19వ శతాబ్దంలో యూరోపియన్ సామ్రాజ్యవాద శక్తులు ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో తమ వలస సామ్రాజ్యాలను విస్తరిస్తున్న కాలంలో ఫ్రాన్స్ ఇండోచైనాపై ఆధిపత్యం ఏర్పరచుకుంది.
వియత్నాం, లావోస్, కంబోడియా ప్రాంతాలు కలిపి “ఫ్రెంచ్ ఇండోచైనా”గా పిలుస్తారు. ఫ్రెంచ్ వలస పాలన వియత్నాం ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా తమ అవసరాలకు అనుగుణంగా మార్చింది.
వ్యవసాయ భూముల్లో పెద్ద ఎస్టేట్లు పెరిగాయి. రబ్బరు తోటలు, బియ్యం ఉత్పత్తి, గనులు, వాణిజ్య రంగాల్లో వలస పెట్టుబడిదారుల ప్రభావం పెరిగింది.
భూమి కేంద్రీకరణ పెరిగింది. గ్రామీణ రైతాంగంలో అప్పులు, కౌలు, పన్నుల భారాలు పెరిగాయి.
అదే సమయంలో వలస ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో కొత్త కార్మిక వర్గం కూడా ఏర్పడింది. ఫ్రెంచ్ వలస పాలనలో భూస్వాములు–రైతుల మధ్య విభేదాలు మరింత పెరగడంతో పాటు కార్మిక వర్గం, బూర్జువా, పెటి బూర్జువా వర్గాలు కూడా తయారయ్యాయి.
వలసవాదం ఒక వైపు ప్రజలను దోపిడీ చేస్తూనే, మరో వైపు దానికి సమాధి కట్టే ఆధునిక రాజకీయ, కార్మిక, జాతీయవాద ఉద్యమాలకు సామాజిక పునాదులను కూడా ఏర్పరచుకుంది.
జాతీయ విముక్తి ఉద్యమ నాయకుడు – హో చి మిన్..
హోచి మిన్ లేకుండా వియత్నాం స్వాతంత్ర్య పోరాటం లేదని చెప్పాలి. ఆయన అసలు పేరు న్గుయెన్ సిన్ కుంగ్. 1911లో యువకుడిగా వియత్నాం విడిచి ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సందర్శించారు.
ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా తదితర ప్రాంతాల్లో నివసిస్తూ వలస వాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్మిక ఉద్యమాలను దగ్గరగా పరిశీలించారు. రష్యా విప్లవం ఆయన ఆలోచనలపై బలమైన ప్రభావం చూపింది.
దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని సామాజిక విముక్తితో అనుసంధానించే రాజకీయ దృక్పథానికి ఆయన క్రమంగా చేరుకున్నారు.
1925లో చైనాలోని గ్వాంగ్జౌలో విప్లవ కార్యకర్తలను సంఘటితం చేశారు. 1930లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
హో చి మిన్ రాజకీయ వ్యూహంలో ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. ఆయన కమ్యూనిస్టు అయినప్పటికీ తక్షణ ప్రధాన లక్ష్యంగా “ముందుగా జాతీయ స్వాతంత్ర్యం” అనే నినాదం ఇచ్చాడు. ఆ విధంగా రైతులు, కార్మికులు, మధ్యతరగతి, మేధావులు, జాతీయ వాదులు వంటి విస్తృత వర్గాలను ఒకే వలస వ్యతిరేక ఉద్యమంలో సమీకరించాడు. 
వియట్ మిన్ ఏర్పాటు..
1941లో హోచి మిన్ తిరిగి వియత్నాంకు వచ్చారు. ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. ఫ్రాన్స్ నాజీ జర్మనీ చేతిలో ఓడిపోయింది.
ఇండోచైనాలో జపాన్ తన సైనిక ప్రభావాన్ని విస్తరించింది. అంటే వియత్నాం ప్రజలు ఒక వైపు ఫ్రెంచ్ వలస వ్యవస్థ, మరో వైపు జపాన్ సైనిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా ద్విముఖ పోరాటం చేశారు.
ఈ నేపథ్యంతో వియట్ నామ్ డాక్ లాప్ డాంగ్ మిన్ – వియట్ మిన్ అనే జాతీయ విముక్తి సమాఖ్య ఏర్పడింది.
హోచి మిన్ నాయకత్వంలోని వియట్ మిన్ సాయుధ దళాలు, గ్రామీణ స్థావరాలు, రాజకీయ సంఘటనలను నిర్మించింది.
1945లో ప్రపంచ రాజకీయ పరిస్థితి వేగంగా మారింది. మే 1945లో నాజీ జర్మనీ ఓడిపోయింది. ఆగస్టులో అమెరికా హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది.
