“ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక అంతరాన్ని భర్తీ చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేయడానికి భారత్‌కు అనుమతి ఇచ్చినట్టు” అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఒక టెలివిజన్ షోలో చెప్పారు.
న్యూఢిల్లీ: భారతీయులు “చాలా మంచి నటులు” అని, అమెరికా చెప్పిన వెంటనే వారు ఆంక్షలున్నా రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేశారని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు.
ఫాక్స్ బిజినెస్ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.
“భారతీయులు చాలా మంచి నటులు. ఆంక్షలు ఉన్న రష్యన్ చమురు కొనుగోలును నిలిపివేయాలని మేము చెప్పాము, వారలానే చేశారు. దాన్ని అమెరికా చమురుతో వారు భర్తీ చేసుకుంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు కొరతను తగ్గించడానికి, రష్యన్ చమురును స్వీకరించేందుకు మేము వారికి అనుమతి ఇచ్చాము. ఇతర రష్యన్ చమురుపై మేము ఆంక్షలు విధించకపోవచ్చు”అని న్యూస్ షోలో ఆయన చెప్పారు.
రష్యన్ చమురు సరఫరాపై అమెరికా తాత్కాలిక సడలింపు
ఆంక్షల కారణంగా “వందల మిలియన్ల” బ్యారెళ్ల చమురు సముద్ర జలాలపైనే నిలిచిపోయింది. అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ వాటి సరఫరాకు అనుమతించవచ్చు. వారు దాని కోసమే ఎదురుచూస్తున్నారు. “ఈ సంఘర్షణ కాలంలో మార్కెట్‌కు ఉపశమనం కలిగించడానికి తీసుకునే చర్యలను త్వరలో ప్రకటించనున్నాము”అని బెసెంట్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “అమెరికన్ ఇంధన ఆధిపత్య విధానానికి” కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రపంచంలో చమురు సరఫరా మెరుగ్గా ఉందని పేర్కొంటూ- మార్చి 7న తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో బెసెంట్ ఒక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు.
“భారత్‌లో మా మిత్రులు చాలా మంచి నటులు. ఆంక్షలు ఉన్న రష్యన్ ఇంధన కొనుగోలును వారు గతంలో నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక కొరతను తగ్గించే ఉద్దేశ్యంతో, ఇప్పటికే సముద్ర జలాలపై నిలిచిపోయిన రష్యన్ చమురును స్వీకరించడానికి మేము తాత్కాలికంగా అనుమతించాము” అని తన సోషల్ మీడియా పోస్టులో ఆయన పునరుద్ఘాటించారు.
“ఈ అనుమతి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న స్వల్పకాలిక చర్య మాత్రమే. దీని వల్ల రష్యన్ ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక లాభాలు ఏవీ ఉండవు. ఎందుకంటే, సముద్రంపై ఇప్పటికే చిక్కుకుపోయిన చమురుకు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే ఇది అధికారం ఇస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఆదేశాల మేరకే రష్యన్ ఇంధన కొనుగోలును భారత్ నిలిపివేసినట్టు బెసెంట్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ, దీనిపై వ్యాఖ్యానించడానికి భారత అధికారులు ఇంకా నిరాకరిస్తూనే ఉన్నారు.
‘ది వైర్’ కథనం- ప్రతిపక్షాల విమర్శలు
ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ వల్ల పెరుగుతున్న ధరల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, 30 రోజుల పాటు రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి అమెరికా ఆర్థిక విభాగం భారత్‌కు అనుమతి ఇచ్చినట్టు ‘ది వైర్’ కథనం తెలియజేసింది.
రష్యా నుంచి కొనుగోలు చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, ముడిచమురు ఇప్పటికే ఓడల్లో ఉన్నాయని, అవి మార్చి 5 నుంచి ఏప్రిల్ 4 వరకు భారత్‌లో అన్లోడ్ అవుతాయని అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ లొంగిపోయారని, అమెరికా శ్రేయస్సు కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్నారని భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లు ‘ది వైర్’ కథనం తెలిపింది.
మౌనం పాటిస్తున్న భారత్ – లాభపడే ఆలోచనలో అమెరికా..
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తున్నట్లు భారత్ మాటిచ్చిందని ఫిబ్రవరి 14న యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెప్పారు.
ఉభయ దేశాల మధ్య వ్యాపార ఒప్పందం ప్రకటించినప్పటి నుంచి ఈ విషయాన్ని అమెరికా పలుసార్లు చెబుతూ వస్తోంది. అయితే, ఈ అంశంపై భారత్ మౌనం పాటిస్తోంది.
రష్యాతో చమురు కొనుగోలు ముగింపుకు, భారత్‌కు ఇస్తున్న సుంకాల రాయితీలతో స్పష్టంగా సంబంధం ఉన్న యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై స్పందించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఫిబ్రవరి 10న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలియజేశారు.
రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేస్తున్నట్లు అమెరికాకు ఏమైనా హామీ ఇచ్చారా అన్న ప్రశ్నకు మిస్రీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఫిబ్రవరి 7న ఈ అంశంపై ఎదురైన ప్రశ్నలను దాటవేశారు.
అయితే, ఫిబ్రవరి 14న రూబియో ఆ ప్రకటన చేసిన సమావేశంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి కట్టుబడి ఉందని, “ఎందుకంటే అది మా చరిత్ర పరిణామంలో భాగం” అని స్పష్టం చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా, దానికి బదులుగా అమెరికా చమురును కొనుగోలు చేసేలా చేసి, భారత్ నుంచి లబ్ధి పొందాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు మార్చి 6 నాటి బెసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
చమురు మార్కెట్లో రికార్డు స్థాయి లాభాలు
సీఎన్‌బీసీ ప్రకారం, యాదృచ్ఛికంగా అమెరికా ముడి చమురు శుక్రవారం మార్చి 6 నాటి వారాంతపు వర్తకంలో చరిత్రలోనే అతిపెద్ద లాభాలను సాధించింది.
వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(అమెరికా గ్రేడ్ ముడి చమురు) ధర ఒక్క బ్యారెల్‌కు 12.21% లేదా $9.89 పెరిగి, $90.90కి చేరుకుంది.
అలాగే, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యాల్లో చమురు ధరలను నిర్దేశించే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 8.52% లేదా $7.28 పెరిగి, $92.69 వద్ద స్థిరపడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
1983 నుంచి చూస్తే అమెరికా చమురు చరిత్రలోనే వారాంతపు లాభం 35.63% మేర పెరిగింది.
ఏప్రిల్ 2020 తర్వాత బ్రెంట్ క్రూడ్ వారంలో సుమారు 28% మేర పెరిగి అతిపెద్ద లాభాన్ని ఆర్జించింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
