‘4పీఎం’ న్యూస్ నెట్వర్క్ జర్నలిస్టులపై పోలీసు దాడిని మీడియా సంఘాలు, రాజకీయ పార్టీలు, అనేక మంది ఇతరులు తీవ్రంగా ఖండించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న ఒక వేడుకను యూట్యూబ్ ఛానెల్ ‘4పీఎం న్యూస్ నెట్వర్క్’ కోసం కవర్ చేయడానికి అసైన్మెంట్ పైన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షహీన్ ఖాన్ వెళ్లారు.
అక్కడ తనపైన, తన తోటి జర్నలిస్టు నఫీసా ఖాన్‌పైన పోలీసులు దాడి చేశారని సాకేత్ పోలీస్ స్టేషన్ నుంచి సెప్టెంబర్ 3న తెలియజేశారు.
వీడియోలో గాయాల గుర్తులు..
వారి గాయం మరకలను ఖాన్ తన వీడియో ద్వారా చూపించారు. నఫీసా పరిస్థితి కూడా చూపించారు. తన చేయిపై ఉన్న దెబ్బలు, లాఠీతో కొట్టడంతో దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న నఫీసా తొడలపైన ఉన్న ఎర్రటి దెబ్బల మరకలను ఆమె చూపించారు.
నఫీసాను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి, తమతో ఉన్న మూడవ మహిళ ధైర్యం చెప్పారు. ఖాన్ వీడియోలో కెమెరా వ్యక్తి కనిపించలేదు.
మతం పేరుతో మరింత దాడి..
“ముఖ్యమంత్రి, హోం మంత్రికి ఒక ప్రశ్న అడిగిన పాపానికి మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకువెళ్లారు. అక్కడ నా పేరు చెప్పగానే మతాన్ని ఉద్దేశించి మరింత గట్టిగా దాడి చేశారు” అని తన రిపోర్టులో పేర్కొన్నట్లు 4పీఎం న్యూస్ నెట్వర్క్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది.
సాకేత్ థానా నుంచి ఎర్రటి ముఖంతో, కళ్లలోంచి నీరు కారుతుండగా తన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తుండగా, ఖాన్ కెమెరాలో ఒక పోలీస్ సిబ్బంది, మరో ఇద్దరు కనిపించారు.
“మానసికంగా, శారీరకంగా మాపై దాడి చేసిన తర్వాత నా పేరేమిటని అడిగారు. నా పేరు ఖాన్ అని బదులిచ్చాను. నా పేరులో ఖాన్ అని ఉంది, అందుకే ఢిల్లీ పోలీస్ అధికారులు మాపై దాడికి దిగారు. లాఠీలతో, చేతులతో కొట్టారు” అని అదే పోలీస్ అధికారి ముందు కెమెరాలో ఆమె చెప్పారు.
కచ్చితంగా విచారణ జరుగుతుంది..
ఈ దశలో హెల్ప్ డెస్క్‌లో కూర్చొని ఉన్న పోలీస్ అధికారి వినిపించకుండా ఏదో అన్నారు. దానికి ఖాన్ కెమెరా ముందు సమాధానం ఇస్తూ, “హోగీ- బిల్కుల్ హోగీ కారవాహీ (అవును జరుగుతుంది- కచ్చితంగా విచారణ జరుగుతుంది)” అని అన్నారు.
“ముసల్మాన్ పేరుతో మా పట్ల ద్వేషాన్ని ప్రదర్శించారు. దీనికంతటికీ ఢిల్లీ పోలీసులు జవాబు చెప్పాల్సి ఉంటుంది” అని ఆమె పేర్కొన్నారు.
సోఫాలున్న పక్కగదిలో నొప్పితో బాధపడుతున్న నఫీసా వద్దకు కెమెరామెన్ వెళ్లారు, వెయిటింగ్ గదిలో కొంత మంది ఇతరులు కూడా ఉన్నారు.
నడవలేని స్థితిలో ఉన్న నఫీసాను ఆ తర్వాత కొందరు తెలిసిన వాళ్లు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు మోసుకొస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాలు చూపించాయి.
