హైదరాబాద్ నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ మిశ్రా వ్యాఖ్యల అనంతరం తలెత్తిన వివాదం నేపథ్యంలో నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ 13వ స్నాతకోత్సవంలో జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
న్యూఢిల్లీ: “రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యానికి స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయవాదులు కీలకమైన అంతర్భాగం” అని జస్టిస్ నాగరత్న అన్నారు.
అటువంటి బార్ కౌన్సిల్ దేశంలో న్యాయవాదుల నుంచి ఆదరాభిమానాలు పొందలేకపోవడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న వాపోయారు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం- “జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ తాము పోషిస్తున్న పాత్ర గురించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వృత్తిపరమైన నైతికతా ప్రమాణాలు, సామర్థ్యం గురించి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బార్ కౌన్సిల్ తన తోటి సభ్యుల నుండే గౌరవం పొందలేకపోవడం న్యాయవాద వృత్తికి శుభసూచకం కాదు” అని జస్టిస్ నాగరత్న అన్నారు.
ఢిల్లీ జాతీయ న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న జస్టిస్ నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు.
బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న మనన్ మిశ్రా రాజీనామా చేయాలంటూ వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నల్సార్ విద్యార్థులపై మనన్ మిశ్రా ఆంక్షలు..
2026లో హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందిన విద్యార్థులు ఎవరినీ బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా రిజిస్ట్రేషన్ చేయరాదు అంటూ మనన్ మిశ్రా హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌కు లేఖ రాసిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.
యువత గురించి, ప్రత్యేకించి నిరుద్యోగ యువత గురించి జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్న విద్యార్థుల గురించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ నల్సార్ విద్యార్థులు ఆయనను స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి నిరాకరించారు.
ఈ నేపథ్యంలో మనన్ మిశ్రా హైదరాబాద్ నల్సార్ విద్యార్థులందరినీ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేశారు.
స్వయంప్రతిపత్తిని కాపాడుకుందాం..
స్వయంప్రతిపత్తి కలిగిన బార్ కౌన్సిల్ న్యాయవాదుల హక్కులు, అవకాశాలు పరిరక్షించేందుకు అర్థవంతమైన వేదిక అవుతుందని కూడా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో వృత్తిపరమైన మేధావులు స్వయంప్రతిపత్తిని అలవర్చుకోవడం అవసరం అని కూడా ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జస్టిస్ నాగరత్న “స్వయంప్రతిపత్తి కలిగిన బార్ అన్నది కేవలం న్యాయవాదుల హక్కుల కోసం మాత్రమే కేటాయించబడిన సంస్థ కాదు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నుంచి, మార్కెట్ నుంచి, చివరకు తమ కక్షిదారుల నుండి అనుమతి కోరాల్సిన అవసరం లేకుండా సలహాలు ఇచ్చేవారు, వాదించేవారు, సవాలు విసిరేవారు, ప్రాతినిధ్యం వహించేవారు ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి వారికి ప్రాతినిధ్యం వహించేందుకు వృత్తిపరమైన వేదికలు అవసరమయ్యాయి. ఈ వృత్తిలో రాణించిన వారు వృత్తి ధర్మం మర్చిపోకుండా గుర్తు చేయడానికి ఉనికిలోకి వచ్చింది బార్ కౌన్సిల్. దాని స్వయంప్రతిపత్తిని కాపాడుకుందాం” అన్నారు.
చట్టం విశ్వాసానికి ప్రతీక అని, న్యాయవాది అంటే కేవలం తన జ్ఞానాన్ని గంటల్లో అమ్ముకునే వాడే కాదని ఆమె గుర్తు చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
