గడచిన 15 ఏళ్లుగా “వారసత్వ రాజకీయాల” గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, పలు వేదికల మీద నాయకులు వారసత్వ రాజకీయాలను ఖండిస్తున్నారు.
అయినప్పటికీ, భారతీయ ఓటర్లు రాజకీయాల్లో కుటుంబ నేపథ్యానికి పెద్దపీట వేస్తూనే ఉండటం కాదనలేని వాస్తవం.
మార్చి 10న దినపత్రికల్లో ప్రచురితమైన రెండు చిత్రాలు పాఠకుల దృష్టిని ఆకర్షించాయి. వాటిలో ఒకటి పాట్నాకు చెందింది కాగా, మరొకటి అహ్మదాబాద్ది.
ఈ రెండు చిత్రాలు పాత భారతదేశానికి, రూపురేఖలు మార్చుకున్న ‘కొత్త భారతదేశాని’కి అద్దం పడుతున్నాయి. దేశం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది, కానీ అది కేవలం “హిందూ” ఛాయలతో మాత్రమేనని ఇవి సూచిస్తున్నాయి.
బీహార్‌లో కొత్త వారసుడి అరంగేట్రం
జనతాదళ్(యునైటెడ్) సరికొత్త ఆశాకిరణంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొడుకు నిశాంత్ రాజకీయ అరంగేట్రానికి పాట్నాలో ముమ్మర సన్నాహాలు జరిగాయి.
ఈ ప్రజాస్వామ్య ‘పట్టాభిషేక’ మహోత్సవం ఏనుగులు, గుర్రాలు, వాయిద్యాలు, నృత్యాలతో అత్యంత వైభవంగా జరిగింది.
నిశాంత్ మరీ చిన్నవాడేమీ కాదు, అతనికి బీహార్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కొచ్చని లేదా ఏకంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా అప్పగించవచ్చని సొంత పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.
ఇప్పటివరకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని, ప్రజలకు పెద్దగా పరిచయం లేని, బహుశా రాజకీయాలపై ఆసక్తి కూడా లేని నాయకుడి కుమారుడికి పట్టం కట్టడానికి జేడీ(యూ) సీనియర్ నేతలు సైతం అంగీకరించినట్టు కనిపిస్తోంది.
దీంతో బీహార్ వారసత్వ రాజకీయాల వేదికపై తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్ల సరసన నిశాంత్ కూడా చేరబోతున్నాడు.
పాత కాలపు రాజకీయ లెక్కల్లో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమైన విషయం, ఆ ఒరవడి ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.
క్రికెట్ రంగంలో వారసత్వ పర్వం
నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై టీ20 ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుమారుడిని కౌగిలించుకుని అభినందిస్తున్న ఫోటోలు మనం చూశాం.
అయితే, తండ్రీకొడుకులు దేశం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకోని సంబరాలు జరుపుకుంటున్నారా? లేక తన కుమారుడి ప్రాబల్యాన్ని పెంచి అతనొక బలమైన ప్రజాదరణ పొందేందుకు ఈ “విజయాన్ని” వాడుకుంటున్నారా అన్నది వేచిచూడాలి.
ప్రస్తుతం భారత క్రికెట్ వ్యవహారాలను నడిపిస్తున్న ముఖ్యుల్లో జై షా ఒకరు. భారత దేశంలో ప్రజలకు అత్యంత ఆసక్తి ఉన్న ఏకైక ఆట క్రికెట్; దీన్ని ఒక జాతీయ భావనగా ఆరాధిస్తాం. ఈ ఆటపై అపారమైన పరిజ్ఞానం ఉందనో, లేదా గొప్ప క్రికెటర్ అనో ఆయనకు ఈ పదవికి రాలేదు.
కానీ ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు బాస్. దానికి ఏకైక కారణం, దేశంలో అత్యంత శక్తివంతమైన రెండవ నేత కుమారుడు కావడమే. దీన్నిబట్టి ‘నయా భారత్’లోనూ అధికార, కుటుంబ బంధాలకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది.
