తమ సంపూర్ణ ఫలవంతమైన జీవితాన్ని భారతదేశంలో ప్రజలు అనుభవించకుండా కులం, వర్గం, మతం అనేక అడ్డంకులను కలిగిస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారతీయ పౌరసత్వపు సమానత్వం కాగితాలకే పరిమితమవుతుందని, ఆచరణలో ఎన్నో అసమానతలకు దారితీస్తుందని ఓ తాజా అధ్యయనం నిర్ధారించింది. పట్టణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న జీవన వాస్తవికతకు ఇది తాజా నిదర్శనం.
“పౌరసత్వం– అసమానతలు, పట్టణ ప్రాంత పాలనా వ్యవస్థలు” అనే అంశం మీద భారతదేశం- అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా పరిశోధించారు. ఎంపిక చేసిన నగరాలలో 15 ఏళ్ల నిడివిలో ఈ పరిశోధనలు జరిగాయి.
గత పదేహేనేల్ల కాలంలో ఆయా పట్టణాలలోని నివాస పొందికలో వస్తున్న మార్పులు, విస్తరిస్తున్న పట్టణీకరణ, పర్యవసానాలు, సామాజిక– రాజకీయ జీవితం వాటి ప్రభావాలను ఈ పరిశోధన అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా పరిశోధకులు పద్నాలుగు రాష్ట్రాలలో 31,803 కుటుంబాలను కలిశారు. ఆయా కుటుంబాలు అందుకునే పౌరసేవలు, ప్రభుత్వ పథకాలు– ప్రయోజనాలు, వారి రాజకీయ భాగస్వామ్యాన్ని కులం, మతం, వర్గం ఎలా ప్రభావితం చేస్తున్నాయో అధ్యయనం చేశారు. భారతీయుల జీవన ప్రమాణాలను నిర్ధారించే ముఖ్యమైన అంశంగా ‘వర్గం’ ఉన్నదని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.
ఈ తాజా అధ్యయనం, పట్టణ ప్రాంతాలలోని భారతీయులు ఎలా నివసిస్తున్నారు. ఎలా సంఘటితమవుతున్నారు. ఎలా ఓటు వేస్తున్నారు. త్రాగు నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సేవల లభ్యత ఏ ఏ తరగుతుల ప్రజలకు ఎలా ఉన్నదనే అంశాన్ని పరిశీలించింది. దీనికి సమర్థవంతమైన పౌరసత్వం అన్న భావనను పరిశోధకులు నిర్వచించారు.
దైనందిన సామాజిక రాజకీయ జీవితంలో భాగస్వాములు కావటం, ప్రభుత్వ సేవలు, పథకాలు, ప్రయోజనాలు పొందటాన్ని రెండు ప్రమాణాల ఆధారంగా సమర్థవంతమైన పౌరసత్వం భావనకు పరిశోధకులు ప్రాతిపాదిక కల్పించారు. ఈ రెండు రకాల అంశాలలో ప్రజల భాగస్వామ్యం ఆధారంగా పట్టణ ప్రాంతాలలోని భారతీయులు ఎంత మేరకు సమర్థవంతమైన పౌరసత్వాన్ని అనుభవిస్తున్నారో అధ్యయనం చేసేందుకు పరిశోధకులు ప్రయత్నించారు.
కులం– వర్గం మధ్య సంబంధం..
ఈ అధ్యయనంలో ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వర్గానికి ప్రతినిధులుగా పరిగణించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మొత్తం సర్వేలో పాల్గొన్న కుటుంబాలను 5 తరగతులుగా వర్గీకరించారు. ఇందులో మురికివాడలు, రేకుల షెడ్డులలో నివసించే కుటుంబాల మొదలు, ఉన్నత స్థాయి గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే కుటుంబాల వరకు ఉన్నాయి.
