మోదీ ప్రభుత్వానికి ఎప్పటినుంచో వ్యతిరేకంగా ఉన్న “అర్బన్ నక్సల్స్” దేశభక్తిగల ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏదో ఒక కొత్త కట్టుకథను తవ్వి తీసుకురావడంలో ఎప్పుడూ అలసిపోరు.
ఇప్పుడు వారి తాజా “దేశద్రోహపు” కుట్ర ఏమిటంటే అమెరికా వంటి శక్తివంతమైన దేశానికి ఇరాన్ ఎదురొడ్డి నిలబడగలిగితే, భారత్ ఎందుకు నిలబడలేకపోతుందని ప్రశ్నించడం.
ఈ మహాదేశం ఇప్పటివరకు పోరాడిన యుద్ధాలన్నింటిలో ఓడిపోయిందని, వాటిలో కొన్ని అత్యంత అవమానకరమైనవని వారే చెబుతుంటారు – అది పక్కన పెట్టండి.
వారు అడుగుతున్న ఈ ప్రశ్న ఎవరైనా గమనించగలిగినట్లుగా వారి అధ్యయన లోపాన్ని, వాస్తవాలపై అవగాహన లేకపోవడాన్ని బయటపెడుతుంది.
ఎంత విద్యావంతులమని గొప్పలు చెప్పుకున్నా, ఆ లోపం దాచిపెట్టలేరు. అయినా చదవడం, రాయడం రాజకీయ లేదా సైనిక విజయాలకు ఏమైనా సంబంధం ఉందా?
జనాభా – సామర్థ్యం..
ఏ దేశమైనా మహాశక్తుల అహంకారాన్ని ఎంతవరకు తట్టుకోగలదో, అది ఆ దేశ జనాభాపైనే ఆధారపడి ఉంటుంది.
ఇరాన్ జనాభా దాదాపు 9.8 కోట్ల మంది. కానీ భారత్ జనాభా 140 కోట్లు. మరి చెప్పండి. 98 పెద్దదా? లేక 14 పెద్దదా? (తదుపరి సున్నాలు తీసేసి చూస్తే. సున్నాను ప్రపంచానికి ఇచ్చింది మనమే అయినా సరే!) ఇది ఒక విషయం.
ఇజ్రాయెల్, అమెరికాలతో సంబంధాలు..
మరొకటి జియోనిజంతో మన నాగరిక సంబంధాలు ఉన్నందున, అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై ఒక్క కఠినమైన మాటైనా, ప్రతికూల ఓటైనా, దేవుడా కాపాడు ఒక్క బుల్లెట్ అయినా ప్రయోగించడం వంటి అసభ్య ప్రవర్తన మనకు తగదు.
అది చిన్న తోక కాదు. అమెరికాలోని భారీ వ్యాపార సంస్థలు, శక్తివంతమైన మీడియా, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, పెంటగాన్, సీఐఏ లాంటి సంస్థలపై(మోసాద్ ద్వారా) ప్రభావం చూపగల శక్తి కలిగిన మిత్రదేశం. అలాంటి సామర్థ్యాన్ని విమర్శించకుండా, అసూయపడటమే కదా సరైనది. అమెరికా మనకూ అలాంటి ప్రత్యేక హోదా ఇస్తే ఎంత బాగుండేది.
కానీ దురదృష్టవశాత్తూ, ప్రపంచ గురువుగా చెప్పుకునే మన నాయకత్వంతో అమెరికా పిల్లి-ఎలుక ఆట ఆడుతోంది.
మన జ్ఞానాన్ని గుర్తించినట్టే కనిపించదు. అదీకాక, ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించడానికి కేవలం రెండు రోజుల ముందు మన గౌరవ ప్రధానమంత్రి ఆ “వాగ్దాన భూమి”ని సందర్శించడం కూడా ఒక విశేష యాదృచ్ఛికమే.
మరోవైపు చాబహార్ నౌకాశ్రయం, చమురు ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇరాన్‌కు మాత్రం మనం ఇంతవరకు అలాంటి రాజసత్కార పర్యటన ఇవ్వలేదు.
ఇంకా మన బిలియనీర్ల సంగతి? వారు అమెరికా డాలర్ సామ్రాజ్యంలో అభివృద్ధి చెందుతూ నిస్సందేహంగా “భారత్‌ను మళ్లీ మహోన్నతం చేయడానికి” కృషి చేస్తున్నారు.
సాంస్కృతిక వారసత్వం వర్సెస్ లావాదేవీల రాజకీయాలు..
దానికి విరుద్ధంగా, ఇరాన్ తనకు ఆరువేల సంవత్సరాల యుద్ధ చరిత్ర ఉందని భావిస్తూ, ఇప్పటికీ గొప్ప దేశమేనని నమ్ముతుంది.