అదే సమయంలో సోవియట్ రెడ్ ఆర్మీ జపాన్‌పై యుద్ధంలోకి ప్రవేశించి మంచూరియాలోని క్వాంటుంగ్ ఆర్మీపై భారీ దాడి చేసింది.
1945 – ఆగస్టు విప్లవం..
1945 ఆగస్టు మధ్యలో వియట్ మిన్ దేశవ్యాప్త తిరుగుబాటుకు పిలుపునిచ్చింది. ఆగస్టు 19న హనోయిలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 23న హ్యుయే, ఆగస్టు 25న సైగాన్.
కొద్ది రోజుల్లో అనేక ప్రాంతాలు విప్లవ శక్తుల ఆధీనంలోకి వచ్చాయి. కేవలం 12 రోజుల్లోనే పాత వలస–రాచరిక పాలనా వ్యవస్థ కూలిపోయింది.
ఆగస్టు 30న బావో దాయి చక్రవర్తి సింహాసనం విడిచి పరారైనాడు. దాంతో శతాబ్దాల పాటు కొనసాగిన రాజరిక పాలన ముగిసింది.
1945 సెప్టెంబర్ 2 – స్వాతంత్ర్య ప్రకటన..
హనోయిలోని బా దిన్ స్క్వేర్‌లో హో చి మిన్ భారీ ప్రజా సమూహం ముందు నిలబడి వియత్నాం స్వాతంత్ర్య ప్రకటన చదివారు.
ఆ ప్రకటనలో ఆయన అమెరికా 1776 డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్‌లోని సహజ హక్కుల భావనను, ఫ్రెంచ్ విప్లవ హ్యూమన్ అండ్ సిటిజన్ రైట్స్ డిక్లరేషన్‌ను ప్రస్తావించడం విశేషం. దీనిలోని రాజకీయ సందేశం ఏమంటే “వ్యక్తులకు స్వేచ్ఛ, సమానత్వం హక్కులైతే, ప్రజలకు, జాతులకు స్వాతంత్ర్యం కూడా అంతే హక్కు”. అంటే ఫ్రాన్స్ స్వేచ్ఛ, సమానత్వం గురించి ప్రపంచానికి బోధిస్తూ వియత్నాంను వలసగా పాలించడం విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశ పరిస్థితి..
స్వాతంత్ర్య ప్రకటనతో అన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వ పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంది.
దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం, నిరక్షరాస్యత, పరిమిత ఆర్థిక వనరులు, విదేశీ సైనిక శక్తుల ప్రమాదం, ఫ్రాన్స్ తిరిగి తన వలస ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. ఇన్ని సమస్యల మధ్య హో చి మిన్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే అత్యవసర కార్యక్రమాలను చేపట్టింది. అందులో ప్రధానంగా ఆకలి నివారణ, ఆహార ఉత్పత్తి పెంపు, నిరక్షరాస్యత నిర్మూలన, సార్వత్రిక ఓటు హక్కుతో ఎన్నికలు, ప్రజాస్వామ్య రాజ్యాంగం, వలస కాలం పన్నుల రద్దు వంటి అంశాలు ఉన్నాయి.
1946 జనవరి 6న జాతీయ ఎన్నికలు జరిగాయి. తరువాత మొదటి రాజ్యాంగం ఆమోదించబడింది.
ఫ్రాన్స్ తిరిగి రావడం – మొదటి ఇండోచైనా యుద్ధం..
ఫ్రాన్స్ తన పాత వలస సామ్రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. 1946 చివరికి వియత్నాం–ఫ్రాన్స్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైంది.
ఇది ఫస్ట్ ఇండోచైనా వార్ – 1946–1954. ప్రారంభ దశలో ఫ్రెంచ్ సైన్యానికి ఆధునిక ఆయుధాలు, విమానాలు, ఆర్థిక శక్తి ఉన్నాయి. వియట్ మిన్కు అవి చాలా తక్కువ. కానీ వియత్నాం నాయకత్వం దీర్ఘకాలిక ప్రజా యుద్ధ వ్యూహాన్ని అనుసరించింది.
హోచి మిన్ రాజకీయ నాయకత్వానికి సైనిక రంగంలో కీలకమైన సహచరుడు జనరల్ వో న్గుయెన్ జియాప్. ఆయన సైనిక అకాడమీ నుంచి వచ్చిన జనరల్ కాదు. చరిత్ర అధ్యాపకుడిగా పనిచేసిన వ్యక్తి. కానీ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన గెరిల్లా–ప్రజా యుద్ధ వ్యూహకర్తల్లో ఒకరిగా ఎదిగారు.
వియట్ మిన్ వ్యూహం గెరిల్లా పోరాటం -> శత్రువును బలహీన పరచడం -> విముక్త ప్రాంతాలు -> సాంప్రదాయ సైనిక దళాల నిర్మాణం -> నిర్ణాయక యుద్ధాలు అనే దశల్లో అభివృద్ధి చెందింది.
