బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రముఖ కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల వరకు పలువురు ఈ ప్రతిపాదిత బిల్లులోని ప్రమాదకర నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు భారత ఉన్నత విద్యా వ్యవస్థను ప్రభుత్వం చెప్పినట్టు నడిచే వ్యవస్థగా మార్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) పాలిత రాష్ట్రాలు, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (వీబీఎస్ఏ) బిల్లు 2025 పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా ఉన్నత విద్యా నియంత్రణపై కేంద్రం చేతుల్లోకి అధిక అధికారం కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పార్లమెంటరీ కమిటీని హెచ్చరించినట్లు ది హిందూ నివేదించింది.
ఈ బిల్లు భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించేందుకు ఉద్దేశించింది.
ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) లను రద్దు చేసి వాటి స్థానంలో వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (వీబీఎస్ఏ) పేరుతో ఒకే అత్యున్నత నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
ప్రస్తుతం ఈ బిల్లును భారతీయ జనతా పార్టీ ఎంపీ డీ పురంధరేశ్వరి అధ్యక్షతన ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తోంది.
అధికార కేంద్రీకరణపై అభ్యంతరం తెలిపిన రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలు..
ది హిందూ కథనం ప్రకారం ఈ బిల్లుపై అత్యంత తీవ్ర అభ్యంతరాల్లో ఒకటి బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పాలనలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వ్యక్తమైంది.
ప్రతిపాదిత చట్టంలోని అనేక నిబంధనలు ఉన్నత విద్యపై రాష్ట్రానికి ఉన్న శాసనాధికారాన్ని ఆచరణలో అర్థరహితంగా మార్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి తెలిపింది.
ముఖ్యంగా బిల్లులోని 11వ నిబంధనను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీలను మంజూరు చేసే విషయంలో నియంత్రణ మండలికి రాష్ట్ర విశ్వవిద్యాలయాలను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుందని హెచ్చరించింది. దీనివల్ల రాజ్యాంగపరమైన ఘర్షణ తలెత్తవచ్చని పేర్కొంది.
అంతేకాకుండా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై ప్రభావం చూపే ఏ చర్యనైనా కేంద్ర ప్రభుత్వం చేపట్టే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా ప్రతిపాదిత నియంత్రణ మండలిలో రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
మేఘాలయలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించాలని ప్రతిపాదించింది.
ది హిందూ కథనం ప్రకారం విద్యా ప్రమాణాల నిర్ధారణ, గుర్తింపు ప్రక్రియలను కేంద్రం పరిధిలో ఉంచుతూ విశ్వవిద్యాలయాల పాలన, సిబ్బంది నియామకం, ఆర్థిక నిర్వహణ లాంటి అంశాలను రాష్ట్రాల అధికార పరిధిలోనే కొనసాగించాలని మేఘాలయ ప్రభుత్వం సూచించింది.
కాంగ్రెస్ పాలిత తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకెళ్లి బిల్లులోని 11వ నిబంధనను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ బిల్లు వలన విద్యా ఫీజులు నిరంతరం పెరిగేందుకు దారితీసే ప్రమాదం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం వాదించినట్లు ది హిందూ పేర్కొంది.
బిల్లులోని 45వ నిబంధనను అత్యంత తీవ్రమైన అధికార కేంద్రీకరణకు దారితీసే నిబంధనగా తెలంగాణ ప్రభుత్వం అభివర్ణించింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అంశాల్లో వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వానికి సమానమైన నిర్ణయాధికారం కల్పించకుండానే తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ నిబంధన అప్పగిస్తోందని పేర్కొంది.
మితిమీరిన అధికార కేంద్రీకరణపై విశ్వవిద్యాలయాల అభ్యంతరం..
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, చిత్తూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)తో పాటు అస్సాం, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్‌లలోని పలు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కూడా అధికార కేంద్రీకరణకు దారితీసే బిల్లులోని నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించాయి.
ది హిందూ కథనం ప్రకారం విధానపరమైన నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలే తుది నిర్ణయంగా అమలయ్యేలా అధికారాన్ని కల్పిస్తున్న 45వ నిబంధన నియంత్రణ సంస్థను కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థకు లోబడి పనిచేసే సంస్థగా మార్చేస్తుందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) పార్లమెంటరీ కమిటీకి తెలిపింది.
అలాగే వీబీఎస్ఏను పక్కన పెట్టేందుకు లేదా రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే 47వ నిబంధన ఆ సంస్థను అప్పటి ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మార్చే ప్రమాదం ఉందని పేర్కొంది.