ఆచారాల కంటే అధికార పంపకాలకే ప్రాధాన్యం
దీనికి తోడు మహారాష్ట్రలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం, రాజకీయాల్లో కుటుంబ ఆధిపత్యం ఎలా కొనసాగుతోందో స్పష్టం చేస్తోంది.
దురదృష్టవశాత్తూ అజిత్ పవార్ దాదా మరణించిన కొద్ది రోజుల వ్యవధిలోనే సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం జరగడం గమనార్హం.
నయా భారత్ రాజకీయాల్లో అధికార యావ ముందు, కుటుంబ సభ్యులు మరణించినప్పుడు పాటించే హిందూ సంప్రదాయాలను సైతం పక్కనపెట్టడం ఆశ్చర్యకరం.
ఇక్కడ కేవలం రాజకీయ లావాదేవీలకు, అధికార దాహానికే పెద్దపీట వేస్తున్నారని, భక్తి లేదా సంప్రదాయాలు కేవలం ప్రొటోకాల్‌కే పరిమితం అయ్యాయని స్పష్టమవుతోంది.
“వారసత్వ రాజకీయాలు” ఆధునిక భారతదేశానికి శాపంగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చేసే తీవ్ర విమర్శలకు వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.
కుటుంబ సభ్యులను అందలం ఎక్కించడానికి జరిగే ఈ ఉత్సవాలన్నీ కేవలం రాజకీయ పదవుల కోసమేనని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
దేశానికి సంబంధించి నెహ్రూ-గాంధీ కుటుంబం ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిందా లేదా అని ప్రశ్నించడానికి ప్రధాని తరచుగా తన ప్రసంగ వేదికలను వాడుకుంటారు.
తన మాటల గారడీతో, భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఇలాంటి పరస్పర విరుద్ధమైన చర్యల మీద వివరణ ఇచ్చుకోకుండా ఆయన సులభంగా తప్పించుకోగలరు.
పార్టీలకతీతంగా వారసత్వ రాజకీయాలు
కనీసం తన సొంత పార్టీ బీజేపీలోనైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి కుటుంబ నేపథ్యం అవసరం లేదని ప్రధానమంత్రి బల్లగుద్ది చెప్పగలరు.
పార్టీలో కేవలం సాధారణ “కార్యకర్తలను” మాత్రమే గుర్తించి తగిన విధంగా ప్రోత్సహిస్తామని చెప్పడానికి, ఆయన కొత్త పార్టీ అధ్యక్షుడి ఎంపికను ఉదాహరణగా చూపించవచ్చు.
అలాగే, ఢిల్లీలోని అధిష్టానం ఎంపిక చేసేంతవరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని కొందరు కొత్త ముఖ్యమంత్రుల ముఖాలు కూడా ప్రజలకు పెద్దగా తెలియకపోవడం దీనికి నిదర్శనం అనవచ్చు.
అయినప్పటికీ, గత 15 ఏళ్లుగా “వారసత్వ రాజకీయాలపై” తీవ్రమైన ప్రసంగాలు, విమర్శలు, ఖండనలు ఉన్నప్పటికీ- ప్రజలు మాత్రం రాజకీయ కుటుంబాలను ఆదరిస్తూనే ఉన్నారు.
జమ్మూకశ్మీర్‌లో అబ్దుల్లాలు, ముఫ్తీలు; పంజాబ్‌లో బాదల్స్; హర్యానాలో లాల్స్, చౌతాలాలు; బీహార్‌లో యాదవులు, పాశ్వాన్లు; మహారాష్ట్రలో ఠాక్రేలు; తమిళనాడులో స్టాలిన్లు; అస్సాంలో గొగోయ్; పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు; కర్ణాటకలో గౌడలు- ఇలా వీరందరూ తమ ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటూనే ఉన్నారు.