చైనా విప్లవ విజయం – వియత్నాంకు కీలక మలుపు..
1949లో చైనా విప్లవం విజయం సాధించి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. ఇది వియత్నాం యుద్ధంలో సమీకరణాన్ని మార్చింది. చైనా సరిహద్దు ద్వారా వియట్ మిన్కు ఆయుధాలు, సరఫరాలు, శిక్షణ అందే అవకాశం పెరిగింది.
అదే సమయంలో సోవియట్ యూనియన్ కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంను గుర్తించింది. దీంతో వియత్నాం పోరాటం ప్రపంచ ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాల్లో భాగమైంది.
ఇక్కడ మరో విరుద్ధ అంశం గమనించాలి. ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ ముసుగులో కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవాలనే లక్ష్యంతో ఫ్రాన్స్‌కు ఇండోచైనా యుద్ధంలో పెద్ద ఎత్తున ఆర్థిక, సైనిక సహాయం చేసింది. అంటే ఫ్రాన్స్–వియత్నాం వలస యుద్ధం క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధ పోటీలో భాగమైంది.
ఫ్రాన్స్ ఉత్తర వియత్నాంలోని డియన్ బియెన్ ఫూ ప్రాంతంలో భారీ సైనిక స్థావరం ఏర్పాటు చేసింది. ఫ్రెంచ్ నాయకత్వం వియట్ మిన్ను అక్కడ పెద్ద యుద్ధానికి లాగి నాశనం చేయవచ్చని భావించింది. కానీ జియాప్ వ్యూహం(స్వాతంత్ర్య వియత్నాం) దీనిని పూర్తిగా తారుమారు చేసింది.
పర్వత ప్రాంతాల్లో భారీ ఫిరంగులను మానవ శ్రమతో తరలించారు. సరఫరా మార్గాలు నిర్మించారు. కందకాలను క్రమంగా ఫ్రెంచ్ స్థావరాల వైపు విస్తరించారు.
చివరకు 1954 మే 7న డియన్ బియెన్ ఫూ ఫ్రెంచ్ చేతుల నుంచి పడిపోయింది. ఈ ఓటమి తర్వాత ఇండోచైనా నుంచి వెనక్కి వెళ్లాల్సిన స్థితికి ఫ్రాన్స్ నెట్టబడింది. ఇది ప్రపంచ వలస చరిత్రలో గొప్ప ప్రతీకాత్మక విజయం.
ఒక ఆసియా వలస దేశ ప్రజా సైన్యం ఒక పెద్ద యూరోపియన్ వలస సైన్యాన్ని కీలక యుద్ధంలో ఓడించింది. ఈ విజయంతో అల్జీరియా సహా ప్రపంచంలోని అనేక వలస వ్యతిరేక ఉద్యమాలకు కొత్త ధైర్యం వచ్చింది.
1954 జెనీవా ఒప్పందాలు..
డియన్ బియెన్ ఫూ తర్వాత జెనీవాలో చర్చలు జరిగాయి. ఫ్రాన్స్, వియత్నాం, సోవియట్ యూనియన్, చైనా, బ్రిటన్, అమెరికా తదితర పక్షాలు ఇందులో పాల్గొన్నాయి.
వియత్నాం తాత్కాలికంగా 17వ సమాంతర రేఖ వద్ద విభజించబడింది. ఉత్తరంలో హో చి మిన్ ప్రభుత్వం. దక్షిణంలో ఫ్రాన్స్ అనుకూల వ్యవస్థ, తరువాత అమెరికా మద్దతుతో ప్రభుత్వం.
1956లో దేశవ్యాప్త ఎన్నికలు జరపాలనే ఉద్దేశం కూడా జెనీవా పరిష్కారంలో భాగంగా ఉంది. కానీ అవి జరగలేదు. దీంతో వియత్నాం విభజన స్థిరపడింది.
1950ల చివరి నుంచి అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి సహాయం పెంచింది. మొదట సైనిక సలహాదారులు. తర్వాత ఆయుధాలు. ఆ తరువాత భారీ సైనిక బలగాలు. 1960ల మధ్య నాటికి అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగింది.
అమెరికా దృష్టిలో దక్షిణ వియత్నాం కమ్యూనిస్టుల చేతికి వెళితే దక్షిణ–ఆగ్నేయ ఆసియాలో మరిన్ని దేశాలు కమ్యూనిస్టు ప్రభావంలోకి వెళతాయి అనే “డొమినో థియరీ” ఒక ప్రధాన వ్యూహాత్మక భావన.
వియత్నాం కమ్యూనిస్టుల దృష్టిలో మాత్రం ఇది జాతీయ ఏకీకరణ, విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం. ఈ రెండు పరస్పర విరుద్ధ దృక్పథాలే యుద్ధాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి.
