విరాళాల డబ్బు గోల్మాల్ తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న ట్రస్టు.. సీఈఓ ఎంపికకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు.
న్యూఢిల్లీ: రామ మందిరానికి విరాళంగా వచ్చిన డబ్బు దొంగిలించబడటం ప్రతి ఒక్కరినీ కేవలం “క్షమాపణలు కోరేలా” చేయడమే కాకుండా, “అవమానభారంతో తలదించుకునేలా” చేసిందని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు.
అలాగే, మందిరం ట్రస్టు కొత్త సీఈఓ తన బాధ్యతలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
ట్రస్టీల నియామకం, ది వైర్ కథనం..
రామ మందిరం ట్రస్టీలు ఎవరనే దానిపై ‘ది వైర్’ ప్రచురించిన కథనం ప్రకారం- నృపేంద్ర మిశ్రా అత్యంత ప్రభావవంతమైన అధికారి. ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
గతంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్‌గా పనిచేసిన ఆయనను ఈ ట్రస్టులో నియమించడానికి వీలుగా, ఏకంగా నియామక నిబంధనలను మారుస్తూ భారత రాష్ట్రపతి చేత ఒక ఆర్డినెన్స్‌పై సంతకం చేయించాల్సి వచ్చింది.
అవమానభారంతో తలదించుకునేలా చేసిన చోరీ..
జులై 11న హిందుస్థాన్ టైమ్స్ నివేదించిన ఒక ఇష్టాగోష్ఠిలో మిశ్రా మాట్లాడుతూ, ఈ అంశం “ఒక అవమానం, మేమంతా కేవలం క్షమాపణలు చెప్పడమే కాదు, దీనివల్ల తీవ్రంగా అవమానభారంతో కుంగిపోయాం” అని అన్నారు.
“ఇది ఇప్పుడు మందిర నిర్వహణకు సంబంధించిన అంశం, ఆరోపించబడిన ఈ విరాళాల చోరీ మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్వహణను కచ్చితంగా మెరుగుపరుస్తాం” అని కూడా ఆయన చెప్పారు.
మందిరం ట్రస్టుకు సీఈఓను నియమించాలని గట్టిగా కోరిన వారిలో మిశ్రా కూడా ఒకరు.
సీఈఓ ఎంపికకు త్రిసభ్య కమిటీ..
దీనిలో భాగంగా సీఈఓ పోస్టుకు పేర్లను సిఫార్సు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, భారతీయ జనతా పార్టీ నాయకుడు సురేశ్ హవారేలతో ట్రస్టు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
సీఈఓ బాధ్యతలు, ప్రభుత్వ జోక్యం లేమి..
“కొత్త సీఈఓ ఆర్థికపరమైన ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తారు” అని అయోధ్యలో విలేకరులతో మిశ్రా చెప్పారు. ట్రస్టు లేదా దాని సీఈఓ పనితీరులో ఎలాంటి “ప్రభుత్వ జోక్యం” ఉండదని ఆయన స్పష్టం చేశారు.
అయోధ్యను సందర్శించే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చూడటం, మందిరం పట్ల వారి విశ్వాసాన్ని నిలబెట్టడం కొత్త సీఈఓ ప్రాథమిక బాధ్యతల్లో ఉంటుందని మిశ్రా చెప్పినట్లు పీటీఐ నివేదించింది.
“ఒక రకంగా చెప్పాలంటే, ప్రభుత్వ జోక్యం లేకుండా ట్రస్టుకు ఒక సహాయకుడిగా సీఈఓ పని చేస్తారు” అని మిశ్రా తెలిపారు.
సీఈఓ పోస్టుకు పేర్లను సిఫార్సు చేసే బాధ్యత ఉన్న కమిటీ సమావేశాలకు మీరు హాజరవుతారా అని అడిగిన ప్రశ్నకు మిశ్రా ‘లేదు’ అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
