విద్యార్థిని, కార్మిక నాయకురాలు ఆకృతి చౌదరిపై పెట్టిన ఎన్ఎస్ఏ(జాతీయ భద్రతా చట్టం) కేసును కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఉన్న ఆమె కుటుంబానికి ఈ ఉత్తర్వు గొప్ప ఊరటనిచ్చింది. గత కొన్ని నెలలు వారికి పీడకలలా గడిచాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా(టీఓఐ)తో మాట్లాడిన ఆమె తండ్రి అరుణ్ చౌదరి, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆకృతి తన లా డిగ్రీని పూర్తి చేస్తుందని, అవసరమైన వారికి సహాయం చేయడం కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
పూర్తికాల సీపీఎం కార్యకర్త చౌదరి, పార్టీ పత్రిక ‘గణశక్తి’ సౌత్ బెంగాల్ ఎడిషన్‌ను నడుపుతున్నారు. తన కుమార్తె ఎదుర్కొన్న కష్టాలకు చౌదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
“పేదలకు, అణగారిన వర్గాలకు సేవ చేయడంలో ఆకృతికి ఉన్న అంకితభావం పట్ల కుటుంబం గర్విస్తోంది. దౌలత్ రామ్ కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా, ఆమె అంగన్వాడీ కేంద్రాలలో వాలంటీర్‌గా పనిచేసింది. కార్మికులకు మద్దతుగా గొంతు విప్పింది. తన తీరిక సమయంలో పిల్లలకు పాఠాలు చెప్పేది” అని భావోద్వేగానికి లోనైన తండ్రి చెప్పారు.
కల్పిత కేసులంటూ కోర్టు వ్యాఖ్యలు..
ఏప్రిల్ 13న కనీస వేతనాల పెంపు కోసం పారిశ్రామిక కార్మికులు చేపట్టిన నిరసనలో హింసను ప్రేరేపించారనే ఆరోపణపై నోయిడా పోలీసులు ఆకృతిపై 11 ఎఫ్ఐఆర్లలో కేసు నమోదు చేశారు.
మే నెలలో ఆమెపై ఎన్ఎస్ఏ మోపారు. ఎన్ఎస్ఏ కేసులో ఆమెను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు ఉన్న 11 కేసులలో కేవలం ఐదు కేసుల్లో మాత్రమే బెయిల్ లభించడంతో ఆకృతి ప్రస్తుతానికి జైలులోనే ఉంది. ఆమెపై పోలీసులు మోపిన కేసును “కల్పితం” అని కోర్టు అభివర్ణించింది.
విడుదలయ్యాక న్యాయవాద విద్య..
నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, అరెస్టు కారణంగా డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో చేరలేకపోయిన ఆకృతి, విడుదలైన తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని కొనసాగించాలని భావిస్తోంది.
అలాగే తన సామాజిక సేవ, నాటక రంగ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి కుటుంబ మద్దతు కూడా ఉందని ఆయన తెలిపారు.
జైల్లోనే ఖైదీల పిల్లలకు విద్యాబోధన..
ఆకృతి విడుదల కావడానికి ఇంకా సమయం పట్టవచ్చని చౌదరి అంగీకరించారు. “నా కుమార్తె మరికొంత కాలం జైలులోనే ఉండటానికి మానసికంగా సిద్ధంగా ఉంది. తనతో పాటు ఉన్న ఖైదీ సృష్టి (ఈమెపై కూడా 11 ఎఫ్ఐఆర్లలో ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి)తో కలిసి జైలు సిబ్బంది, ఇతర ఖైదీల పిల్లలకు చదువు చెబుతోంది” అని ఆయన అన్నారు.
యూపీ పోలీసుల తీరుపై ఆందోళన..
యూపీ పోలీసులు అనుసరించిన విధానం వల్లే సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉండాల్సి వస్తుందనే ఆందోళన కుటుంబంలో కలిగిందని చౌదరి తెలిపారు.
“ఆకృతి పేరు మొదట నాలుగు కేసుల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించిన తర్వాత, ఆమె పేరును మరో ఏడు ఎఫ్ఐఆర్లలో చేర్చారు”అని ఆయన చెప్పారు.
పోలీసుల బెదిరింపులకు లొంగని ధైర్యం..
ఆమె రిమాండ్‌కు పంపబడిన తర్వాత, నోయిడా పోలీసు బృందం ఏప్రిల్ 24 రాత్రి ఢిల్లీలోని ఆమె నివాసానికి తీసుకెళ్లి, ఆమె పాకిస్తాన్‌తో సంబంధాలు ఉండి దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేరస్థురాలని పొరుగువారికి చెప్పారని చౌదరి ఆరోపించారు.
“ఆకృతి మానసికంగా కుంగిపోయి ఉండేదే, కానీ ఆమె దృఢంగా నిలబడింది. పోలీసులు సంతకం చేయమన్న ఖాళీ కాగితాలపై సంతకం చేయడానికి నిరాకరించింది” అని ఆయన చెప్పారు.
తనకు తెలియజేయకుండా ఎన్ఎస్ఏ బోర్డు ముందు హాజరుపరిచేందుకు లక్నోకు తీసుకెళ్లాలనే పోలీసుల నిర్ణయాన్ని కూడా ఆయన సవాలు చేశారు.
కుటుంబ సభ్యుల ఆవేదన..
సురాజ్‌పూర్ కోర్టు ప్రాంగణంలో పోలీసుల నీడలో ఉన్న తన కూతురిని చూసి ఆకృతి తల్లి పింకీ దేవి కన్నీరుమున్నీరయ్యారు.
ఎన్ఐటీ దుర్గాపూర్ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, చెన్నైలోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఆమె సోదరుడు కూడా ఎన్ఎస్ఏ కేసు మోపినట్లు తెలిసిన తర్వాత ఆమె వెంటనే విడుదల కాదని తెలుసుకుని, ఆమెను చూడటానికి వచ్చాడు.
దేశ సేవలోనే కుటుంబం..
“మా కుటుంబం దేశ సేవలో ఉంది. మా దగ్గరి, దూరపు బంధువులలో చాలామంది ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాల్లో ఉన్నారు. పేదలు, అణగారిన వర్గాల గొంతుకగా మారి దేశానికి సేవ చేయాలని నా కుమార్తె ఎంచుకుంది. ఆమె ఎంచుకున్న మార్గం పట్ల మేము సంతోషంగా ఉన్నాము” అని చౌదరి చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