యుద్ధ స్వభావం – అంతర్యుద్ధమా? జాతీయ విముక్తి యుద్ధమా?
వియత్నాం యుద్ధంలో రెండు ప్రధాన అంశాలున్నాయి. మొదటిది ఉత్తర–దక్షిణ వియత్నాం మధ్య అంతర్గత రాజకీయ పోరాటం. రెండవది విదేశీ సైనిక జోక్యానికి వ్యతిరేకంగా జాతీయ విముక్తి పోరాటం. ఈ రెండు అంశాలను కలిపి చూసినప్పుడే వియత్నాం యుద్ధ సంక్లిష్టత అర్థమవుతుంది.
యూఎస్ఎస్ఆర్, చైనా పాత్ర..
సోవియట్ యూనియన్ ఉత్తర వియత్నాంకు ముఖ్యమైన సైనిక, ఆర్థిక, సాంకేతిక సహాయం అందించింది. ప్రత్యేకంగా విమాన నిరోధక రక్షణ వ్యవస్థలు, సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్, రాడార్, యుద్ధ విమానాలు, భారీ ఆయుధాలు, ఇంజనీరింగ్ పరికరాలు, పారిశ్రామిక, ఆర్థిక సహాయం అందించింది. అమెరికా వైమానిక దాడులను ఎదుర్కోవడంలో సోవియట్ సాంకేతిక సహాయం చాలా ముఖ్యమైనది.
అయితే యూఎస్ఎస్ఆర్ నేరుగా అమెరికాతో యుద్ధంలోకి దిగకుండా, వియత్నాంకు మద్దతు ఇవ్వడం ద్వారా తన పాత్రను నిర్వహించింది.
చైనా కూడా ఉత్తర వియత్నాంకు భారీ సహాయం చేసింది. ప్రత్యేకంగా యుద్ధ ప్రారంభ దశల్లో ఆయుధాలు, రవాణా, లాజిస్టిక్స్, ఆహార సరఫరాలు, శిక్షణ, ఇంజనీరింగ్, విమాన రక్షణ సహాయం అందించింది. చైనా సైనిక సిబ్బంది కూడా ఉత్తర వియత్నాంలో సహాయక విధుల్లో పనిచేశారు.
వియత్నాం ప్రజల పాత్ర..
సోవియట్, చైనా సహాయం ముఖ్యమైనదే. అయితే వియత్నాం విజయం కేవలం విదేశీ సహాయంతోనే సాధ్యమైందని చెప్పడం తప్పు. అత్యంత ముఖ్యమైన అంశం ప్రజల విస్తృత భాగస్వామ్యం.
గ్రామీణ రైతులు, కార్మికులు, యువకులు, మహిళలు, స్థానిక మిలీషియా, రవాణా కార్మికులు, వైద్య సిబ్బంది.. ఆ విధంగా లక్షలాది మంది యుద్ధంలో ఏదో ఒక రూపంలో పాల్గొన్నారు.
ఉత్తర వియత్నాం నుంచి దక్షిణ ప్రాంతాలకు ఆయుధాలు, ఆహారం, సైనిక బలగాలను తరలించడానికి ఏర్పడిన రవాణా వ్యవస్థను హో చి మిన్ ట్రైల్ అంటారు.
ఇది కేవలం ఒక రహదారి కాదు. లావోస్, కంబోడియా ప్రాంతాల గుండా వెళ్లే రోడ్లు, అడవి మార్గాలు, వంతెనలు, గిడ్డంగులు, పైప్లైన్లు, రహస్య సరఫరా కేంద్రాలను కలిపిన విస్తారమైన లాజిస్టిక్స్ నెట్వర్క్.
అమెరికా దీనిని ధ్వంసం చేయడానికి విస్తృత బాంబు దాడులు చేసినప్పటికీ సరఫరా వ్యవస్థ కొనసాగింది. ఇది యుద్ధంలో వియత్నాం ప్రజల సామర్థ్యానికి ఒక ఉదాహరణ.
ఏజెంట్ ఆరెంజ్ – యుద్ధం మిగిల్చిన గాయం..
వియత్నాం యుద్ధంలో అత్యంత వివాదాస్పద అంశాల్లో ఒకటి ఏజెంట్ ఆరెంజ్ వినియోగం. అమెరికా సైన్యం అడవులను తొలగించి గెరిల్లాలు దాగి ఉండే ప్రాంతాలను తగ్గించడానికి హెర్బిసైడ్స్(విష వాయువులు-రసాయనాలు) వినియోగించింది.
1962–1971 మధ్య ఆపరేషన్ రాంచ్ హ్యాండ్ కింద 19 మిలియన్ గ్యాలన్లకు పైగా వివిధ హెర్బిసైడ్స్ చల్లినట్లు అమెరికా వెటరన్స్ అఫైర్స్ విభాగం పేర్కొంటుంది.
