ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య హక్కును సాధించే అసంపూర్ణ ప్రయాణం: జీవితం–మరణం మధ్య పోరాటం పుస్తకం నుంచి కొంత భాగం. ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది రెండవ భాగం. మొదటి భాగం కోసం , రెండవ భాగం కోసం క్లిక్ చేయండి.
ఈ అవగాహనను అంతర్జాతీయ సంస్థలు వెంటనే స్వీకరించలేదు. ఈ దృక్పథం ప్రపంచవ్యాప్తంగా అంగీకారం పొందడానికి చాలా కాలం పట్టింది.
అయితే నేడు ప్రజారోగ్య రంగంలో ఆరోగ్యాన్ని నిర్ణయించే సామాజిక అంశాల ప్రాధాన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ): ఆరోగ్యాన్ని నిర్ణయించేది వైద్యం మాత్రమే కాదు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక నిర్ణాయక అంశాల గురించి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది.
దాని ప్రకారం, ఇవి వైద్యానికి నేరుగా సంబంధించిన అంశాలు కాకపోయినా ప్రజల ఆరోగ్య ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేసే పరిస్థితులు.
ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలాంటి కుటుంబంలో జన్మించాడు, ఎలా పెరిగాడు, ఎలాంటి పని చేస్తున్నాడు, ఎక్కడ నివసిస్తున్నాడు, వృద్ధాప్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో గడుపుతున్నాడు లాంటి అంశాలు ఉంటాయి.
అలాగే ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే విస్తృతమైన వ్యవస్థలు కూడా ఇందులో భాగమే.
వీటిలో ఆర్థిక విధానాలు, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విధానాలు, సామాజిక విలువలు, సామాజిక విధానాలు, రాజకీయ వ్యవస్థలు లాంటి అంశాలు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించింది.
పేదరికంలో జీవిస్తున్న ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని అది స్పష్టం చేస్తుంది.
డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయం ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల్లో—అవి ధనిక దేశాలైనా లేక పేద దేశాలైనా సామాజిక–ఆర్థిక స్థితి ఎంత దిగువన ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యం అంత దయనీయంగా ఉండే అవకాశం ఎక్కువ. అంటే పేదరికం, ఆరోగ్య అసమానతల మధ్య బలమైన సంబంధం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెబుతోంది.
ఆరోగ్య సేవల కంటే సామాజిక పరిస్థితుల ప్రభావమే ఎక్కువ..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది.
అనేక శాస్త్రీయ పరిశోధనలు, అనుభవాధారిత అధ్యయనాలు ఒకే విషయాన్ని స్పష్టంగా నిరూపించాయని అది పేర్కొంటుంది.
ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో సామాజిక నిర్ణాయక అంశాల ప్రభావం, చాలా సందర్భాల్లో కేవలం వైద్య సేవలు లేదా వ్యక్తిగత జీవనశైలి ఎంపికల కంటే ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.
అధ్యయనాల అంచనాల ప్రకారం ప్రజల ఆరోగ్య ఫలితాల్లో సుమారు 30 నుంచి 55 శాతం వరకు ప్రభావం ఈ సామాజిక నిర్ణాయక అంశాల వల్లనే ఏర్పడుతుంది.
అంటే పేదరికం, విద్య, ఉపాధి, నివాసం, పోషకాహారం, పరిశుభ్రత, సామాజిక భద్రత లాంటి అంశాలు ప్రజల ఆరోగ్యంపై అత్యంత కీలకమైన ప్రభావం చూపుతాయి.
డబ్ల్యూహెచ్ఓ మరో కీలకమైన విషయాన్ని కూడా చెబుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆరోగ్య శాఖ ఒక్కటే కాదు విద్య, ఉపాధి, గృహనిర్మాణం, తాగునీరు, పారిశుద్ధ్యం, సామాజిక సంక్షేమం, ఆర్థిక విధానాలు లాంటి ఆరోగ్యేతర రంగాల పాత్ర కూడా చాలా సందర్భాల్లో ఆరోగ్య రంగం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
ఈ అవగాహన ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని నిజంగా మెరుగుపరచాలంటే ఆసుపత్రులు, వైద్యులు, మందుల సంఖ్య పెంచడం మాత్రమే సరిపోదు.
సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించే విధానాలు కూడా అంతే పెంపొందించడం అవసరం.
ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సామాజిక నిర్ణాయక అంశాలు ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక సామాజిక నిర్ణాయక అంశాలను గుర్తించింది. ఇవి ప్రజల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపవచ్చు, లేదా ప్రతికూల ప్రభావం కూడా చూపవచ్చు. అంటే ఈ అంశాలు ఎలా ఉంటాయన్నదానిపై ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్న ముఖ్యమైన సామాజిక నిర్ణాయక అంశాలు..
ఆదాయం, ఆర్థిక స్థితి, సామాజిక రక్షణ, విద్య, నిరుద్యోగం, అలాగే ఉద్యోగ భద్రత లేకపోవడం, పని ప్రదేశంలోని పరిస్థితులు, ఆహార భద్రత, నివాసం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ లాంటి ప్రాథమిక సౌకర్యాలు, పర్యావరణం, సామాజిక బహిష్కరణ, వివక్ష, యుద్ధాలు, ఘర్షణలు.
