ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తొలిసారిగా చతుర్ముఖ పోటీని చూడనున్నాయి.
ఓవైపు డీఎంకే, ఏఐఏడీఎంకేలు ప్రధాన శిబిరాలుగా తమ మిత్ర పక్షాలతో బరిలోకి దిగుతుండగా, మరోవైపు కొత్తగా ప్రారంభమైన తమిళగ వెట్రి కజగం(టీవీకే)తో పాటు నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
తమిళనాడు గతంలో ఎన్నడూ చూడని రీతిలో పలు పక్షాలు వినూత్న వాగ్దానాలతో ఓటర్లను మైమరపించబోతున్న ఈ ఎన్నికలకు సంబంధించిన తాజా స్థితి గురించి టీ రామకృష్ణన్ ‘ది హిందూ’లో ఇచ్చిన సమగ్ర విశ్లేషణను ‘ది వైర్ తెలుగు’ పాఠకుల కోసం అందిస్తున్నాము.
ఏప్రిల్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు మరో పది రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. దీంతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం వాదప్రతివాదాలు, ఆరోపణలు-ప్రత్యారోపణలతో మారుమ్రోగనున్నది.
ఈసారి జరగబోయే ఎన్నికలు గతం కంటే భిన్నంగా ఉండనున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు దాదాపుగా ‘జనరేషన్ జెడ్’ను విస్మరించాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజాకర్షణ కలిగిన సినీ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే రాజకీయ సమీకరణలలో మార్పుకు పునాది వేయబోతున్నదా?
సర్దుబాటు కాని సీట్లు..
ఈ కథనం రాసే వరకు డీఎంకే నాయకత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి, ఏఐఏడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏలు తమ భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకోలేదు.
డీఎంకే కాంగ్రెస్‌కు 28 సీట్లు, సీపీఐకి 5 సీట్లను కేటాయించింది.
ఎండీఎంకేకు నాలుగు సీట్లను కేటాయించగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఎంకే, కేఎండీకే పార్టీలకు రెండేసి స్థానాలు కేటాయించింది.
అయితే, ఈ కూటమిలో ప్రధాన భాగస్వాములైన సీపీఎం, వీసీకే, డీఎండీకే, ఎంఎన్ఎంలతో సీట్ల సర్దుబాటు ఖరారు కాలేదు.
ఇవేకాక, మరికొన్ని చిన్న పార్టీలు కూడా డీఎంకే కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి.
సీట్ల సర్దుబాటులో ఈ సారి ఓ ముఖ్యమైన లక్షణం కనిపిస్తోంది. పాలక కూటమికి నాయకురాలిగా ఉన్న డీఎంకే, కాంగ్రెస్‌కు తప్ప మిగిలిన కూటమి భాగస్వాములకు అందరికీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయించింది.
ఈ పరిస్థితిని కూటమిలో జూనియర్ భాగస్వామ్య పక్షాలు ఆహ్వానించలేకపోతున్నాయి.
అయినప్పటికీ, ఆయా పక్షాలు సంకీర్ణాన్ని ప్రశ్నార్థకం చేయరాదనే అవగాహన మేరకు తక్కువ సీట్లతో సంతృప్తి పడ్డాయి. మరోవైపు టికెట్లు కోరుతున్న అభ్యర్థులతో డీఎంకే సంప్రదింపులను మొదలు పెట్టింది.
ఈ సారి డీఎంకే తీర్థం పుచ్చుకున్న, నిన్న మొన్నటి వరకు ఏఐఏడీఎంకే సమన్వయ కర్తగా ఉన్న పన్నీర్ సెల్వం, ఆయన కొడుకు- తేని మాజీ ఎంపీ రవీంద్రనాథ్‌లు కూడా అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

డీఎంకే కూటమిలో చిక్కుముడులు..
నెల రోజుల క్రితం సీట్ల సర్దుబాటు చర్చలు మొదలయ్యే వరకు పాలక లౌకిక ప్రగతిశీల కూటమి పరస్పరం అవగాహన, ఏకాభిప్రాయం కలిగిన కూటమిగా కనిపించింది.
