ఎంఎస్ ఆచార్య, వరంగల్ ఆచార్య, ప్రెస్ అయ్యగారుగా మాడభూషి శ్రీనివాసాచార్య ప్రసిద్ధులు. ఆయన తెలుగు పాత్రికేయుడుగా సేవలందించారు. అంతేకాకుండా నిబద్ధత కలిగిన స్వాతంత్ర్య సమరయోధుడు, అన్నింటికీ మించి ఒక మానవతావాది.
భూమి కోసం భుక్తి కోసం, “బాంచన్ నీ కాళ్లు మొక్కతా” అంటూ వెట్టి చేసే బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంఎస్ ఆచార్య కూడా పరోక్షంగా పాల్గొన్నారు. దొరల, జమీందార్ల, రజాకార్ల దురాగతాల నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి ఆయన చేసిన పరోక్ష పోరాటం అసాధారణమైనది, అనన్య సామాన్యమైనది. చిమ్మచీకటిలో ప్రతి రాత్రి వీధులలో కందిల్ల వెలుగులో తిరుగుతూ ప్రజల రక్షణ కోసం ఆయన పహారాకాచారు.
అంతేకాదు, ప్రతీ తెల్లవారుజామున సైకిల్ తొక్కుతూ తెలుగు వార్తాపత్రికలను పంపిణీ చేసేవారు.
సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా, అంతకన్న ఎక్కువగా ఎంఎస్ ఆచార్య కృషిచేశారు. ఆనాడు ఉద్యమానికి ఉపయోగపడే అత్యంత రహస్యమైన సందేశాలను చేరవేయడమంటే ప్రాణాలతో చెలగాటమే. ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా సందేశాలను ఆచార్య చేరవేయడం; ఆ తరువాత పరిశోధక జర్నలిస్టుగా జీవించడం, నీతీ నిజాయితీతో పత్రికల సంపాదకుడిగా పనిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకం.
నిజాం రాచరిక పాలన కింద హైదరాబాద్ రాజ్యంలో దొరలు, జమీందారులు, రజాకార్లు, సాగించిన అమానుష చర్యల పట్ల ఎంఎస్ ఆచార్య తీవ్రంగా కలత చెందేవారు. నిజాం రాజ్యంలోని కుటుంబాలన్నీ ఆంధ్ర లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లక తప్పని పరిస్థితిలో ఆయన ప్రతీ రాత్రి ఒక “కందిల్”(లాంతరు), ఒక “లాఠీ” పట్టుకుని వీధులన్నీ పహారా కాచేవారు.
ఎంఎస్ ఆచార్య, ఎస్ మల్లేశం, అడువాల వెంకట నరసయ్య కలిసి ఒక జట్టుగా ఏర్పడి ఈ పని చేసేవారు. ఇందులో భాగంగా వరంగల్‌లోని పాపయ్యపేటలో రాత్రంతా కాపలా కాస్తూ, పౌరులలో ధైర్యాన్ని నింపేవారు.
పేపర్‌బాయ్ నుంచి తెలుగు పత్రికా సంపాదకుడిగా..
ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన మద్రాసు నుంచి వచ్చే “ఆంధ్రపత్రిక”కు న్యూస్ ఏజెంట్‌గా కూడా ఆచార్య పనిచేశారు. మొదట్లో మద్రాసు నుంచి వచ్చే పత్రిక కట్టలను తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయన సేకరించేవారు. దీని కోసం వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి సాహసోపేతంగా తీసుకునేవారు.
పత్రిక కట్టలన్నింటిని సేకరించి, తానే స్వయంగా సైకిల్‌పై పెట్టుకొని ఉదయం 5 గంటలకు ప్రతీ ఇంటికి చేరవేసేవారు. ఈ విధంగా జీవనం కోసం పేపర్‌బాయ్‌గా కూడా పనిచేశారు. దీని వల్ల వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవారు.