ఏజెంట్ ఆరెంజ్ వాటిలో అత్యధికంగా ఉపయోగించబడింది. ఏజెంట్ ఆరెంజ్‌లో డయాక్సిన్ కలుషితం ఉండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.
అమెరికా వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏజెంట్ ఆరెంజ్ ఎక్స్పోజర్కు కొన్ని వ్యాధులతో సంబంధాన్ని గుర్తించి తరువాత పరిహార వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దాని ప్రభావం అమెరికన్ యుద్ధ వీరులకే కాకుండా వియత్నాం ప్రజల ఆరోగ్యం, పర్యావరణం మీద కూడా దీర్ఘకాలిక సమస్యలకు దారితీసింది.
1968లో వియత్నాం కమ్యూనిస్టు దళాలు టెట్ అఫెన్సివ్ పేరిట దక్షిణ వియత్నాంలో అనేక నగరాలు, సైనిక కేంద్రాలపై సమన్విత దాడులు చేశాయి.
సైనికంగా చూస్తే కమ్యూనిస్టు దళాలకు భారీ నష్టం జరిగింది. కానీ రాజకీయంగా ఇది అమెరికాలో యుద్ధంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసింది.
“విజయం సమీపంలో ఉంది” అనే అధికారిక ప్రచారంపై ప్రజల్లో అనుమానం పెరిగింది. వియత్నాం యుద్ధంలో ముఖ్యమైన అంశం అమెరికా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.
యుద్ధ వ్యతిరేక ఉద్యమం విస్తరించింది. విద్యార్థులు, కార్మికులు, మేధావులు, మత నాయకులు, నల్ల జాతి పౌరహక్కుల ఉద్యమ నాయకులు, యుద్ధం నుంచి తిరిగి వచ్చిన కొంతమంది సైనికులు కూడా యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమంలోకి వచ్చారు.
వియత్నాం యుద్ధం ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు కూడా ప్రేరణగా మారింది.
హో చి మిన్ మరణం..
హో చి మిన్ 1969 సెప్టెంబర్ 2న మరణించారు. ఇది ఒక యాదృచ్ఛిక ఘటన. 1945 సెప్టెంబర్ 2న ఆయన స్వాతంత్ర్యం ప్రకటించారు. 24 సంవత్సరాల తరువాత అదే సెప్టెంబర్ 2న మరణించారు. అయితే ఆయన జీవిత కాలంలో వియత్నాం ఏకీకరణను చూడలేకపోయారు.
పారిస్ పీస్ అకార్డ్స్ – 1973..
దీర్ఘకాలిక యుద్ధం, అమెరికాలో పెరిగిన యుద్ధ వ్యతిరేకత, భారీ ఆర్థిక, మానవ వ్యయం కారణంగా అమెరికా తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
1973లో పారిస్ పీస్ అకార్డ్స్ కుదిరాయి. అమెరికా పోరాట దళాలు వియత్నాం నుంచి వెనక్కి వెళ్లాయి. అయితే ఉత్తర–దక్షిణ వియత్నాం మధ్య పోరాటం కొనసాగింది. 1975లో ఉత్తర వియత్నాం దళాలు భారీ సైనిక దాడి ప్రారంభించాయి. దక్షిణ వియత్నాం ప్రభుత్వం వేగంగా కూలిపోయింది. 1975 ఏప్రిల్ 30న సైగాన్లోని అధ్యక్ష భవనంలోకి విముక్తి దళాల ట్యాంకులు ప్రవేశించాయి. దీంతో వియత్నాం యుద్ధం ముగిసింది.
వియత్నాం ప్రభుత్వం ఏప్రిల్ 30ను యుద్ధ ముగింపు, జాతీయ ఏకీకరణకు ప్రతీకగా గుర్తిస్తుంది. సైగాన్ తరువాత హో చి మిన్ సిటీగా పేరు మార్చబడింది.
1976లో దేశవ్యాప్త ఎన్నికలు జరిగాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాలు అధికారికంగా ఏకీకృతమయ్యాయి. దేశానికి సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం అని పేరు పెట్టారు. హనోయి రాజధానిగా కొనసాగింది. 1945లో ప్రకటించిన జాతీయ స్వాతంత్ర్యం ఇలా 31 సంవత్సరాల తరువాత వియత్నాం ఉత్తర, దక్షిణ భాగాలు ఏకమైనాయి.
నాటి వియత్నాం ఆర్థిక స్థితి..
1975లో వియత్నాం సైనికంగా విజయం సాధించింది. కానీ ఆర్థికంగా దేశ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. దశాబ్దాల యుద్ధం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతింది. పరిశ్రమలు పరిమితమయ్యాయి.