ఏదో ఒక సందర్భంలో బీజేపీ సైతం ఈ “వారసత్వ రాజకీయాల” రంగాన్ని ప్రోత్సహించింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ- దాదాపు 15 ఏళ్లుగా ఒడిశాలో నవీన్ పట్నాయక్ వారసత్వ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.
రాజకీయాలు నేర్చుకోవడానికి పాఠశాలలు ఉన్నాయా?
కొందరు “వారసత్వ రాజకీయ నాయకులు” ఇతరుల కంటే ఎక్కువ ఆమోదయోగ్యులా? సాధారణ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ “వారసత్వ” వాస్తవాన్ని అంగీకరించలేమా? లేదా ఆ నాయకుడు/నాయకురాలు ప్రజలకు సేవ చేస్తున్నంతకాలం ఈ వారసత్వాన్ని ఆమోదించవచ్చా?
ఉదాహరణకు, ఒక బలమైన రాజకీయ నాయకుడి కుమారుడు క్రికెట్ బోర్డుకు అధ్యక్షత వహించడం వల్ల భారతీయ క్రికెట్‌కు వచ్చిన నష్టమేమీ లేదని వాదించవచ్చు, అలాగే దీన్ని వ్యతిరేకించనూ వచ్చు.
లాంఛనంగా పదవులు చేపట్టడం మినహా, ఈ “వారసత్వ రాజకీయ నేతలు” తమ పదవికి ఏదైనా ప్రత్యేక నైపుణ్యాన్ని లేదా విలువను జోడిస్తున్నారా? ఆధునిక వ్యాపారవేత్తల కుటుంబాలు, తమ పిల్లలకు వ్యాపార మెళుకువలు నేర్పించడానికి ‘వార్టన్’లాంటి ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లకు పంపిస్తాయి. కానీ, రాజకీయ కుటుంబాలు తమ పిల్లలకు రాజకీయ పాఠాలు నేర్పించడానికి అలాంటి ప్రత్యేకమైన “పాఠశాల” ఏదీ లేదు.
రాజకీయాలు నేర్చుకోవడానికి ఇంటిలోని డైనింగ్ టేబులే సరైన ప్రదేశం అని ఇందిరా గాంధీ గురించి, ఆ తర్వాత సోనియా గాంధీ గురించి చెబుతుంటారు. ఇక రాహుల్ గాంధీ తన సొంత అనుభవాలతోనే రాజకీయాలు నేర్చుకున్నారని ఆయన మద్దతుదారులు నొక్కి చెబుతారు.
ప్రజాస్వామ్య విలువలపై ప్రభావం
ముఖ్యమంత్రి కూతురో, ప్రధానమంత్రి కొడుకో లేదా మేనకోడలో- ఎవరైనా సరే, అధికార పీఠంపై మొదటి హక్కు తమదే అనుకోవడం ప్రజాస్వామ్య విలువలకు, సుపరిపాలన స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.
గణతంత్ర వ్యవస్థలో రాజకీయ అధికారం అనేది ప్రజల అంగీకారంతోనే దక్కాలి. అలా ప్రజల తీర్పు ద్వారా రానప్పుడు దాన్ని ప్రాథమికంగా వ్యతిరేకించాల్సిందే. విశాలమైన ఈ రిపబ్లిక్ దేశం కొన్ని వందల చిన్న-రాజరికపు కుటుంబాల చేతుల్లో నడవకూడదు.
ఇంతటి సువిశాల దేశంలో, వంద కోట్ల మంది ప్రజల గొంతుకలను కేవలం వంద లోపు కుటుంబాలు శాసిస్తున్నాయంటే, వారసత్వ పాలనకు వ్యతిరేకంగా మోదీ చేసే ప్రసంగాలు ఎంత బలమైనవైనప్పటికీ అవి బధిర శంఖారావాలుగానే మిగిలిపోతాయి.
పాట్నా నుంచి వెలువడిన వార్తలు మళ్లీ ఈ వాస్తవాన్ని మనకు గుర్తు చేశాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