47వ నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ కార్యకలాపాలను ఆరు నెలల వరకు నిలిపివేయవచ్చు. అవసరమైతే ఆ నిలిపివేతను మరో ఆరు నెలల పాటు పొడిగించే అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది.
ది హిందూ కథనం ప్రకారం 45వ నిబంధనను అమలు చేయడం వల్ల బిల్లు కింద ప్రతిపాదించిన మూడు మండళ్లపైనా కేంద్ర ప్రభుత్వ ప్రభావం విస్తరించే అవకాశం ఉందని చిత్తూరు ఐఐఐటీ పేర్కొంది. తద్వారా విద్యా సంస్థల అకడమిక్ కార్యకలాపాలను కూడా కేంద్రం ప్రభావితం చేసే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించింది.
పుణెలోని శ్రీమతి నాథీబాయి దామోదర్ థాకర్సీ మహిళా విశ్వవిద్యాలయం కూడా బిల్లులో పేర్కొన్న చర్యలపై తగిన నియంత్రణలు, అధికార సమతుల్యత, పార్లమెంటరీ పర్యవేక్షణ లేకపోతే అవి మితిమీరిన అధికార కేంద్రీకరణకు దారితీయవచ్చని పేర్కొంది.
రాజకీయ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత..
ది హిందూ కథనం ప్రకారం సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులైన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ సాగరికా ఘోష్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా కూడా ఈ బిల్లును విమర్శించారు. బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపారమైన అధికారాలు కట్టబెట్టడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీబీఎస్ఏ ఛైర్పర్సన్ నియామక ప్రక్రియలో పారదర్శకత, స్వతంత్రత లోపించాయని సాగరికా ఘోష్ విమర్శించారు. మరోవైపు బిల్లులోని 18, 20, 21, 45, 47 నిబంధనలు కలిపి అన్ని మండళ్లపైనా కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాన్ని కట్టబెడుతున్నాయని సంజయ్ కుమార్ ఝా పేర్కొన్నారు.
ఛైర్పర్సన్ నియామకానికి అభ్యర్థులను ఎంపిక చేసే సెర్చ్ కమిటీల్లో కేంద్ర ప్రభుత్వ నామినీలదే ఆధిపత్యం ఉందని ఘోష్ అన్నారు. ఈ కమిటీల్లో బోధనా వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, న్యాయవ్యవస్థకు తగిన ప్రాతినిధ్యం లేదని ఆమె స్పష్టం చేశారు.
కమిటీలోని ఇతర సభ్యులు కూడా బిల్లుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మరింత ముందుకెళ్లి వీబీఎస్ఏ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాలను నిర్దేశించే 4వ నిబంధన ద్వారా రాష్ట్ర జాబితా పరిధిలోని అంశాల్లో కేంద్రం రాజ్యాంగపరంగా తన అధికార పరిధిని అతిక్రమిస్తోందని ఆరోపించారు.
విద్యా సంస్థల స్థాపన, నియంత్రణ, మూసివేతకు సంబంధించిన అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టే నిబంధనలు కేంద్ర జాబితా పరిధిని మించిపోయాయని సింగ్ పేర్కొన్నారు.
బిల్లును సమర్థించిన కేంద్ర ప్రభుత్వం..
విస్తృతంగా వ్యక్తమవుతున్న విమర్శలపై స్పందించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వివాదాస్పద నిబంధనలను సమర్థించింది. ఇవి అత్యాధునిక నియంత్రణ వ్యవస్థల్లో అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొన్నట్లు ది హిందూ తెలిపింది.
వీబీఎస్ఏను పక్కన పెట్టే లేదా దాని అధికారాలను నిలిపివేసే అధికారం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సాధారణ రక్షణ చర్య మాత్రమేనని దానిని ఇష్టానుసారంగా ప్రయోగించబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఈ నిబంధనలు నియంత్రణ సంస్థ స్వతంత్రతను కాపాడుతూనే జవాబుదారీతనంలో సమతుల్యతను కొనసాగిస్తాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పరిమిత జోక్యానికి అవకాశం కల్పిస్తాయని తెలిపింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ చట్టాల్లోనూ ఇటువంటి నిబంధనలకు పూర్వ ఉదాహరణలు ఉన్నాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు స్పందిస్తూ కొత్త బిల్లులోనూ ఇదే తరహా నిబంధనలను పొందుపరచడాన్ని మంత్రిత్వ శాఖ సమర్థించుకుంది.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
