూమి అనే భావనను పౌరసత్వానికి ప్రమాణంగా మనం ఎప్పుడూ అంగీకరించలేదు.
యూరప్‌లో జాతీయ రాజ్యాలు ఏర్పడిన విధానం భిన్నమైనది. అక్కడ “మనవారు”, “ఇతరులు” అనే విభజన ఉండేది. జాతి, మతం, భాష, వంశం, సంస్కృతి ఆధారంగా మెజారిటీలు, మైనారిటీలు ఏర్పడ్డాయి.
మైనారిటీల ఉనికి, మెజారిటీలు అనుమతించినంత వరకే పరిమితమైంది. చరిత్రలో అనేక యూరోపియన్ దేశాలు మైనారిటీలను అణచివేయడం, బహిష్కరించడం, కొన్నిసార్లు నిర్మూలించడం వరకు వెళ్లాయి.
ఐబీరియన్ ద్వీపకల్పంలోని మత ప్రక్షాళన నుంచి నాజీ గ్యాస్ చాంబర్ల వరకు, అలాగే నేటి ఇజ్రాయెల్ చేపడుతోందని రచయిత పేర్కొన్న జాతి ప్రక్షాళన వరకు చరిత్రలో ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ భారతదేశం వేరే మార్గాన్ని ఎంచుకుంది.
మన రాజ్యాంగ నిర్మాతలు, స్వాతంత్ర్య సమరయోధులు వైవిధ్యభరిత సమాజాన్ని ఒకే గణతంత్రంలో కలిసి వుండేలా నిర్మించారు.
అయితే యూరోపియన్ జాతీయ రాజ్య భావన నుంచి ప్రేరణ పొందిన భారతీయ సిద్ధాంతాలు, భారత గణతంత్రాన్ని కూడా ఒకే “హిందూ జాతికి” చెందిన రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నాయి.
ప్రస్తుత పాలక వ్యవస్థ కూడా అదే సిద్ధాంతానికి చెందినది. ఆ భావజాలం ప్రకారం “ఇతరులు” మూడు మార్గాల్లో ఒకదాన్ని అనుసరించాలి: తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోయేంత వరకు కలిసిపోవాలి. లేదా దేశం విడిచి వెళ్లాలి. లేదా అంతరించిపోవాలి.
తిరస్కార్ – పురస్కార్ – సంస్కార్..
కొన్ని సంవత్సరాల క్రితం ప్రస్తుత పాలక భావజాలం మైనారిటీలను ఎలా చూడాలనే విషయంలో మూడు మార్గాలను చెప్పింది.
1. తిరస్కార్
2. పురస్కార్
3. సంస్కార్
ప్రారంభంలో పెద్ద మైనారిటీని పూర్తిగా తిరస్కరించడం సాధ్యం కాదని భావించి తిరస్కార్ను పక్కన పెట్టారని ఆయన చెబుతున్నారు. పురస్కార్ కూడా సరైన మార్గం కాదని భావించారు. కాబట్టి సంస్కార్ — అంటే మైనారిటీల ప్రత్యేక మత, సాంస్కృతిక గుర్తింపులు క్రమంగా చెరిగిపోయేలా వారిని మెజారిటీ సమాజంలో కలిపివేయడమే సరైన మార్గమని వారు భావించారు.
తరువాత కాలంలో ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో, మొదట వదిలేసిన తిరస్కార్ మళ్లీ రాజకీయ కార్యాచరణలో ప్రధాన స్థానానికి వచ్చింది. అది ఇప్పుడు బహిష్కరణగా మారింది.
మైనారిటీలను రాజకీయ సమాజం నుంచి వెలివేయడం..
ఒకానొక సందర్భంలో “మీతో కలిసి, మీరు లేకపోయినా, మీరు వ్యతిరేకించినా” అని ముస్లిం మైనారిటీలను ఉద్దేశించి ఎల్కే అద్వానీ అన్నారు.
అంటే, మైనారిటీలు సహకరిస్తే వారితో కలిసి ముందుకు వెళ్తాం. సహకరించకపోతే వారిని పక్కన పెట్టి ముందుకు వెళ్తాం. వ్యతిరేకించినా వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతామనే భావనను ఇది సూచిస్తుంది.
అసమానమైన, దిగువ స్థాయి స్థానాన్ని అంగీకరించకపోతే, మైనారిటీలను దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక జీవితంలో నుంచి క్రమంగా వెలివేసే దిశగా ఈ ఆలోచన దారి తీస్తుంది.
ప్రజలను గుంపులుగా కొట్టి చంపడం(లించింగ్‌లు), ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం, క్రిస్మస్ సందర్భంగా చర్చిలపై దాడులు ఇవన్నీ ఆ భావజాలానికి ప్రతిరూపం.
కేంద్ర మంత్రివర్గంలో మైనారిటీల ప్రాతినిధ్యం..
ఈరోజు దేశ రాజకీయ వాస్తవాన్ని గమనించండి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో ముస్లిం లేదా క్రైస్తవ మైనారిటీ సమాజానికి చెందిన ఒక్క ప్రతినిధి కూడా లేరు.
కొద్ది వారాల క్రితం వరకు ఉన్న ఒక క్రైస్తవ ప్రతినిధిని కూడా మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో కేంద్ర మంత్రివర్గం పూర్తిగా భారతీయ మూలాలున్న మతాలకు చెందిన వ్యక్తులతోనే నిండిపోయింది.
కార్యనిర్వాహక వ్యవస్థలో రాజకీయ ప్రాతినిధ్యం నుంచి మైనారిటీలను తొలగించే పని దాదాపు పూర్తయింది.