పట్టణాల విస్తరణ పెరిగేకొద్ది కనీస వనరులకు, సేవలకు, సౌకర్యాలకు నోచుకొని మురికివాడలలో నివసించే కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని ఈ పరిశోధన అంచనాకు వచ్చింది. ఉదాహరణకు కేరళలోని కొచ్చిన్‌లో కేవలం 1.4శాతం కుటుంబాలు మురికివాడలు, అంతగా పారిశుద్ధ్యంలేని ప్రాంతాలలో నివసిస్తుంటే, ముంబయిలోని జనాభాలో 62శాతం ఇటువంటి పరిస్థితులలో నివసిస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.
భోపాల్‌లో మినహా మిగిలినా అన్ని రాష్ట్రాలలోను మురికివాడలలో నివసిస్తున్న కుటుంబాలు; తాము ఆ స్థలాలను ఎప్పుడూ ఖాళీ చేయాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమని జీవితాన్ని గడుపుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. అయితే, ఈ పరిస్థితులలో పలు నగరాల మధ్య ఉన్న తేడాలు కూడా గణనీయమైన మోతాదులోనే ఉన్నాయని అధ్యయనం పేర్కొంటున్నది. ఉదాహరణకు కోల్‌కతాలో ఇటువంటి బేదఖళ్ల భయం దాదాపు లేదు. జలంధర్ నగరంలో ఎక్కువమంది కుటుంబాలు ఈ భయంతో బ్రతుకుతున్నాయి.
మురికి వాడలలో నివసిస్తున్న కుటుంబాలలో అత్యధికులు షెడ్యూల్డ్ క్యాస్ట్- తెగల కుటుంబాలకు చెందినవారున్నారు. సర్వే అంచనాల ప్రకారం, మురికివాడలలో నివసించే జనాభాలో 45శాతం దళితులు ఉంటే, 37శాతం షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలు, 16శాతం వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారుంటే, ఇతర కులాలకు చెందిన వాళ్లు 25శాతం ఉన్నారు. అంతేకాకుండా మెరుగైన, ఉన్నతమైన పౌరసేవలు అందుబాటులో ఉండే గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే దళితులు, షెడ్యూల్డ్ తెగల కుటుంబాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, చైన్నై, కోల్‌కతాలలో నివాస ప్రాంతాల మధ్య కులాలవారిగా స్పష్టమైన విభజన రేఖలు ఏర్పడ్డాయని ఈ అధ్యయనం గుర్తించింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఒకానొక సందర్భంలో గ్రామీణ ప్రాంతాలు దళితులతో నిండిపోయాయని, వీరు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తే కులకట్టుబాట్లు ఆచారవ్యవహారాల బంధనాల నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ పట్టణాల్లో సైతం కులం కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలు ఘనీణీభవించి ఉన్నాయని, వివిధ ప్రాంతాలలో అసమానతలకు ఈ కట్టుబాట్లు పునాదులు వేస్తున్నాయని అధ్యయనం నిర్ధారించింది.
పట్టణ ప్రాంతాలలో అమలవుతోన్న కులాధారిత విభజన, వివక్ష కొత్తరూపాలు సంతరించుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. కొన్ని పట్టణాలలో వెనుకబడిన తరగుతులు, ఇతర కులాలు(అగ్రకులాలు– జనరల్ క్యాస్ట్) మధ్య ఉన్న విభజన రేఖలకంటే మిగిలినవారితో విభజన రేఖలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఈ విధంగా చూసినప్పుడు కులవివక్షను వర్గం కూడా మరింతగా పెంచి పోషిస్తుందని పట్టణ ప్రాంతాల స్థూలనివాస చిత్రాన్ని(కాలనీలు, టౌన్‌షిప్‌ల అమరిక) పరిశీలిస్తే పట్టణ ప్రాంతాలలో కులం గ్రామీణ ప్రాంతాలతో సమానంగా ఘనీభవించిందని అర్థమవుతోంది.