కానీ ఈ సంగతులేవీ ఆ “అర్బన్ నక్సల్స్”కు అర్థం కావు. ఎందుకంటే వారు జార్జ్ సోరోస్ లాంటి “విదేశీ ప్రభావశీలుల” బానిసలుగా మారిపోయారని వ్యంగ్యంగా అంటారు.
అంతేకాదు, ఈ ఇరానీయులు న్యాయం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడంలో గర్వపడతారు. అలాంటి సంప్రదాయం అమెరికా గానీ, “వికసిత్ భారత్” గానీ అనుసరించే లావాదేవీ ఆధారిత రాజకీయ తెలివితేటలకు పూర్తిగా విరుద్ధమైనది.
వ్యక్తిగత సంపదను కూడబెట్టడంలో అదే వ్యూహం మనల్ని ప్రపంచంలో ముందంజలో నిలబెడుతోందని వ్యంగ్యంగా చెబుతారు.
అసలు చూస్తే, భౌతిక ఐశ్వర్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఒక దేవతను ప్రతిష్ఠించిన మతం సనాతన ధర్మమే అయి ఉండవచ్చు.
ఇక్కడ “రాజ్య సంపద” అంటే ధనికుల ఖజానాలనే ఉద్దేశిస్తున్నామని రచయిత ఎద్దేవా చేస్తారు.
దానికి భిన్నంగా, అమెరికా డబ్బు పట్ల అమితమైన మోజు ఉన్న దేశమే అయినప్పటికీ, క్రైస్తవ సంప్రదాయంలో ధన దేవుడు మామన్ నరకానికి చెందినవాడిగా పరిగణించబడతాడు.
జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ కావ్యంలో, బంగారంతో వీధులను పరచేవాడిగా అతన్ని చిత్రీకరిస్తాడు.
మూడో విషయం లేదా రెండో విషయమా? ఈ అర్బన్ నక్సల్స్ వైఖరిపట్ల నాకు కలిగిన అసహ్యం వల్ల లెక్కే మరిచిపోయానేమో.
సైనిక సామర్థ్యం – రహస్య ఆయుధాలు..
సావర్కర్ ఇచ్చిన హెచ్చరికలు ఉన్నప్పటికీ, మన సైనిక సామర్థ్యం ఇంకా వెనుకబడి ఉందని రచయిత వ్యంగ్యంగా చెబుతారు.
అదే సమయంలో, ఇరాన్ భూగర్భంలో “భారీ” రహస్య ఆయుధ నిల్వలను నిర్మించుకుంటూ, ట్రంప్‌ను, అతని “యుద్ధ కార్యదర్శి” పీట్ హెగ్సెత్ను కూడా ఆశ్చర్యపరిచిందని అంటారు.
ఇంకో పుకారు కూడా ప్రచారంలో ఉందట. భారత్‌కు నిజంగా అణుబాంబు లేకపోవచ్చు.
కానీ ఇరాన్ వద్ద ఇప్పటికే అనేక అణ్వాయుధాలు ఉన్నాయట. అవి సీఐఏ, ఎంఐ6 లాంటి గూఢచారి సంస్థల కంటపడకుండా దాచిపెట్టబడ్డాయట.
అందుకే అమెరికా ఇరాన్‌ను చూసి భయపడుతుంది. కానీ దేశీయంగా ఎంత గొప్పలు చెప్పుకున్నా “విశ్వగురు” భారత్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోదని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు.
ఇటీవల పొరుగు దేశంతో జరిగిన ఘర్షణలో, అమెరికా కోరిన వెంటనే మనం విధేయంగా ఆగిపోలేదా? ఇంకో భారత్ వ్యతిరేక పుకారు కూడా వినిపిస్తోంది.
ఇరాన్‌కు ఎప్స్టీన్ వ్యవహారం లాంటి బలహీనతలు లేకపోవచ్చు. కానీ మన అల్మారాల్లో మాత్రం కొన్ని “అస్థిపంజరాలు”(దాచిన రహస్యాలు) ఉండొచ్చని, అవే మనల్ని జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తున్నాయని అంటున్నారు.
ఈ అపవాదు అత్యంత దుర్మార్గమైనది, క్షమించరానిది.
కానీ దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న అదుపులేని నోరున్న వాళ్లు, మన భవిష్యత్ మహోన్నతిని చూసి భయపడి ఇలాంటి ఊహాగానాలు సృష్టిస్తుంటే, వారిని ఎలా ఆపగలం? అది నిజం కావడానికి 2047 వరకు వేచి చూడవలసి వచ్చినా సరే.
చమురు రాజకీయాలు – ప్రవాస భారతీయులు..
అన్నింటికంటే ముఖ్యంగా, ఇరాన్‌కు హోర్ముజ్ జలసంధి ఉంది. మనకు మాత్రం అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి ఉపయోగపడని పవిత్ర నదులు మాత్రమే ఉన్నాయి.