ఆచార్య సోదరుడు రామానుజాచార్య పేపర్ బాయ్‌గా చేస్తూ కుటుంబ పోషణలో ఆయనకు సహకరించేవారు. ఇతర పేపర్‌బాయ్‌ల మద్దతుతో రోజుకు 1200 పత్రికల సర్క్యులేషన్‌ను ఆచార్య సాధించేవారు.
మరోవైపు పిల్లల కోసం చందమామ, యువత కోసం యువ, ఆంధ్రపత్రిక వీక్లీ వంటి పలు వార, పక్ష, మాస పత్రికల ఏజెన్సీల డిపాజిట్లు సంపాదించుకోవడం కోసం కూడా ఆయన ప్రయత్నించేవారు.
తెలుగు వార్తాపత్రిక చదవడం నేరం..
నిజాం రాచరిక పాలనలో తెలుగు వార్తాపత్రిక పంపిణీ చేయడమే పెద్ద నేరం. అటువంటిది, తెలంగాణ సరిహద్దు శిబిరాల నుంచి వచ్చిన నాయకుల సందేశాల అనేక రహస్య కరపత్రాలను- వార్తాపత్రిక కట్టల మధ్య పెట్టి ఆచార్య పంచేవారు.
ఒకసారి ఆయన మద్రాసు నుంచి రహస్యంగా సైక్లో స్టైలింగ్ యంత్రాన్ని రవాణా చేయగలిగారు. నాయకుల సందేశాలు, ఉద్యమ సాహిత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన రాత్రంతా ప్రభావవంతంగా పని చేశారు.
హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసే మూడు సంవత్సరాల ముందు, ఆచార్య అనేక యువజన సంఘాలతో కలిసి ప్రతాప్ రుద్ర దళ్ అనే సమూహాన్ని స్థాపించారు. ఒక క్రియాశీల వార్తాపత్రిక ఏజెంట్‌గా ఉండటంతో పాటు యువత కోసం కుస్తీ(రెజ్లింగ్), కబడ్డీలాంటి క్రీడా పోటీలను ఆచార్య నిర్వహించారు.
తెలంగాణ విలినోద్యమాన్ని ప్రోత్సహించడానికి జాతీయ నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జరిగినటువంటి మహాత్మా గాంధీ వరంగల్ సమావేశంలో ఆచార్య వాలంటీర్‌గా పనిచేశారు.
వరంగల్‌లో గాంధీ సమావేశానికి హాజరుకావడం కోసం వందలాది ఎడ్ల బండ్లతో, వేలాది మంది ప్రజలు సభాస్థలికి చేరుకున్నారు. భారతదేశం మొత్తం, ముఖ్యంగా నిజాం రాజ్యంలో స్వాతంత్ర్య పోరాటానికి గాంధీ ప్రసంగాలు ఉత్ప్రేరకాలుగా మారాయి. ఉత్సాహవంతులైన యువత చాలామంది సత్యాగ్రహంలో చేరడానికి ఈ ప్రసంగాలు కారణమయ్యాయి. ఈ ఉద్యమంలో పాలుపంచుకున్న ఆచార్య, ఖాదీ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. తన చివరి శ్వాస వరకు(1994 జూలై 12 వరకు) ఖాదీ దుస్తులను ఆచార్య ధరించారు. బనీను కూడా ఖాదీదే ఉపయోగించేవారు. ఆ బనీనులో ఒక జేబు కుట్టించుకునే వారు. ఆయనకు సరిగా వినబడేది కాదు కాబట్టి ఆ జేబులో చెవి యంత్రం అమర్చుకునే వారు.
ఆంధ్ర సరిహద్దు శిబిరాల నుంచి ప్రచురించే తల్లూరు రామయ్య స్వామి “సారథి”, బండి బుచ్చయ్య చౌదరి “ములుగోల”, మర్రి చెన్నా రెడ్డి ప్రచురించే “హైదరాబాద్” పత్రికలను, అలాగే అయోధ్య రామకవి విప్లవాత్మక పాటలు/ రాజద్రోహ కరపత్రాలు, ఉద్యమ సందేశాలను హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు- వరంగల్ జైలులో ఉన్న కొందరు శిబిర నాయకులకు ఆచార్య రహస్యంగా అందించేవారు.