వ్యవసాయ భూములు నాశనమయ్యాయి. లక్షలాది కుటుంబాలు దెబ్బతిన్నాయి. యుద్ధంలో అమెరికా ఉపయోగించిన పేలని ఆయుధాలు, రసాయన కాలుష్యం సమస్యలుగా మిగిలాయి.
కేంద్రీకృత ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ..
యుద్ధం తరువాత వియత్నాం సోవియట్ తరహా కేంద్రీకృత ప్రణాళికాబద్ధ పాలనను దేశమంతటా విస్తరించే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, సహకార వ్యవసాయం, ధరల నియంత్రణ, ప్రజా పంపిణీ వ్యవస్థ, విదేశీ వాణిజ్యంపై ప్రభుత్వ నియంత్రణ ప్రణాళికలోని ప్రధాన లక్ష్యాలు. కానీ 1970ల చివర, 1980ల ప్రారంభంలో దేశంలో తక్కువ ఉత్పత్తితో సరుకుల కొరతలు, ధరల హెచ్చుతగ్గులు, బడ్జెట్ సమస్యలు, ద్రవ్యోల్బణం, ఆహార సరఫరా, విదేశీ మారకద్రవ్య కొరత సమస్యలు ఉన్నాయి. వీటితో వియత్నాం నాయకత్వం ఆర్థిక విధానాన్ని పునర్నిర్మించాల్సి వచ్చింది.
యుద్ధం ముగిసిన తరువాత కూడా వియత్నాం ప్రశాంత పరిస్థితిలోకి వెంటనే ప్రవేశించలేదు. కంబోడియా సమస్య, చైనాతో 1979 యుద్ధం, అమెరికా ఆంక్షలు, పాశ్చాత్య ప్రపంచంతో పరిమిత ఆర్థిక సంబంధాలు దేశ అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యాయి. సోవియట్ యూనియన్ వియత్నాంకు ప్రధాన ఆర్థిక భాగస్వామిగా మారింది.
1986 – డోయ్ మోయ్ విప్లవాత్మక మలుపు..
1986లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం ఆరవ జాతీయ కాంగ్రెస్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించింది. దాని పేరు “డోయ్ మోయ్ – రెనొవేషన్”. ఇది వియత్నాం ఆధునిక ఆర్థిక చరిత్రలో కీలక మలుపు.
డోయ్ మోయ్ కింద కేంద్ర ప్రణాళిక నుంచి క్రమంగా మార్కెట్ ఎకానమీ వైపు మార్పు, అంతర్జాతీయ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు ఆర్థిక వ్యవస్థను తెరవడం జరిగింది. అంటే సోషలిజాన్ని వదిలివేయడం కాదు.
వియత్నాం అధికారికంగా సోషలిస్ట్ రాజకీయ వ్యవస్థను కొనసాగించింది. కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం, సహకార రంగం, దేశీయ ప్రైవేట్ రంగం, విదేశీ పెట్టుబడులు, మార్కెట్ ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం అన్నీ కలిసి పనిచేసే మిశ్రమ రూపాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని వియత్నాం నాయకత్వం “సోషలిస్ట్ ఓరియెంటెడ్ మార్కెట్ ఎకానమీ” గా నిర్వచించింది. అంటే రాజకీయంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం + ఆర్థికంగా మార్కెట్ సాధనాల విస్తృత వినియోగం.
డోయ్ మోయ్ విజయానికి వ్యవసాయం చాలా ముఖ్యమైనది. సహకార వ్యవసాయం నుంచి కుటుంబాల ఆధారిత ఉత్పత్తికి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చారు.
రైతులకు భూమి వినియోగ హక్కులు ఇచ్చారు. మిగులు పంటను మార్కెట్లో అమ్ముకునే అవకాశాలు పెరిగాయి. ఇది రైతులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
ఆహార కొరత నుంచి బియ్యం ఎగుమతి..
ఒకప్పుడు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్న వియత్నాం తరువాత ప్రపంచంలో ప్రముఖ బియ్యం ఎగుమతి దేశాల్లో ఒకటిగా మారింది.
కాఫీ, మిరియాలు, జీడిపప్పు, రబ్బరు, మత్స్య ఉత్పత్తులు వంటి రంగాల్లో కూడా ప్రపంచ మార్కెట్లో పెద్ద స్థానం సంపాదించింది. ఇది వ్యవసాయ సంస్కరణలు, సాగునీరు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ప్రపంచ మార్కెట్ అనుసంధానం కలిసి సాధించిన ఫలితం.
వియత్నాం విదేశీ కంపెనీలకు పెట్టుబడులు పెట్టే అవకాశాలను క్రమంగా విస్తరించింది. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాలు ముఖ్య పెట్టుబడి వనరులుగా మారాయి.
శాంసంగ్ వంటి సంస్థలతో వియత్నాం ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎగుమతి రంగంలో ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
ప్రపంచ సరఫరా గొలుసుల్లో వియత్నాం..