ఆయా కుటుంబాల వర్గస్థితికి ఆ కుటుంబాలలోని సభ్యుల ఓటర్ల నమోదుకు కూడా సంబంధమున్నదని ఈ సర్వే గుర్తించింది. ఉదాహరణకు ముంబయి, జలంధర్, హైదరాబాద్ నగరాలలో ఎక్కువమంది తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకునేందుకు విఫలమైయ్యారు. మురికివాడలలో నివసించే జనాభాలో దాదాపు 50శాతం మంది తాజా ఓటర్లుగా నమోదుకావడంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రధాన వాడలలో నివసిస్తున్న 74శాతం తేలికగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లుగా నమోదు కాగలగుతున్నారు. ఈ పరిణామం సార్వత్రిక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యనే భావనకు ముప్పు తెచ్చిపెట్టేదిగా ఉండబోతోంది. అన్న ఆందోళనను ఈ ప్రాజెక్టులో పాల్గొన్న పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిసగం కుటుంబాలు జీవనోపాధికోసం సొంత ఊర్ల నుంచి వలస వచ్చినవారే ఉన్నారు. ఈ విధంగా వలసవచ్చినవారిని; ప్రత్యేకించి వలస వచ్చిన దళితులు, షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందినవారికి మురికివాడలు ఆశ్రయం ఇచ్చినంత తేలికగా, తొందరగా పట్టణ ప్రధానవాడలలో ఆశ్రయం దొరకడం లేదు. దీనికి భిన్నంగా పట్టణ ప్రధానవాడలలో దీర్ఘకాలంగా స్థిరపడిన ఉన్నతకులాలు, వర్గాలకు చెందిన కుటుంబాలే నివసిస్తున్నాయి. పట్టణ దయనందిన జీవితంలో కులం, మతం తమవంతు పాత్రను పోషిస్తున్న శాంతిభద్రతల వ్యవస్థ; ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ వివక్షతను ప్రదర్శించడంలో వర్గమే కీలకపాత్రను పోషిస్తోంది.
ప్రజలు అందుకునే పౌరసేవల విషయంలో కూడా వివిధ నగరాల మధ్య చెప్పుకోదగిన వ్యత్యాసాలున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం, గుజరాత్‌లోని ఆవ్నగర్, వడోదర, కేరళలోని కొచ్చిన్ నగరాలలో పౌరసేవల లభ్యత మెరుగ్గా ఉంటే చెన్నై, ముంబైలలో నాసిరకంగా ఉంది. కొచ్చిన్ మినహా మిగిలిన అన్ని నగరాలలోనూ రోజుకు గంటా రెండుగంటల మినహా నీటి సరఫరా ఉండడం లేదు. పైగా మురికివాడలలో నివసించే ప్రజానికానికి అవసరమైన కనీస మోతాదులో నీటి లభ్యత ఉండడం లేదని తాజా అధ్యయనంలో రుజువైంది. పరశోధన జరిగిన నగరాలలో 23శాతానికి మాత్రమే రోజంతా నీటి లభ్యత ఉంటోంది. పారిశుద్ధ్యం విషయంలో కూడా ఇవే పరిస్థితులు వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. కొచ్చిన్, వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీలలో మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందుబాటులో ఉంటే, ఈ విషయంలో ముంబయి అట్టడుగు స్థాయిలో ఉంది. అన్ని నగరాలలోని మురికివాడలలో, మురికివాడల పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం నామమాత్రమే. ఈ విషయాలు పరిశీలించినప్పుడు కులం, మతం కంటే, ఆయా కుటుంబాలు ఏ వర్గానికి చెందాయన్న దాన్నిబట్టే ఆయా కుటుంబాలు ఏ రకమైన పౌరసేవలు పొందుతున్నాయో నిర్ధారణవుతుంది.
మతపరమైన వ్యత్యాసాలు..
