భారత్‌లో ఇంధన ధరల పెంపు కేవలం 3 శాతమే ఉందంటూ జరుగుతున్న ప్రచారం ఒక స్వల్పకాలిక వ్యవధిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఇంధన ప్రారంభ ధరను విస్మరించి చేస్తున్న తప్పుదోవ పట్టించే వాదన.
గతంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా పతనమైనప్పుడు, ఆ మేరకు భారత్ దేశీయంగా ఇంధన ధరలను తగ్గించలేదు.
అంటే, బేస్ ధర అప్పటికే అత్యధిక స్థాయిలో ఉందన్న విషయాన్ని ఇది విస్మరిస్తోంది.
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా, యూఏఈ, కెనడా వంటి దేశాల్లో ఇంధన ధరలు 30% నుంచి 80% వరకు పెరగ్గా, భారత్‌లో మాత్రం ఆ పెరుగుదల కేవలం 3% మాత్రమే ఉందని ప్రభుత్వ అనుకూల జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చార్టులు షేర్ చేస్తున్నారు.
ధరల స్థిరీకరణలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, మోదీ ప్రభుత్వం వినియోగదారులను ఎంతగానో రక్షిస్తోందని ఈ చార్టుల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ, ఈ డేటా అనేది కేవలం ఒక నిర్దిష్ట సమయంలో మార్కెట్ ఆధారిత దేశాలు ఎదుర్కొన్న ఆకస్మిక ఒడిదుడుకులను మాత్రమే ప్రతిబింబించే తాత్కాలిక చిత్రం.
పశ్చిమాసియాలో సంక్షోభం తలెత్తక ముందు నుంచే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి.
ఈ పదేళ్ల కాలంలో భారతీయ వినియోగదారుల వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సమగ్రమైన డేటా అవసరం.
అసలు మోసం ‘బేస్ ఎఫెక్ట్’లోనే..
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ డేటా తప్పుదోవ పట్టించడానికి ప్రధాన కారణం ‘బేస్ ఎఫెక్ట్’.
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనమైనప్పుడు కూడా దేశీయంగా పెట్రోల్ పంపుల వద్ద ధరలు తగ్గకపోవడానికి కారణం- మోదీ ప్రభుత్వం ఆ ధరలపై ఉంచిన నియంత్రణే.
ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా, సెస్‌లు, ఎక్సైజ్ డ్యూటీలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం భారీగా లాభాలు గడించింది.
అలాగే, ఈ డేటా ఒక నిర్దిష్ట స్వల్పకాలిక సమయంలో ఇంధన ధరల పెరుగుదలను కేవలం శాతాల రూపంలో చూపిస్తోంది.
గణితశాస్త్ర పరంగా ఆ లెక్కలు సరైనవే అయినప్పటికీ, ఆచరణాత్మకంగా చూస్తే అది అసంపూర్ణమైన విశ్లేషణ.
అమెరికా, యూఏఈ వంటి దేశాల్లో దేశీయ ధరలు నేరుగా ప్రపంచ ముడిచమురు ధరలతో అనుసంధానమై ఉంటాయి.
కాబట్టి గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు, ఆ దేశాల రిటైల్ ఇంధన ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది.
పదేళ్ల లెక్కలు తీస్తే.. అసలు వాస్తవం ఇదే..
మనోజ్ అరోరా విశ్లేషించినట్టుగా ఈ డేటాను పదేళ్ల కాలవ్యవధికి విస్తరించి చూస్తే, వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టినా, దానికి అనుగుణంగా దేశీయంగా ధరలు తగ్గలేదన్న వాస్తవం ఈ దీర్ఘకాలిక విశ్లేషణలో స్పష్టమవుతుంది.

ఈ పదేళ్ల కాలంలో అమెరికాలో 36%, జర్మనీలో 40%, దక్షిణ కొరియాలో 39% మేర ఇంధన ధరలు పెరగ్గా- భారత్‌లో మాత్రం ఆ పెరుగుదల ఏకంగా 63 శాతంగా ఉంది. ఈ జాబితాలో 67% పెరుగుదలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, గత దశాబ్ద కాలంలో ఇంధన ధరల ద్రవ్యోల్బణంలో భారత్ కూడా అగ్రశ్రేణిలోనే కొనసాగుతోంది.
ప్రభుత్వ అనుకూల జర్నలిస్టులు చేస్తున్న ‘తక్కువ పెంపు’ ప్రచారానికి ఈ గణాంకాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

ప్రధాని మోదీ హయాంలో పెట్రోల్ పంపుల వద్ద ధరలను కృత్రిమంగా గరిష్ఠ స్థాయిలోనే ఉంచడం వల్ల, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్‌లో స్వల్పకాలిక శాతం పెంపు ఎప్పుడూ తక్కువగానే కనిపిస్తుంది. కానీ గత పదేళ్ల కాలవ్యవధిలో, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతీయులే అత్యంత తీవ్రమైన ఇంధన ధరల పెంపును ఎదుర్కొన్నారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