ఈ అంశాలన్నీ కలిసి ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని, అతని జీవన నాణ్యతను, అలాగే వ్యాధుల పట్ల అతని సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడాలంటే వైద్య సేవలతో పాటు ఈ సామాజిక, ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరచడం అత్యంత అవసరమని డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెబుతోంది.
మానవ హక్కుల పరిశోధన కేంద్రం గమనించిన దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజల ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది.
2016లో అల్ప, మధ్య-ఆదాయ దేశాలలో సంభవించిన 15 మిలియన్ల అకాల మరణాలకు అంటువ్యాధులు కాని వ్యాధులే అత్యంత సంభావ్య కారణం.
అంతేకాకుండా ఐరోపా ప్రాంతాలతో పోలిస్తే ఆఫ్రికా ప్రాంతాలలో ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ఎనిమిది రెట్లకు పైగా ఎక్కువగా ఉంది.
ఆరోగ్య హక్కు అంటే కేవలం వైద్య సేవల హక్కు మాత్రమే కాదు..
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ తన 22వ సమావేశంలో 2000 ఆగస్టు 11న విడుదల చేసిన జనరల్ కామెంట్ నం. 14 ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సామాజిక నిర్ణాయక అంశాలను మరింత విస్తృతంగా వివరించింది.
ఈ కమిటీ అభిప్రాయం ప్రకారం ఆరోగ్య హక్కు అనేది ఇతర మానవ హక్కుల అమలుతో విడదీయరాని సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఇతర ప్రాథమిక హక్కులు నెరవేరకపోతే ఆరోగ్య హక్కు కూడా పూర్తిగా సాకారం కాదని అది స్పష్టం చేసింది.
ఈ హక్కులతో అనుసంధానమైన ప్రధాన అంశాలు..
తగిన ఆహారం, పోషకాహారం, సురక్షితమైన నివాసం, స్వచ్ఛమైన తాగునీరు, తగిన పారిశుద్ధ్యం, సురక్షితమైన పని పరిస్థితులు, ఆరోగ్యకరమైన వృత్తి, పర్యావరణ పరిస్థితులు, ఆరోగ్యానికి సంబంధించిన విద్య, సమాచారం—ప్రత్యేకంగా లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం గురించి అవగాహన, మానవ గౌరవం, వివక్షకు గురికాకుండా ఉండే హక్కు, సమానత్వం, హింస, చిత్రహింసల నుంచి రక్షణ, వ్యక్తిగత గోప్యత, సమాచారం పొందే హక్కు, అలాగే సంఘాలు ఏర్పాటు చేసుకునే, సమావేశమయ్యే, స్వేచ్ఛగా సంచరించే హక్కులు.
ఈ కమిటీ స్పష్టం చేసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్య హక్కు అంటే కేవలం సమయానికి మంచి వైద్య చికిత్స అందుకోవడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన ఈ సామాజిక, ఆర్థిక, పౌర హక్కులన్నీ కూడా అందుబాటులో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్య హక్కు నిజమైన అర్థంలో అమలవుతుందని కమిటీ పేర్కొంది.
ఆరోగ్య హక్కును కాపాడడం అంటే ప్రభుత్వ బాధ్యతలు ఆసుపత్రులతోనే ముగియవు..
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ అభిప్రాయం ప్రకారం ఆరోగ్య హక్కును అమలు చేయాలంటే ప్రభుత్వం కేవలం మంచి ఆసుపత్రులు నిర్మించడం, వైద్య సేవలను అందుబాటులో ఉంచడం మాత్రమే కాదు. అంతకంటే విస్తృతమైన బాధ్యతలను కూడా నిర్వర్తించాలి.
ఈ బాధ్యతల్లో ముఖ్యమైనవి: కార్మిక హక్కులను రక్షించడం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని పరిస్థితులు కల్పించడం, పనికి సంబంధించిన వ్యాధులు, ప్రమాదాలను నివారించడం.
విద్యార్థులకు పరిశుభ్రమైన, గౌరవప్రదమైన వసతి, అలాగే స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడడం.
వృద్ధాప్య పింఛన్లతో సహా సమగ్ర సామాజిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం.
ప్రజలు రేడియేషన్, హానికర రసాయనాలు, కలుషిత గాలి, కలుషిత నీరు లాంటి ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదాల నుంచి రక్షణ పొందేలా చర్యలు తీసుకోవడం.
బాల్య వివాహాలు, మహిళల జననేంద్రియ వికృతి, మగ పిల్లలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే ఆహారం, సంరక్షణ లాంటి మహిళలు, పిల్లల ఆరోగ్యానికి హానికరమైన సంప్రదాయాలను నిర్మూలించడం.
వికలాంగ పిల్లలు గౌరవప్రదమైన, సంతృప్తికరమైన జీవితం గడపడానికి, తమ సమాజంలో సమానంగా భాగస్వామ్యం కావడానికి అవసరమైన అవకాశాలు, మద్దతు కల్పించడం.
ఈ దృక్పథం చెప్పే ప్రధాన విషయం ఏమిటంటే ఆరోగ్య హక్కు అనేది వైద్య సేవల హక్కుతో మాత్రమే పరిమితం కాదు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన సురక్షితమైన పని, పరిశుభ్రమైన వాతావరణం, సామాజిక భద్రత, సమానత్వం, వివక్షలేని జీవనం లాంటి అన్ని ప్రాథమిక పరిస్థితులను కల్పించడం కూడా ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యతే.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