ముస్లింలు పొందే పౌరసేవల విషయంలో ఇటువంటి వివక్ష వ్యత్యాసం వ్యక్తమవుతున్నాయి. అధ్యయనం జరిగిన 14 నగరాలకు కాను 10 నగరాలలో ముస్లింలు అత్యధికంగా మురికివాడలలోనే నివసిస్తున్నారు. మెరుగైన సేవలు అందుబాటులో ఉండే ప్రధాన పట్టణ వాడలు, గేటెడ్ కమ్యూనిటీలలో ముస్లిం కుటుంబాల ఉనికి నామమాత్రమే. కానీ, కొచ్చిన్, చైన్నై, భోపాల్, ఢిల్లీలలో మిగిలిన నగరాలకంటే పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నగరాలలో ముస్లింలు నిర్దేశిత ప్రాంతాలలో కేంద్రీకరించబడి ఉంటున్నారు. ఉదాహరణకు ఎక్కువ సంఖ్యలో ముస్లింలు నివసించే ఢిల్లీలోని షాహిన్బాగ్లాంటి ప్రాంతాలను పరిపాలన యంత్రాంగం అనధికార మురికివాడలుగా పరిగణిస్తోంది.
సమాజ నిర్మాణంలో ముస్లింల భాగస్వామ్యం ఏమీ లేదనే మతోన్మాద దుష్ప్రచారాలకు భిన్నంగా శ్రమజీవులలో రాజకీయ, పౌర కార్యక్రమాలలో హిందువులకంటే ముస్లింలే ఎక్కువగా పాల్గొంటున్నారని ఈ అధ్యయనం నిర్ధారించింది.
సామాజిక వివక్ష..
అధ్యయనానకి ఎంపిక చేసిన నగరాలన్నీ వందల సంవత్సరాల చరిత్ర కలిగినవే ఉన్నాయి. అయినప్పటికీ, ఈ నగరాలలో కలివిడితో కూడిన సామాజిక జీవనం అభివృద్ధి చేసే దశకు చేరుకోలేదు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులందరూ తమకున్న స్నేహం, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఆయా కులాలు, మతాలు విధించిన పరిమిత చట్రానికి లోబడే ఉంటున్నాయని వెల్లడించారు. కేవలం కొచ్చిన్, చైన్నైలలో సామాజిక సంబంధాలు, కులచట్రం, మతవ్యవస్థ పరిధులను అధిగమించి ఉన్నట్టుగా అధ్యయనం గుర్తించింది.
ధార్మిక ప్రదేశాలకు ఎవరినైనా అనుమతించే విషయంలో ఈ కట్టుబాట్లు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఎక్కువ నగరాలలో లౌకిక జీవనం వేళ్లూనుకోలేదు. ఓ మతం పవిత్ర స్థలానికి మరో మతానికి చెందిన వారిని రానివ్వకుండా బలీయమైన అనధికారిక ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ విషయంలో కాస్తింత ఢిల్లీ పరిస్థితి మెరుగ్గా ఉంది.
కాగితాలకే పరిమితమైన సమానత్వం..
రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానపౌరసత్వం భావన నేటికి కాగితాలకే పరిమితమైందని అల్పసంఖ్యాకులు, దళితులు, ఆదివాసీ తెగలకు చెందినవారు మౌలిక పౌర సేవలు పొందడంలోనూ, సామాజిక– రాజకీయ హక్కులను అనుభవిచండంలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారు. ఈ పరిశీలనల వెలుగులో తాజా అధ్యయనం కులం, మతం, వర్గమనే మూడు సామాజిక అస్తిత్వాల కారణంగా పౌరులు భారతదేశంలో సంపూర్ణమైన, ఫలవంతమైన అవకాశాలను, సేవలను పొందలేకపోతున్నారని, హక్కులను అనుభవించలేకపోతున్నారని నిర్ధారించింది.
రాజ్యాంగం సమానపౌరసత్వానికి హామీ ఇచ్చినప్పటికీ, పట్టణ జీవనంలో పౌరసత్వం పట్ల వివక్ష, విభజన రేఖలు అమలులో ఉన్నాయి. సాధారణ ప్రజలు ఎంత మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారనే అంశం ఆయా కుటుంబాలు ఏ వర్గానికి చెందినవనే సామాజిక, ఆర్థిక వాస్తవికతతో ముడిపడి ఉంటే– మతపరమైన, కులపరమైన మైనార్టీలు పౌరజీవనంలో సంపూర్ణ భాగస్వామ్యం పొందలేని విధంగా కుల–మత విభజన రేఖలు చెలామణిలో ఉన్నాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