ఈరోజు వియత్నాం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ భాగాలు, దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్, యంత్ర పరికరాలు వంటి ఉత్పత్తుల్లో ప్రపంచ సరఫరా గొలుసులో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇది వియత్నాం ఆర్థిక పరివర్తనలో అత్యంత గమనించదగ్గ అంశం.
ఆసియాన్ సభ్యత్వం..
1995లో వియత్నాం ఆసియాన్(అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్)లో చేరింది. ఇది దేశాన్ని దక్షిణ–ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను మరింత బలంగా అనుసంధానించింది. వరల్డ్ బ్యాంక్ తాజా డేటా వియత్నాం మార్పు ఎంత పెద్దదో తెలియజేస్తుంది.
2024లో జీడీపీ – సుమారు 476.4 బిలియన్ డాలర్లు. తలసరి జీడీపీ – సుమారు 4,717 డాలర్లు. జీడీపీ వృద్ధి – 7.1 శాతం. 2025లో వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం జీడీపీ – సుమారు 514.7 బిలియన్ డాలర్లు, తలసరి జీడీపీ – సుమారు 5,066 డాలర్లు, జీడీపీ వృద్ధి – 8.0 శాతం. 1986 డోయ్ మోయ్ తరువాత వియత్నాం “ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకదాని నుంచి ఒక చురుకైన మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థగా” మారింది.
పేదరిక నిర్మూలన – గొప్ప విజయం..
ఇది వియత్నాం అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన సామాజిక ఫలితం. వరల్డ్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం రోజుకు 3.00 డాలర్లు (2021 పీపీపీ) ప్రమాణంలో పేదరికం 2022లో సుమారు 1.6 శాతం మాత్రమే. వియత్నాంలో పేదరికం భారీగా తగ్గింది.
విద్యలో పురోగతి..
వరల్డ్ బ్యాంక్ ప్రకారం వియత్నాం 2000ల ప్రారంభంలోనే యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సాధించింది. 2024లో లోయర్ సెకండరీ నెట్ ఎన్రోల్మెంట్–సుమారు 95 శాతం. అప్పర్ సెకండరీ–సుమారు 80 శాతం అని వరల్డ్ బ్యాంక్ పేర్కొంటోంది.
లెర్నింగ్ అడ్జస్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ సుమారు 10.2 సంవత్సరాలు, ఆసియాన్‌లో రెండవ అత్యధిక స్థాయి అని కూడా వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది.
తలసరి ఆదాయం ఇంకా ధనిక దేశాల స్థాయికి చేరకపోయినా, విద్యా ఫలితాల్లో వియత్నాం తన ఆదాయ స్థాయి కంటే మెరుగైన పనితీరు చూపుతోంది.
ఆరోగ్య రంగం..
ఆరోగ్య సూచికల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం 1990లో సగటు ఆయుర్దాయం 70.5 సంవత్సరాలు. 2023లో 74.5 సంవత్సరాలు, 2024 నాటికి సుమారు 75 సంవత్సరాలు. 1993లో శిశు మరణాలు ప్రతి 1,000 జననాలకు 32.6 ఉండగా 2023కి అది 12.1కి పడిపోయింది. 2023 నాటికి జాతీయ ఆరోగ్య బీమా పరిధిలోకి 93 శాతం జనాభా వచ్చారు.
విద్యుదీకరణ – గ్రామీణ వియత్నాం మార్పు..
1993లో కేవలం 14 శాతం కుటుంబాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉండగా, 2019 నాటికి దాదాపు అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం సాధించినట్లు వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.
2023 డేటా ప్రకారం మొత్తం జనాభాలో 99.8 శాతం మందికి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దేశ అభివృద్ధిలో విద్యుదీకరణ ఎంత కీలకమో ఇది తెలియజేస్తుంది.
మానవ అభివృద్ధి సూచిక – హెచ్‌డీఐ.. కార్మికుల పరిస్థితి..
యూఎన్డీపీ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 1990లో హెచ్‌డీఐ 0.499 ఉండగా 2025లో 0.766కు పెరిగింది. ర్యాంక్ 93/193. దీంతో వియత్నాం హై హ్యూమన్ డెవలప్మెంట్ దేశాల సరసన చేరింది. అంటే 33 సంవత్సరాల్లో సుమారు 53.5 శాతం పెరుగుదల సాధించింది. ఇది అద్వితీయమైన సామాజిక పురోగతి. అయితే ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి.
వియత్నాం తయారీ రంగం వేగంగా ఎదిగింది. దాంతో కోట్లాది ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. గ్రామీణ యువత పరిశ్రమల్లోకి వచ్చింది. మహిళల ఉపాధి కూడా విస్తరించింది.