గత ఐదేళ్లలో బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకే నిర్వహించిన అన్ని ఆందోళనలు, పోరాటాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
అయితే, గత నెల రోజులుగా ఎంఎన్ఎం లాంటి కూటమి కొత్త భాగస్వామ్య పక్షాలకు కూడా డీఎంకే సీట్లు కేటాయించడానికి సిద్ధం కావడంతో భాగస్వామ్య పక్షాల మధ్య గందరగోళం మొదలైంది.
రాష్ట్ర రాజధాని చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్రవండిలో జరిపిన టీవీకే ప్రారంభ సభలో పార్టీ అధినేత విజయ్ మాట్లాడుతూ, తాము అధికారానికి వస్తే ప్రధాన భాగస్వామ్య పక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని ప్రకటించారు.
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు ఇటువంటి వాగ్దానం తోసిపుచ్చలేనిది.
అయితే కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రదర్శించిన పరిణతి, డీఎంకే నాయకత్వం అనుసరించిన వెసులుబాటు ధోరణితో కాంగ్రెస్ అదనంగా మూడు సీట్లు పొంది కూటమిలోనే కొనసాగడానికి నిర్ణయించుకుంది.
అయితే, సీట్ల సర్దుబాటు చర్చలు జరిగిన ప్రతిసారి కాంగ్రెస్ కొత్త డిమాండ్లతో ముందుకు రావడంతో సంకీర్ణం, సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి రావడంలో ఆలస్యమయ్యాయి.
అంతిమంగా మూడు సీట్లు అదనంగా సంపాదించుకున్న కాంగ్రెస్ సంకీర్ణ నావను గట్టెక్కించింది.
అదనంగా రాజ్యసభ సీటుకు కూడా హామీ పొందింది. గత పదేళ్లుగా సంకీర్ణంలో భాగస్వాములుగా కొనసాగుతున్న సీపీఎం, వీసీకేలు గతం కంటే ఎక్కువ సీట్లను కోరుతున్నాయి.
దీంతో పాలక సంకీర్ణ సీట్ల సర్దుబాటుకు తుది రూపం ఇవ్వడం ఆలస్యమవుతోంది.
ఏఐఏడీఎంకే విషయానికి వస్తే, బీజేపీతో కూటమిని ఖరారు చేసుకొని దాదాపు ఏడాది కావొస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఏడీఎంకేలు విడివిడిగా పోటీ చేశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలను పాలక లౌకిక ప్రగతిశీల కూటమి చేజెక్కించుకున్నది.
ఫలితంగా ప్రతిపక్ష శిబిరంలోని రెండు ప్రధాన పార్టీలు తమ అహాన్ని వదిలి పొత్తుకు సిద్ధమయ్యాయి.
ఊహించని పరిణామం..
ఈ మధ్యకాలంలో ఎన్డీఏ కూటమిలోని మరో భాగస్వామి ఏఎంఎంకే కూటమిని వీడిపోవడం, 2026 జనవరిలో తిరిగి కూటమిలోకి రావడంతో పన్నీరు సెల్వం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫలితంగా ఎవరూ ఎన్నడూ ఊహించని విధంగా పన్నీరు సెల్వన్ పాలక డీఎంకేలో చేరారు.
ఇదిలా ఉండగా, ఎన్డీఏ కూటమిలోని మరో భాగస్వామి పీఎంకే తండ్రీ తనయుల మధ్య నిలువునా చీలిపోయింది. డాక్టర్ అన్బుమణి రాందాస్ నాయకత్వంలోని పీఎంకే చీలిక వర్గం ఎన్డీఏలో కొనసాగడానికి సిద్ధమైంది. టీఎంసీ(మూపనార్) పార్టీ కూడా ఎన్డీఏతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది.
ఎన్డీఏ కూటమి తరఫున పళనిస్వామి కేంద్ర హోంమంత్రితో గత రెండువారాలలో రెండు దఫాల చర్చలు జరిపారు. బీజేపీ తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పీయూష్ గోయల్ కూడా ఈ చర్చలలో భాగస్వామిగా ఉన్నారు.
