Reading Time: 2 minutes
రాజస్థాన్ నుంచి మరో బీజేపీ ఎంపీ గడచిన ఐదు సంవత్సరాలుగా సబ్సిడీ పొందుతున్నారని, వివరాలు చెప్పకుండా పార్లమెంట్లో సమాధానం ఇస్తూ ప్రభుత్వం వెల్లడించింది.
న్యూఢిల్లీ: వాణిజ్య దోసకాయ పంట కోసం తన సొంత శాఖ నుంచి తీసుకున్న రూ 99 లక్షల సబ్సిడీని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌధరి తిరిగి వెనక్కి ఇచ్చేసినట్లు, లోక్‌సభకు జులై 29న ప్రభుత్వం తెలియజేసింది.
బ్యాంకుకు సబ్సిడీ వాపస్..
“ఈ పథకం కింద ఉన్న బ్యాంకుకు సొంతంగా తీసుకున్న సబ్సిడీని తిరిగి చెల్లించినట్లు భగీరథ్ చౌధరి సమాచారం ఇచ్చారు. సబ్సిడీ మొత్తాన్ని ఎన్‌హెచ్‌బీకి తిరిగి అప్పజెప్పాలని సంబంధిత బ్యాంకును ఆదేశించినట్లు” లోక్‌సభలో జులై 28న ఒక ప్రశ్నపై స్పందిస్తూ ప్రభుత్వం చెప్పింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తు కథనం..
తన సొంత శాఖ కింద ఉన్న ఉద్యానవన పథకం ద్వారా సుమారు రూ 1 కోటి సబ్సిడీని చౌధరి అంగీకరించారన్న విషయంపై దర్యాప్తు వివరాలను సరిగ్గా నెల రోజుల క్రితం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ప్రచురించింది.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న స్వయంప్రతిపత్తి గల జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్‌హెచ్‌బీ) సబ్సిడీ నిర్వహణ, పంపిణీ చూసుకుంటుంది.
ఐఏఎస్ అధికారి కుటుంబానికీ మంజూరు..
వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్న మరో వివాదాస్పద సబ్సిడీ రాజస్థాన్ క్యాడర్ నుంచి ఉన్న 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారికి చెందిన అనేక మంది కుటుంబ సభ్యులకు మంజూరైంది.
వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద ఉన్న పశు సంవర్ధక, డెయిరీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన నరేశ్ పాల్ గాంగ్వార్‌కు మంజూరు చేశారు.
ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియామకం..
ఉన్నత విద్య పరీక్షా పద్ధతిలో తరచూ వైఫల్యాలపై దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం జులై 23న ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా గాంగ్వార్‌ను నియమించారు.
నిబంధనలకు మించి ప్రయోజనాలు..
గడచిన ఐదు సంవత్సరాలుగా ఆయన భార్య, తల్లి, కొడుకు మంత్రుల సబ్సిడీతో పాటు పొందుతున్న సబ్సిడీ అంకె పెద్దగా ఉన్నప్పటికీ రూ 1.16 కోట్లు పొందుతున్నారు.
ఈ పథకం కింద నిబంధనల ప్రకారం కుటుంబానికి రూ 1 కోటి సబ్సిడీ పొందే విధంగా పరిమితి విధించినట్లు కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఈ కుటుంబం సబ్సిడీని తిరిగి అప్పగించిందా లేక ప్రయోజనాలను ఆనందించడాన్ని కొనసాగిస్తుందా అనే విషయంపై ఇంత వరకు ఎలాంటి వార్తలు లేవు.
తృణమూల్ ఎంపీ ప్రశ్నకు బదులు..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ చౌధరి తీసుకున్న సబ్సిడీని తిరిగి చెల్లించినట్లు వ్యవసాయ విభాగం ప్రకటించింది.
జాతీయ ఉద్యానవన బోర్డు పథకాల కింద ఉన్న సబ్సిడీలను గత ఐదు సంవత్సరాలలో ప్రస్తుత మంత్రులు, పార్లమెంటు సభ్యులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా పొందారా అని, అభిషేక్ బెనర్జీ ప్రశ్న వేశారు.
సబ్సిడీ పొందిన మరో ఎంపీ..
రాజస్థాన్‌లోని జాలోర్ సిరోహి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో బీజేపీ ఎంపీ లుంబారామ్ చౌధరి కూడా గత ఐదు సంవత్సరాలుగా సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతున్నారని ప్రభుత్వం తెలియజేస్తూ, ఈ సబ్సిడీ గురించి మిగతా వివరాలను పంచలేదు.
ప్రయోజనాల వైరుధ్యంపై ప్రశ్నలు..
ప్రజా జీవితంలో ఉన్నవారికి లేదా వారి కుటుంబ సభ్యులకు సబ్సిడీ మంజూరును పరిశీలించినప్పుడు ఏమైనా “ప్రయోజనాల వైరుధ్యం లేదా తిరస్కరణ విధానం” ఉందా అని కూడా బెనర్జీ అడిగారు.
అర్హత ఆధారంగానే పరిశీలన..
ప్రభుత్వం లిఖితపూర్వకంగా స్పందిస్తూ తిరస్కరణ విధానం అంటూ ఏమీ లేదని తెలిపింది. “అయితే పథకం నిబంధనల ప్రకారం అర్హత కలిగిన దరఖాస్తులన్నిటినీ సమానంగా చూసి అర్హతనే ప్రాతిపదికగా తీసుకొని దాని ఆధారంగానే దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని” తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