అయితే నిజ వేతనాలలో ఇంకా పెరుగుదల రావాల్సి ఉంది. వియత్నాం ఎగుమతుల్లో విదేశీ కంపెనీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇది పెట్టుబడులు, ఉద్యోగాలు, సాంకేతిక పరిజ్ఞానం తెచ్చింది. కానీ దీని వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.
“మేడ్ ఇన్ వియత్నాం” నుంచి “డిజైన్డ్ అండ్ ఇన్నోవేటెడ్ ఇన్ వియత్నాం” వైపు ఎలా వెళ్లాలి? అనేదే నేడు వియత్నాం ముందు ఉన్న ప్రశ్న.
ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర.. వాతావరణ మార్పు – కొత్త ప్రమాదం..
డోయ్ మోయ్ తరువాత ప్రైవేట్, విదేశీ పెట్టుబడి రంగాలు విస్తరించినప్పటికీ, వియత్నాం ప్రభుత్వం ఎనర్జీ, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్, రవాణా, వ్యూహాత్మక పరిశ్రమలు వంటి రంగాల్లో ప్రభుత్వ రంగాన్ని కొనసాగించింది.
వియత్నాం విజయానికి ఐదు ప్రధాన స్తంభాలు. అవి 1. భూ సంస్కరణలు, వ్యవసాయ ఉత్పాదకత. 2. విద్య, ఆరోగ్యంపై దీర్ఘకాలిక పెట్టుబడి. 3. గ్రామీణ విద్యుదీకరణ, మౌలిక సదుపాయాలు. 4. ఎగుమతి ఆధారిత పారిశ్రామికీకరణ. 5. విదేశీ పెట్టుబడులను దేశ అభివృద్ధి వ్యూహంతో అనుసంధానించడం. ఇవన్నీ కలిసి పనిచేశాయి.
వియత్నాంకు వేల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రత్యేకంగా మెకాంగ్ డెల్టా దేశ బియ్యం ఉత్పత్తిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం.
సముద్ర మట్టం పెరుగుదల, ఉప్పునీటి చొరబాటు, వరదలు, తీవ్ర వాతావరణ మార్పులు భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు. వియత్నాం 2050 నాటికి నెట్-జీరో ఎమిషన్స్ లక్ష్యాన్ని ప్రకటించింది.
వృద్ధాప్య జనాభా.. 2045 లక్ష్యం..
వియత్నాంలో ఇతర అనేక దేశాలలో మాదిరిగానే జననాల రేటు తగ్గుతోంది. వృద్ధుల జనాభా పెరుగుతున్నది. దీంతో భవిష్యత్తులో పెన్షన్ ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణ, కార్మిక శక్తి కొరత, ఉత్పాదకత వంటి ప్రశ్నలు ముందుకు వస్తాయి.
అయితే వియత్నాం సోషలిస్ట్ ప్రభుత్వం వీటిని ప్రణాళికాబద్ధ వ్యూహంతో అధిగమించగలదని గత అభివృద్ధి సూచికలు రుజువు చేస్తున్నాయి.
వియత్నాం ప్రభుత్వం తన స్వాతంత్ర్య శతాబ్ది అయిన 2045 నాటికి అధిక ఆదాయ దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది సాధించాలంటే ఇప్పటి తక్కువ ఖర్చు పారిశ్రామిక ఉత్పత్తుల విధానం నుంచి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, పరిశోధన, కార్మికుల సాంకేతిక నైపుణ్యం పెంచడం, సరికొత్త పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుంది.
1945 సెప్టెంబర్ 2న బా దిన్ స్క్వేర్‌లో హో చి మిన్ చదివిన స్వాతంత్ర్య ప్రకటనతో ప్రారంభమైన నూతన వియత్నాం ప్రయాణం చాలా అసాధారణమైనది. ఫ్రెంచ్ వలస పాలనను ఓడించింది. డియన్ బియెన్ ఫూలో చారిత్రక విజయం సాధించింది.
అమెరికా వంటి ప్రపంచ మహాశక్తి సైనిక జోక్యాన్ని ఎదుర్కొంది. దేశాన్ని ఐక్యం చేసింది. తీవ్ర పేదరికం, యుద్ధ విధ్వంసం, అంతర్జాతీయ ఒంటరితనం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.
1986 తరువాత తన ఆర్థిక విధానాన్ని మార్చుకుంది. మార్కెట్ వ్యవస్థలోని కొన్ని సాధనాలను ఉపయోగించింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించింది.
అదే సమయంలో విద్య, ఆరోగ్యం, విద్యుదీకరణ వంటి సామాజిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. వరల్డ్ బ్యాంక్ వియత్నాంను ఒక తరం కాలంలో ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకదాని నుంచి డైనమిక్ మిడిల్-ఇన్కమ్ ఎకానమీగా మారిన రిమార్కబుల్ డెవలప్మెంట్ సక్సెస్ స్టోరీగా పేర్కొంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