నేరుగా తానే సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీతో సంప్రదింపులు జరపడంతో మిగిలిన భాగస్వాములతో సీట్ల సర్దుబాటు విషయమై చర్చించేందుకు ఏఐఏడీఎంకే ఎటువంటి చర్యలను చేపట్టలేదు.
దీనికి భిన్నంగా పాలక కూటమి నాయకురాలిగా ఉన్న డీఎంకే తన భాగస్వామ్య పక్షాలతో ఫిబ్రవరిలోనే సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలుపెట్టింది. సీట్ల సర్దుబాటు విషయంలో పాలక, లౌకిక ప్రగతిశీల కూటమిలో ఎటువంటి పొరపొచ్చాలు లేవని స్వయంగా పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం.
ఈ పరిస్థితుల్లో పాలక లౌకిక ప్రగతిశీల కూటమిలా- ఎన్డీఏ కూటమి భాగస్వాములు తమ విభేదాలను విస్మరించి, ఐక్యంగా నేటికి ముందుకు రాలేదు.
గత ఏడాది కాలంగా డీఎంకే నేతృత్వంలోని పాలక కూటమి వైఫల్యాలపై ప్రజలను సమీకరించే అవకాశాలు వచ్చినా ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
అంతిమంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రెండురోజుల తర్వాత మాత్రమే, మార్చి 17న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి తొలిసారిగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పూనుకున్నది.
విభేదాల నుంచి సఖ్యత దిశగా..
2016లో ఏఐఏడీఎంకే అధినేత జయలలిత మరణం తర్వాత బీజేపీతో ఆ పార్టీ తన సంబంధాలను పునరుద్ధరించుకున్నది. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ స్థానాన్ని బీజేపీకి అప్పగిస్తున్నారన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.
2025 ఏప్రిల్‌లో ఏఐఏడీఎంకే, బీజేపీలు తమ రాజకీయ విభేదాలు మరచి మరోసారి దగ్గరయ్యాయి. దీంతో రానున్న రాజకీయ సమరం తమిళనాడుకు, ఢిల్లీకి అని డీఎంకే శంఖారావం పూరించింది.
ప్రధాన తమిళ పార్టీ ఈ పరిణామాలను ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య జరుగుతున్న పోరాటంగానూ, తమిళ భాషపై ఆధిపత్యం చలాయించేందుకు హిందీ భాష అనుకూల రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రయత్నంగానూ చూపే ప్రయత్నంలో డీఎంకే “తమిళ భాష, ప్రాంతం, జాతి, సంస్కృతుల రక్షకుడిగా నిలిచింద”ని ఇంగ్లీష్ ప్రొఫెసర్ గంగా జయరామన్ అభిప్రాయపడ్డారు. జయరామన్ 1960 దశకంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగ నేతగా రాజకీయాలు నడిపారు.
ఈ విమర్శలకు స్పందిస్తూ ఏఐఏడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి మునుస్వామి, జాతీయ పార్టీలతో వ్యవహరించడంలో తమ పార్టీకి సుదీర్ఘమైన అనుభవం ఉన్నదని చెప్పుకున్నారు.
1998లో తొలిసారి బీజేపీ తమిళనాట పార్లమెంటరీ ప్రాతినిధ్యం సంపాదించడంలో ఏఐఏడీఎంకే బీజేపీకి అందించిన సహకారాన్ని మర్చిపోకూడదని అన్నారు. “అందువల్ల ఎవరూ ఎవరినీ మింగేసే అవకాశం లేదు”అని మునుస్వామి స్పష్టం చేశారు.
ఆరోపణలు- ప్రత్యారోపణలు..
నానాటికీ దిగజారుతోన్న శాంతిభద్రతలు, మహిళల భద్రతవంటి సమస్యలపై కేంద్రీకరిస్తున్న ఏఐఏడీఎంకే- ధరల భారం నుంచి ప్రజలను కాపాడటంలో పాలక లౌకిక కూటమి విఫలమైందని విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించింది.
మరోవైపు గత పదేళ్లలో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, నిలకడగా కొనసాగుతున్న ఆర్థికాభివృద్ధిని తమ విజయాలుగా డీఎంకే ప్రచారం చేస్తోంది.