గూఢచారిగా..
కూసం వైకుంఠం, ఎ రామారావు వంటి స్నేహితులు హైదరాబాద్‌లోని సుందర్ భవన్లో వీ వీరభద్రరావు ఆధ్వర్యంలో ఒక గూఢచార శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నాగ్‌పూర్‌లోని ముంజే సెంటర్లో శిక్షణ పొందిన ఆచార్య ఈ శిబిరంలో కూడా సేవలు అందించారు. ఆచార్య శిబిరంలో అమరం రామారావు శిక్షణ పొందారు.
వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయం వద్ద తన సహచరులతో కలిసి ఆచార్య గూఢచారిగా పనిచేశారు.
విమానాశ్రయానికి వచ్చిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి పెట్టెలను దూరదర్శిని(బైనాక్యులర్స్)తో గమనించేవారు. ఆ వివరాలను ప్రముఖ స్వాతంత్ర్య వందేమాతరం సోదరులకు అందించేవారు.
ఒకసారి, వరంగల్‌లో చురుకుగా ఉన్న కొంతమంది నాయకులను ‘షెహర్ బదర్'(నగర బహిష్కరణ) చేశారు. ఆ సందర్భంలో, దివంగత పెండ్యాల రామానుజారావు నాయకత్వంలో కొత్తకొండ జాతరలో యువజన శిబిరాలను ఆచార్య నిర్వహించారు. ఆయన పట్టణం వెలుపల రహస్య సమావేశాలలో వాలంటీర్‌గా పనిచేశారు.
పగలు, రాత్రి ప్రమాదకర పరిస్థితులు..
రహస్యంగా సాగుతున్న సాయుధ పోరాటంలో పదుల కొద్దీ కార్యకర్తలలో ముస్త్యాల శంకర్ రావు చాలా చురుకుగా ఉండేవారు. ఒకసారి రజాకార్లు శంకర్ రావును కిడ్నాప్ చేశారు. అప్పుడు ఆచార్య తీవ్ర ఆందోళన చెంది- రజాకార్లు, నిజాం పోలీసుల అక్రమ నిర్బంధం నుంచి శంకర్ రావును విడుదల చేయడానికి ఎంతో కృషి చేశారు.
‘విడుదల’ మీద అనుమానం వ్యక్తం చేసిన రజ్వీ నుంచి రక్షించేందుకు శంకర్ రావును రహస్య ప్రదేశంలో పెట్టే ప్రయత్నాలలో ఆచార్య కష్టపడ్డారు. చివరకు ఆయనను రక్షించారు కూడా. ఈ ప్రయత్నాల విషయాలు తెలియడంతో ఆచార్య, ఆయన స్నేహితుల ఇళ్లపై రజాకార్లు చాలాసార్లు దాడి చేశారు. కానీ ఆచార్య సంస్థ రక్షణ వలయాన్ని మాత్రం ఛేదించలేకపోయారు.
ప్రాణాపాయంలో కూడా ఉద్యమ ప్రయత్నాలు..
తెలుగు వార్తాపత్రికల కట్టల మధ్య దాచిన కరపత్రాలను పంచుతుండగా ఒక రజాకార్ ఆచార్యను పట్టుకున్నాడు. ఆ రహస్య కరపత్రాల కోసం ఆయన మీద దారుణంగా దాడి చేశాడు. ఆచార్య ఓపికగా ఆ దాడిని భరించారు.
నేను నాన్నగారితో మాట్లాడిన సందర్భంలో, తన స్నేహితుడు కందగడ్ల కనకయ్య తనను రజాకార్ల నుంచి రక్షించారని గుర్తుచేసుకుంటారు. మరొకసారి, ఆయనను కింద పడేసి, బల్లెంతో చంపడానికి సిద్ధమవుతుండగా, వీధిలోని ఇతర వ్యాపారవేత్తలు ఆయనను రక్షించారు.
ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్ సమీపంలో ఒక నిజాం సైనిక అధికారి ఆచార్యను బస్సు నుంచి కిందకు లాగి కత్తితో పొడవబోయాడు. ఈసారి ఇరుకుళ్ల శ్రీశైలమనే వ్యక్తి జోక్యం చేసుకుని ఆయనను కాపాడారు.
ఇవన్నీ ప్రపంచానికి తెలియజేయడానికి నేను రాయడానికి ప్రయత్నిస్తుంటే, కళ్లు చెమ్మగిల్లేవి. బాధపడకని నాన్న నా వెన్నుతట్టేవారు. కానీ భరించడం నాకు చాలా కష్టంగా ఉండేది.
ఆచార్య కోసం గాలించాడాన్ని నిజాం పోలీసులు మాత్రం ఆపలేదు. అప్పుడు ఆయన స్నేహితులు ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారి ఆస్తులను దోచుకోకుండా రాత్రిపూట కాలనీలకు కాపలాగా ఉండే బాధ్యత నుంచి విముక్తి పొందమన్నారు. ఆంధ్ర లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళమని ఆయనకు సలహా ఇచ్చారు. కాలం కఠినంగా ఉండడంతో ఆ సలహాను పాటించడం తప్పలేదు.
నిజాం రాచరికం నుంచి విముక్తి కోసం పోలీస్ చర్య(ఆపరేషన్ పోలో) జరిగిన తర్వాత, ఆచార్య 1948 సెప్టెంబర్ 22న స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ వరంగల్‌కు తిరిగి వచ్చారు.
జనధర్మ వరంగల్ వాణి పత్రికల ప్రచురణ..
ఎంఎస్ ఆచార్య జీవితం పత్రికావిలేకరిగా మొదలైంది. ఆ తరువాత సంపాదకుడుగా ఎదిగారు. 1948లో ప్రఖ్యాత సంపాదకులు శంభు ప్రసాద్ సంతకంతో ఆయన ఆంధ్ర పత్రికకు వరంగల్ కరస్పాండెంట్‌గా నియమితులయ్యారు. ఆయన న్యూస్‌పేపర్ ఏజెన్సీల బాధ్యతను తన సోదరుడు రామానుజాచార్యకు అప్పగించి, సంచలనాత్మక వార్తలను రిపోర్ట్ చేసే బాధ్యతను స్వీకరించారు. తన పాత్రికేయ కార్యకలాపాల వల్ల ఆయన మాజీ ఎంపీలు, మంత్రుల నుంచి బెదిరింపులను ఎదుర్కొన్నారు.
1958లో ఆచార్య “జనధర్మ” అనే తెలుగు వారపత్రికను, 1980లో “వరంగల్ వాణి” అనే దినపత్రికను ప్రారంభించి, ప్రభుత్వాలకు లంచాలు ఇవ్వలేక కార్యకలాపాలను ఆపేసి, చివరికి వరంగల్ వాణి పత్రికను అమ్ముకోకతప్పలేదు.
1994 జూలై 12 వరకు తన జీవితాన్ని జనధర్మ పత్రికకు అంకితం చేసి, దానిని నడిపించుకున్నారు. స్వాతంత్ర్యసమరయోధుడనే గుర్తింపు తనకు వస్తుందని కూడా ఆయనకు తెలియదు. నేను ఈ విషయం తెలుసుకొని మిత్రులతో కలిసి గుర్తింపు ఇప్పించాను. మరణించే నాటికి వేయిరూపాయలు మాత్రం నెలకు దొరికేవి. కానీ మా అమ్మ రంగనాయకమ్మ 93 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచే దాకా పెన్షన్ దొరికింది. ఎంఎస్ ఆచార్య- మాఢభూషి ఆచార్య తన జీవితాన్ని వరంగల్‌కు, తెలంగాణకు అంకితం చేసి ప్రజల కోసం పరితపించిన వ్యక్తి.
(వ్యాస రచయిత మాడభూషి శ్రీధరాచార్యులు(ఎంఎస్ ఆచార్య కుమారుడు) మాజీ కేంద్ర సమాచార కమిషనర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