పోలీసు స్టేషన్లో నేలపైన అపస్మారక స్థితిలో ఖాన్ పడి ఉన్నట్లు ఆన్లైన్లో పంపిణీ అయిన వీడియోలు చూపించాయి.
జర్నలిజాన్ని లక్ష్యంగా చేసుకోవడమేనా?
“ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి గత కొద్ది రోజులుగా 4పీఎం ఛానెల్ నిరంతరంగా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతూ రిపోర్టులు ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ విధంగానైనా ఆ ప్రశ్నలు, ప్రచురణలతో ఈ రోజు చర్యలకు ముడిపడి ఉందనడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది” అని థానా నుంచి వీడియో వార్తను పంచుతూ 4పీఎం ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ శర్మ అన్నారు.
“ముఖ్యమంత్రికి ప్రశ్నలు అడగడం నేరంగా మారిపోయిందా? అధికారంలో ఉన్న వారికి జర్నలిస్టుల ప్రశ్నలు ఇంత ప్రమాదకరంగా మారుతున్నాయా? ఒక జర్నలిస్టు పేరులో ఖాన్ అని ఉన్నంత మాత్రాన వారిపై దాడికి కారణం అవుతుందా?” అని ఆయన ఎక్స్(ట్విట్టర్)లో రాశారు.
మీడియా సంఘాల తీవ్ర ఖండన..
జర్నలిస్టులు, శర్మ వాదనలను ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసుల చర్యలను ‘డిజిపబ్’ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. తమ ఛానెల్‌ను తరచుగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శర్మ చెప్పారు.
“అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడం జర్నలిజం ప్రాథమిక ప్రజాస్వామ్య జవాబుదారీతనంలో భాగం. జర్నలిస్ట్ తన విధి నిర్వహణను భయం, బెదిరింపులు లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుంది” అని ఆ ప్రకటన గుర్తు చేసింది.
ఈ సంఘటనపైన స్వతంత్ర దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజ్‌ల సంరక్షణ, బాధ్యులైన వారి నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసింది.
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ (ఐడబ్ల్యూపీసీ), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (డీయూజే), ప్రెస్ అసోసియేషన్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒక సంయుక్త ప్రకటనలో సెప్టెంబర్ 3 మధ్యాహ్నం జరిగిన దాడిని తీవ్రంగా ఖండించాయి.
మతం తెలిశాకే ద్వేషపూరిత దాడి..
జర్నలిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇద్దరు నాయకులను ప్రశ్నించినందుకు పోలీసులు ఈడ్చుకుంటూ, దాడి చేస్తూ తీసుకెళ్లారు. వారి మతం గురించి తెలియగానే దాడిని మరింత తీవ్రం చేశారు.
“పోలీస్ స్టేషన్లో ప్రవేశించగానే స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్ఓ) ఈ ఇద్దరు జర్నలిస్టులను ఒక గదిలోకి తీసుకెళ్లాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. అప్పుడు మహిళా అధికారులు కూడా చేరి షహీన్, నఫీసాను కొట్టడం మొదలు పెట్టారని” ఆ ప్రకటన తెలియజేసింది.
ఇద్దరు జర్నలిస్టులను ఎఫ్ఐఆర్లతో బెదిరిస్తూ వారి మతాన్ని ఉద్దేశించి ద్వేషంతో మాట్లాడుతూ బూతులకు పాల్పడ్డారని అది తెలిపింది.
స్వతంత్ర దర్యాప్తు చేయాలి..
ఇద్దరు జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో పాలుపంచుకున్న పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తును ప్రారంభించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్‌కు ప్రెస్ సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి.
ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి, పత్రికా స్వేచ్ఛను హింసతో అణచివేయడానికి ప్రయత్నించిన అధికారులకు వ్యతిరేకంగా స్వతంత్ర దర్యాప్తును చేపట్టాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కూడా కోరాయి.
అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ వార్తపైన స్పందిస్తూ ఇందులో పాలుపంచుకున్న పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా చర్యలను డిమాండ్ చేశాయి.
కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతితో సహా జర్నలిస్టులపై దాడిని పలువురు నేతలు ఖండించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
