విద్యార్థి సంఘం ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించడంపై కచ్చితమైన గడువును ఖరారు చేస్తూ విశ్వవిద్యాలయం హామీ ఇవ్వడంతో, నిరసనలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు తమ సమ్మెను విరమించుకున్నారు.
న్యూఢిల్లీ: విద్యార్థి సంఘం ఏర్పాటుకు, ఎన్నికలను నిర్వహించే విషయమై కచ్చితంగా గడువును ఖరారు చేస్తూ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కలిసి హామీ ఇచ్చిన తర్వాత- నిరసనల్లో ఉన్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు తమ నిరాహారదీక్షను విరమించుకున్నారు.
దాదాపు మూడు వారాల పాటు కొనసాగిన తమ నిరసనలు ముగియడంతో వారు సంబరాలు జరుపుకున్నారు.
తమ డిమాండ్లతో అక్టోబరు 12 నుంచి విద్యార్థులు క్యాంపస్‌లో నిరంతర నిరసనలు, నిరాహారదీక్షలను నిర్వహించారు.
విశ్వవిద్యాలయం చీఫ్ ప్రాక్టర్, భద్రతా సలహాదారుడి తొలగింపుతో పాటు నిర్బంధించిన విద్యార్థుల విడుదల, శిక్షాత్మక చర్యలు, విద్యార్థులకు వ్యతిరేకంగా జారీ చేసిన షోకాజ్ నోటీసుల ఉపసంహరణ, నిరంతర బోధనా కార్యకలాపాల కోసం క్యాంపస్‌ను తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయం కొన్ని కీలక చర్యలను ప్రకటించినప్పటికీ, నిర్బంధించిన విద్యార్థులతో పాటు పోలీసు చర్యలను ఎదుర్కొంటున్న ఇతరుల భవిష్యత్తుపై భయాలు పెరుగుతున్నాయి.
విద్యార్థుల నిరసనల సందర్భంగా విధ్వంసానికి సంబంధించిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది.
అదే సమయంలో- కొన్ని గంటల ముందు ఇద్దరు విద్యార్థులు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జీషన్ ఖాన్, మహ్మద్ ఫైజాన్‌లను తీహార్ జైలుకు తరలించారు.
విశ్వవిద్యాలయం బయట నిర్బంధించిన ఈ ఇద్దరు విద్యార్థులను అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ వద్ద స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. జేఎంఐలో ఎన్ఎస్యూఐ యూనిట్‌కు జీషన్ నాయకత్వం వహిస్తున్నారు.
తీహార్ జైలులో వారిని మూడు రోజుల పాటు నిర్బంధించనున్నట్లు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం తెలియజేసింది.
అంతేకాకుండా ఎస్ఈఎమ్ ఎదుట హాజరుపరచడానికి ముందు 24 గంటల పాటు ఖాన్, ఫైజాన్‌లను అక్రమంగా నిర్బంధించినట్టు కూడా ఆ కథనం వెల్లడించింది.
గతంలో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఈఎమ్ ఆదేశాల మేరకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను వారం రోజుల పాటు నిర్బంధించారు.
విద్యార్థి సంఘం రాజ్యాంగం ఏర్పాటు 2027 మే 15 నాటికి పూర్తి చేయాలని విశ్వవిద్యాలయం ఆదేశించింది- ఇప్పటి నుంచి ఆరు నెలలకు పైగా సమయం ఉంది.
విద్యా సంబంధమైన కార్యకలాపాలు 2027 జులై 16న ప్రారంభమైన “ఆరు వారాల లోపే” ఎన్నికలు జరగాలని అక్టోబరు 29న జారీ చేసిన ఉత్తర్వులో జేఎంఐ పేర్కొంది.
ఎన్నికల కోసం జులై ఆఖరు లేదా ఆగస్టు 2027 మధ్యలో తేదీని ఖరారు చేయవచ్చు.
విద్యార్థి సంఘం ఎన్నికలకు విద్యార్థులనే ఇన్‌ఛార్జులుగా చేస్తూ, లింగ్డో కమిటీ సిఫార్సుల ప్రకారం నిబంధనలను అమలుపరచనున్నట్టు ఆ ఉత్తర్వులో విశ్వవిద్యాలయం తెలిపింది.
ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలకు సంబంధించిన క్యాంపస్ నిషేధం, క్రమశిక్షణా చర్యలను రద్దు చేయడం జరుగుతుందని కూడా పేర్కొంది.
“తరగతులకు హాజరు తప్పనిసరి” చేస్తూ అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన ఆఫ్‌లైన్ తరగతులు, పరీక్షలను నవంబరు 2 సోమవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు, మరో నోటీసులో జేఎంఐ ప్రకటించింది.
నిరసనలకు సంబంధించి విద్యార్థులకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసు నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్లలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న దానిపై వేగంగా జరుగుతున్న ఈ పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి.
ఖాన్, ఫైజాన్ నిర్బంధంతో పాటు- జేఎంఐకు చెందిన బేగం హజ్రత్ మహల్ బాలికల హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని, జేఎంఐ నుంచి అత్యవసరంగా సెలవు పెట్టి విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ షోకాజ్ నోటీసును అందుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని 24 గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో కోరుతూ, ఆమె స్పందన సంతృప్తికరంగా లేనట్లు గుర్తిస్తే క్రమశిక్షణా చర్యకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జేఎంఐ విద్యార్థులు అక్టోబరు 12 నుంచి నిరసనలు చేపట్టారు. 2006 నుంచి విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరగలేదు.
విద్యార్థుల 19 రోజుల నిరాహారదీక్ష ఫలితంగా, విద్యార్థి సంఘానికి ఎన్నికలను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అక్టోబరు 9న ప్రకటించింది. ఈ ప్రకటన జేఎంఐ విద్యార్థుల పోరాటానికి ప్రేరేపించింది.
ఏఎంయూలో ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత ఒక విద్యార్థి సంఘాన్ని ఎన్నుకోనున్నారు.
ఏఎంయూలో విద్యార్థుల ఆందోళన ఫలితంతో ప్రోత్సాహం పొంది, జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరవధిక నిరాహారదీక్షను అక్టోబరు 12న ప్రకటించారు.
క్యాంపస్ హింస, పరిపాలనాపరమైన వివాదాలను పేర్కొంటూ తన విద్యార్థి సంఘాన్ని 2006లో జామియా రద్దు చేసింది.
నిరసన తెలుపుతున్న విద్యార్థులు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని బహిష్కరించి దానికి ప్రత్యామ్నాయంగా 7వ నెంబరు గేటు వద్ద “ఇంక్విలాబీ మేళా”ను నిర్వహించారు.
క్యాంపస్‌ను తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తూ వారు ఆన్లైన్ తరగతులను కూడా బహిష్కరించారు.
క్యాంపస్ నుంచి నిరసనకారులను బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించడంతో అక్టోబరు 25 ఉద్రిక్తతలు పెరిగాయి.
విశ్వవిద్యాలయం అధికారులు తరగతులను రద్దు చేసి, నీటి సరఫరా సౌకర్యాలను నిలిపివేసి, క్యాంపస్‌లో, బయట రాకపోకలపై పరిమితులను విధించారు.
భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ నిరసన తెలపడానికి విద్యార్థులు అధిక సంఖ్యలో గుమికూడటాన్ని కొనసాగించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