పౌరసత్వాన్ని నిర్వీర్యం చేయడం..
అయితే, రాజకీయ సమాజంలో మైనారిటీలను ఎలా వెలివేయాలి? ఈ రోజుల్లో వారిని దేశం నుంచి బలవంతంగా పంపించడం గానీ, భౌతికంగా నిర్మూలించడం గానీ రాజకీయంగా సాధ్యం కాదు. కానీ మరో మార్గం, వ్యక్తిని నిర్మూలించడం కాకుండా, అతని పౌరసత్వాన్నే నిర్వీర్యం చేయవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ అలాంటి లక్ష్యంతో రూపొందించిన సాధనం.
అది అవసరం లేని వ్యక్తుల ఓటు హక్కును తొలగించడం ద్వారా వారి పౌరసత్వాన్ని అర్థరహితం చేస్తుంది. ఓటు హక్కు లేకుండా పౌరసత్వం కేవలం పేరుకే మిగులుతుంది. ఓటు హక్కు కోల్పోవడం అంటే పౌరసత్వం తన అసలు సారాన్ని కోల్పోవడమే.
అందువల్ల ఎస్ఐఆర్ అనేది “రక్తపాతం లేని రాజకీయ మారణహోమం”. ఇది పౌరసత్వాన్ని నిర్వీర్యం చేసి, ప్రజలను రాజకీయ సమాజం నుంచి బయటకు నెట్టివేస్తుంది. దేశ సరిహద్దులలోనే నివసిస్తున్నప్పటికీ, వారిని రాజకీయంగా “రాష్ట్రం లేని వారిగా” మార్చేస్తుంది.
సీఏఏ-ఎన్నార్సీ ద్వారా సాధ్యం కాలేదని ఆయన భావించే లక్ష్యాన్ని, ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనే ప్రయత్నం జరుగుతోంది.
ఈ విధంగా, వైవిధ్యభరిత ప్రజలు, భాషలు, మతాలు, సంస్కృతులకు నిలయమైన భారతదేశ భావన వేగంగా ధ్వంసం చేయబడుతోంది.
మరోసారి ఫాదర్ స్టాన్ స్వామీ మాటలు..
ఇప్పుడు, 2020 అక్టోబర్ 8న అరెస్టుకు ముందు ఫాదర్ స్టాన్ స్వామీ చెప్పిన ముఖ్యమైన పదాలను మరోసారి గుర్తుచేసుకుందాం: ఆదివాసీలు, దళితులు, అట్టడుగు వర్గాలు, పాలక శక్తులు, గౌరవప్రదమైన, ఆత్మగౌరవంతో కూడిన జీవితం కోసం పోరాటం, విభేదం, సంఘీభావం, భారత రాజ్యాంగం, చెల్లుబాటు, చట్టబద్ధత, న్యాయబద్ధత, దేశ ద్రోహి, నిశ్శబ్ద ప్రేక్షకుడు, మూల్యం చెల్లించడం, పరిణామాలను ఎదుర్కోవడం.
అనేక అధ్యయనాలు చూపిస్తున్నదేమిటంటే, ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా ఆ వర్గాల మహిళలు అధికంగా ప్రభావితమవుతున్నారు.
ఫాదర్ స్టాన్ స్వామీ బతికి ఉంటే, ఆయన వారి పక్షాన నిలిచేవారు. ఈరోజు గ్రామీణ, పట్టణ భారతదేశంలో గౌరవప్రదమైన జీవితం కోసం పోరాడుతున్న ప్రజల పోరాటాలకు ఆయన అండగా నిలిచేవారు. వారికి అవసరమైన సంఘీభావాన్ని అందించేవారు.
లౌకికవాదం, బహుళత్వం, సమాఖ్య వ్యవస్థ, వైవిధ్యం, న్యాయం, సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ — ఇవి భారతదేశ సామాజిక ఒప్పందానికి మూల స్తంభాలు. ఈ విలువలు ఈరోజు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫాదర్ స్టాన్ స్వామీ నిశ్శబ్దంగా ఉండేవారు కాదు.
ఈ విలువలను కాపాడేందుకు మాట్లాడినందుకు తనను “దేశ ద్రోహి” అని పిలిచినా, ఆయన వెనుకడుగు వేయలేదు. అలాంటి ముద్రను వెయ్యిసార్లు మోపినా, తన విభేదాన్ని వ్యక్తం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేవారని, దాని మూల్యం చెల్లించడానికీ, పరిణామాలను ఎదుర్కోవడానికీ వెనుకాడరని మనమూ అలాగే చేయాలని ఫాదర్ స్టాన్ స్వామీ కోరుకునేవారు.
ఫాదర్ స్టాన్ స్వామీ ఎప్పుడూ గొప్ప హడావిడి చేయలేదు. ఆయన దేశంలోని మారుమూల, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో నిశ్శబ్దంగా ప్రజల కోసం పనిచేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న, బలహీనమైన, ఎనభై ఏళ్లు దాటిన ఒక వృద్ధుడికే ప్రస్తుత పాలక వ్యవస్థ భయపడింది.
ఎందుకంటే, భారతదేశానికి అవసరమైన, మనందరికీ ప్రియమైన విలువలకు ఆయన ప్రతిరూపంగా నిలిచారని. ఆ విలువలు ఢిల్లీలో అధికారంలో ఉన్న వారి రాజకీయ ప్రాజెక్టుకు విరుద్ధమైనవి, ధన్యవాదాలు.
అనువాదం: డీ వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