సంకీర్ణ సమస్యలు పక్కనపెట్టి చూస్తే, మెజారిటీ రాష్ట్రాలలో పాలక పార్టీలే అధికారాన్ని నిలుపుకుంటున్నాయని రాజ్యసభ ఎంపీ కాన్స్టాంటైన్ రవీంద్రన్ అన్నారు.
మరోవైపు ప్రజలలో అప్రతిష్టపాలైన ఏఐఏడీఎంకే స్థానాన్ని ఆక్రమించుకోవడానికి టీవీకే అధినేత విజయ్ ప్రయత్నిస్తున్నారు. తదనుగుణంగా డీఎంకేపై విజయ్ తమ విమర్శలను ఎక్కుపెట్టారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ తమకు, డీఎంకేకు మధ్యనే అని విజయ్ చెప్పుకుంటున్నారు.
2024- 25 మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామళై ప్రచారశైలిని విజయ్ అనుకరిస్తున్నట్టు కనిపిస్తోంది.
చెన్నై పరిసర ప్రాంతాలలోనూ, కావేరీ డెల్టా ప్రాంతంలోనూ టీవీకే మెరుగైన ఫలితాలు పొందే పరిస్థితి కనిపిస్తోందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏఐఏడీఎంకే బలహీనంగా ఉన్న ప్రాంతాలలో టీవీకే పాలక సంకీర్ణానికి సవాలు విసురుతోందని ఈ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్‌కు ఉన్న ప్రజాదరణ, సినిమా నటుడికి ఉండే ఆదరణకు మించి ఉన్నదని సాఫ్ట్వేర్ ఉద్యోగి పీ విజయ్ అన్నారు.
పార్టీ ఆవిర్భావ సభలో జరిగిన తొక్కిసలాట తదనంతర వివాదం, విజయ్‌కు తన భార్యతో విడాకుల గొడవ టీవీకే అధినేత పలుకుబడిని మసకబార్చలేకపోయాయని అన్నారు.
తాను బీజేపీకి సైద్ధాంతిక శత్రువుగా ఉన్నందునే తనను కేంద్ర పాలక ఎన్డీఏ కూటమి ఇబ్బంది పెడుతోందని విజయ్ ఆరోపిస్తున్నారు.
ఎన్ని ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలోని 234 సీట్లలోనూ అభ్యర్థులను బరిలోకి దించాలని టీవీకే నిర్ణయించింది.
ఈ మూడు ప్రధాన పక్షాలతో పాటు 16 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎన్టీకే(నామ్ తమిళర్ కట్చి) కూడా ఈసారి ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. నటుడు, దర్శకుడు సీమాన్ ఈ పార్టీ అధినేతగా ఉన్నారు.
గత పదేళ్లుగా ఎన్టీకే రాష్ట్రంలోని ఏ రాజకీయ సంకీర్ణంలోనూ భాగస్వామి కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లోనూ 50 శాతం సీట్లు మహిళలకే కేటాయించడం ద్వారా ఈ పార్టీ రాజకీయ పరిశీలకుల దృష్టినే కాక ప్రజల దృష్టిని కూడా ఆకర్షించింది.
తాజా ఎన్నికల్లో ఈ పార్టీ ఆరుగురు బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చింది. తమిళనాట రాజకీయాలలో దీర్ఘకాలం నిరాదరణకు గురైన సామాజిక తరగతిగా ఉన్నవారిలో బ్రాహ్మణులు ఒక తరగతి.
ఏఐఏడీఎంకే మాజీ మధ్యంతర ప్రధాన కార్యదర్శి శశికళ నేతృత్వంలో ఏర్పడిన పీఎంఎంకే (పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం) మరికొన్ని చిన్నాచితకా పార్టీలను పోగేసే పనిలో ఉన్నది.
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎన్ని పక్షాలు ఉన్నా ప్రధాన పోటీ పాలక లౌకిక సంకీర్ణానికి, ప్రతిపక్ష మతతత్వ రాజకీయ సంకీర్ణానికి మధ్యనే ఉంటుంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