చమురు విషయంలో అది ఎంత “ముడి” రూపంలో ఉన్నా సరే ఇరాన్ మనకంటే ఎంతో బలమైన స్థితిలో ఉంది.
అలాంటి పరిస్థితిలో అమెరికా అహంకారానికి గట్టి హెచ్చరిక ఇచ్చేలా మనం ఎలాంటి ఒత్తిడిని తీసుకురాగలం?
ఒకప్పుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయడంలో భారత్‌కు ప్రత్యేక గౌరవ స్థానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రభావాన్ని, విదేశాంగంలో శాంతి కంటే వేరే లక్షణాలతో పేరుగాంచిన మన పొరుగు దేశం చాకచక్యంగా చేజిక్కించుకుందని రచయిత వ్యంగ్యంగా అంటారు.
అన్నింటికంటే ముఖ్యంగా, అమెరికాలో నివసిస్తున్న లక్షలాది భారతీయులను ఏ భారత ప్రభుత్వం విస్మరించగలదు? వారు అక్కడ డబ్బు సంపాదిస్తున్నారు. అమెరికా పౌరులుగానే భారతీయ టెలివిజన్ చర్చల్లో పాల్గొంటూ, ఇరాన్ లేదా పాలస్తీనా విషయంలో అమెరికా విధానాలను సమర్థిస్తున్నారు. దానికి భిన్నంగా, ఇరాన్ వద్ద మహమ్మద్ మరాండి లాంటి మేధావులు ఉన్నారు. ట్రంప్‌ను విమర్శించడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరు.
ప్రపంచవ్యాప్తంగా ఆయన కలిగించిన విధ్వంసాన్ని, అలాగే కేవలం 250 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న ఒక కొత్త దేశమైన అమెరికా భరించలేనంత నూతన సామ్రాజ్యవాద అహంకారంతో ప్రవర్తించేలా చేశాడని ఆయన బహిరంగంగా విమర్శిస్తారు.
అందువల్ల, ప్రపంచ రాజకీయాలు, చరిత్ర, దౌత్యంలోని సూక్ష్మతలు ఎంత క్లిష్టమైనవో మన “అర్బన్ నక్సల్స్”కు ఒకటి రెండు పాఠాలు నేర్పాల్సిన అవసరం ఉందని రచయిత వ్యంగ్యంగా చెబుతారు.
ట్రంప్ అప్పుడప్పుడు మోదీపై బహిరంగంగా చూపించే అవమానకరమైన ప్రవర్తనను కూడా, సముద్ర మథనంలో వెలువడిన విషాన్ని శివుడు మింగినట్లుగా, మోదీ భరిస్తున్నారని రచయిత ఎద్దేవా చేస్తారు.
ఇదంతా చూస్తూ, ట్రంప్ మర్యాదలేమిపై కోపంతో ఉన్న సాధారణ భారతీయులు మాత్రం ఒక ప్రశ్న అడుగుతున్నారు: “అసలు ట్రంప్‌కీ, మోదీ గారికీ తెలిసిన ఏ విషయం మనకు తెలియదు?”
ఆ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు, మాటలతోనైనా, దౌత్యపరంగానైనా, మరే రూపంలోనైనా అమెరికా లాంటి “వ్యూహాత్మక భాగస్వామి”కి ఎదురు నిలవాలని సలహా ఇవ్వడం కంటే అవివేకమైన సలహా ఇంకేముంటుంది? (మన నావికులు అంతర్జాతీయ సముద్ర జలాల్లో హత్యకు గురైనప్పటికీ, కనీసం “క్షమించండి” అని కూడా చెప్పని సందర్భాలు ఉన్నా సరే.)
కాబట్టి, యౌవనోత్సాహంతో కూడిన గర్వం కోసం ఇరాన్ అమెరికాకు ఎదురొడ్డి నిలబడదలచుకుంటే, బంగారం ఇంకా ఉన్న అమెరికాను మనం మాత్రం వదిలిపెట్టకూడదని రచయిత వ్యంగ్యంగా ముగిస్తారు. అందుకే మనం జీ7 సమావేశాలకు హాజరవుతూనే, బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తాం. ఇదంతా చాణుక్య సంచిలోని అమూల్యమైన వ్యూహాలలో ఒకటే అన్నట్లుగా రచయిత వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు.
(గమనిక: ఈ వ్యాసం మొత్తం వ్యంగ్య రచన. ఇందులో కనిపించే అనేక వ్యాఖ్యలు రచయిత నేరుగా సమర్థిస్తున్న అభిప్రాయాలు కావు. భారత విదేశాంగ విధానం, అమెరికాతో సంబంధాలు, సమకాలీన రాజకీయాలపై విమర్శను వ్యంగ్య రూపంలో వ్యక్తీకరించడానికి ఉద్దేశించినవి.)
స్వేచ్చాను వాదం: డి వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
